top of page
Original_edited.jpg

భక్తసులభుడు హనుమ

  • Writer: T. V. L. Gayathri
    T. V. L. Gayathri
  • May 22
  • 1 min read

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BhakthaSulabhuduHanuma, #భక్తసులభుడుహనుమ

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 22

Bhaktha Sulabhudu Hanuma - Gayathri Gari Kavithalu Part 22 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 22/05/2025

భక్తసులభుడు హనుమ - గాయత్రి గారి కవితలు పార్ట్ 22 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


భక్తసులభుడు హనుమ

(కవిత )


**********************************


వాయుసూనుడు దివ్యబలబుద్ధి సంయుతుడు 

ధ్యేయమును సాధించు ధీర కపినాయకుడు


భక్తసులభుడు హనుమ వైరిబలసూదనుడు

ముక్తిపథమును జూపు పుణ్యఫలదాయకుడు


ఘనమైన కార్యములు ఘడియలో సలుపంగ

వినయంబుతో సురలు ప్రీతిగా పూజింత్రు


రామదాసుడు భువిని రక్షింప నిలిచాడు

కామితంబులు తీర్చు కపికిశోరుడు ఘనుడు


కదళీవనంబులో కలయతిరిగెడు స్వామి

మదిలోన శ్రీరామ మంత్రమును జపియించి


భాసురమ్ముగ నిల్చు వ్యాకరణ కోవిదుడు

కేసరీ నందనుడు కీడుతొలగిస్తాడు


స్థిరముగా సేవించు దీనులకు దిక్కుగా

చరియించు మారుతిని సతతంబు వేడగా


ప్రకటిత మగుచు వేల్పు పాపములు హరియించు

సకల సౌభాగ్యములు క్షణములో నందించు


అంజనేయునికి జయమంచు నినదించెదము

ప్రాంజలించి వరదుని భక్తితో మ్రొక్కెదము.//


************************************

జ్ఞాన సంపన్నుండు

(ఇష్టపది )

ree















దేవఋషి నారదుడు దివ్యాత్ముడై నిలిచి

భావమందున హరిని ప్రణతితో నర్చించు


చతురాననుని సుతుడు జ్ఞానసంపన్నుండు

జితకాముడై జగతి క్షేమముకు తపియించు


పంకజాక్షుని కథలు ప్రవచించి యాధ్యాత్మ

శంకలను తీర్చుచూ జడత్వము నిర్జించు


భక్తిసూత్రంబులను ప్రజలకై బోధించి

ముక్తిపథగాములకు మోక్షంబు కలిగించు


గాన కోవిదుడు ఘన కళ్యాణ కారకుడు

వీణ మ్రోగించుచు విభేదాలు తొలగించు


మూడులోకాలలో ముచ్చటగ ద్రిమ్మరుచు

నాడుతూ పాడుతూ నార్తులను కరుణించు


ధరను పాలించుచు ధర్మంబు నిలబెట్టు

పరిపాలకుల కెపుడు బాసటగ చరియించు


హరిపదాబ్జపు తేటి కంజలిని ఘటియించ

చిరయశముతో జనుల జీవితములు వెలుగు.//


*******************************

ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page