top of page

బంధం


'Bandham' New Telugu Story

Written By Kayala Nagendra

'బంధం' తెలుగు కథ

రచన: కాయల నాగేంద్ర

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)పద్మిని, రమణలకు పెళ్ళయి ఐదు సంవత్సరాలయింది. ఈ అయిదు సంవత్సరాలు క్షణాల్లా గడచి పోయాయి. వారి మధ్య మూడో వ్యక్తి మూడేళ్ళ ముద్దుల కొడుకు సాకేత్. తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన ప్రేమానురాగాలు అల్లుకున్నాయి. హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి పెనుతుఫాన్ చెలరేగింది. తాత రఘురామయ్య అంటే సాకేత్ కి వల్లమాలిన ప్రేమ. ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. తాతయ్యలు మన సంస్కృతీ సాంప్రదాయాలను, వాటి విలువలను తెలియజెప్పి, జీవితానుభవంతో మనిషిగా ఎలా మసలుకోవాలో చెబుతారు. తాత, మనవడు మధ్య అనురాగ బంధాన్ని చూసిన పద్మిని తట్టుకోలేకపోయింది. ఎక్కడ కొడుకు తనకు దూరం అవుతాడోనని మదనపడసాగింది. ఆమె ముఖంలో వున్న ప్రశాంతత స్థానంలో కోపం చోటు చేసుకుంది. రాను రాను తాతే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేక పోయింది. “ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. మన కొడుకును దూరం చేయాలని చేస్తున్నాడు” అని చెబుతూ వేరు కాపురం పెట్టడానికి రమణ పైన ఒత్తడి పెంచింది. రమణకు భార్య మాటే వేదం. ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాడ్ని చేసి వేరు కాపురం పెట్టారు. ఎంతో అన్యోన్యంగా వున్న తాత-మనవడ్ని వేరు చేశారు. తాత మనవడు బంధం శాశ్వతమే కానీ, వాడితో కలిసుండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు. పక్కమీద వాలినా నిద్ర రావడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలెన్నో కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి. ‘పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదా?..’ ఆక్రోశించింది అతని మనస్సు. గుండె చెరువయ్యి కళ్ళల్లో నీళ్లు తెరలు కట్టాయి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి. పెళ్లికాక ముందు పులిగా ఉండే కొడుకు, భార్య రాగానే పిల్లిలా మారిపోయాడు. భార్య ముందు నోరెత్తటం మానేసి, బుద్దిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకున్నాడు. తన గురించి తాను పట్టించుకోకుండా తన కొడుకు సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య. సకలభోగాలు తన వారసుడికి అందించి తను మాత్రం సాధారణ జీవితం గడపసాగాడు. తన ధ్యేయం ఒక్కటే! తనలాగా తన కొడుకు గుమాస్తా కాకూడదు. అందుకనే ఉద్యోగం చేరిన మొదలు రిటైర్ అయ్యేంత వరకూ నడిచే ఆఫీసుకు వెళ్ళి వచ్చేవాడు. ఇదంతా చేసేది తన కొడుకును ప్రయోజకుడ్ని చేయడానికి. కొడుక్కి మంచి ఉద్యోగం రాగానే పెళ్లి చేశాడు. తన బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకున్నాడు. రిటైర్ అయిపోయి పెన్షన్ డబ్బుతో కాలక్షేపం చేయసాగాడు. చిన్నప్పుడు కన్నకొడుకుతో ఆడుకుని, వాడు అడుగులు వేస్తే ఆనందించే తను, ఈ వయసులో తన కొడుకు చేయూతకు దూరమయ్యాడు. తన ప్రాణమైన మనవడు దూరం కావడంతో మరింత ఇబ్బంది పడసాగాడు. వెళ్లిపోతున్న మనవడ్ని చూస్తుంటే, రఘురామయ్య కళ్ల నుంచి అశ్రు బిందువులు జలజలా రాలాయి. కర్చీఫ్ తో వాటిని అడ్డుకుంటూ వికలమైన మనసుతో అలాగే నిలబడి పోయాడు. ప్రతి నిమిషం వాడి గురించే ఆలోచిస్తూ, వాడి గురించే ఆదుర్ధాపడుతూ మానసికంగా క్రుంగసాగాడు. రెండు నెలలు భారంగా గడిచిపోయాయి. మనవడ్ని చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికెళ్ళాడు రఘురామయ్య. రఘురామయ్య ఇంటిలోకి రాగానే ఆయన కాళ్లమీద పడి ఏడ్చేసింది పద్మిని. ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరింకేమైనా కారణం ఉందో రఘురామయ్యకు అర్థం కావడం లేదు. మనసులో భారం తగ్గేదాకా ఏడ్వసాగింది. రఘురామయ్యకు అర్థం కాకపోవడంతో బెడ్రూమ్ లో పడుకునివున్న మనవడి దగ్గరకి వెళ్ళాడు. సాకేత్ అస్థిపంజరంలా మూసిన కళ్ళు మూసినట్లే బెడ్ మీద పడి ఉన్నాడు. ఆ స్థితిలో మనవడ్ని చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది. ‘సాకేత్, నాన్న సాకేత్’ అంటూ పిలుస్తుంటే, అతని కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా తనకిష్టమైన తాతను చూడగానే పెదవులపైన చిరునవ్వు మెరిసింది. ఎక్కడలేని శక్తిని తెచ్చుకుని తాతను అల్లుకుపోయాడు. దుఃఖం ఎగతన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ తాతను వదలలేదు. ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది. గదిలో మనుషులు ఉన్నా, మనసువిప్పి మాట్లాడుకోవటానికి ఏవో తెరలు అడ్డు పడుతున్నాయి. “నాన్న....! సాకేత్ ఇలా కావడానికి మా తొందరపాటే కారణం. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వచ్చి పెద్ద తప్పు చేశాం. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనోవ్యాధికి మందులేదని సాకేత్ విషయంలో రుజువయింది. మమ్మల్ని క్షమించండి నాన్న! ఈరోజే మనింటికి వెళ్దాం” తన మనసులోని ఆవేదనను తెలియజేశాడు రమణ. కొడుకు, కోడలులో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య. వారం రోజుల్లో పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యాడు సాకేత్.

కాయల నాగేంద్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం:

నా పేరు కాయల నాగేంద్ర, నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ 31-10-2021 తేదీ రిటైర్ అయ్యాను. నా రచనలు వివిధ దిన, వార, మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి. తాజాగా ఈ సంవత్సరం 'విడదల నీహారక ఫౌండేషన్, సాహితీ కిరణం' సౌజన్యంతో నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో 'సంబంధం కుదిరింది' కథకు బహుమతి వచ్చింది.


99 views0 comments

Comments


bottom of page