బండరాళ్ల బ్రతుకులు
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Jun 11
- 6 min read
#BandarallaBrathukulu, #బండరాళ్లబ్రతుకులు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Bandaralla Brathukulu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 11/06/2025
బండరాళ్ల బ్రతుకులు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"మావా! బువ్వ తినే ఏలయినాది చేతులు కడుక్కుని రా !" అంటూ ఎండలో చెమటలు కక్కుతు బండరాళ్లను ఇనుప సమ్మెటతో కొడుతున్న పెనిమిటి నాగరాజును కేకేసింది నాగమణి.
నాగరాజు చేతులు కడుక్కుని రాగా సద్దిమూట విప్పి బాదం ఆకులో జొన్న రొట్టెలు, గిన్నెలో పప్పు, పచ్చి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు, ముంతతో మంచినీళ్లు ఇచ్చి తను కూడా తినసాగింది.
అప్పటికే ఎండ ముదిరి వాతావరణం వేడిగాఉంది. కొండగుట్టల వద్ద ఉన్న క్వారీలో రాతిపనులు చేసే ఆడ మగ కూలీలు పనులు కట్టిపెట్టి తినడానికి దగ్గరలో ఉన్న వేపచెట్టు నీడకు చేరుకుంటున్నారు.
ఎక్కువగా అక్కడ రాతిపనులు చేసేది ఆలుమగలు. వారందరు దగ్గరగా ఉన్న పాలెం గ్రామస్తులే. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు అదునుకు పడక వ్యవసాయ పనులు లేక రైతులు కూలీలుగా మారి బ్రతుకుతెరువు కోసం ఏ పని దొరికితే అది చేసుకుంటు రోజులు వెళ్లదీస్తున్నారు.
కొందరు లేబర్ కాంట్రాక్టరుతో దూర ప్రాంతాలకు వలసపోయారు. ఊరికి దగ్గరగా ఉందని క్వారీ కాంట్రాక్టరు కనకరాజు దగ్గర రోజువారీ పనులకు ఒప్పుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు బండ రాళ్లను ముక్కలుగా చేస్తు చెమటోడుస్తున్నారు.
మగవాళ్ళు పగలకొట్టిన రాతిముక్కలను ఆడవారు తట్టలలో నింపి తల మీద పెట్టుకుని ఒకచోట గుట్టలుగా పోస్తారు. తర్వాత లారీలలో నింపి క్రషింగ్ మిషిన్ దగ్గర వాటిని గ్రావెల్ కాంక్రీటు పిక్కలుగా చేస్తారు.
కనకరాజు ఆప్రాంతంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. రోడ్డు కాంట్రాక్టులు, పాఠశాల బిల్డింగులు గుత్తకు తీసుకుని డబ్బులు బాగా సంపాదించాడు. తండ్రి కట్టించిన పాత ఇంటిని పడగొట్టి ఆధునిక సౌకర్యాలతో బంగ్లా కట్టించాడు. ఖరీదైన కారు కొన్నాడు. పొడవైన భారీ
శరీరం, కళ్లకి నల్ల కళ్లద్దాలు, ఎప్పుడూ తెల్లని వస్త్రధారణతో ఖరీదైన పెర్ఫ్యూమ్స్ బట్టలకు స్ప్రే చేస్తాడు. సాయంకాలమైతె మందు పార్టీలతో ఎప్పుడూ ఇద్దరు రౌడీలను వెంట ఉంచుకుంటాడు.
కాంట్రాక్టరు కనకరాజు విలాస పురుషుడు. స్త్రీలోలుడు. ఎప్పుడూ అందమైన అమ్మాయిల వేటలో డబ్బు వెదజల్లుతాడు. అతని కళ్లలో ఎవరైన ఆడది కనబడిందంటె ఆమెను అనుభవించేవరకు వదలడు. అతని క్వారీ వద్ద, క్రషింగ్ మిషీన్ల దగ్గర పని చేసే వయసున్న ఆడవారిని నయానో భయానో లొంగతీసుకుంటాడు. రాజకీయ పలుకుబడి ఉన్న కనకరాజును ఎవరు ప్రతిఘటించడానికి భయపడతారు.
అక్కడ ఉండే పోలీసు సిబ్బందిని డబ్బుతో కొని తన కనుసన్నలలో ఉంచుకున్నాడు. అందువల్ల ఊరి వారి మొర వినేవారు లేరు అక్కడ. ఎవరైన ఎదురు తిరిగి మాట్లాడితే ఏదో పోలీసు కేసులో ఇరికించి చావు దెబ్బలు కొట్టిస్తాడు.
కనకరాజుకు పైళ్లై పెళ్లాం వసంత ఉంది. అతని చెడుతిరుగుళ్ల వల్ల ఆమెకు రోగాలు సోకి గర్భాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చి తీసేయవల్సి వచ్చింది. పిల్లలు లేరు. ఇంటి దగ్గర ఎన్ని అధునాతన సౌకర్యాలున్నా దుర్భర జీవితం అనుభవిస్తోంది ఆమె.
పాలెం ఊళ్లో నాగరాజును సోగ్గాడంటారు. శోభన్ బాబులా నల్లని ఒత్తైన గిరజాల జుత్తు, కోరమీసం, కండలు తిరిగిన జబ్బలు, నల్లటి శాండో బనీను, పొడుం రంగు నిక్కరుతో అందర్నీ నవ్వుతు పలకరిస్తుంటాడు. ఊరి గ్రామదేవత పండగప్పుడు అడ్డపంచె కట్టు, కల్లీ కమీజు, తలపైన ఎరుపు రిబ్బను చుట్టి మొహాన సింధూర బొట్టుతోతోటి సహవాస గాళ్లతో కర్రసాముతో అందర్నీ ఆకట్టుకుంటాడు.
ఊళ్లో ఎవరికి ఆపద వచ్చినా ముందుంటాడు. అందువల్ల ప్రత్యేక అభిమానం చూపుతారు అందరు. నాగరాజు అమ్మ నాన్నలు చిన్నతనంలోనె చనిపోవడం వల్ల ముసలి నానమ్మ చేరదీసి పెంచి పెద్దచేసింది. ఆముసలి నానమ్మ కూడా ఈమద్య కాలంలో చనిపోవడంతో నాగరాజు ఒంటరి వాడయాడు. చెల్లి వరసైన అనసూయ వచ్చి ఇంటి పనులలో సహాయం అందిస్తుంది.
నాగమణిది పొరుగూరు తవ్వాడ గ్రామం. పద్దెనిమిదేళ్ల వయసులో శరీర అంగసౌస్టవంతో నల్లని పెద్ద జడ, కోలకళ్లు, చామనచాయ రంగుతో చూసేవారి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చెయ్యగల అందం ఆమెది.
పల్లె గ్రామంలో వరి పంటల కోతల టైములో తవ్వాడ నుంచి తోటి ఆడకూలీలతో కలిసి వచ్చేది నాగమణి. అప్పుడు కొన్ని సార్లు నాగరాజు తారసపడటం జరిగింది. అతని రూపం, దేహ దారుడ్యాన్ని చూసి మనసులో మురిసిపోయేది.
అనుకోకుండా పెద్దల సమక్షంలో రాములోరి కోవెల దగ్గర నాగరాజు, నాగమణిల లగ్గం జరిగింది. అందరూ ఈడూజోడు కుదిరిందని మెచ్చుకున్నారు. వారికి పెళ్లి జరిగి సంవత్సరమవుతోంది.
నాగరాజు, నాగమణి కాంట్రాక్టరు కనకరాజు దగ్గర కూలి పనులకు ఒప్పుకున్నారు. కొండగుట్టల వద్ద రాతిబండలను పగలగొట్టే పనులు జరుగుతున్నాయి. వీలైనంతవరకు ఇనప సమ్మెటలతోను, పెద్ద బండలను డైనమైట్ జెలటిన్ మందుగుండు సామాన్లు ఉపయోగించి ముక్కలుగా చేస్తుంటారు.
ఒకసారి కనకరాజు కారులో నల్లకద్దాలు పెట్టుకుని క్వారీ పనులు చూడటానికి వచ్చాడు. అప్పుడు అక్కడ వయసు మీదున్న నాగమణి కంటపడింది. ఈ గ్రామీణ జనాలలో ఇంత అందగత్తె ఉందా అని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి తరచు క్వారీని చూడటానికి వస్తున్నాడు. తనతో ఉండే పహిల్వాన్ల ద్వారా ఆమె వివరాలు సేకరించాడు.
డబ్బు విసిరి నాగమణిని ఎలాగైన లొంగతీసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆమె తెంపరితనం ముందు కనకరాజు ఆశలు నెరవేరడం లేదు. కొంతమంది తోటి ఆడకూలీల ద్వారా కాంట్రాక్టరు కనకరాజు పన్నాగం తెలుసుకున్న నాగమణి తన జాగ్రత్తలో ఉంటోంది.
ఇక్కడి నుంచి పట్నం పోయి ఏదైన కొలువు చూసుకుని బ్రతకాలని ఆలోచనలో ఉన్నారు నాగరాజు దంపతులు.
బండరాతి కూలీలు వేపచెట్టు కింద మద్యాహ్నం బువ్వలు తిని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కారులో వచ్చిన కనకరాజు ఇంకా పని మొదలెట్టలేదని గుమస్తా మీద కేకలేస్తున్నాడు. అతని కళ్లు నాగమణి కోసం వెతకసాగేయి. కూలీల గుంపులో కలిసి నాగమణి పనిలోకి పోయింది.
ఒకరోజు నాగరాజు తోటి కూలీలతో పెద్ద బండను ముక్కలు చెయ్యడానికి రంద్రం చేసి పేలుడు పదార్థం ఉంచి దూరంగా జరిగి కూర్చున్నారు. అందులో ఒక బండరాయి ముక్క పేలి ఎగిరి నాగరాజు కుడికాలి మీద జోరుగా వచ్చి పడింది. కాలు నుజ్జయి రక్తం కారసాగింది. వెంటనే గుమస్తా తోటి కూలీల సహాయంతో ఆటోలో పట్నం హాస్పిటల్ కు తోలుకుపోయారు.
నాగమణి, కాలు నుజ్జయి రక్తస్రావంలో ఉన్న నాగరాజును చూసి హతాగరాలైంది. ఒకటే ఏడుపులు పెడబొబ్బలు మొదలెట్టింది. తోటికూలీలు ధైర్యం చెప్పి ఊరడిస్తున్నారు.
కాంట్రాక్టరు కనకరాజుకు విషయం తెలిసి క్వారీ దగ్గరకు కారులో వచ్చి కూలీల ద్వారా ప్రమాదం వివరాలు తెలుసుకున్నాడు. కేసు కాకుండా వెంటనే పోలీసుస్టేషనుకు చేరుకుని స్టేషన్ ఆఫీసర్తో మంతనాలు జరిపాడు.
పట్నంలో పెద్ద హాస్పిటల్లో నాగరాజుకు చికిత్స జరపగా నుజ్జైన కుడికాలుకు ఆపరేషన్ చేసి మోకాలు వరకు తీసెయ్యవల్సి వచ్చింది. నాగమణి తోడుగా ఉంటు రోజులు వెళ్లదీస్తోంది. అనుకోని ఈ దుర్ఘటనతో కుంగి కృశించిపోయింది.
హాస్పిటల్ ఖర్చులు, తిండికి కాంట్రాక్టరు కనకరాజు చూసుకుంటున్నాడు. పోలిసు కేసైతే ఎంక్వైరీలు, అధికారుల రాకపోకలు జరిగితే తన బండారం బయటపడుతుందని జాగ్రత్త పడ్డాడు. ఊరి సర్పంచ్ ను డబ్బుతో మేనేజ్ చేసి ప్రత్యక్ష సాక్షులతో తనకి అనుకూలంగా ఏక్సిడెంట్ కేసుగా మార్చి నష్టపరిహారం లేకుండా చేసుకున్నాడు.
రెండు వారాల తర్వాత వికలాంగుడిగా రెండు ఊత కర్రల సాయంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయాడు నాగరాజు. ఊళ్లో అందరు ముందు సోగ్గాడిలా ఉషారుగా ఉండే నాగరాజు ఇలా ఊతకర్రల సాయంతో అవిటివాడిగా రావడం చూసి బాధ పడ్డారు. కొంత డబ్బు సహాయం చేసి ఇంట్లోకి కావల్సిన నిత్యావసర సరుకులు పంపిస్తున్నాడు కాంట్రాక్టరు కనకరాజు.
అప్పుడప్పుడు నాగరాజును పరామర్స వంకతో ఇంటికి వచ్చి నాగమణిని చూస్తున్నాడు. నాగమణి తన జాగ్రత్తలో ఉంటు అన్నీ గమనిస్తోంది. కొద్ది రోజుల తర్వాత పట్నానికి పోయి ఏదో బ్రతుకుతెరువు చూసుకుందామన్న సమయంలో ఇలా నాగరాజుకు ప్రమాదం జరిగి కాలు పోగొట్టుకోవడం బాధనిపిస్తోంది. ఇప్పుడు నాగమణి మూడునెలల గర్భవతి. భవిష్య జీవితం ఎలాగని దిగులు పట్టుకుంది.
కాంట్రాక్టరు కనకరాజు ఇచ్చిన డబ్బుతో రోజులు గడుస్తున్నాయి. నాగమణి తన బిడ్డకు తల్లి కాబోతుందని తెలిసినా నాగరాజులో ఆనందం లేకపోయింది.
ఒకరోజు చీకటి పడిన తర్వాత నాగరాజును పరామర్స వంకతో ఇంటికి వచ్చిన కాంట్రాక్టరు కనకరాజు, కారును దూరంగా ఉంచి తన బాడీగార్డులను అక్కడే ఉండమని చెప్పి చేతిసంచిలో పళ్లు, తినుబండారాలతో వచ్చాడు. బాగా విస్కీ తాగిన నిషాలో వున్నాడు.
వస్తూనే నాగరాజు బాగోగులను అడిగి తెల్సుకుని త్వరలోనే తహసీల్దారుతో మాట్లాడి వికలాంగుల పెన్షన్ అందేలా చేస్తానని చెప్పేడు.
నాగరాజు అచేతనంగా నులకమంచం మీద పడుకున్నాడు. మనిషి సాయం లేకుండా తన పనులు చేసుకోలేక పోతున్నాడు. వీలున్నంత వరకు నాగమణి కావల్సిన అవసరాలు తీరుస్తోంది. ముందు గదిలో మంచం మీద పడుకున్న నాగరాజును "నీ భార్య కనబడటం లేదు. పైకి వెళ్లిందా" అన్నాడు.
తనకి అన్నం తినిపించి వెనక పాత్రలు శుభ్రం చేస్తోందని చెప్పాడు. కనకరాజు రాకను గమనించే నాగమణి ఇంటి వెనకవైపుకు వెళ్లింది. ఇదే అదును అనుకుని విస్కీ నిషాలో ఉన్న కనకరాజు ఊగుతు పెరటి వైపుకు దారి తీసాడు. అక్కడ మసక వెలుగులో పాత్రలు శుభ్రం చేస్తున్న నాగమణిని వెనక నుంచి తన కబంధ హస్తాల్లో
ఇరికించాడు.
ఈ హఠాత్పరిణామానికి నాగమణి నివ్వెరపోయింది. పెనుగులాడుతు అరవబోతే ఆమె నోరు నొక్కిపెట్టాడు. నిషా మీదున్న కనకరాజు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకో లేదు. ఆమె చీరను లాగి పారేసాడు. జాకెట్టు లంగా మీదున్న నాగమణిని చూసి మరింత రెచ్చిపోయి ఆమె వక్షోజాలను పట్టుకున్నాడు.
కనకరాజు చేష్టలను గ్రహించిన నాగరాజు మంచం మీద ఉండి ఏమీ చేయలేని పరిస్థితి. అరుద్దామన్నా నోరు పెగలడం లేదు.
నిస్సహాయ పరిస్థితిలో ఉన్న నాగమణి జరగబోయే ముప్పును గ్రహించింది. దగ్గరలో చెట్టు మొదట్లో ఉన్న గొడ్డలి కనబడింది. తన ఆత్మ రక్షణకు అదే ఆధారమని ఊహించి బలంగా ఆ కామాంధుడిని వెనక్కి తోసి గొడ్డలి అందుకుని బలంగా కనకరాజు మెడ మీద నరికింది. సగం మెడ తెగిన కనకరాజు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్నాడు.
ఇలా జరిగిందేమిటని నాగమణి నివ్వెరపోయింది.
ఇంతలో ఇరుగు పొరుగు ఇళ్ల వారికి సమాచారం తెల్సి అందరూ నాగరాజు ఇంటి ముందు గుమిగూడారు. విషయం తెల్సుకున్నారు. కామాంధుడు కనకరాజుకు తగిన శిక్షే జరిగిందని అతడి కబంధహస్తాలలో నలిగిన ఆడవాళ్ళు ఆనందించేరు. ఇప్పటికి వాడి పాపాలు పండేయని సంతోషించేరు.
విషయం తెల్సి కారుతో వచ్చిన కనకరాజు బాడీగార్డులు గబగబా రక్తపు మడుగులో ఉన్న శరీరాన్ని హాస్పిటల్ కు తీసుకు రాగా అప్పటికే ప్రాణాలు పోయినట్టు డాక్టర్లు నిర్దారణ చేసారు.
మొగుడు కాలు పోయి సొట్టోడైనాడని డబ్బు కోసం నాగమణే కాంట్రాక్టరు కనకరాజుకు లొంగిపోయి ఉంటాదని కొందరు ఆడాళ్లు చెవులు కొరుక్కున్నారు.
***
తన భర్త కామం వల్ల ఒక యువజంట జీవితం కష్టాలు పాలైందని తెల్సిన దివంగత కనకరాజు భార్య వసంత ఎంతో బాధ పడింది. తన భర్త విలాసపురుషుడని, స్త్రీ లోలుడని ఆమెకు బాగా తెలుసు. భర్త చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తను చెయ్యాలనుకుంది.
కాంట్రాక్టరు కనకరాజును హత్య చేసిన కేసులో పోలీసులు నాగమణిని అరెస్టు చేసి కేసు ఫైల్ చేసారు. రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో ఉంచారు. కనకరాజు భార్య వసంత డబ్బు ఖర్చు చేసి పెద్ద క్రిమినల్ లాయర్ని ఏర్పాటు చేసి నాగమణి కేసును అప్పగించింది.
కేసు జిల్లా కోర్టులో నడుస్తోంది. సాక్షుల వాంగ్మూలం, ఆడవారితో కనకరాజు అనుచిత ప్రవర్తన, తన ఆత్మరక్షణ కోసం తప్పని పరిస్థితుల్లో హత్య చేయవల్సి వచ్చిందని కోర్టులో క్రిమినల్ లాయర్ వాదించి నాగమణిని నిర్దోషిగా నిరూపించి జైలు నుంచి విడుదల చేయించారు.
కాంట్రాక్టరు కనకరాజు మరణానంతరం భార్య వసంత తన తమ్ముడికి వ్యాపార భాద్యతలు అప్పగించి ఊరికి ధన సహాయం చేస్తు అందరి మన్ననలు అందుకుంది.
నాగరాజుకు వీల్ చైర్ కొనిచ్చి తమ కంపెనీ ఆఫీసులో కొలువు ఇప్పించి చక్కటి ఇల్లు ఏర్పాటు చేసింది.
నాగమణి సంరక్షణ బాధ్యత తీసుకుని కార్పోరేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించగా పండంటీ మగపిల్లాడు పుట్టాడు. తమ ఇంటి సమీపంలోనే వారికి ఆశ్రయం కల్పించింది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments