చందమామ రావే!
- T. V. L. Gayathri

- 6 days ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #చందమామరావే, #ఒక్కమాటచాలు

గాయత్రి గారి కవితలు పార్ట్ 45
Chandamama Rave - Gayathri Gari Kavithalu Part 45 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 12/11/2025
చందమామ రావే! - గాయత్రి గారి కవితలు పార్ట్ 45 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
చందమామ రావే!
(వచన కవిత)
***********************
చందమామ రావే!జాబిల్లి రావే!మా ఇంటికి రావే!
అందాల మా కన్నమ్మకు అంబరాన్ని చూపగా రావే!
తేరు మీద నెక్కించి నీవు సారథిగా దిశలందు త్రిప్పవే!
జారుబండ లెక్కించి జర్రుమని జారుతూ గడిపేయవే!
పంచదార కలిపిన పాలబువ్వను గారంగా తినిపించవే!
మంచి మంచి బహుమానాలను మా బాలిక కీయవే!
నీలి మబ్బుల దారుల్లో చిన్నారికి నేస్తాలను వెదకవే!
పాల బుగ్గల పసి మొలకకు పసిడి బుడ్లను తెచ్చి పెట్టవే!
తళుకు తారల మధ్య మా పండుతో దాగుడు మూత లాడవే!
వెలుగు కనుల బుజ్జాయిని ప్రేమగా భుజాలపై మోయవే!
కబురులను కథలను చెప్పవే!కలలన్నీ క్షణంలో తీర్పవే!
వైభవంగా నిలిచినట్టి దివ్యమైన భవనాలను చూపవే!
పరిమళలు వెదజల్లే పువ్వులేరి మా బంగారాని కీయవే!
మురిపాలు చిలికించు మా తల్లి ముచ్చట్లను తీర్పవే!
మా పాపాయి కొఱకు రత్న మాణిక్యాల నేరుకొని రావే!
దీపాలు పెట్టేవేళ ఠంచనుగా దివినుండి నీవు దిగిరావే!
అమ్మవంటి వాడవని ఆశతో మా చిట్టితల్లి చూస్తోంది.
నెమ్మదిగా నాడించు మామవని నీ కోసం పలవరిస్తోంది.//
************************************

ఒక్క మాట చాలు!...
( వచన కవిత)
************************************
మౌనమే గోడలాగా మనిద్దరి మధ్య నిలబడింది.
క్షణక్షణం దూర మిదిగో కాల్చుకు తింటోంది.
ఒక్క మాట మాట్లాడు!ఊపిరి తిరిగొస్తుంది.
ప్రక్కనే తోడుగా ఉండు!ప్రపంచం దిగి వస్తుంది.
పంతాలు పట్టింపులు మన బంధానికే శత్రువులు.
సంతోషంతో సమస్యలను పరిష్కారం చేసుకుందాము!
మనసులోని భావాలను మాటలతో తెలుపగలం!
మనుజులకే దేవుడిచ్చిన మహిమాన్విత మైనవరం!
నువ్వు నవ్వితే చాలు! నూతనోత్సాహం కల్గుతుంది.
త్రవ్వుకుంటూ కూర్చోకు! తల్చి తల్చి బాధపడకు!
సరేలే!నేనే కొద్దిగా తలవంచి క్షమాపణ చెప్పేస్తాను!
మరో మాట లేదింక!మౌన యుద్ధానికి సెలవంటాను!
హమ్మయ్య!నీ నవ్వులో నాకాహ్వానం కనిపించింది!
కమ్మనైన కబుర్లతో మనమీ కాలాన్ని గడిపేద్దాము!
అలకలస్సలు మనకొద్దు! అమృతాన్ని చవి చూద్దాము!
చిలకా గోరింకలమై చిరకాలం చింతమరచి జీవిద్దాము!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:




Comments