top of page
Writer's pictureRanganath Sudarsanam

బంగారు మాస్కులు


'Bangaru Maskulu' Written By Ranganath Sudarsanam

రచన : రంగనాథ్ సుదర్శనం

"ఏవండీ!...మరి మా అన్నయ్య కొడుకు పెళ్లిగా! మన స్టేటస్ కు తగ్గట్లుగా కాస్త రిచ్ గా పెళ్లికి వెళ్లాలండి" అంది శకుంతల భర్త తలకు నూనె మర్దనా చేస్తూ.

ఒకరకంగా శకుంతల ఆయిల్ మసాజ్ మొదలు పెట్టిందంటే, దేనికో టెండర్ పడుతున్నట్లే! అనుకున్నాడు చంద్రమౌళి.

కానీ తప్పదుగా! జుట్టు చేతిలో ఉంది. ఏదడిగినా కాదు, కూడదు.. అంటే బట్ట తల పైన ఉన్న నాలుగు వెం(టుకలూ ఊడబెరికి, ఇల్లు పీకి పందిరేస్తుంది, ‘ఎందుకొచ్చిన పెంట! ఊ.. అంటే సరిపోయే..’ అనుకున్నాడు చంద్రమౌళి, పోయిన నెల జరిగిన ఆషాడం గొడవ బుర్రలో గిర్రున తిరిగి.

'ఆషాడం ఆఫర్' కొత్త చీర కొంటానంటే వద్దన్న పాపానికి, ఇంట్లో లంకా దహనం మొదలెట్టి, అరడజను కప్పులు, ఒక ఫ్లాస్క్, పింగాణీ డిన్నర్ సెట్ ముక్కలు ముక్కలయ్యాయి. రెండు రోజులు కూరల్లో కారాలు పోసి మంటలు మండించిన సంగతి గుర్తొచ్చి, గుండె గుభేలు మంది చంద్రమౌళికి.

‘దీని కడుపు మాడ! పట్టు పట్టిందో వదలని జగమొండి! సినిమాల్లో సూర్యకాంతానికి డూపును పుట్టించావురా దేవుడా! ఐనా పెంట మీద రాయేస్తే మన మీదకు చిమ్ముతుంది, ఎందుకా అశుద్దాన్ని కావాలని కెలకడం’ అనుకున్నాడు చంద్రమౌళి బాధను దిగమింగుతూ.

"చెప్పువే! ఏంకావాలో..నువ్వడగటం నేను కాదనటం మన హిస్టరీలో ఉందా?” అన్నాడు చంద్రమౌళి కోపాన్ని మనసులో దాచుకొని, నవ్వును మాత్రమే ముఖంలో పలికిస్తూ.

"ఏవండీ! పెళ్ళిలో నగలు న(టా అందరూ వేసుకొని వస్తారు, వాటిలో ప్రత్యేకత ఏముంది? ఇది కరోనా సీజనుగా! వెరైటీగా బంగారు మాస్కులు చేపించుకుందామండి" అంది శకుంతల, చంద్రమౌళి జట్టులోకి వేళ్ళను జొప్పించి సున్నితంగా మర్దన చేస్తూ.

ఇప్పుడు ఎదురు చెప్పానా!.. అమ్మో! ఆ చేతి మొట్టికాయలు తలచుకుంటేనే భయమేసింది! ఐనా ‘ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు దీనికెలా వస్తాయిరా దేవుడా!’ అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం "అబ్బా..అబ్బా.. శక్కు! నీ ఐడియా సూపరే.. ఇలాంటి ఆలోచనలు నీకు తప్ప ఎవరికి రావే!” అన్నాడు చంద్రమౌళి, మనసులోని వికారాన్ని క్యాక్ తూ.. అని ఊంచుతూ.

"అయ్యో!...ఏమయ్యిందండీ?” అంది శకుంతల నూనె చేతులు తుడుచుకుంటూ.

“ఆ..ఆ..ఏం లేదే.. నోట్లోకి వెంట్రుక వచ్చింది అన్నాడు సర్దుకుంటూ చంద్రమౌళి.

***

శకుంతల దగ్గరుండి బంగారు మాస్కులు, వాటికి (వేలాడే చిన్న చిన్నగజ్జలు, మధ్యలో కెంపులు, పచ్చలు పొదివి ఆకర్షణీయంగా తయారు చేయించింది. తన మాస్క్ కు అటు చివర, ఇటు చివర ప్రత్యేకంగా రెండు పువ్వులు ఎనామిల్ పెయింట్ తో వేయించి, చూడ ముచ్చటగా తయారు చేయించింది శకుంతల.

దంపతులిద్దరూ మాస్కులు కట్టుకొని పెళ్లికి వెళ్లారు. ఇంకేముంది! అమ్మలక్కలకు ఇదో ఎనిమిదో వింత! అందరూ గుంపులుగా చేరి, వాటిని నకశిక పర్యంతం పరిశీలించడం, దాని బరువు, ధర, చేసిన వారి అడ్రస్ అడగటం, తోచిన ఉచిత సలహాలు ఇవ్వడం, ‘ఇలా చేసి ఉంటే ఇంకా బాగుండేది వదినా!’ అని ఒకరు, ‘ఇది ఓల్డ్ మోడల్ లా ఉంది అక్కా.. ఇంకాస్త లేటెస్ట్ గా చేయాల్సింది! ‘ అని మరొకరు, ‘పర్వాలేదు బాగుందమ్మాయీ’ అని ఒకరు.. ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడారు.

ఇక ఈ బంగారు మాస్కులను చూసి ముక్కున వేలేసుకున్నవారు కొందరైతే, మూతి మూడు వంకరలు తిప్పిన వారూ ఉన్నారు. మరి కొందరు మొహమాటానికి తప్పదన్నట్లు బాగున్నాయని నోటితో పొగిడినా, నొసటితో వెక్కిరించారు. కొందరు ‘చాలా బాగున్నాయి. అసలు ఇలాంటి ఐడియా రావటమే గొప్ప! ‘ అన్నారు. మొత్తానికి ఈ బంగారు మాస్కులు పెళ్లి లో చర్చనీయాంశం అయ్యాయి.

“ఏవి! చూద్దాం..” అని వాటిని చేతుల్లోకి తీసుకొని పరిశీలించడం, అటు తిప్పి, ఇటు తిప్పి వాటిని శల్య పరీక్ష చేయడం, కొందరు వాటిని కట్టుకొని ఒక సెల్ఫీ దిగటం, ఇంకొందరు భర్తలను పిలిచి మరీ.. ఆ బంగారు మాస్కులు కట్టుకొని ఓ ఫోటో తీయించుకోవడం!. ఇలా అసలు మాస్క్ పెట్టుకునే ఉద్దేశం గంగలో కలిసి, అదో ప్రదర్శనగా మారి, సామాజిక దూరం కూడా ఉష్.. కాకి అయ్యింది.

ఈ పొగడ్తలు, అందరిలో మాస్కుల చర్చను చూసి శకుంతల ఉబ్బి తబ్బిబ్బై పోయింది. మాస్కులైతే కట్టుకున్నారు కానీ, గాలి ఆడడం కష్టంగా ఉంది ఇద్దరికీ.

కానీ.., తీద్దామా పరువేం కాను! 'తీయకుంటే ఊపిరాడదు, తీస్తే పరువు పోతుంది'! ఇదీ వరుస.

"ఏమేవ్.. మాస్క్ తీసేస్తానే? ఊపిరాడటం లేదు" అన్నాడు చంద్రమౌళి.

"ఇదిగో.. తీసారో నా మీద ఒట్టే!” అంది శకుంతల మాస్క్ పైకెత్తి గుడ్లురిమి చూస్తూ..

‘చచ్చానురా! దేవుడా’ అనుకొని, ఊపిరి బిగపట్టి, ఎవరూ చూడకుండా చాటు మాటుగా మాస్క్ పైకెత్తి గాలి పీల్చుకొని హమ్మయ్య! అనుకుంటూ ఏదో మేనేజ్ చేసాడు చంద్రమౌళి.

ఇక శకుంతల అయితే, ఎవరైనా "ఏది.. చూడనివ్వండి" అనడం పాపం! దాన్ని ముక్కు నుండి ఊడబీకి ఆ గ్యాప్ లో గాలి పీల్చుకొని ‘హమ్మయ్య!’ అనుకునేది.

మొత్తానికి ఈ బంగారు మాస్కులు ఆకర్షణీయంగా ఉన్నా, అసౌకర్యంగా ఉండి, గాలి సరిగ్గా ఆడక నానా అవస్థలు పడ్డారు దంపతులు.

పెళ్లి అయిపోగానే ఇంటికి వచ్చారు. మాస్కులు తీసి ‘హమ్మయ్యా! ‘ అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు దంపతులిద్దరు.

తెల్లవారి ఇద్దరికీ దగ్గు, జ్వరం పట్టుకుంది. టెస్టులో ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. చచ్చి, చెడి చేతిలో ఉన్న డబ్బు సరిపోక, ముక్కి, మూలిగి చివరకు, బంగారు మాస్కులు అమ్మి, లక్షలు ఖర్చుపెట్టి ఇద్ద రూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

"చెప్తే వినవు! ఆ దరిద్రపు మాస్కుల కారణంగా కోవిడ్ వచ్చింది" అన్నాడు కోపంగా చంద్రమౌళి తన అసహనాన్ని వెళ్లగక్కుతూ.

"అదేం కాదు! ఆ పెళ్లి లో మన మాస్కులకు దిష్టి తగిలింది, అందుకే అలా జరిగింది" అంటూ చంద్రమౌళి తలకు మసాజ్ మొదలు పెట్టింది శకుంతల.

అంతే..! టక్కున నోరు మూసాడు చంద్రమౌళి, మరో ఉపద్రవమేదో ముంచుకొస్తుoదని భయపడుతూ!.

..సమాప్తం..

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : రంగనాధ్ సుదర్శనం

విద్యార్హతలు, MA (సోషయాలాజి)

సింగరేణి సంస్థలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాను. సాహత్యాభిలాషిని, ఇప్పటి వరకు రాసిన కథలు 74. అందులో వివిధ పత్రికలలో ప్రచురితం అయినవి, సాహిత్య పోటీలలో బహుమతులు అందించిన కథలు కూడా ఉన్నాయి. ఉరిమెళ్ళ ఫౌండేషన్ వారి జాతీయ కథా పురస్కారం, ప్రతిలిపి వారి మాండలిక కథల పురస్కారం, శార్వరి కథాతోరణం, తదితర సంస్థల నుండి పురస్కారాలు, ప్రశంశలు అందుకున్నాను. సాహిత్య ప్రక్రియలో నాకు కథలు, కథానికలు, గల్పికలంటే మక్కువ.

55 views0 comments

コメント


bottom of page