బహుమఖ ప్రజ్ఞాశాలి
- T. V. L. Gayathri

- Dec 20, 2025
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #బహుమఖప్రజ్ఞాశాలి, #వివాహబంధం

గాయత్రి గారి కవితలు పార్ట్ 51
Bahumukha Prajnasali - Gayathri Gari Kavithalu Part 51 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 20/12/2025
బహుమఖ ప్రజ్ఞాశాలి - గాయత్రి గారి కవితలు పార్ట్ 51 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
బహుమఖ ప్రజ్ఞాశాలి
(వచనకవిత)
**********************************
పూర్వకాలమును నుండి పూజనీయమైన గృహిణి
సర్వజగతిని చాకచక్యముగా పరిపాలించు ధీమణి
ఆదిశక్తిగ తానవతరించెనీ యసమానమౌ చైతన్యఝరి.
ఆదరించిన చాలు తానద్భుతాలు చేసి చూపించు నారి.
వివిధ విద్యలు నేర్చి విశ్వమును గెల్చు నీ విదుషీమణి.
భవితవ్యమును నిల్పు ప్రణాళికలు రచించు నీ తరుణి.
గృహమునకు రాణిగా మెలగి బాధ్యతలు మోయునది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యశూరతను చూపిస్తుంది.
చుక్కాని వలె మసలి సంసార నౌకనే నడపు నీ వనిత
ప్రక్కతోడుగా పతి వెంటచరించు పావనమూర్తి ముదిత.
ఆధునిక యుగములో స్త్రీ యాలోచింది యడుగు వేస్తుంది.
సాధించుకొనుచు తన లక్ష్యమును సమర్ధత చూపుతుంది.
ఘనమైన సంస్కృతిని తన వారసుల కందించు నీ సుదతి.
తనదైన ముద్రతో తరతరాలను కాపాడుకొంటుందీ సుమతి.
క్షమతోడ మెలగుచు సంఘమును నడిపించు శాంతిదాయిని.
మమతానురాగాలతో మహిని వెలిగించు నీ భాగ్యప్రదాయిని.
జగన్మాత స్వరూపమైన స్త్రీని మనమంతా గౌరవించుకొందాం!
ప్రగతి పథంలో పయనించటానికామెను భాగస్వామిని చేద్దాం!
************************************

వివాహబంధం
(వచన కవిత)
************************************
పవిత్రమైన పరిణయ బంధంలో భావైక్యత లోపించిందా?
నవీనమైన జీవన విధానంలో నయవంచన దాగుందా?
యువతకు సంప్రదాయ పథంలో ప్రమాదం గోచరిస్తుందా?
భవితవ్యం మీద నానాటికీ విశ్వాసం సన్నగిల్లి పోతుందా?
నీవే నేనను భావన నెమ్మదిగా కరిగి గరళ మవుతోందా?
వివాహబంధమే నానాటికీ వేళాకోళమయి నాశమయిందా?
కడదాకా కలిసి ప్రయాణించటమీనాడు తప్పనిపిస్తోందా?
విడాకుల ప్రహసనమీ సంఘంలో నిత్యకృత్యమయిందా?
చక్కని దాంపత్య జీవితానికి మనమే సమాధి కట్టేస్తున్నామా?
ఎక్కడుందో లోపమని తెలుసుకొనే యింగితాన్ని వదిలేశామా?
నూరేళ్ళ సహజీవనానికి నోచుకోని తరానికి తల్లిదండ్రులమా!
దారులన్నీ మూసుకొని పోయాయని తప్పించుకుంటున్నామా!
ఇకనైనా వివేకంతో మెల్గమనే యెరుకనీనాడు కలిగిద్దామా!
వికాసభరితమైన ధిషణతో మసలుకోమని బోధలు చేద్దామా!
సనాతనమైన మనదేశ సంస్కృతిని సంయమనంతో నిల్పుదామా!
ఘనమైన మన వారసత్వానికి జవ జీవ జ్ఞాన చైతన్యానందిద్దామా!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments