'Badhyatha' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఇదిగో సీతా, రెండు లవంగాలు యిస్తావా, దగ్గు చంపేస్తోంది” అన్నాడు భార్య తో కామేశం.
“మీకు కనిపించే విధంగా గూట్లో పెట్టానని చెప్పాను, అయినా మంచం మీద పడుకుని లవంగాలు యిస్తావా అని అంటారు. ఉదయం నుంచి నడుం నొప్పి వున్నా అన్నీ పనులు చేసుకుంటున్నాను. మీకు జాలి కూడా లేదు” అంటూ రెండు లవంగాలు తెచ్చి పడేసింది.
“నాకోసం చేసింది ఏముంది? నీకు వండుకుంటూ నాకు పెడుతున్నావు. వెధవది రెండు లవంగాలు యివ్వడానికి ఎందుకు గొడవ” అన్నాడు చిరాకు పడుతూ.
“అవును లెండి! నా కోసమే యిన్ని వంటలు! వంటంతా అయిన తరువాత ‘ఈ కూర నేను తినను, రెండు బంగాళాదుంపలు వేయించు’ అని చెప్పి దగ్గుకుంటూ తిన్నది ఎవ్వరుటా? ఏదన్నా అంటే అన్నాను అంటారు” అంది సీత లైట్ తీసేస్తో.
ఆంజనేయ దండకం చదువుకొని పడుకోబోతో, కుడివైపుకి తిరిగి పడుకుని దగ్గుతున్న భర్తని చూసి, పాపం నాలుగు లవంగాలు అడిగినందుకు అనవసరంగా తిండి గురించి మాట్లాడాను, మాలాగా పూరిలో మామిడికాయ పప్పు నంచుకుని తిన్న వాళ్ళు కాదు,, మొదటి నుంచి మా అత్తగారు నాలుగు రకాల కూరలతో పిల్లలకి అన్నం పెట్టే వారుటా, ఆ అలవాటు మనలేక ఏదో ఒకటి స్పెషల్ గా వండమంటారు పాపం అనుకుంది సీత.
ఈ తతంగం యిప్పటిది కాదు పెళ్లి అయి నలభై సంవత్సరాలనుండి జరుగుతోనే వుంటుంది ఈ మొగుడు పెళ్ళాల మధ్య.
కామేశం గవర్నమెంట్ ఆఫీసులో, సీత ప్రైవేట్ ఆఫీస్ లో మంచి జీతం మీద ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి.
యిద్దరు పిల్లలకి మంచి ఉద్యోగాలు, పెళ్లిళ్లు అయిపోయి తలో సిటీ లో వుంటున్నారు. ఈ యిద్దరు ముసలాళ్ళు స్వంత వూరిని, యింటిని వదలలేక యిక్కడే వుండిపోయారు.
కామేశానికి దగ్గు ఎక్కువ అవడం తోపాటు కొద్దిగా జ్వరం కూడా రావడం మొదలైంది. యింట్లో వున్న యాంటీ బయోటిక్ క్యాప్సూల్స్ వేసుకుంటున్నాడు. వారం రోజులైనా దగ్గు తగ్గకపోగా కొద్దిగా మనిషి చిక్కినట్టు అనిపించింది సీతకి.
“మీరు రెడీ అవ్వండి, నేను క్యాబ్ లో మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను. మీ స్వంత వైద్యం లాభం లేదు” అంటూ తను కూడా రెడీ అయిపొయింది.
నిజమే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపించుకోవడం అనుకుని లేచి రెడీ అయ్యాడు.
అది పేరున్న హాస్పిటల్. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అడ్మిట్ చేసుకుంటారు. డిశ్చార్జ్ ఏ రూపంలో చేస్తారో భగవంతుడికి కూడా తెలియదు.
అరగంట ఆగిన తరువాత కామేశానికి అవకాశం వచ్చింది డాక్టర్ ని చూడటానికి.
అన్నీ విన్న డాక్టర్ గారు “మీకు లంగ్స్ లో బాగా ఇన్ఫెక్షన్ వుంది, ఆక్సిజన్ కూడా తగ్గింది. హాస్పిటల్ లో జాయిన్ అవడం మంచిది” అన్నాడు.
“అదేమిటి డాక్టర్ గారు.. వచ్చేడప్పుడే ఆక్సీ మీటర్ తో చూసుకుంటే 99 వుంది. అప్పుడే ఎలా తగ్గింది” అంటూ జేబులోనుంచి ఆక్సి మీటర్ తీసి వేలుకి పెట్టుకుని, బాగానే వుంది సార్ చూడండి” అన్నాడు కామేశం.
తెల్లబోయిన డాక్టర్ గారు.. “మా నర్స్ సరిగ్గా చూడలేదేమో..” అంటూ నర్స్ ని పిలుస్తోవుంటే, “నర్స్ చూడలేదు సార్! మీరే చూసారు” అన్నాడు కామేశం.
వీడెక్కడ దొరికాడు రా బాబు అనుకుని, “సరే.. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే వున్నాయి కాబట్టి, అడ్మిట్ అవ్వక్కర్లేదు. మందులు రాస్తాను. అవి వాడి అయిదు రోజుల తరువాత రండి” అని మందులు రాయడం మొదలు పెట్టాడు.
మొదట ఆంటిబయోటిక్ రాయాగానే, “సార్ ఆ మందు అయిదు రోజులు వాడాను” అన్నాడు కామేశం.
“వాడేసారా, సరే యిది వాడండి” అంటూ ఇంకొకటి రాస్తో వుంటే, “ఆ మందు నాకు పని చేయదు సార్” అన్నాడు మళ్ళీ.
డాక్టర్ గారు రాయడం ఆపి, “అన్ని మందులూ మీకు తెలిసినవే. అన్నీ వాడేసారు. యింకా నేను ఏ మందు యివ్వాలి” అని విస్కుంటూ, “సరే.. దగ్గు కి పాలలో పసుపు వేసుకొని తాగండి, తగ్గిపోతుంది” అంటూ నెక్స్ట్ పేషెంట్ ని పిలిచాడు. కామేశానికి నోటిదాకా వచ్చింది, పసుపు పాలు తాగుతున్నా అని చెప్పబోతో ఆగిపోయాడు.
నీరసంగా బయటకి వచ్చి ఆటో మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నారు. “ఆ డాక్టర్ ని కన్ఫ్యూస్ చేసి చివరికి మందు మాకు లేకుండా అయిదు వందలు యిచ్చుకున్నారు” అంది సీత నిష్ట్ఠురంగా.
“ఆ డాక్టర్ నన్ను చూడటానికి భయపడి పోతున్నాడు. నాకు ఏ కరోనానో అని! ఎలాగో అలాగ హాస్పిటల్ లో జాయిన్ చేసుకుని మన ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేసాడు” అన్నాడు కామేశం దగ్గుతో.
కరోనా మాట వినిపించి ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి, “సార్ కి కరోనానా అమ్మా..” అన్నాడు భయపడుతూ.
“అబ్బే.. అటువంటిది ఏమీ కాదు నాయనా! ఈ కరోనా కాలంలో హాస్పిటల్ కి ఎందుకు తీసుకొని వచ్చావు అంటున్నారు” అని సర్ది చెప్పింది.
ఇంటికి చేరిన తరువాత పై రూమ్ లోకి వెళ్లి బెంగళూరు లో వున్న కూతురుకి, ముంబై లో వున్న కొడుకుకి ఫోన్ చేసి జరుగుతున్న విషయం చెప్పింది.
“కొంప మీద కి తెచ్చుకునే దాకా ఎందుకు వచ్చింది. సరే మేము బయలుదేరి వచ్చి ఏదైనా పెద్ద హాస్పిటల్ లో చేరుస్తాము. కంగారు పడకు” అన్నాడు కొడుకు.
“అయ్యో రాత, హాస్పిటల్ లో చేరడానికి సుతారం ఒప్పుకోవడం లేదు మీ నాన్న” అంటున్న తల్లితో,, “మేము వస్తున్నాం కదా, మేము ఒప్పించి జాయిన్ చేస్తాంలే” అన్నాడు కొడుకు.
మెట్లు దిగి వస్తున్న భార్యని చూసి, “ఎవరికి ఫోన్ చేసావ్, అందరిని కంగారు పెట్టకు, తగ్గిపోతుంది అన్నానుగా” అన్నాడు కామేశం.
చెప్పినట్టుగానే, పిల్లలిద్దరూ వాళ్ళ పిల్లలతో వచ్చేసారు. “ఎలా వుంది మామయ్యగారూ!” అంటూ లోపలకి వచ్చిన అల్లుడిని చూసి, “అయ్యో! మిమ్మల్ని కంగారు పెట్టేసింది అనుకుంటా మీ అత్తగారు! ఏమీలేదు. కొద్దిగా దగ్గుగా వుంది. అంతే” అన్నాడు కామేశం.
పిల్లలిద్దరూ తండ్రి దగ్గర కూర్చొని “ఈ రోజు అపోలో హాస్పిటల్ లో చూపిస్తాము. డాక్టర్ గారు ఏమంటే దానికి ఒప్పుకోవాలి” అన్నారు.
“ఈ రోజు ఉదయమే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాను. రేపు వెళ్దాం” అన్నాడు.
“తాతా.. త్వరగా తగ్గించుకో. తోటలో వంకాయలు నీ కోసం చూస్తున్నాయి” అన్న మనవరాలిని “నీకు యిష్టంగా.. నీకు వండమను బామ్మని” అన్నాడు చిన్నగా నవ్వి కామేశం.
“యిలా పడుకునే బదులు కాసేపు హాల్లో కూర్చుంటే బాగుంటుంది నాన్నా! లేవండి” అంటూ కూతురు కొడుకు చెరో చెయ్యి పట్టుకొని లేపి, మెల్లగా హాల్లోకి తీసుకొని వచ్చారు. ఆశ్చర్యం అక్కడ తన కూతురి కొడుకు రామాయణం పుస్తకం చదువుతూ కనిపించాడు.
“ఏరా! లోపలకి రాలేదే” అన్నాడు కామేశం.
“నీకు తగ్గే వరకు రామాయణం చదివి, ఆంజనేయస్వామి ని వేడుకుంటా. అందుకే రాలేదు. పచ్చళ్ళు వేసుకొని తినద్దని చెపితే విన్నావా తాతా, యిప్పుడు చూడు ఎలా దగ్గుతున్నావో” అన్న మనవడి తలనిమిరి, “తగ్గుతుందిలేరా” అన్నాడు.
రాత్రి టిఫిన్ తినేసి అందరూ వాళ్ళ రూమ్స్ లోకి వెళ్లి పడుకున్నారు. భర్తకి రెండు లవంగాలు యిచ్చి, “యివి బుగ్గన పెట్టుకుని పడుకోండి. దగ్గు తగ్గుతుంది” అని నుదుటి మీద చేయి వేసి, “యింకా జ్వరం వున్నట్టే వుంది” అంటూ నడుము వాల్చింది.
ఉదయం నుంచి యింటి పని చేసి అలిసిపోయిన సీతకి యిట్టే నిద్రపట్టేసింది.
దగ్గు మందు ప్రభావం వలన కామేశానికి కూడా నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి సడన్ గా పెద్ద దగ్గు తెర రావడం తో ఉలిక్కిపడి లేచాడు కామేశం. జ్వరం ఎక్కువగా వున్నట్టుంది అనుకుని, రాబోతున్న దగ్గుని ఆపుకుని నిద్రపోతున్న భార్య వంక చూసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
ఇద్దరు పిల్లలు ఇండియా లోనే వున్నా కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా విడిగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు అనుకోవడమేగాని ఎవ్వరితో చెప్పించుకోవడం వాళ్లకు ఇష్టం లేదు. కూతురు దగ్గరకి వెళ్తే వంటిల్లు సీతదే అయినా ఏంవండాలో ఎలా చేయాలో అన్నీ కూతురు చెప్పాలిసిందే. కొడుకు దగ్గరికి వెళ్తే, కోడలు తనకి వచ్చినట్టు, నచ్చినట్టు చేస్తుందే గాని అత్తగారిని వంటగదిలోకి రానీయదు. అతిశుభ్రంగా ఇల్లు వుంచుకుంటుంది.
ఎక్కడైనా వాళ్ళింట్లో వున్నంత స్వేచ్ఛగా వుండలేక యిక్కడే ఉండిపోయారు.పిల్లలు ప్రేమగా రమ్మన్నా వెళ్లలేని స్థితి.
ఈ దగ్గు జ్వరం తో తనకు ఏమైనా అయితే, సీత ఒంటరి అయిపోయి కొడుకు దగ్గరికి చేరక తప్పదు. ప్రతీ పని తన స్వంత ఆలోచన తో చేసుకోవడం అలవాటైన సీత అక్కడ కొడుకు, కోడలు మీద ఆదారపడాలిసిందేనా, రాజాలాగా బతుకుతున్న దంపతులలో ఎవరు ముందు పోయినా రెండవ వారి బతుకు పరాధీనమేనా? అనుకుని మెల్లగా లేచి, ఆల్మరా లోని తెల్లకాయితం తీసుకొని రాయడం మొదలుపెట్టాడు కామేశం.
తన పేరున వున్న ఇల్లు, పొలం, స్థలం, డబ్బు అన్నీ తన తరువాత సర్వ హక్కులతో తన భార్య సీతకి చెందేవిధంగా విల్లు రాసి, పూజా రూంలోని దేముడి ఫోటో వెనుక పెట్టి వచ్చి పడుకున్నాడు కామేశం.
“పడుకోనీయండి, లేపద్దు” అంటున్న మాటలు వినిపించి, కళ్ళు తెరిచి, “సీతా.. ఎవరొచ్చారు?” అన్నాడు కామేశం.
“నేనే కామేశం గారు” అంటూ స్టేతస్కోప్ తో కామేశం దగ్గరికి వచ్చాడు వియ్యంకుడు గారు.
“అయ్యో! అల్లుడు గారు, మిమ్మల్ని కూడా కంగారు పెట్టేశారా..” అన్నాడు కామేశం.
కామేశం వియ్యంకుడు ఒంగోలు దగ్గర ఒక విలేజ్ లో యాభై సంవత్సరాలనుండి అక్కడి వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. హస్తవాసి మంచిది అని ఎంతమంది డాక్టర్స్ వున్నా, ఈయన దగ్గరికి వస్తోవుండటంతో, ఆ ఊరు విడిచి రాకుండా అక్కడే వుంటున్నారు.
“ఆ ఏమిటి, దగ్గు జ్వరం వస్తోందా.. చలికాలం కదా వస్తాయి, పోతాయ్” అంటూ స్టేతస్కోప్ తో చెక్ చేసి, బీపీ కూడా చూసి, నవ్వుతూ “దీనికోసం మా చెల్లమ్మ ని, పిల్లలని కంగారు పెట్టేసారా.. భలే వారే” అని తన బ్యాగ్ లోనుంచి ఒక చిన్న బాటిల్ లోనుంచి సిరంజీ ద్వారా మందు తీసి, అటు తిరగండి అన్నాడు.
“అది ఏ మందు?” అన్నాడు కామేశం.
అక్కడే వున్న కూతురు “నీకెందుకు నాన్నా!, ప్రతీ మందు గురించి తెలుసుకుంటే కానీ వేసుకోరు. మామయ్యగారు యిస్తున్నారుగా, అటు తిరగండి” అంది విసుగ్గా.
“అదికాదే! నాకు పెన్సిలిన్ పడదు. అందుకే అడిగాను” అని, పక్కకి వొత్తిగిల్లాడు.
యిచ్చినట్టు కూడా తెలియని విధంగా ఇంజక్షన్ ఇవ్వడంలో తన వియ్యంకుడిని మించిన వాళ్ళు లేరు అనుకున్నాడు దూదితో రుద్దుకుంటో.
సాయంత్రం లోపు యింకో ఇంజక్షన్ యిస్తో వుంటే, “మళ్లీనా” అన్నాడు కామేశం.
“యిది నీరసం తగ్గటానికి” అంటూ ఇంజక్షన్ చేసి, “యిలా హాల్ లోకి వచ్చి కూర్చోండి. ఎప్పుడూ పడుకుని వుంటే దగ్గు ఎక్కువగా అనిపిస్తుంది” అన్న మాటలకి మెల్లిగా లేచి హాల్ లో సోఫాలో కూర్చున్నాడు.
“మీరందరి భోజనం అయ్యిందా” అని ఆడిగాడు కామేశం.
“యిప్పుడు సాయంత్రం నాలుగు అయ్యింది. మీరు మంచి నిద్రమీద వుండటం తో లేపలేదు” అంది సీత.
“అదిసరే గాని బావగారు.. మీరంటే నాకు యింకా ఎక్కడో కోపం అలాగే వుంది” అన్నాడు వియ్యంకుడు మూర్తి గారు.
వియ్యంకుడి మాటలకి తెల్లబోయి “నేనేమన్నాను సార్” అన్నాడు కామేశం.
“మీ అమ్మాయి పెళ్లి లో మీకు ముందుగానే చెప్పాను, వంటల్లో బిర్యానీ మాత్రం వద్దని. కానీ మీరు పనిగట్టుకుని బిర్యానీ వడ్డించారు. అంటే మగపెళ్లి వాళ్ళ మాట వినేది ఏమిటి అనేగా?” అన్నాడు సీరియస్ గా.
“ఎప్పుడో యిరవై ఏళ్ళ క్రితం పెళ్లి లో వండిన వంటల గురించి యిప్పుడు ఎందుకు నాన్నా?” అన్నాడు అల్లుడు.
“అదికాదురా, మీ మామగారు ఆలా చేయడం తప్పుకాదా? ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటే మీ అత్తగారు నవకాయ పిండివంటలతో భోజనం పెట్టగానే మర్చిపోతున్నాను. ఈ రోజు మీ మామగారు ఎలాగైనా తప్పయింది అని ఒప్పుకోవాలి” అన్నాడు కామేశం వియ్యంకుడు.
“సరే సార్, నాకు గుర్తు లేదు. నిజంగా మీరు వద్దన్నా బిర్యానీ వడ్డించితే నాది తప్పే” అన్నాడు కామేశం.
పక్కున నవ్వుతూ, “బావగారూ! మనమిద్దరం యిప్పుడు గంట నుంచి మాట్లాడుకుంటున్నాము. మీరు ఒక్కసారి కూడా దగ్గలేదు” అన్నాడు అల్లుడి తండ్రి.
“అవును, నిజమే! విచిత్రంగా వుందే.. దగ్గు రాలేదు. మీకు నిజంగా కోపం వచ్చిందేమో అని భయంతో దగ్గటం మర్చిపోయాను” అన్నాడు కామేశం మెల్లగా దగ్గుతో.
“యిప్పుడు గుర్తు చేసుకుని దగ్గక్కరలేదు. చూడండి బావగారూ! రోగాలు కూడా చుట్టాలు వంటివే. అతి మర్యాదలు చేస్తే వదిలిపెట్టకుండా మకాం పెడతాయి. పట్టించుకోకపోతే అవే పోతాయి. ఆలా అని కొంతమంది మొండి చుట్టాలు వుంటారు. అటువంటప్పుడు మాలాంటి వాళ్ళ అవసరం వస్తుంది” అన్నాడు డాక్టర్ మూర్తి.
వియ్యంకుడి మూడు రోజులు వైద్యం తో జ్వరం తో పాటు దగ్గు, నీరసం కూడా తగ్గి నాలుగు మెతుకులు తింటున్నాడు కామేశం.
భోజనం చేసి సోఫాలో కూర్చొని వియంకుళ్లు ఇద్దరూ మాట్లాడుకుంటో వుండగా కామేశం కొడుకు, కూతురు వంటగది లోనుంచి పది ప్లాస్టిక్ డబ్బాలను తీసుకొని వచ్చి హాల్ మధ్యలో పెట్టారు.
“మామయ్యగారూ! మా నాన్న తినడానికి ఎన్ని పచ్చళ్ళు ఉంచుకున్నారో చూడండి. ఆవకాయ, కొరివికారం, మాగాయ, పులిహోర ఆవకాయట, ఇదేమిటి.. తాళ్ల గోంగూర.. ఎప్పుడూ వినలేదే” అంది కామేశం కూతురు.
“అయినా అమ్మా.. నువ్వు ఎందుకు యిన్ని పచ్చళ్ళు పెట్టావ్? ఇందుకోసమా బొంబాయి రమ్మంటే పనులున్నాయిరా అని తప్పించుకుంటావు” అన్నాడు తల్లితో కామేశం కొడుకు.
“అయ్యో, నేను పెట్టలేదు బాబు. మీ నాన్నే ఆన్లైన్ లో తెప్పించుకుని రోజు పెరగన్నంలోకి అనడం, మొదటి ముద్దనుంచి పచ్చడి నంచుకోవడం” అంది సీత.
“అక్కయ్యా! అవి అన్నీ సంచిలో వేసి యివ్వు, తీసుకెళ్లి వాచ్మాన్ కి యిచ్చేస్తా” అంటూ లేస్తున్న కొడుకుని, “ఒరేయ్.. ఒక్క ఉసిరికాయ పచ్చడి, మొన్ననే వేసిన దోసఆవకాయ వుంచరా” అని అరిచాడు కామేశం.
యిది అంతా చూస్తున్న కామేశం మనవడు కలిపించుకుని, “మామయ్యా! యిప్పుడు తాతా, అమ్మమ్మ వయసు 70 లోకి వస్తున్నారు. వాళ్ళకి యిహ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టక్కర్లేదు. తినాలిసినవి తిననీయండి. మనం నుడిల్స్, ముంచురియాలు తినకుండా వుండాలి” అన్నాడు.
దానితో డాక్టర్ మూర్తి కలిపించుకుని, “నువ్వు చెప్పింది నిజం నాయనా! ఏదైనా లిమిట్ దాటకుండా నోటికి రాసుకోండి, పర్వాలేదు.. కామేశం గారు” అన్నాడు.
“అమ్మయ్య.. డాక్టర్ గారు ఓకే అన్నారు” అంటూ కామేశం లేచి రెండు చేతులతో నాలుగు డబ్బాలు పట్టుకొని వంటగదిలోకి వెళ్ళిపోయాడు.
అది చూసి, “నాన్నకి ఒక్కసారిగా యింత ఓపిక ఎలా వచ్చింది అక్కయ్య” అన్నాడు.
యింకో రెండు రోజులు తరువాత ఎక్కడవాళ్లు అక్కడికి వెళ్లి పోయారు.
వేడి వేడి కాఫీ తాగుతో పేపర్ చదువుతున్న కామేశం భుజం మీద చెయ్యి పడటం తో వెనక్కి చూసాడు. కళ్ళలో నీళ్లతో వీలునామ చూపిస్తో “ఇదియెందుకు?” అంటున్న సీత చేతి మీద చెయ్యి వేసి తడుతో “వుంచుకో జాగ్రత్తగా. ప్రతీ భర్త తన భార్యకోసం తీసుకోవలిసిన జాగ్రత్త, బాధ్యత” అన్నాడు కామేశం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
NAR DIGITAL NEWS • 1 day ago
Nice