top of page

బెడిసికొట్టిన ఉపాయం


'Bedisikottina Upayam' - New Telugu Story Written By D V D Prasad

'బెడిసికొట్టిన ఉపాయం' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఏమండోయ్! సూపర్బజార్కెళ్ళి ఈ సామాన్లు తెండి!" అంటూ చేంతాడంత లిస్ట్ తన చేతికందించిన తాయారు వైపు గుర్రుగా చూసాడు గుర్నాధం.


"నీకెన్ని సార్లు చెప్పాలి తాయారూ, నేను కథలు రాసేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని! సాయంకాలం తెస్తానులే!" విసుగ్గా అన్నాడు గుర్నాధం.


"అదేం కుదరదు. ఇప్పుడే కావాలి! అయినా మీరు కథలు రాసి ఇక్కడ ఉద్ధరించేదెవరిని? ఇవాళారేపు కథలు చదివేదెవరు? వెళ్ళిన ప్రతీ కథా గోడకి కొట్టిన బంతిలా తిరిగి రావడమే కదా! కాగితాలు, పోస్టేజి కోసం బోలెడంత డబ్బులు దండుగ!" అంది తాయారు ఈసడింపుగా.


"ఇప్పుడు అవేవీ లేవే! కథ మెయిల్ చేస్తే చాలు. అయినా నా కథల జోలికి రావద్దని నీకెన్ని సార్లు చెప్పాను? అసలు నీ దిష్టి తగిలే నా కథలన్నీ తిరిగి వస్తున్నాయని నా అనుమానం. ఇప్పుడు మంచి మూడ్ వచ్చి రాస్తూంటే చెడగొడ్తున్నావు నువ్వు." అన్నాడు గుర్నాధం భార్యవైపు కోపంగా చూసి.


"కావాలంటే బజారునుండి ఈ సామన్లు తెచ్చిన తర్వాత తీరుబడిగా రాసుకోండి, మీ జోలికి రానేరాను, సరేనా! సాయంకాలం మా తమ్ముడు, మరదలు వస్తున్నారు! వాడికి నేను చేసే స్వీట్స్, కారంపూస, పకోడీలు అంటే చాలా ఇష్టం. వెంటనే బయలుదేరండి!" ఆర్డర్ పాస్ చేసిందామె.


'ఓ…తిండిపోతు రామన్న, బకాసుర బామ్మర్ది వస్తున్నాడనమాట!' అని మనసులో అనుకొని, పైకి అంటే భార్య తన భరతం పడుతుందని, తను మరేం చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదని ఆ లిస్ట్ చేతబుచ్చుకొని కాళ్ళీడ్చుకుంటూ వీధిలోకి బయలుదేరాడు గుర్నాధం.


గుర్నాధం ఈ మధ్యే కొత్తగా కథలు రాయడం ప్రారంభించాడు. ఎప్పుడు కథ రాద్దామని కూర్చున్నా ఆమె ఏదో రాద్ధాంతం చేసి గుర్నాధాన్ని కుదురుగా కూర్చోనివ్వదు. రాసిన కథలు డబుల్ సెంచూరీ దాటినా, ప్రచురించబడిన కథలు ఒక్క బౌండరీ కూడా (అంటే నాలుగు) దాటలేదు.


అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పెన్ను పట్టుకొని కాగితంపైన దున్నుతూనే ఉన్నాడు గుర్నాధం. అందుకే ఆమెకి మరీ లోకువైపోతున్నాడు ఈ మధ్య. భర్త కథలు రాయడం ఆమెకి కిట్టదో, లేక మరే కారణమో కాని, గుర్నాధం కథలు రాయడానికి కూర్చోగానే అకారణంగా ఏదో ఒక పని అప్పచెప్తుంది. అమెతో వేగలేక పాపం సతమత మవుతున్నాడు గుర్నాధం.


ఎలా ఈ పనులనుండి తప్పించుకోవడమా అని ఆలోచిస్తూనే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నసూపర్బజార్కెళ్ళాడు. అసలే శనివారం, సెలవు రోజే కాకుండా నెలలో మొదటి వారం కూడా అవడంవల్ల సూపర్ బజార్ కిటకిటలాడుతోంది. తాయారు రాసిచ్చిన లిస్ట్ పట్టుకొని సామానంతా తీసుకునేసరికి అరగంట పట్టింది. తీరా డబ్బులు చెల్లించడానికి బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ చాంతాడంత క్యూ ఉంది.


చేసేదిలేక ఆ క్యూ చివర్న నిలబడ్డాడు. క్యూ కూడా చాలా నెమ్మదిగా నడుస్తోంది తాయారు చూసే డైలీ సీరియల్లాగే. తన వంతు వచ్చేసరికి అరగంటపైన పట్టింది. అక్కడే ఆ కౌంటర్లో బిల్ చేస్తున్న వాళ్ళని చూడగానే గుర్నాధం మనసులో ఫ్లాష్లా ఓ ఆలోచన మెరిసింది. ఇంటికి తిరిగి వచ్చిన గుర్నాధం తను తెచ్చిన సరుకుల బ్యాగ్ భార్యకి అందించి, "అయితే చాలా సేపయిందిగాని ఆ సూపర్ బజార్లో, బాగా కాలక్షేపం మాత్రం అయింది.


ఆ కౌంటర్లో ఆకుపచ్చ చుడీదార్ వేసుకున్న అమ్మాయి చకాచకా పని చేస్తూంటే ముచ్చటేసిందనుకో. నవ్వు మొహంతో ఎంత చలాకీగా మాట్లాడిందో తెలుసా! ఆ బిల్ కౌంటర్లో అరగంటకు పైగా నించున్నాఅస్సలు విసుగనిపించలేదు తెలుసా! అన్ని వస్తువులు సరిగ్గా తెచ్చానో లేదో చూసుకోQ తర్వాత ఇది తేలేదు, అది తేలేదు అంటావు. ఏవైనా మర్చిపోయి ఉంటే చెప్పు ఇప్పుడే మళ్ళీ వెళ్ళి క్షణంలో తెచ్చేస్తాను." హుషారుగా అని భార్య ముఖంలోకి చూసాడు గుర్నాధం ఆమె రియాక్షన్ కోసం.


గుర్నాధం ఊహించినట్లే ఆమెలో అనుమానం బీజం మొలకెత్తింది. బజారుకెళ్ళి సరుకులు తీసుకురావాలంటే ఎప్పుడూ విసుక్కునే భర్త, తనంతట తానే వెళ్తానంటే ఆమెకి అనుమానం ఎందుకు రాదు మరి? గుర్నాధం అందించిన బ్యాగ్ విసురుగా అక్కణ్ణుంచి తీసుకెళ్ళి, "ఫర్వాలేదు, నేను కావాలంటే తెచ్చుకోగలను లెండి." అంది.


"అంటే నీకెందుకు పాపం శ్రమ అని అన్నాను..." నసిగాడు గుర్నాధం.


దాంతో తాయారు అనుమానం అనకొండలా పెరిగిపోయింది. ఆదే గుర్నాధంకి కావలసింది. మనసులోనే నవ్వుకుంటూ తన రూముకి వెళ్ళి లాప్టాప్ ముందేసుకు కూర్చున్నాడు సగం వదిలేసిన కథ పూర్తి చెయ్యడానికి. సాయంకాలం ఆరుగంటలయ్యేసరికి తాయారు తమ్ముడు రాంబాబు, మరదలు రజని వచ్చారు.


వాళ్ళున్న వారం రోజులూ ఎలాగూ తన రచనా వ్యాసంగం సాగదని తెలిసి, ఆ సరంజామా అంతా తాత్కాలికంగా పక్కన పెట్టాడు గుర్నాధం. తమ్ముడి రాకవలన తాయారు హడావుడి బాగా పెరిగిపోయింది.


మరుసటి రోజు ఉదయమే గుర్నాధంని నిద్రలేపి, "లేచి తయారవండి! కూరలు తెద్దురుగాని!" అంది తాయారు.


గుర్నాధం విసుక్కొని,"నిన్న సాయంకాలం చెప్పి ఉంటే తెచ్చి ఉందునుగా!" అన్నాడు.


"సాయంకాలం అందరూ ఎంచుకొని మిగిల్చిన పుచ్చులు, ముదరిపోయిన, ఎండిపోయిన కూరలు మాత్రమే ఉంటాయి. ఆ మాత్రం కూడా మీకు తెలియదా! ఉదయం అయితే తాజా కూరలు దొరుకుతాయి." అంది తాయారు.


మరి తప్పదన్నట్లు పక్క మీద నుండి లేచాడు గుర్నాధం. ఓ గంట తర్వాత కూరల బ్యాగ్ మోసుకుంటూ వంటింట్లోకి చేర్చి, "చాలా రోజుల తర్వాత మంచి బెండకాయలు దొరికాయి, మనం వాడుకగా తీసుకొనే ఆ కూరలమ్మి దగ్గర. కూరలమ్మి కూతురు మంగి కూడా దుకాణంలో కూర్చొని ఉంది. నవ్వుతూ చాలా చలాకీగా ఉందనుకో! చాలా చక్కగా చలాకీగా నవ్వుతూ అన్నీ లేతవి ఎంచి ఇచ్చింది. లేత వంకాయలు కూడా ఆ అమ్మాయే ఎంచి ఇచ్చింది. మొత్తం కూరలన్నీ అక్కడే కొనేసాను. కూరలన్నీ చాలా బాగున్నాయి కదా!" అన్నాడు గుర్నాధం హుషారుగా తాయారు మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ.


గుర్నాధం మాటలు వింటూనే తాయారు మొహం చిట్లించింది. 'కూరలు బాగున్నాయా, లేక కూరలు అమ్మే అమ్మాయి బాగుందా!' నోటిదాకా వచ్చిన మాటలు మింగేసింది తాయారు, అలా అంటే గుర్నాధం మరింత బరితెగిస్తాడని. ఆమె మొహంలో కనపడిన భావాలు పసిగట్టిన గుర్నాధం, "అరే...నువ్వు చెప్పిన కొత్తిమీర మర్చిపోయాను సుమా! ఉండు మళ్ళీ వెళ్ళి క్షణంలో తెస్తాను." అని మరో బ్యాగ్ తీసుకొని బయలుదేరబోయాడు.


గుర్నాధంవైపు గుర్రుగాచూసింది తాయారు. "ఆగండి!...ఇందాక వీధిలోకి వస్తే కొత్తిమీర కొన్నాను, మీరేం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు." అంటూ అతని చేతిలోంచి సంచి లాక్కుంది.


గుర్నాధం మనసులోనే నవ్వుకుంటూ హుషారుగా ఈల వేసుకుంటూ తన రూముకి వెళ్ళాడు. బామ్మర్ది ఉన్న వారంరోజులూ వాళ్ళని ఊళ్లో తిప్పడంతో సరిపోయింది. ఆ వారం రోజులూ కథలు రాయాడనికి పెద్దగా సమయం కేటాయించలేకపోయాడు గుర్నాధం. ఆ సాయంకాలం బావమరిదినీ, అతని భార్యని ట్రైన్ ఎక్కించి తిరిగి వచ్చాక మళ్ళీ తీరుబాటు అయింది.


ఉగాది కామెడీ కథల పోటీకి సమయం అట్టే లేదు, ఎలాగైనా మరో రెండు రోజుల్లో కథ రాయడం పూర్తి చేసి పంపించాలన్న పట్టుదలతో ఉన్న గుర్నాధం మళ్ళీ తన సరంజామా అంతా సర్దుకొని కుర్చీలో కూర్చున్నాడు. అలా కూర్చొని ఇంకా రాయడం ఆరంభించాడో లేదో తాయారు గొంతు వినబడింది.


"ఏమండీ ఒకసారి ఇలా రండి!" అని సీరియల్ చూస్తూ హాల్లోంచే కేకేసింది.


విసుగ్గా లేచి హాల్లోకి వెళ్ళాడు గుర్నాధం. తనని తాయారు కుదురుగా కూర్చొని కథలు రాయనిచ్చేలా లేదు, ఆమెకి తనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ డోస్ సరిపోలేదేమోనని డౌటొచ్చింది గుర్నాధంకి..

"ఏమండీ! ఇంట్లో సామన్లన్నీ నిండుకున్నాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి తేరూ!" అంది.


"అదేమిటి, వారం క్రితమే అన్నీ తెచ్చాను కదా!" అన్నాడు ఆశ్చర్యపోతూ.


"అంటే మా తమ్ముడి వల్లే సామాన్లన్నీ అయిపోయాంటారా?" అంటూ కొళాయి విప్పింది.


"ఇప్పుడు నేనేమన్నానని? బ్యాగ్ ఇలా తే! అయినా ఆ సూపర్ మార్కెట్లో ఉన్న అమ్మయిలంతా చాలా కలుపుగోరు వాళ్ళు. సామాన్లన్నీ చకచకా ప్యాక్ చేసేస్తారు! అట్నుంచి అటే వెళ్ళి కూరలు కూడా తెమ్మన్నావా?" అన్నాడు హుషారుగా విజిల్ వేస్తూ.


"భేషుగ్గా వెళ్ళండి! ఇదిగో లిస్ట్. తీరిగ్గా రండి, తొందరేం లేదు." అంది తాయారు టివి నుండి మొహం కూడా తిప్పకుండా.


ఆశ్చర్యపోయాడు గుర్నాధం. తన ట్రిక్ ఎలా ఫెయిల్ అయిందో తెలీక తికమక పడుతూ వీధిలోకి బయలు దేరాడు. వీధిలోకి వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చింది పర్సు టేబుల్పై ఉంచిన సంగతి. ఇంట్లోకి రాబోతూ, తాయారు ఎవరితోనే ఫోన్లో మాట్లాడటం, అందులో తన ప్రస్తావన ఉండటంతో అక్కడే ఆగిపోయాడు.


"తమ్ముడూ!...మీ బావగారు ఇప్పుడు బజారుకి వెళ్ళారురా! సూపర్ బజారుకి, కూరలకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అమ్మాయిల గురించి మాట్లాడితే ముందు నిజమే అనుకొని అనుమానపడ్డాను. నువ్వు అతనికి తెలియకుండా అతని వెనుకే వెళ్ళి చూడబట్టి నిజం తెలిసింది. ఆ సూపర్ బజార్లో అసలు అమ్మాయిలే లేరట కదా!


అలాగే ఆ కూరలమ్మికి ఒక్క కొడుకే తప్ప కూతురు లేదు కదా! ఇప్పుడు నన్ను బురిడీ కొట్టించి బజారుకెళ్ళే పని ఎగ్గొట్టాలనుకున్నారు మళ్ళీ. నేను ‘సరే’ అనడంతో మొహం ఏదోలా పెట్టి ఇప్పుడే వెళ్ళార్రా! మొత్తం మీద మీ బావగారి తిక్క బలే కుదిరిందిలే! లేకపోతే పనులన్నీ నా మీద పడేసి కథలు రాస్తూ కూర్చుంటారా? మళ్ళీ ఆ రాసే కథలన్నీ మన మీదే రాస్తారు." పడిపడి నవ్వుతూ చెప్తోంది తాయారు.


తాయారు మాటలు విన్న గుర్నాధం బుర్ర గుండ్రంగా తిరిగింది. గుర్నాధం ప్లాన్ బెడిసికొట్టింది.

పాపం గుర్నాధం!

……………………

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.



53 views0 comments

Comments


bottom of page