top of page
Original.png

బాల గేయాలు - అందెల రవళులు మధురము

Jul 25
4 min read

బాల గేయాలు, తాతయ్య మేలి సుద్ధులు, తెలుగు బాల సాహిత్యం, పిల్లల గేయాలు, నీతి గేయాలు, తెలుగు పద్యాలు, మానవ విలువలు, తల్లి ప్రేమ, భగవంతుని నామము, పిల్లల కవితలు, Moral Poems Telugu, Children Poems Telugu, Inspirational Telugu Poems, Telugu Rhymes


Bala Geyalu - Andela Ravalulu Madhuramu| Gadwala Somanna 

బాల గేయాలు - అందెల రవళులు మధురము | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 25/07/2026


బాల గేయాలు - పిల్లల వ్యక్తిత్వ వికాసానికి మంచి పుస్తకాలు, మంచి గేయాలు ఎంతో దోహదపడతాయి. చిన్న వయస్సులోనే సద్గుణాలు అలవర్చే ఉత్తమ మార్గాల్లో బాల గేయాలు ఒకటి. ప్రముఖ రచయిత గద్వాల సోమన్న రచించిన ఈ గేయాల సంకలనంలో ప్రతి గేయం ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది.

ఈ గేయాల్లో అందెల రవళులు మధురము, తాతయ్య హితబోధ, ధైర్యమే కవచం, భగవంతుడు శ్రేష్టుడు, అక్షర శపథం, సమస్యలు సహజమే, బ్రతకాలి గొప్పగా, పరహితం కాంక్షించు, జాగ్రత్తగా ఉండాలి వంటి ఎన్నో విలువైన అంశాలు పొందుపరచబడ్డాయి.

ఈ గేయాలు పిల్లలకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి.


అందెల రవళులు మధురము 

------------------------------

కాళ్ళకు అందము గజ్జెలు 

రంజింపజేయు మనసులు 

ఆడపిల్లలకు ఇష్టము 

కట్టుకుంటే మోదము 


చేయును సుమధుర నాదము 

ఉల్లసించును హృదయము 

మువ్వలు కట్టిన బాలిక 

నడిస్తే ఇల్లు పావనము 


ఎన్నో రకములు అందెలు 

చూడుము పిల్లల చిందులు 

చూడ చక్కని నాట్యము 

ఎంతో ఎంతో హృద్యము 


అందెలు చేసే రవళులు  

ఇష్టపడును కర్ణ ద్వయము 

వాటి పాత్ర ఎంతో ఘనము 

అక్షర ప్రబోధము వినుము 







తాతయ్య హిత బోధ 

------------------------------

మంచి వారి స్నేహము 

ఆపదలో సాయము 

కావు కావు వ్యర్థము 

అగును సఫలీకృతము 


పవిత్రమైన బంధము 

విరిసిన దరహాసము 

ఉంటేనే మంచిది 

జీవితాన గొప్పది 


చదవాలి పుస్తకము

వెలగాలి మస్తకము 

అప్పుడే సార్ధకము 

అవుతుంది జీవితము 


చేసిన ఏ కష్టము 

తీసుకు రాదు నష్టము 

నమ్ముము ఈ సత్యము 

ఇక ఉండదు అపజయము 







పొరపాట్లు సహజమే!

------------------------------

వేగిరమే చేసుకోకు 

ఏ మాత్రం అపార్ధము 

చేసుకుంటే మంచిది 

నిదానంగా అర్థము 


గాలిలా వ్యాపించును 

చూడంగా వదంతులు 

నమ్మితే బహు నష్టము 

మనసులగును పలు ముక్కలు


వినరాదు చెప్పుడు మాటలు 

చీల్చునోయ్! కుటుంబాలు 

కొలిమిలో మండు నిప్పులు 

కాల్చునోయ్! కాపురాలు 


చూసిన పిదప నమ్మాలి 

వీలైతే దిద్దాలి 

పొరపాట్లు సహజమేనోయ్!

తక్షణమే వదలాలి 







ధైర్యమే  కవచం 

------------------------------

ధైర్యంగా ఉంటే 

ఎవరూ ఆపలేరు 

భయంతో క్రుంగితే 

పైకెత్తు వారు లేరు 


ఆత్మవిశ్వాసంతో 

ఏదైనా చేయొచ్చు

శ్రమించే తత్వంతో 

ముందడుగు వేయవచ్చు 


కేంద్ర బిందువు మనసు 

అది ఎందరికి తెలుసు?

చేస్తే దాన్ని అదుపు  

నీ సొంతమే గెలుపు 


ధైర్యంతోనే ఉండు 

పిరికితనమే పుండు 

సాహసమే ఊపిరి 

అది నడిపించు కాపరి 







భగవంతుడు శ్రేష్టుడు 

------------------------------

ఆపదలో భగవంతుడు 

నమ్మదగిన సహాయకుడు 

ఆశ్రయిస్తే కొండగా 

ఉంటాడోయ్! అండగా 


జీవితాల్లో దైవము 

ఉంటే ఆశీర్వాదము 

అగును వెలుగు కాగడా

విశ్వసిస్తే జీవితము 


సదా కాలము  దేవుడు 

కాపాడే రక్షకుడు 

చూస్తాడు కనుపాపలా 

ప్రేమించు పసిపాపలా 


హృదయానికి దగ్గరగా 

ఉంటాడు మిత్రునిలా

లాలించే అమ్మలా 

పాలించే నాన్నలా 








పాపాయికి అందము 

------------------------------

జడలోన పూవులు 

మెడలోన మాలలు 

అమ్మాయికి అందము 

చేతిలోన గాజులు 


నడుముకు వడ్డాణము 

చెవిలోన పోగులు 

ఆడపిల్లకు అందము 

ముత్యాల సరములు 


కాళ్లకు పట్టీలు 

కళ్ళకు అద్దాలు 

బాలికకు  అందము 

ముఖంలో చిరునవ్వులు 


నిండుగా వస్త్రాలు 

అమ్మాయికి అస్త్రాలు

అందాలకు అందము 

పాపకు జాడకుచ్చులు 








కాస్త జాగ్రత్త!!

------------------------------

గమనించాలి ఎక్కువ 

స్పందించాలి తక్కువ 

ఆధ్యాత్మిక విషయాల్లో 

పెంచుకోవాలి మక్కువ


మహా శక్తి నిశ్శబము 

ఓ మేటి గుణం సహనము 

జీవితాల్లో అవసరము 

అప్పుడప్పుడు మౌనము 


ఉండాలోయ్! సర్దుబాటు 

లేకుంటే తత్తరపాటు 

కాదు కాదు మంచిదోయ్!

జీవితాల్లో అదిరిపాటు


బహు నష్టము క్రుంగుబాటు 

తట్టుకోలేరు ఎడబాటు 

మాట ఇచ్చి తప్పితే 

జీవితాల్లో నగుబాటు 








సకల లోక నాథుడు 

------------------------------

కీర్తనీయుడు దేవుడు 

కడు కరుణాసంపన్నుడు 

నమ్ముకున్న భక్తులకు 

కాపుదల జీవితాలకు 


ఆపదలో సహాయకుడు 

ఆరాధనకు పాత్రుడు 

అవనిలోన భగవంతుడు 

అమూల్యమైన స్నేహితుడు 


ఉద్దరించు బ్రతుకులను 

మురిపించును మనసులను 

సకల లోక పాలకుడు 

విశ్వ మానవ ప్రేమికుడు 


దీవెనలు ఒసగువాడు 

బ్రతుకులను దిద్దువాడు 

విశ్వ గురువు దైవము 

ప్రపంచానికి దీపము 






అక్షరాల వాస్తవాలు 

------------------------------

గడిచిపోయిన కాలము 

తరిగిపోయిన జీవితము 

తిరిగిరాదు  తిరిగిరాదు

చేసుకో సద్వినియోగము 


చేజారితే బంధాలు 

మేనులోని అందాలు 

అతుకుకొనుట బహు కష్టము 

అంతులేని అనర్ధము 


కష్టించని జీవితాలు 

చెడగొట్టే స్నేహాలు 

అభివృద్ధికి బహు దూరము 

ఆవరిస్తే బద్ధకము 


ప్రేమలేని హృదయాలు 

కాపులేని వృక్షాలు 

చూడంగా వ్యర్థమే

మేలు చేయని చేతులు 







అక్షర శపధం 

------------------------------

అక్షర జ్యోతులు వెలిగిద్దాం 

అజ్ఞానాన్ని తరిమేద్దాం 

అనురాగంతో అందరం 

అవనిలో కలసి జీవిద్దాం 


ఆటలు బాగా ఆడుదాం 

పాటలు చాలా పాడుదాం 

ఆరోగ్యం మెరుగుపరచుకుని 

ఆయుష్షును పెంచుకుందాం


గురుదేవుల మాట విందాం 

కమ్మని కలలు కంద్దాం 

ఐకమత్యంతో మనమంతా 

సాగిపోదాం జగమంతా 


ప్రేమానురాగాలు పంచుదాం 

ప్రేమే దైవమని చాటుదాం 

దానవత్వం పారద్రోలి 

దైవత్వం పెంపొందిద్దాం







ఉంటేనే అందము 

------------------------------

పట్టుదల ఆశయంలో

ఉంటే ఘన విజయము 

ప్రేమపూలు హృదయంలో 

పూస్తే బలపడును బంధము 


పెద్ద వారు సదనంలో 

ఉంటేనే సురక్షితము 

తారకలు గగనంలో 

వెలిగితేనే అందము 


పిల్లలంతా బడిలో 

ఉంటేనే క్షేమకరము 

భక్తులంతా గుడిలో 

గడిపితేనే పుణ్యము 


మెత్తని అమ్మ ఒడిలో 

బాలలకు సంతోషము 

పైరులుండే పొలంలో 

అమితమైన ఆహ్లాదము 







మోక్షానికి మార్గం దైవ నామము 

------------------------------

భగవంతుని సన్నిధిలో 

వారి నామ స్మరణలో

కలదు కలదు సంతోషము 

ఆధ్యాత్మిక చింతనలో 


మనసులోని మాలిన్యము 

కడిగివేసే నామము 

శుద్ధ సువర్ణం మాదిరి 

మార్చుతుంది ఓ చదువరి 


తొలగించును చీకట్లు 

బాపుతుంది ఇక్కట్లు 

పవిత్రమైన నామము 

ధ్యానిస్తే అరుణోదయము 


ఉద్దరించు జీవితాలు 

రంజింపజేయు హృదయాలు 

మోక్షానికదే మార్గము 

గుర్తించుకో అనిశము 








సమస్యలు సహజమే!

------------------------------

సముద్రంలో కెరటాలు 

జీవితంలో సమస్యలు 

ఉంటాయి నిరంతరము 

జయిస్తేనే విజయము 

 

జీవితమే పోరాటము 

అంతులేని ఆరాటము 

స్థిరమైన  సంకల్పమే 

విజయానికి సోపానము 


ఉండరాదు పిరికితనము 

గుండెల్లో అధైర్యము 

మనోనిబ్బరము ఘనము 

గెలుపు బాటకు మూలము 


 గెలుపు ఓటములు సహజము 

మానరాదు ప్రయత్నాలు 

అక్షరాలది సత్యము 







బ్రతకాలి గొప్పగా 

------------------------------

విజ్ఞానం  పెంచుకుని 

అజ్ఞానం త్రుంచుకుని 

ఎదగాలి బ్రతుకులో 

నడవాలి ప్రగతిలో 


బద్ధకాన్ని వదులుకుని 

చురుకుదనం నింపుకుని 

నిలవాలి స్ఫూర్తిగా 

గెలవాలి పూర్తిగా 


అబద్దాలు మానుకుని 

జీవితాలు దిద్దుకునికి 

దైవానికి ఇష్టంగా

ఉండాలి  సాక్షిగా 


పగటి కలలు దాటుకుని 

పాఠాలు నేర్చుకుని 

మారాలి మంచిగా 

జీవించాలి గొప్పగా 







తాతయ్య సుభాషితాలు 

------------------------------

తొందరపాటుతనంతో 

పనికిమాలినతనంతో 

కూల్చుకోకు బంధాలు 

అందమైన కుటుంబాలు 


పనికిరాని చర్యలతో 

తుచ్ఛమైన తలపులతో 

చెరుపుకోకు జీవితాలు 

అమూల్యమైన స్నేహాలు 


కఠినమైన మాటలతో

మలినమైన మనసులతో 

కష్టాలే రానీయకు 

కన్నీరే మిగుల్చకు 


బాధభరిత వార్తలతో 

కీడు చేయు బుద్ధులతో 

ఎవరి పతనం కోరకు 

ఆ ఆలోచన  చేయకు 






జాగ్రత్త అవసరం 

------------------------------

అవసరానికి మించినది 

విషంతో సరి సమానము 

ధనమైనా  ఏదైనా 

తగినంత లాభకరము 


అత్యాశ చేటు చేటు 

వేయును బ్రతుకులో వేటు 

ఆదిలోనే త్రుంచితే 

తప్పుతుంది ఇక పోటు 


చింత వలన బహు నష్టము 

తెచ్చిపెట్టు అనారోగ్యము 

దూరముంటే చాలు చాలు 

జీవితాన మేలు మేలు 


పెద్దలను చేయరాదు

ఏమాత్రం అపహాస్యము 

చిన్న చూపు చూపరాదు 

గాయపడుతుంది హృదయము








ఉండాలి హాయిగా 

------------------------------ 

పసి పాపలా నవ్వుతూ 

ప్రతి క్షణమూ హాయిగా

బ్రతకాలి స్ఫూర్తిగా 

అందనంత గొప్పగా 


కలహాలను  తరుముతూ 

విశ్వశాంతి వెదుకుతూ 

సమైక్యతే తేవాలి 

సైనికునిలా కావాలి 


స్నేహాన్ని కోరుతూ 

క్షమాగుణం చాటుతూ 

ప్రగతి బాట వేయాలి 

ప్రేమ తోట విరియాలి 


పరుల మేలు ఆశిస్తూ 

పెద్దలను గౌరవిస్తూ 

కుటుంబంలా ఉండాలి 

అనురాగం పండాలి 







పరహితం కాంక్షించూ...

------------------------------ 

ఆధ్యాత్మిక చింతనలో 

దైవ నామ ధ్యానంలో 

ఉంటుంది ప్రశాంతంగా 

దైనందిన జీవితంలో 


పనికిరాని వాదనలో 

వదరుబోతు మాటలలో 

పస మాత్రం ఉండబోదు 

ఏ లాభం చేకూరదు 


నిరంతర సాధనలో 

విజయోత్సవ కీర్తనలో 

ముందడుగే వేయాలి 

ఆదర్శం చాటాలి 


పవిత్రమైన మనసులో 

పరహితం కోరుటలో 

ఉన్నదోయ్! దైవత్వము 

మితిలేని మానవత్వము







జాగ్రత్తగా ఉండాలి 

------------------------------

జాగ్రత్త మూర్ఖులతో 

వితండ వాదులతో 

ఓర్వలేనినంతో 

హాని చేయు మనుషులతో 


కష్టాల సమయంలో 

నష్టాల ఊబిలో 

చూపాలి బహు సహనము 

చూడాలి పరిష్కారము 


చేస్తున్న పనిలోన 

వ్రాస్తున్న రచనలోన 

ఉండాలి చిత్త శుద్ధి 

జీవితాన అభివృద్ధి 


మాట్లాడే వేళలో 

ఆలోచన చేయాలి

నెమ్మదిగా మనసులో 

మంచినే కోరాలి

 







అమ్మ ఆధారం--అవనిలో మందారం 

------------------------------

ఇంటి దీపము ఇల్లాలు 

ఆమెతోనే వెలుగులు 

వృద్ధినొందును కుటుంబాలు 

బాగుండును జీవితాలు 


ఇవ్వాలి అమ్మకు స్థానము 

అవనిలోన తొలి గురువు 

ఆమె ఉన్న నందన వనము 

కళకళలాడును సదనము 


ఎవరెస్టు అమ్మ త్యాగము 

కమనీయము ఆమె రాగము 

సృష్టికి ఆమె ఆధారము 

తెచ్చును భూతల స్వర్గము 


అమ్మ చూడ అపురూపము 

పంచుతుంది ఆనందము 

ఆమె లేని ఈ లోకము 

తలపించు ఎడారి ప్రాంతము 



-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page