బ్రేకింగ్ న్యూస్ భాస్కర్

Breaking News Bhaskar - Telugu Social Story | Ramana Bandhakavi
బ్రేకింగ్ న్యూస్ భాస్కర్ - తెలుగు సామాజిక కథ | రమణ బంధకవి
Published in manatelugukathalu.com on 18/09/2026
“బ్రేకింగ్ న్యూస్ భాస్కర్” కార్యాలయ జీవితంలోని ఒక ఆసక్తికరమైన మానవ స్వభావాన్ని హాస్యంతో, చక్కని సందేశంతో ఆవిష్కరించే సామాజిక నీతి కథ.
ఇతరుల గురించి మాట్లాడటం, వారి లోపాలను వెతకడం అలవాటుగా మారితే అది మన వ్యక్తిత్వాన్నే ఎలా బయటపెడుతుందో ఈ కథ చూపిస్తుంది. భాస్కర్, కొత్త బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ మధ్య జరిగే సంఘటనలు పాఠకులను నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ఇతరుల గురించి మాట్లాడే ముందు మన మాటలను మనమే పరిశీలించుకోవాలనే విలువైన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
ఆ రోజు బ్యాంక్ కొత్త బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ ఉదయం బాధ్యతలు స్వీకరించాడు. స్వాగతాలు, పుష్పగుచ్ఛాలు, పరిచయాలు పూర్తయ్యాక ఒక ఉద్యోగి వినయంగా తలుపు తట్టి లోపలికి వచ్చాడు.
"మే ఐ కమ్ ఇన్, సార్?"
"ప్లీజ్... కమ్ ఇన్."
"నేను భాస్కర్, సార్... సీనియర్ ఆఫీసర్. ఈ బ్రాంచ్‌లో పదిహేనేళ్లుగా పనిచేస్తున్నాను. ఇక్కడి కస్టమర్ల నుంచి సిబ్బంది వరకూ అందరి స్వభావాలు నాకు తెలుసు. మీకు ఏ సహాయం కావాలన్నా... నేనున్నాను."
"థాంక్యూ, భాస్కర్."
ఆ రోజు నుంచి భాస్కర్ రోజూ ఏదో ఒక సాకుతో మేనేజర్ గదిలో కనిపించడం మొదలైంది.
"సార్... క్యాషియర్ శర్మగారు చాలా మంచివారిలా కనిపిస్తారు. కానీ పెద్ద మొత్తాల నగదు లెక్కించేటప్పుడు ఒకసారి మీరే చూడండి."
"మన హెడ్ క్యాషియర్ లక్ష్మి... పని బాగా చేస్తుంది. కానీ కొంచెం యూనియన్ ప్రభావం ఎక్కువ."
"అసిస్టెంట్ మేనేజర్ మూర్తిగారు... మీ ముందు చాలా విధేయంగా ఉంటారు. కానీ..."
ప్రతి మాట చివరా ఒకే వాక్యం... "మీ మంచికే చెబుతున్నాను, సార్."
కొత్త బ్రాంచ్. కొత్త మనుషులు. శ్రీధర్‌కు భాస్కర్ చెప్పేవి ఉపయోగపడుతున్నాయేమో అనిపించింది. కొన్ని రోజులకే భాస్కర్‌కు బ్రాంచ్‌లో ‘బ్రేకింగ్ న్యూస్ భాస్కర్’ అనే మరో పేరు కూడా ఉందని శ్రీధర్‌కి తెలిసింది. టీ విరామంలో అందరూ కాంటీన్‌లో చేరగానే ఎవరో ఒకరు అడిగేవారు.
"భాస్కర్... ఈరోజు వార్తలు ఏంటి?"
"మన ఫీల్డ్ ఆఫీసర్ కస్టమర్ల ఇళ్లకంటే టీ దుకాణాలకే ఎక్కువ వెళ్తాడు."
"నిన్న అకౌంటెంట్ మీద చెప్పావు కదా..."
"అది నిన్నటి వార్త. ఇవాళ కొత్తవి."
అందరూ నవ్వుకున్నారు. భాస్కర్ మాత్రం వాళ్లు తన హాస్యానికి నవ్వుతున్నారని అనుకునేవాడు. కానీ, వాళ్లు తన స్వభావానికి నవ్వుతున్నారని గ్రహించేవాడు కాదు.
ఒకరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీధర్‌కు కాంటీన్‌లోనే తన కళ్ళజోడు మరిచిపోయానని గుర్తువచ్చింది. తిరిగి నడుచుకుంటూ వెళ్ళాడు. కాంటీన్ తలుపు దగ్గరికి రాగానే లోపల నుంచి భాస్కర్ గొంతు వినిపించింది.
"కొత్త బాస్ ఉట్టి భోళాశంకరుడు. ఏది చెప్పినా నమ్మేస్తాడు."
"నిజంగా?" అని ఎవరో అడిగారు.
"ఇప్పటివరకు నేను ఎంత చెప్పానో అంతా నమ్మాడు. ఇంకో నెల రోజులు పోనివ్వండి. నా చిటికెన వేలు మీద ఆడిస్తా" అని గర్వంగా అన్నాడు.
కాంటీన్ నవ్వులతో మార్మోగిపోయింది. శ్రీధర్ అడుగు ముందుకు పడలేదు. నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ సాయంత్రం ఫైళ్లు తెరిచినా... మనసు మాత్రం ఒక నిజాన్ని తెరిచింది.
మరుసటి ఉదయం. భాస్కర్ ఎప్పటిలాగే చిరునవ్వుతో లోపలికి వచ్చాడు.
"గుడ్ మార్నింగ్, సార్! మన మూర్తిగారి గురించి ఒక చిన్న విషయం..."
శ్రీధర్ చేయి ఎత్తి ఆపాడు.
"భాస్కర్... మీరు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ఈ గొప్ప వాక్యాలు ఎప్పుడైనా విన్నారా?"
భాస్కర్ ఆశ్చర్యంగా చూశాడు. శ్రీధర్ ప్రశాంతంగా, ఒక్కో పదం స్పష్టంగా పలికాడు.
"పరుని నీముందు దిట్టేటివాడు... నిన్ను నొరుని ముందు దిట్టకయుండబోడు."
"ఇక మీదట ఈ గదిలో మనుషుల గురించి కాదు... పనుల గురించి మాత్రమే మాట్లాడుకుందాం," అన్నాడు శ్రీధర్ ఫైల్‌లోకి చూస్తూ.
భాస్కర్ ముఖంలోని చిరునవ్వు క్షణంలో చెదిరిపోయింది. ఆ గదిలో ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది.
***
రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రమణ బంధకవి
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.







Comments