top of page

చంటబ్బాయ్!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Chantabbay' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)




కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ


ఆమె పేరే రెండు జళ్ళ సీత. అందాల భరిణె.

గుమ్మానికి జారగిలపడి ఒంటిజడ తిప్పుతూ వాకిట్లో నిలబడి, చంటబ్బాయ్ కోసం కళ్ళల్లో బ్యాట్రీ లైట్లు వేసుకుని ఎదురు చూస్తోంది.


అతగాడు ఎంత సేపటికీ రాకపోవడంతో నీరసంగా మెట్లమీదే కూలబడి కునికిపాట్లు పడుతోంది.


ఆమె ఊరికే కూర్చున్నా, మనసు ఊరుకోకుండా అల్లరిగా

గెంతుతూ, సైకిల్ చక్రం తిప్పుకుంటూ.. గతంలోకి పరిగెత్తింది.


సీత తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళినపుడు, ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు తలపై తలంబ్రాలు పడకుండా వెనక్కి లాగే వర్గంలో చంటబ్బాయ్,

ఇటుపక్కన పెళ్లికూతుర్ని వెనక్కి లాగేసి, వెక్కిరించే గ్రూప్ లో సీత

విజయవంతంగా పోటీ పడుతున్నారు.


నువ్వా నేనా అన్నట్టు హుషారుగా సాగుతున్న తలంబ్రాల ఆటలో చంటబ్బాయ్ ఒకపక్క, సీత మరోపక్కా చేరి సందడి చేస్తుండగా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.

చిలిపి ఊసులాడుకున్నాయి.


ఆ చూపులు కలిసిన శుభవేళ లో చంటబ్బాయ్ సీతకి బాగా నచ్చేసాడు.


కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం అనుకుంటూ ఒకరి వెనకాల ఒకరు తిరుగుతూ పెళ్లి పందిరిలో మనసిచ్చి పుచ్చుకున్నారు.


వివాహ భోజనంబు చేస్తున్నప్పుడు చంటబ్బాయ్ ఓరచూపులు, వడ్డిస్తున్న సీత వీపుకి గుచ్చుకున్నాయి.


వెనక్కి తిరిగి చూసి, "పిలిచారా?" అంది కళ్ళెగరేసి.

"ష్. . . గప్ చుప్ గా ఉండు. మనిద్దరం మాట్లాడుకున్నట్టు మా నాన్న చూస్తే నా తాట తీస్తాడు. మనం తెలుకుట్టిన దొంగలల్లే ఏం తెలీనట్టు వుండాలి” అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం మొదలు పెట్టాడు చంటబ్బాయ్.


ఆమాటకి సీత హర్ట్ అయ్యింది. బోల్డంత కోపం కూడా వచ్చింది.

ఆ కోపంతోనే విసురుగా వెళ్లి బుంగమూతి పెట్టుకుని, ఆ పక్కనే వున్న బాబాయ్ హోటల్ కి వెళ్లి కూర్చుంది.


అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ని కృష్ణుడు సీతని చూసాడు.

ఆహా ఎంత బావుందో అనుకున్నాడు.

దగ్గరకు వచ్చి మాట కలిపాడు.

"ఈ లంగా ఓణీలో రెండు జళ్ళ సీతలా ఉన్నావ్" అన్నాడు.

"నా పేరు సీతే" అంది సీత.

"నువ్వింత సంప్రదాయ బద్ధంగా వుండికూడా మోడ్రన్ పేరు పెట్టుకున్నావే.

సీత. . పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. " అన్నాడు నాలుగైదుసార్లు అనుకుంటూ.


ఇద్దరూ ఒకే పెళ్లికి వచ్చారని తెలుసుకుని

నవ్వుకున్నారు.


ఇదంతా దూరం నుంచి చూస్తున్న చంటబ్బాయ్ గుండె తుప్పుపట్టిన గ్యాస్ స్టవ్ బర్నర్ లా ఎర్రగా మండింది.


ఈగలు ముసురుతున్న గాజుగ్లాసుపై తన ప్రతాపం చూపించాడు. దాన్ని కోపంగా నలిపేశాడు. అది చేతిలో పగిలి సున్నిపిండిలా జలజలమని నేల మీద కుప్పగా రాలింది.


ఆ పిండి మీద నాలుగు రక్తపు చుక్కలు కూడా కారి పడ్డాయి.


ఆ ఎర్రటి పిండిలో చూపుడు వేలుతో 'సీతా ఐ లవ్ యు' అని రాశాడు.


ఇదంతా ఓరకంట చూస్తున్న సీత ఇక తట్టుకోలేక చంటీ అంటూ టేబుల్స్ ని నెట్టుకుంటూ, అన్నిటినీ పడదోసుకుంటూ పరిగెత్తుకొచ్చింది.


"హెంత పనిచేశావ్ చంటీ. ఏవిటీ సాహసం!


ఇక్కడ నెత్తురు చిందించే బదులు నీ చూపులు నా వీపుకి తగిలినపుడే.. అక్కడే నీ మనసేమిటో చెబితే సరిపోయేదిగా. . ఇప్పటికైనా మంచిమాట చెప్పావు సంతోషం" అని ముద్దుగా కసిరి, పట్టు ఓణీ సగం ముక్క చించి చంటబ్బాయ్ చేతికి కట్టుకట్టింది.


చిన్ని కృష్ణుడు పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ వాళ్లదగ్గరకు వచ్చాడు. ఇద్దరూ అతనివంక అర్ధంకానట్టు అదో మాదిరిగా చూసారు.


""నువ్వు సీతని ప్రేమిస్తున్నావని నాకు ముందే తెలుసు బ్రదర్. నీ మనసు బాయిలర్ లో దుమ్ముకున్న ఆలోచనా బొగ్గుల్లో నా మాటల పెట్రోల్ పోసి మంట పెడితే నీ రక్తం సలసలా మరిగి వేడెక్కుతుందని, ఆరొందల అడుగుల కిందున్న ఆ మాటను బోరు వేసి లాగినట్టు నీనోటినుంచే బుళుక్కున కక్కించాలని సీతతో అలా వెకిలివేషాలు వేశాను.


అంతేతప్ప పరాయివాళ్ళ పరవాన్నం గ్లాసులో స్పూన్ వేసుకుని తినే రకాన్ని కాను. ఇక మీ ఇద్దరినీ కలపడంతో నా సీన్ అయిపోయింది. మీ నాన్నతో సీత గురించి నిర్భయంగా చెప్పి ఇద్దరూ ఒక్కటవ్వండి. జయమ్ము నిశ్చయమ్మురా బ్రదర్" అని చెప్పి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని ఎటో వెళ్ళిపోయాడు చిన్ని కృష్ణ.


ఇద్దరి పరిచయానికీ వారధైన ఆ పెళ్లి పందిరి సాక్షిగా ధైర్యం చేసి వాళ్ళ ప్రేమ విషయం అందరితో చెప్పేసాడు చంటబ్బాయ్.


పెద్దలంతా కలిసి ఎన్నో తర్జన భర్జనలు పడి చివరకు వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు. చంటబ్బాయ్ ‘అహ నా పెళ్ళంట’ అని ఊరంతా పెళ్లి కార్డులు పంచిపెట్టాడు.


కొంత దూరం వెళ్లిన సీత జ్ఞాపకాల టైర్ పంక్చరై వెనక్కి తిరిగొచ్చింది.

చంటబ్బాయ్ రాకను గమనించిన సీత లోపలికి పరిగెత్తుకెళ్లి తలుపు చాటున దాక్కుంది.


సీతను వెతుక్కుంటూ గదిలోకి వచ్చిన అతని చేతిలో కవరు పెట్టి పారిపోయింది సీత. కవరుమీద ‘శ్రీవారికి ప్రేమలేఖ’ అనే అందమైన అక్షరాలు రాసున్నాయి. ఆత్రంగా కవరు విప్పి చూసాడు.


అతను క్యాంప్ కి వెళ్ళినపుడు ఆమె పడిన విరహవేదనను వివరిస్తూ

‘ఇక మీరెక్కడికీ వెళ్ళకండి, నేను త్వరలో మిమ్మల్ని మరిచిపోతానేమో అని భయంగా ఉంది' అని రాసింది.


అది చదివి తుళ్ళి పడ్డాడు చంటబ్బాయ్.


భయంతో బిక్కచచ్చిపోయాడు.

పెళ్లయిన మూడ్నెల్లకే పాతబడిపోయానా?


హే భగవాన్. ఈ అమ్మాయిలంతా ఇంతేనా.

వీళ్ళకి గుండె అనే పదార్థం ఉండదా.

మా కెందుకయ్యా ఇంత సున్నితంగా ఇచ్చావ్.

నువ్వు స్త్రీల పక్షపాతివిలే. కాకపోతే

మహిళా దినోత్సవాలకు కవితలను ఆహ్వానించే సాహితీ సంస్థల్ని ఎందుకు సృష్టిస్తావు.

అందులో మగవాళ్ళని స్టేజీ ఎక్కించి, వాళ్ళని పొగడమని ఎందుకు శాసిస్తావు.

మొన్నటికి మొన్న పురుషుల దినోత్సవం

వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా ఒక్క వాట్సాప్ సమూహానికి కూడా తెలీదు.

ఒక్క అభినందన మెసేజ్ లేదు.

ఇది పక్షపాతం కాదా అంట.

అయినా నవ్వుతూ నటిస్తూ లాక్కొస్తుంటే ఈ పిడుగులాంటి వార్త ఏంటి నాయనా?


హే దేవా ఏవిటీ నీ లీల. నేనే గనక ఏక పత్నీ భర్తనైతే నా భార్య నన్ను వదిలి పోకూడదు.

అందుకు రుజువుగా ఏదోటి మోగించి శబ్దం చేయి స్వామీ'


అంటూ వెంకన్నారాయణ మూర్తి ఫోటో కి మొక్కుతూ కవరు బోర్లించాడు.

బుల్లి ఉగ్గు గిన్నె జారి కింద పడి ఘళ్ళుమని శబ్దం చేసింది.


వెనకనుంచి క్యార్ క్యార్ అంటూ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ వినబడేసరికి


'అమ్మ దొంగా! ఇదా సంగతి' అనుకుంటూ

సీతవంక చూసాడు.


ముసిముసిగా నవ్వుతున్న సీత అప్పటికే ఊలుతో బుల్లిబుల్లి మేజోళ్ళు అల్లుతోంది.

సీతవంక ఆనందంగా చూశాడు చంటబ్బాయ్.

తన ప్రేమని భార్యకిస్తే దాన్ని ఉగ్గుగిన్నెలో పోసి కొడుక్కి పట్టాలని కోరుకుంటూ ‘మా జంట కథ సుఖాంతం కావాలి. దేవతలారా దీవించండి’ అని ప్రార్ధించాడు.


---------శుభం--------

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రి ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


31 views0 comments

Commentaires


bottom of page