top of page
Writer's pictureBharathi Bhagavathula

బామ్మగారూ.. సెల్ ఫోనూ


'Bammagaru - Cell Phone' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



మానవీయ కోణాన్ని ప్రసార మాధ్యమం

ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంది.

చాపక్రింద నీరులా ~

నేనుఆలోచిస్తున్నాను. ఏంజరుగుతోంది

మనచుట్టూ, కాలంతోపాటు మనం మారామా? మన మూలంగా కాలం మారుతోందా? మూడు తరాల అంతరంగాలనూ అంచనావేస్తూ ఆలోచిస్తున్నాను. ఇదివరకు ఈ ఇల్లు

ఎలాఉందీ? ఇప్పుడెలా ఉందీ? ప్చ్!

///////////////

"సౌదా! అయిందా?" మామగారి పిలుపుకు

"వచ్చేస్తున్నా మామయ్యా" జవాబు చెప్పి~

"స్వస్తిశ్రధ్ధాం మేధాం యశ: "~ ~

అగ్నిహోత్రపు ఆఖరిమంత్రం కూడా చదివేసి

తర్వాతి మంత్రాలు నోట్లో చదివేస్తూ,

చకాచకా అన్నీ సర్దేసి, పరుగులాంటి నడకతో, ఇంట్లోకి వచ్చేదాన్ని, మామయ్యగారికి కాఫీ ఇవ్వడానికి.

"ఏమిటే చాదస్తం, తెల్లవారేటప్పటికి, వంటలూ, టిఫిన్లు, బాక్సులు, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయటాలూ, ఇన్నీ చాలవనీ ఈ అగ్నిహోత్రం ఒకటీ ,పనులు ఎక్కడ

తెములుతాయీ, ఇవన్నీకాక మళ్ళీ స్కూల్.

ఏదీ ఆపవుకదా? కానీయండీ టైం అవుతోందీ "

నాకు చేదోడువాదోడుగా ఉంటూనే ముద్దుగా విసుక్కుంటోంది అత్తయ్య.

గబగబా తెమిలి, స్కూల్ కి పిల్లలతో వెళ్ళిపోయేదాన్ని. మావారు రమణశర్మ కూడా, నా సాయంతో, ఆత్తయ్య సాయంతో రెడీఅయి కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంట్లో అత్తయ్యా మామయ్యా ప్రశాంతం.

సాయంత్రం అవగానే ,మళ్ళీ హడావిడి గా ఇల్లు చేరేదాన్ని పిల్లలతో.

అప్పటికే బయటి పిల్లలు ఇంటి కొచ్చి ఎదురు చూస్తుండేవారు. వాళ్ళు తరగతి గదిలో పాఠాలకు ప్రైవేట్ ట్యూషన్ కి వచ్చిన వాళ్ళుకారు.

ప్రాచీన సంస్కృత, తెలుగు భాషాభిమానంతో, ఎలాగైనా తమ పిల్లలకు ఓ సంస్కృతీ, సాంప్రదాయం నేర్పాలీ.

ఈరోజుల్లో అవన్నీ, భాషా రూపంగాగానీ, సాంప్రదాయ రూపంగా గానీ మృగ్యమై పోతున్నాయ్, వాటిని చేతులొడ్డి ఐనా కాపాడాలనుకునే, కొంత మంది సత్సాంప్రదాయ వాదులైన తల్లిదండ్రులకు

ప్రతీకలు వాళ్ళు. సాంప్రదాయాన్ని, శ్లోకం,

పద్యం రూపంలో వల్లెవేసేసి, మళ్ళీ యధాతధంగా తరగతి పుస్తకాలతో కుస్తీ పట్టడానికి, గంటలో ఎవరిదారిన వారు వెళ్ళి పోయేవారు.

నేను, పి, జి డిగ్రీ తోపాటుగా వేదమంత్రాలు కూడా కొన్ని నేర్చుకున్నాను. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, నాదగ్గరకు

తర్ఫీదు కోసం పంపిస్తారు. ప్రతిఫలాపేక్షగానీ

ధనాభిలాషగానీ, ఆశించని ఓ ఆదర్శవంత మైన, ఉదాత్తమైన ప్రక్రియ.

"అవునూ! మా కోడలు హోమం చేస్తుంది. కాస్తో కూస్తో వేదమంత్రాలు చదువుతుంది. మేం బాగానే ఉన్నామ్, మీకేమిటి ఇబ్బంది? ఆడవాళ్లు ఇవన్నీ చేయకూడదనే మూఢ నమ్మకం మాకులేదు" అని సున్నితంగా నాకు సపోర్టు ఇస్తూ చాలా ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు,

అత్తయ్య కూడా నాకు మద్దతే. ఆయనైతే సరేసరి. ఇంట్లో గాని వేరే ఇతర విషయాలలోగానీ నాకు మంచి సహాయకుడే, యఙ్ఞసామాగ్రి కూడా శ్రద్ధగా తీసుకురావటం లోకూడా ~

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

కాలచక్రం గిఱ్ఱున తిరిగింది. మామయ్య గారు మరణించారు, సహజంగా ఇంట్లోనూ చాలా మార్పులు జరిగాయ్. కాలేజీలో తరగతి గదులను డిజిటల్ క్లాస్ లు ఆక్రమిస్తున్న నేపద్యంలో ఆయనగారు వృత్తిరీత్యా ఓ స్మార్ట్ ఫోన్ కొన్నారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం. నాకూ ఒకటి ఇచ్చారు.

ఇక అంతే, నా దైనందిని మారిపోయింది.

సెల్ కొత్త మోజులో నేను ప్రపంచాన్నే మరిచిపోయాను . ఇంట్లో అందరి అవసరాలూ తీరంగానే సెల్ ముందేసుకుని కూర్చుని, క్రమక్రమంగా సాహిత్య ప్రక్రియలు నేర్చుకుని, పండితులతో ఇష్టాగోష్ఠులు, సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ, నేర్చుకుని నేను చదువుకున్న

చదువుకు సార్ధకత చేసుకుంటున్నాను.

కానీ, అత్తయ్యగారు సుశీలమ్మగారికి మానసికంగా దూరమయ్యాను. ఇదివరకు ఏపనైనా కలిసి సంప్రదించుకుని చేసేవాళ్ళం .

అత్తయ్యగారుచుట్టుప్రక్కల విషయాలన్నీ పోగేసుకొచ్చి ,"ఏమే! సౌదా! మరే!" అంటూ నాకు పూసగుచ్చినట్టు చెప్పి ఆనందపడేవారు. ఆ జరిగిన సంఘటనల మీద గంటలు గంటలు చర్చించుకుని చివరికి "ఆ ~మనకెందుకు లెద్దూ " అనుకుంటూ , చుట్టుప్రక్కల ఆదర్శఅత్తాకోడళ్ళూ, అని అందరిచేతా శభాష్ అనిపించుకున్నాం.

సెల్ నాకు మంచే చేసినా మా ఇంట్లోవాళ్ళ మనసుల్లో అగాధాలు సృష్టించింది. మా ఇంట్లో జరిగిన మంచికీ చెడుకీ కూడా టెక్నాలజీ వారధి ఐంది.

"ఏమే అమ్మాయ్! లేచి అగ్నిహోత్రం చేయవా?" అత్తయ్యగారు పిలిస్తేగానీ ఈలోకంలోకి రాలేకపోతున్నాను.

ఇంటికి పద్యం, మంత్రం నేర్చుకునే పిల్లలను దగ్గరకు రానీయట్లేదు .

"టీచర్, టీచర్, మాకేదన్నా నేర్పండి "అని ఫోన్ చేసిన పిల్లలకూ, "మేడమ్! మా పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయం మీరు కాకపోతే ఎవరు నేర్పుతారూ?" అని పెద్దలు అడుగుతుంటే నిర్లక్ష్యం చేసేసి, సెల్ ప్రపంచం లో మునిగిపోయా.

ఇలా చాలా మార్పులు జరుగుతున్నాయ్. చక్కని ఫ్రెండ్ లా ఉండే నేను తనతో తక్కువగా మాట్లాడటం జీర్ణించుకోలేక పోతోంది, అత్తయ్యగారు.

"ఏరా! నేనెక్కడికైనావెళ్ళిపోతా! నన్ను ఇంట్లోంచి పంపేయ్, ఇంట్లో చిరాకుగా ఉంది. ఉండలేక పోతున్నాను" అన్నఅత్తయ్య గారి ఆరోపణ మావారిని ఆలోచనలో పడేసింది.

"ఏంటమ్మా! ఈ వయసులో ఈ మాటలూ.. నీకేం తక్కువయిందనీ, సౌదామినితో గొడవలేం లేవుగదా! నిన్ను తల్లి కంటే ఎక్కువగా చూస్తోంది కదా?" అని అడిగిన అత్తయ్యగారి తల్లి మాటకు మనసులో నాతోపాటు ఆయనా నొచ్చుకుంటూ,

"అయ్యో! అదేం కాదురా.. అది చాలా మంచిది. నాకు సమయానికి అన్నీచక్కగా అమరుస్తుంది, బంగారు కోడలురా! కానీ ఈ సెల్ ఫోన్ వచ్చాక అది చాలా మారిపోయిందిరా! నాతో గడిపే సమయాన్ని సెల్ ఫోన్ కి ఇచ్చేసింది. రోజూ పనికాగానే అందులోనే తలదూరుస్తుంది, ఇదిగో నేను ఒంటరిగా కూర్చుని టి, వి లో వచ్చే సీరియల్స్ చూసీ, చూసీ విరక్తి పుడుతోంది.

పిల్లలు స్కూల్ కి వెళ్ళి పోతారు, వాళ్ళ చదువుతో వాళ్ళుకూడా బిజీ. అంతలా చూసేంతగా ఏముంటాయిరా ఆ సెల్ లో " తన మనసులోని మాటను కొడుకు ముందు బయట పెట్టేసింది.

తల్లి ఒంటరితనంతో బాధ పడుతోందని ఆయనకు అర్ధమయ్యింది.

//////////////

"అమ్మా! నీకో సర్ప్రైజ్ "అంటూ ఆనందంగా వచ్చి తల్లిచేతిలో ఒక పాకెట్ ఉంచారు ఆయన. నేనేం ఈర్ష్య పడలేదు.

"ఏమిటిరాఇదీ! అర్ధంకాలా! ఏదో పెట్టెలా ఉందే "అన్నారు , పెట్టెను తడిమి చూస్తూ.

పాకెట్ విప్పారు.

టచ్ మొబైల్ నల్లగా మెరుస్తూ కనబడేసరికి

"ఇంత పెద్దఫోన్ నాకెందుకురా? ఖరీదు కూడా ఎక్కువే అనుకుంటా. ఇప్పటికిప్పుడు పదివేలు పోసి ఎందుకు కొన్నావు? ఇందులో నాకేం అర్ధం అవుతుందీ? దీనిని ఎలా నొక్కాలో నాకేం తెలుసూ" అంటూ ఆనందంగానూ, కాస్త మెుహమాటం తోనూ ఉబ్బితబ్బిబ్బయ్యింది 80 ఏళ్ళ అత్తయ్యగారు .

"నేర్చుకుంటే ఏదైనా వస్తుందమ్మా! మాన్వి ఉందిగా, ఆదివారం రోజు దాని దగ్గర నేర్చుకో!” అన్నాడు.

ఏడవ తరగతి చదువుతున్న మాన్వి సెల్ టెక్నాలజీ అంతా అవపోసన పెట్టేసింది.

ఆమెకి బామ్మంటే ప్రాణం.

స్కూల్ నుండి రాగానే బామ్మే కనబడాలి, బామ్మ ప్రక్కన లేకుండా నిద్రపోదు. స్కూల్ విషయాలన్నీ బామ్మకే చెపుతుంది. బామ్మా, మనవరాలు మంచి

స్నేహితులు. ఇంకేం.. ఒకఆదివారం నాడు గదిలో మంచంమీద, గుసగుసలాడుకుంటూ

పక్కపక్కనే పడుకుని సెల్తో కుస్తీ మెుదలెట్టారు ఇద్దరూ.

"ఏమిటే! ముట్టుకోగానే పాదరసంలా జరిగిపోతోందీ? "

సంబరపడిపోతోంది అత్తయ్య.

"ఇది అంతే బామ్మా! ఇదిగో ఇలా

నొక్కాలి! ఇలా చేయాలి! "అంటూట్రైనింగ్ ఇచ్చింది,

మాన్వి స్కూల్ కి పోగానే బామ్మగారు

సెల్ ఆన్ చేసి సినిమాలు చూడటం, జోక్స్

ఎంజాయ్ చేయడం, తెలియనివి ఆయనను

నన్ను అడిగి తెలుసుకోటం, అత్తయ్య పాతతరం అత్తయ్య గా బామ్మగాగాక, క్రొత్తతరం అత్తయ్యగా బామ్మగా సరికొత్త అవతారం ఎత్తి పరిణతి సాధించారు.

అంతవరకూ ఆవిడ కాలక్షేపం బాగానేఉంది, కానీ మాన్వి బామ్మకి ఫోన్ వాడకం నేర్పే క్రమంలో ఫోనుకి అలవాటు పడింది.

స్కూల్ నుండి రాగానే చదువు, హోంవర్క్, మానేసి సెల్ ఆన్ చేయటం మెుదలుపెట్టింది. పోనీలే సరదాగా కాసేపు ఆడుకోమని ఉపేక్షించాం అత్తయ్యగారూ, మేమూ.

రోజూ ప్రేమగా వుండే బామ్మతోనే మాటలు మానేసి వీడియోగేమ్స్ టిక్ టాక్ లు, యు ట్యూబ్ ఆన్ చేసి ఏమిటేమిటో చూడటం,మెుదలు పెట్టింది. అత్తయ్య ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా ఫోన్ మనవరాలిని అడుక్కోవటం చూసే వాళ్ళకి ఇదేమిటీ అనిపిస్తోంది. అవసరానికి వాడాల్సిన ఫోన్ బామ్మచేతిలో కన్నా, మనవరాలి చేతిలోనే ఎక్కువసేపు ఉంటోంది.

ఇంట్లో వాళ్ళు మందలించారు. తెలిసినవాళ్ళచేత చెప్పించాం. సెల్ పిల్లలు వాడటం వల్ల వచ్చే నష్టాలు పేపర్లో చదివి వినిపించాం.

ఐనా వినే స్థితి దాటింది, నిరంతరంసెల్, సెల్ . బయట ఫ్రెండ్స్ ని కలవడం మానేసింది, అందరికీ తన నెంబర్ ఇచ్చి గంటలకొద్దీ వాట్సప్ ఛాటింగ్ లు, గంటలు గంటలు మాటలు ముచ్చట్లు, ఏదన్నా అంటే సిలబస్ డౌట్స్ అని చెప్పటం తలనొప్పిగా తయారయింది.

అన్నంతినేటప్పుడు కూడా సెల్ చూస్తూ తినడమే, అర్ధరాత్రిదాకా మేలుకొని ఫోన్లో మునిగిపోవటం. ఇంట్లో వాళ్ళకి భయంపట్టుకుంది, ఈ వయసుకే టెక్నాలజీని ఇంత దుర్వినియోగం చేస్తే, పిల్లభవిష్యత్తు ఏమై పోతుంది?

బామ్మకాలక్షేపం ఎలా ఉన్నా ఇది తలలు పట్టుకు కూర్చునేంత భారమైంది. ఏం చేయాలి?

ఓరోజు మాన్వి స్కూల్ నుండి రాగానే బామ్మా! అని పిలిచింది. బామ్మ కనిపించలా!

"అమ్మా! బామ్మేదీ!" అడిగింది మాన్వి.

"నీకు సెల్ అప్పగించి తను ఎటో వెళ్ళిపోయింది, బహుశా వృధ్ధాశ్రమానికనుకుంటా! నాన్నగారే దింపివచ్చారు. తనవల్లే అంటే తన కాలక్షేపం కోసం సెల్ఫోన్ కొనటం వల్లే నువ్వు చెడిపోతున్నావని ఏడుస్తూ మీ నాన్నతో నేనెటన్నా వెళ్ళిపోతారా పంపేయరా! అనటం విన్నాను. అయినా నీకెందుకు? ఈ మధ్య బామ్మతో సహవాసం చేయట్లేదుగా నువ్వూ .....పోతేపోనీ బామ్మనీ!” అంటూ ఇదిగో సెల్ నువ్వే ఉంచుకో!" సెల్ ఫోన్ మాన్వి చేతికి ఇస్తూ అన్నాను.

అంతే, ఏడుపు మొదలు పెట్టింది మాన్వి,

"బామ్మకావాలీ" అని ఏడుపు, ఎవరూ పట్టించుకోనట్లు ప్రవర్తించాం. మౌనంగా మేమంతా ఎవరి పనుల్లో వాళ్ళు

నిమగ్నం అయ్యాం. కానీ మాన్వీ మాత్రం

పుస్తకాలు ముట్టలేదు, ఏడుస్తూనే ఉంది.

అన్నం తినలేదు, మరునాడు స్కూల్ కి వెళ్ళలేదు.

‘బామ్మకావాలీ...’

ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ సెల్ విసిరేసింది.

"అమ్మా! నాకు ఫోన్ వద్దమ్మా! బామ్మే కావాలి! పిలువమ్మా!"

కానీ మేం ఎవరం స్పందించలేదు, జ్వరం వచ్చింది. సంధి కలవరింతలు…

"బామ్మా! బామ్మా!" అని. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గలా!

వారం రోజులకి ఎక్కడినుండో ఊడిపడింది, అత్తయ్య. "మాన్వీ, మాన్వీ " అని పరుగు పరుగున....

"బామ్మా నాకు నీ సెల్ ఫోన్ వద్దు, నువ్వే కావాలి. ఫోన్ నీకిచ్చేస్తా,. నన్ను వదలిపెట్టి వెళ్ళిపోకూ" "కలవరిస్తోంది మాన్వి.

బామ్మ ,మనవరాలు కౌగిలింతలతో మమేకమైపోయారు.

"నిన్ను విడిచి నేనెక్కడికి పోతాన్రా బంగారం! మనిద్దరం ఎప్పటికీ స్నేహితులం. సరేనా!"

మనుమరాలి దగ్గరే కూర్చుని బుజ్జగించింది.

వారిద్దరి బాంధవ్యాల మధ్య అనుబంధాల తీవెలు అల్లుకున్నాయి.

నేనూ ఈయనా నవ్వుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. కానీ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా వల్ల కాదూ!?

ఇన్ని అనుబంధాలకూ,అవాంతరాలూ, నన్ను నేను మార్చుకోవాల్సింది చాలా ఉంది.

వెంటనే ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాను.

కొంతమంది పిల్లలనూ, వారి తల్లిదండ్రులను మన సంస్కృతికి పునరంకిత మవుదాం రమ్మని పిలవాలని.

~శుభం ~

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.



173 views0 comments

Kommentare


bottom of page