భగవంతుడు తింటాడా?
- Sudha Vishwam Akondi

- Oct 26
- 5 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #BhagavanthuduThintada, #భగవంతుడుతింటాడా

Bhagavanthudu Thintada - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 26/10/2025
భగవంతుడు తింటాడా? - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
పూజలో భాగంగా ఎన్నోరకాల పండ్లు, రకరకాల వంటకాలు భగవంతునికి నైవేద్యంగా పెడతాం! మరి ఆయన తింటాడా? అనే ప్రశ్నకు జవాబు చెప్పడానికి అంత స్థిరత్వం ఉండదు. అలా చూపించి, ఇలా మనం తినెయ్యడమే! పద్ధతి రొటీన్ గా పాటిస్తున్నాం అనే జవాబు ఎక్కువగా వస్తుంది.
భగవంతుడు మనం పెడితే తింటాడా? అలా ఎవరైనా పెడితే, ఆయన తిన్నట్లుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని అడిగితే పరమాత్మ మనం పెడితే తింటాడని, అలా తిన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని ఏ రకమైన డౌట్ లేకుండా ఘంటాపధంగా బల్లగుద్ది మరీ చెప్పవచ్చు!
ఎందరో భక్తుల విషయంలో అలా జరిగింది. ప్రేమగా పెడితే ఏదైనా తింటాడు! ఎంత కొద్దిగా పెట్టినా ప్రేమగా తిని, అనుగ్రహిస్తాడు. అది ఆయన తత్వం! మనం ఆయన వైపు రెండు అడుగులు వేస్తే, ఆయన రెండు వందల అడుగులు మనవైపు వేసి, మనల్ని అందుకుని, అక్కున చేర్చుకుంటాడు.
సృష్టి మొత్తం అంతటా ఉన్నది ఆయనే అని ఙ్ఞానం రాకపోయినా ఏ ప్రాణికి హాని చెయ్యకుండా, తనకు కష్టం కలిగినా వేరే ప్రాణికి కష్టం కలిగించకుండా ఉండేవాడు ఎవడో వాడిపై అమిత ప్రేమను చూపిస్తాడు పరమాత్మ.
అలాంటి అమాయకమైన ప్రియ భక్తురాలి కథనే ఇది.
ఈ కార్తీక మాసంలో స్వామి లీల తలుచుకోవడం ఎంతో పుణ్యప్రదం!
***
ఒకప్పుడు మార్వాడ దేశంలో కర్మాబాయి అనే పూరీ జగన్నాథునికి మహా భక్తురాలు అయిన స్త్రీ ఉండేది.
ఆమె తన బరువుబాధ్యతలను అన్నీ తీర్చుకుని, పూరీ క్షేత్రానికి వెళ్లి, అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుంది. తన శేష జీవితాన్ని అక్కడే ముగించాలని భావించింది. అక్కడ ఆ జగన్నాథుని సేవలోనే మునిగిపోయింది.
***
ఆమె ప్రతిరోజూ నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచి అవ్వగానే, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులు, నెయ్యి వేసి కిచిడీ చేసి, తన ఇంట్లో వున్న స్వామికి నివేదన చేసి, ఆ తరువాత అదే కిచిడీని జగన్నాథుని నైవేద్యం కోసం గుడికి పంపించేది. ఆ కిచిడీని స్వామికి నైవేద్యం ఇచ్చాక అర్చకులు ఇచ్చిన ఆ కిచిడీ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.
ఆ క్రమంలో కర్మాబాయి పంపే కిచిడీ జగన్నాథుడికి ఇష్టమైన భోగం అయిందని అక్కడి అర్చకులు, ఆచార్యులు అర్థం చేసుకున్నారు. ప్రతిరోజూ కర్మాబాయి పంపే కిచిడీ భోగం సమర్పించడం పూర్తికానిదే మిగతా ఏ భోగాలు సరిగ్గా కుదిరేవి కావు. కిచిడీ సమర్పించిన తరువాత మాత్రమే మిగతా ప్రసాదాలు అద్భుతంగా తయారు అయ్యేవి. నెమ్మదిగా ఈ రహస్యాన్ని అదేపనిగా గమనించి తెలుసుకున్నారు అక్కడి అర్చకులు, ఆచార్యులు. స్వామి ఇష్టప్రకారమే ముందుగా కర్మాబాయి పంపించిన కిచిడీ నైవేద్యం అయ్యాకే మిగతావి సమర్పించేవారు.
ఈ విషయం త్వరలోనే ఆనోటా ఈనోటా ఆ ప్రాంతంలో అంతటా పాకింది. అందరూ ఆమె భక్తిని గురించి గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఆమె మాత్రం ఆ మాటలేవీ పట్టనట్లు ఉండేది. ఏమాత్రం గర్వం రాలేదు. అసలు ఆ మాటలే పట్టించుకోలేదు ఆవిడ. తన మానాన తను ఉండేది.
***
అదే రోజుల్లో జగన్నాథుని భక్తుల్లో గొప్పవాడిగా అందరూ చెప్పుకునే ఒక బైరాగి ఉండేవాడు. అతడు నిజంగా ఆ జగన్నాథునికి భక్తుడు. బైరాగి పిలవగానే జగన్నాథుడు పలుకుతాడని ప్రతీతి.
అంతటి గొప్ప భక్తుడైన బైరాగి కర్మాబాయి గురించి, ఆమె భక్తిని గురించి విన్నాడు. అంత గొప్ప భక్తురాలిని వీలైతే కలవాలని, కనీసం ఒకసారి దర్శించాలని అనుకున్నాడు.
ఒకసారి పూరీ యాత్ర చేయడం కోసమని సంకల్పించి, అదే సమయంలో కర్మాబాయిని దర్శించుకోవాలని అనుకున్నాడు బైరాగి.
అనుకున్నట్లుగానే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత, మరునాడు ఉదయమే ఆమె వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆ కర్మబాయి కిచిడీ వండి, తన ఇంట్లో నైవేద్యం ఇచ్చి, అదే జగన్నాథునికి పంపడం చూశాడు ఆ బైరాగి.
ఆమె కిచిడీ చేసే పద్ధతి నచ్చలేదు ఆయనకు. ఒక మడి, ఆచారం లేకుండా వండుతున్న పద్ధతి బైరాగికి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే ఉన్న స్వామికి నివేదన చేసే, అదే జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అస్సలు నచ్చలేదు.
అదే అన్నాడు ఆమెతో.
"ఎంతో గొప్ప భక్తురాలివని అందరూ చెప్పుకుంటూ ఉంటే విని, నిన్ను చూడాలని వచ్చాను. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? స్వామికి నివేదించే కిచిడీ మడి లేకుండా వండి, అది ఇంట్లో నివేదన చేసి, జగన్నాథునికి పంపిస్తున్నావు! ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా? " అన్నాడు బైరాగి.
"అయ్యో అవునా! తప్పయిపోయింది స్వామి! నాకేమీ తెలియదు. నాకు తెలిసినది చేసి పంపుతున్నాను. ఎలా చెయ్యాలో మీరు చెప్పండి! ఇకనుంచి అలాగే నడుచుకుంటాను" అన్నది ఆవిడ వినయంగా.
"ఇంట్లో నివేదన చేసిన పదార్థాలు గుడికి పంపగూడదు! అది వేరేగా శుచిగా చెయ్యాలి! మడి కట్టుకుని వంట చెయ్యాలి. ఇవన్నీ పాటించకుండా పదార్థాలు తయారు చేసి స్వామి నివేదనలు పంపడం చాలా తప్పు!" అంటూ అప్పుడు బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలను బోధించాడు.
అదంతా విన్న కర్మాబాయి..
"ఇకనుంచి మీరు చెప్పిన విధంగానే తయారుచేసి పంపుతాను!" అని చెప్పింది.
ఆ తర్వాత బైరాగి సంతోషించి, అక్కడనుంచి వెళ్లిపోయాడు.
అమాయకురాలైన ఆ కర్మాబాయి తాను ఇన్నాళ్లూ తప్పుచేశానని చాలా బాధపడింది. ఇకనుంచి ఖచ్చితంగా బైరాగి చెప్పిన విధంగానే అన్నీ పాటిస్తానని స్థిరంగా అనుకుంది.
***
ఆ మరునాడు నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి, కొద్దిగా కిచిడీ చేసి ఇంట్లో వున్న స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేకంగా వంటకం తయారు చేయడానికి సిద్ధపడింది.
మడి కట్టుకుందామని అనుకుని లోపలికి వెళ్ళింది. ఇంతలో ఎవరో పెద్దగా పిలిచినట్లుగా వినబడింది. రెండు, మూడుసార్లు పిలిచారు.
"ఎవరూ.. ?" అనుకుంటూ బయటకు వచ్చింది.
అక్కడ ఒక సాధువు నిల్చుని ఉన్నాడు. ఆ సాధువు నీరసించి ఉన్నాడు.
"అమ్మా! ఆకలి.. ! ఆకలి.. ! ఆకలికి తాళలేకపోతూ ఉన్నాను. ఆహారం పెట్టమ్మా!" అన్నాడు పొట్ట పైన చేయి పెట్టుకుని.
"అయ్యో! ఇంకా వంట పూర్తికాలేదు. వంట పూర్తిచేసి గుడికి పంపాలి. కాస్త ఆగు!" అందామె.
"ఇంట్లో ఏది ఉంటే అది పెట్టు! చచ్చిపోయేలా ఉన్నాను. ఏదో కొద్దిగానైనా పెట్టు!" అని వేడుకున్నాడు.
ఏదో ఒకటి తినకపోతే నిజంగానే అతని ప్రాణాలు పోతాయేమో అన్నంత దీనంగా ఉన్నాడు. అతని స్థితిని చూసి ఏమి చెయ్యాలో తోచలేదు ఆమెకు. గుడికి పంపే వంటకం తయారు కాలేదు ఇంకా. తను గుడికి పంపిన తరువాత అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదం పంపిన తర్వాత ఇంట్లో వంట చేసుకునే అలవాటు ఆమెకు.
'ఇప్పుడు ఎలా? ఈయనకు ఏం పెట్టాలి!' అని ఆలోచించసాగింది.
ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది ఆమెకు.
'మనిషి ప్రాణాలు నిలపడం ముఖ్యం. ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ పెడతాను!' అనుకుని ఆ సాధువుకు కిచిడీ మొత్తం పెట్టింది.
ఆ సాధువు ఎంతో ఆత్రంగా, ఇష్టంగా ఆ కిచిడీ తిని, కృతజ్ఞతలు చెప్పి, కర్మాబాయిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక మడి కట్టుకుని గబగబా ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి, తానే స్వయంగా తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు, తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి ఆమె కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు.
"ఇంత ఆలస్యం ఏంటమ్మా? నైవేద్యం పెట్టాల్సిన సమయం దాటిపోతున్నది. ఇప్పుడు తెచ్చావు!" అని విసుక్కుంటూ జగన్నాథునికి అడ్డంగా ఉన్న తెర ముందు పెట్టి, తెరను తొలగించారు.
స్వామి వైపు చూసి ఉలిక్కిపడ్డారు. జగన్నాథుని నోటికి కిచిడీ అంటుకుని ఉంది. అన్నంతిని మూతి సరిగ్గా కడుక్కోని చిన్న పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది.
ముందుగా ఆశ్చర్యపోయిన అర్చకులు, అలా స్వామి నోటికి పదార్థం అంటుకుని వుండడం అరిష్టమని భావించారు.
"నీవు పిలిస్తే స్వామి పలుకుతారు కదా! అసలు ఏం జరిగిందో స్వామిని అడిగి చెప్పండి! తప్పు ఏమైనా జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు!" అన్నారు అర్చకులు బైరాగితో.
అప్పుడు బైరాగి స్వామిని స్తుతించి, పిలిచాడు.
"స్వామీ జగన్నాథా! నీ నోటికి ఆహారం అంటుకుని ఉండడానికి గల కారణం ఏమిటి? మావల్ల ఏమైనా తప్పు జరిగిందా? అది పోగొట్టుకోవాలంటే ఎలా?" అని అడిగాడు బైరాగి.
అప్పుడు స్వామి ముఖం నుండి అదృశ్యంగా కొన్ని మాటలు వినిపించాయి.
"బైరాగీ! నీకు ఒక్కడికే కాదు అందరికీ చెబుతున్నాను! శ్రద్ధగా వినండి! కేవలం భక్తిశ్రద్ధలతో, పరిశుద్ధమైన మనసుతో ప్రేమగా కర్మాబాయి చేసి పంపే కిచిడీ భోగం అంటే నాకు ఇష్టమని మీ అందరికీ తెలుసు కదా!
కానీ నిన్న నా భక్తుడే అయిన ఈ బైరాగి ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేసేది తప్పని, మడితో చేయాలని, మన ఆచారవ్యవహారాలు పాటించాలని చెప్పి, అవన్నీ నూరిపోశాడు ఆమెకు.
దాంతో ఆమె భయపడింది. ఇంతవరకూ అపచారాలు చేశానని దుఃఖించింది. తన ఇంట్లో వున్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంట చేయడానికి ఉద్యుక్తురాలు అయ్యింది.
దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. ఆ ఆలస్యం వల్ల నేను ఆకలికి తట్టుకోలేక పోయాను. ఆమె పంపలేదు, అందుకని మీరు నివేదన చేయలేదు. నాకు భోగం అందలేదు.
ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉంది కనుక, అంతేకాదు ఆ కిచిడీ నాకెంతో ఇష్టం కాబట్టి ఆమె ఇంటికే వెళ్లి ఆమె నాకు నివేదించిన భోగాన్ని తినేసి వచ్చాను! మళ్లీ వెంటనే ఇక్కడ ఆమె తీసుకుని వచ్చే భోగం నివేదన ఉండడం వల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగం నివేదన కానివ్వండి!" అని వినిపించింది.
ఆ మాటలు అందరికీ వినబడ్డాయి
అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామివారి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా నివేదన చేశారు.
కర్మాబాయి మాత్రం స్వామి తనపై చూపిన అపారమైన కరుణకు ఎంతో ఆనందపడింది. అంతటి పరిశుద్ధురాలికి ఆచారాల గురించి నేర్పిన తన అవివేకానికి బైరాగి సిగ్గుపడ్డాడు.
'తను పాటిస్తున్న ఆచారాలు అన్నీ వృధానేనా?' అని అనుకున్నాడు.
అప్పుడు బైరాగికి జగన్నాథుడు జవాబు ఇచ్చాడు.
"మనసు నాయందే లగ్నం కావడం కోసం ఆచారవ్యవహారాలు అవసరమే! కానీ ఎవరైతే తమ మనసును సర్వేవేళల్లో, సర్వావస్థల్లో ఎటువంటి సమయంలో అయినా నాకే అర్పించి ఉంటారో, అటువంటి వారికి ఈ ఆచారాలతో నిమిత్తం లేదు. తనను మర్చిపోయి మరీ నన్నే ధ్యానిస్తూ ఆమె నాకు జరిపే భోగాన్ని నేను అమృతంగా భావించి స్వీకరిస్తూ ఉంటే, మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా?
అయితే ఆచారవ్యవహారాలు తెలిసిన వారు, విధివిధానంగా చేయవలసిన కుటుంబంలో పుట్టినవారు, ఖచ్చితంగా ఆ ప్రకారమే చేయాలి. వితండవాదాలు చేయకూడదు. అలా కర్మలు చేస్తున్నా, అప్పుడు కూడా భక్తివిశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించే పదార్దాలు నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి.
వారిలో నాపట్ల భక్తి, విశ్వాసం, నాకు చేసే ఉపచారాల పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే నేను స్వీకరిస్తాను.
ఆచారాలు తెలియనివారు అయినా సరే నాపై భక్తి, విశ్వాసాలు ఉండి, నాకు నివేదన చేయడంలో శ్రద్ధ, నేను తినాలనే కోరిక ఉంటే వాటిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను" అని జగన్నాథుడు తన తత్వాన్ని వివరించాడు.
అప్పుడు బైరాగి స్వామికి నమస్కరించి, తన అవివేకాన్ని క్షమించమని ప్రార్థన చేశాడు. స్వామి క్షమించాడు. కర్మాబాయికి కూడా క్షమాపణ చెప్పాడు. కానీ ఆమె వినయంగా నమస్కారం చేసింది బైరాగికి.
ఆ తర్వాత జగన్నాథుని ఆజ్ఞ మేరకు కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనలు భోగం పంపించింది. అలా ఆ జగన్నాథుని సేవలో తరించి, ఆయన్నే చేరుకుని ముక్తి పొందింది కర్మాబాయి.
నాటి నుంచి ఇప్పటికీ కూడా భక్తురాలైన కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్ళెంలో ఉంచి, నివేదన చేస్తారు.
మనం త్రికరణశుద్ధిగా ఆ స్వామినే మనసులో నిలుపుకుని ఆయనకు నైవేద్యం ఇస్తే, పాలు గానీ, పండు కానీ ఆ నైవేద్యం ఏదైనా సరే ప్రేమగా సమర్పిస్తే స్వామి ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఎందరో భక్తుల చరిత్రలు అందుకు నిదర్శనం.
ఈ కార్తీక మాసంలో అటువంటి భక్తురాలి గురించి చెప్పుకుంటే ఆ జగన్నాథుడు సంతోషిస్తాడు. మనల్ని అనుగ్రహిస్తాడు.
సర్వం జగన్నాథం
������శ్రీకృష్ణార్పణమస్తు����������

-సుధావిశ్వం




Comments