
'Cherukuru Bamma' written by Aduri Hymavathi
రచన : ఆదూరి హైమావతి
" పిల్లలూ! తలుపులేసుకోండర్రా!పోడు గాలొస్తున్నాది. అసలే బరువైన రంగూన్ టేకు చెక్క తలుపులు.మా నాయనగారు దగ్గరుండి దట్టంగా చేయించారు. రెట్టింపు మందం చెక్కలు పెట్టించి దట్టంగా చేయించి నవి. తలుపు పడతాయి భద్రం బంగార్లూ! శ్రావణమాసం ముందు పోడు గాలి వీస్తుందర్రా!"అంటూ అందరి గదులముందూ కర్రపోటేసు కుంటూ వచ్చి కేకేసి చెప్పిపోడం మా చెరుకూరు బామ్మకు అలవాటు.
మధ్యాహ్నం అంతా భోజనాలయ్యాక నడుం వాల్చుతారు. పిల్లలు మధ్యహాల్లో ఆటల్లో పడతారు. పసికూనలు నేలమీద అప్పుడప్పుడే వస్తున్న దోగాట పాకుడు చేస్తూ హాల్లో కొస్తుంటారు.వాళ్ళ అమ్మలు అలసి పోయి పొట్టలో అన్నం పడగానే తెలీకుండానే నిద్రలోకి జారు కుంటారు. అమ్మపక్కన చాపమీద పడుకుని పాలుకుడిచి అమ్మ నిద్ర లోకి జారుకున్నాక , పారాడుతూ హాల్లోకొస్తుంటారు.
మా చెరుకూరు బామ్మ మాత్రం నడుంవాల్చదు. అందరినీ హెచ్చరిస్తూ ఎవ్వరూ ఇల్లు దాటి బయటికి పోకుండా కాపలా కాస్తూ అందరినీ చూస్తూ ఉంటుంది. బిడ్ద తల్లుల గదుల ముందు నిల్చుని హెచ్చరికలు చేస్తూ ఉంటుంది
" నీకెందుకే బామ్మా! హాయిగా ఇంత తిని నడుంవాల్చక ఇలా అందరికీ హెచ్చరికలు చేస్తూ ఇల్లంతా తిరుగుతావు?" అంటే నవ్వి,
" పిల్లకాకివి నీకెం తెల్సే బాధ్యతలూ బరువులూనూ."అంటూ తన హెచ్చ రిక పని తాను చేస్తుంటుంది.
అసలు చెరుకూరు బామ్మ గురించీ చెప్పకుండా ఏదేదో అంటున్నాను కదూ! ఆమెలాంటి వ్యక్తిని మీరెవ్వరూ ఎప్పుడూ చూట్టంకాదుకదా వినే ఉండరు, అందుకే చెరుకూరు బామ్మగురించీ వివరంగా చెప్తాను .
మా చెరుకూరు బామ్మ పాపం సుఖమన్నదే లేని కష్టజీవి. ఐతే కడుపు నిండా ప్రేమ నింపుకున్న బంగారు బామ్మ. చెరుకూరు బామ్మ బదులు మేము చెరుకుబామ్మ అంటాం.
మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మాముత్తాతగారి హయాం నుండీ అంతా కలిసే ఉండేవారట.పెద్ద తాతగారి అధ్వర్యంలో కూడా అలాగే కొనసాగు తున్నది.మా పెద్దతాతగారూ , చిన్నతాతగారూ ఇద్దరన్నదమ్ములు . ఇద్దరికీ చెరి నలుగురు కొడుకులు.ఇద్దరేసి కూతుళ్ళూనూ. మా పెద్ద బామ్మ కు పెళ్ళిచేసాక ,ఇద్దరు కొడుకులు పుట్టాక , వాళ్ళాయన ఇంకో ఆడమనిషితో సంబంధం పెట్టుకుని, మా బామ్మను కాస్త రంగు తక్కువని సంసారం చేసి ఇద్దర్ని కన్నాక వానికళ్లకు ఆమె రంగుతక్కువదని కళ్ళు తెరిచి చూసి 'అందవికారపుదానా!' అని కొట్టడం దాకా వచ్చాక , పక్కింటి వారు పంపిన మనిషిద్వారా కబురందగానే మా పెద్దతాత వెళ్ళి , వారితో తెగతెంపులు చేసేసుకుని, వారి గోళ్ళూడగొట్టి పెళ్ళప్పుడు పసుపు కుంకుమ క్రింద ఇచ్చిన పొలం తోసహా, ఆమెవాటాకు రావలసిన ఆస్థిని కూడా తెచ్చేశారు.
ఆమె ఇద్దరు కొడుకులతోమా ఉమ్మడి కుటుం బంలోనే ఉండ సాగింది. అప్పటికి మాపెద్ద బామ్మకు పదహారేళ్లే. అందరితో కలిసి మా ఇల్లు నిత్యం పెళ్ళి ఇల్లులా ఉంటుంది. మాచెరుకూరు బామ్మ విషయానికోస్తే మాతాత గారికున్న పలుకుబడి చూసి ఇంటికొచ్చి అడిగారని, మా చెరుకూరు బామ్మకు పదకొండేళ్ళకే చెరుకూరు సంబంధంవారికి ఇచ్చి పెళ్ళిచేశారు. ‘అమ్మాయి ఎదిగాక పంప’మని చెప్పారుట. పన్నెండో ఏట రైస్తురాలయ్యాక మా పెద్దతాత, పెద్ద బామ్మా వెళ్ళి అమ్మాయిని పసుపుకుంకుమలతో , ఊరంతా పెట్టేంత సారెతో వెళ్ళి దించి వచ్చారుట. పాపం ఈవిడ వెళ్ళిన మరు రోజే ఆమె భర్తకు పొలంలో పాము తాకి మరణించడం జరిగి పోయింది. ఈమె అడుగు పెట్టిన దుష్ట క్షణమని అంతా తూలనాడటం, చివరకు కొట్టడం కూడా జరిగిందిట.విషయం తెలిసిన పెద్ద తాతగారు పరుగు పరుగున వెళ్ళేసరికి, అంతా ఆమెను తిడుతూ ,కొడుతున్నారుట.
ఈయన్ను చూసి " ఐదోతనం లేనిదాన్ని మాకు అంట గట్టి మాకొడుకు ప్రాణాలు తీసారని " మాట్లాడే వారితో , మాపెద్దతాత “ఆయుష్షు లేని వాడని తెలిసి, మా ఇంటికొచ్చి పిల్లను అడిగి చేసుకున్న మీ పరువు చుట్టు పక్కల అన్ని పరగణాల్లో చెప్తాను, మా చెల్లాయిమీద చేయి చేసుకున్న మీ మీద పోలిస్ కేసు పెడతాను. మర్యాదగా పెళ్ళినాడిచ్చిన కట్నం డబ్బు ఇంటికి చేర్చండి. మూడు రోజులు టైం ఇస్తున్నాను. నాలుగో రోజు పోలీసులు మీ ఇంటి ముందుంటారు. పసుపు కుంకుమకు ఇచ్చిన పొలం కూడా వెనక్కిచ్చేయాలి. నీకొడుక్కు వచ్చే ఆస్థిలో భాగం వెంటనే మూడు రోజుల్లో పంపండి. జాగ్రత్త , లేకపోతే చూస్తారు మా తడాఖా." అని హెచ్చరించి, వెంటనే చెల్లెలిని అక్కునచేర్చుకుని ఇంటికి తెచ్చారుట.
మాపెద్దతాత చదివింది ఆరోజుల్లో స్కూల్ ఫైనలైనా ఆయన ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఇంగ్లీషువారే ఆశ్చర్యపోయేవారుట. ఆంగ్లేయులకు మా పెద్దతాత అంటే అమిత గౌరవం. ఆయన ఏమాటైన చెప్తే వెంటనే చేసేసేవారుట. ఆయనకు బయట వున్న గౌరవం, పలుకుబడీ చూసి మా చెరుకూరు బామ్మకు రావాల్సిన ఆస్థంతా రెండురోజులకే పంపించేసారుట వారు. పాపం సంసార సుఖంకాదు కదా, ఏ సుఖమూ , మంచి బట్టలూ,, నగలూ, పూలూ ఏమీ ఎరుగని ఆమె ఆరోజునుంచీ మా పెద్ద తాత ఇంట్లో ఉంటూ ఇల్లంతా తానే ఐ అన్ని పనులూ చూస్తూ, చేస్తూ ఈరోజు వరకూ ఇలా ఉంది. చెప్పానుగా మాది ఉమ్మడి కుటుంబమని,మా తాతల కొడుకులు పెద్ద వారై కొందరు పట్టణాల్లో ఉద్యోగాలకెళితే మరికొందరు , ఊర్లో ఉన్న చదువు పూర్తయ్యాక, మాకున్న పొలాలూ తోటలూ చూసుకుంటూ ఇక్కడే ఉండి పోయారు.అందరికీ పెళ్ళిళ్ళై ఇల్లంతా పిల్లాపాపలతో నిత్యం పెళ్ళిళ్ళే.ఎవరెక్కడున్నా సరే కాన్పులకు మాత్రం ఇక్కడికే పంపేవారు. ఇల్లంతా పనివారు ఉండటాన ఏ ఇబ్బందీ ఉండదని వారి భావన,
అందుకే బాలింతలూ, చూలింతలూ అంతా ఇల్లంతా తిరుగుతూ ఇల్లు చిన్న తిరునాళ్ళలా ఉండేది. పాపం మా చెరుకూరు బామ్మ చిన్నల్లో చిన్న, పెద్దల్లో పెద్దలా అన్ని పనులూ తనవే అనుకుని చేస్తుండేది. మా పెద్దతాతగారు, పెద్ద బామ్మ కూడా అన్నిపనులూ చక్క బెట్టను మా చెరుకూరు బామ్మ కే చెప్పేవారు.
ఆమె అన్నీ సమర్థవంతంగా చేసేది.నేను మా పెద్దతాత గారి మూడో కుమారుని కూతుర్ని.మావారు చదువుకున్నా పొలంపనులంటే ఇష్టపడ టాన మేం ఇక్కడే స్థిరపడిపోయాం. మాకూ ఇద్దరు కుమారులు వారిని పట్టణంలో హాస్టల్లో వేసారు మా వారు. ఇక నాకేం పనుంటుందీ! అందుకే మా చెరుకూరు బామ్మ వెనకాలే తిరు గుతూ , పనులన్నీ చూస్తూ, నేర్చుకుంటూ ఉండే దాన్ని.
మా తాతల మిగతా పిలల కూతుళ్ళూ ,కోడళ్ళూ అంతా కాన్పులకు వచ్చి పదకొండో నెలలో వెళ్ళే వారు.ఆపాటికి పిల్లలు కాస్త పెద్దవార వటాన ,వారి ఇళ్ళ కెళ్ళినా ఇబ్బంది ఉండదనుకుని అలా ఉండి పోయేవారు.
మా ఇల్లు చిమ్మనూ, తుడవనూ నలుగురు పనివారు ఉండేవారు. బయట ఒక వరండాలో ఊరివారు తాత గార్లతో మాట్లాడను వస్తే అక్కడే అరుగులమీద కూర్చో బెట్టి మాట్లాడి పంపేవారు. కాస్త ముఖ్యమైన వారు వస్తే తాతగారు పై రెండో వరండాలో కూర్చోబెట్టి మాట్లాడి పంపేవారు. బంధువులు మాట్లాడిపోను వస్తే మా పెద్ద ఇంట్లో ముందున్న హాల్లో కూర్చోబెట్టి మాట్లాడి సమయాన్ని బట్టి టిఫినా, కాఫీనా, భోజనమా అని ఆలోచించి మా చెరుకూరు బామ్మే అన్నీ ఏర్పాట్లూ చేయించేది.
ఇంట్లో ముగ్గురు వంటవాళ్ళు ఉండేవారు. వారికి తీరికే ఉండేదికాదు, కాఫీ కోసం నిరంతరం ఒక పొయ్యి మీద పాలకుండతో ఎప్పుడు కావల్సితే అప్పుడు కలిపి ఇవ్వను తయారుగా ఉండవలసిందే. పదిగేదేలూ, నాలుగు ఆవుల పాలూ పొద్దుటే ముగ్గురు పనివారు పిండి దాలీలమీద పెట్టేస్తారు. వంటవారూ ,పనివారూ ఉండను ఇంటికి ఉత్తరం వైపున అందరికీ గదులు కట్టించారు తాతగారు. పనివారినంతా స్వంత బిడ్డల్లా చూసేవా రాయన.
భోజనాలూ,ఉపాహారాలూ అన్నీ మా ఇంట్లోనే పనివారి కి అందరికీనీ. రెండో హాలును భోజన సాలగా వాడుకునే వారం. వంటగది లోంచీ నేరుగా అక్కడికి పదార్థాలు తెచ్చి వంట వారు వడ్దనలు చేసేవారు. ఇంతకు ముందు అంతా క్రిందకూర్చుని భోజనాలు చేసే వారం. కాస్త నాగరీకమయ్యాక , మా తాతగార్ల కొడుకులూ వారి సంతానమూ క్రింద కూర్చోను ఇబ్బంది పడుతున్నారని, తాతగారూ చలువరాళ్లతో ముప్పై మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలాగా భోజనం బల్లా, కూర్చో నూ పాల రాళ్ళతో బండలూ వేయించారు. పాపం పిల్లలు కూడా క్రిందకూర్చో లేర ని వారికి వేరే వారి ఎత్తుకు సరిపడా పాలరాళ్లతో పిల్లలుభోజనం బల్లలు ఏర్పాటు చేశారు.
మా చెరుకూరు బామ్మను మొదట 'చెరుకూరు అత్తా!' అనేవారు, మా హయాం వచ్చాక ఆమె చెరుకూరు బామ్మై పోయింది. చెరుకూరు బామ్మ పొద్దుటే మా ఇంటి వెనకాలే వేయించి పెంచే అరిటితోటనుంచీ ఆకులు తెప్పించి టిఫిన్లకూ, భోజనాలకూ సరిపడా సైజులప్రకారం కోయించి , కడిగించి తుడిపించి పెట్టించేది . మాఇంట్లో భోజనం పళ్ళాలు కడగాలంటే కష్టం కనుక , ఈ ఏర్పాటు మా చెరుకూరు బామ్మే చేయించింది.
అరతి తోట ఆకులన్నీ మా భోజనాలకే.
మొదట్లో మా పెద్ద తాత " చిన్నా! నీకెందుకమ్మా! ఈ బాధా , బాధ్యతా నూ, వదినలు చూసుకుంటార్లే, హాయిగా విశ్రాంతిగా ఉండు" అంటే ,
"అన్నా! నీవు నాప్రాణం వారి చేతుల్లో పోకుండా కాచి తెచ్చావ్! నీవు కాపాడిన ఈ ప్రాణం ఈ ఇంట్లో వారికే అంకితం అన్నా! నేను ఏ పనీ లేకుండా ఎలా ఉండను?" అన్న మీదట మా పెద్ద తాతగారు తమ్ముడితో, ఆడ వాళ్లతో మాట్లాడి పనులన్నీ చక్క బెట్టను అంతా చెరుకూరు బామ్మకు అప్పగించను అంగీకరించారుట. వారు ఏపని చెప్పినా చాకచక్యంగా చేసుకుంటూ పోయి అందరి అభిమానానికీ పాత్రురాలైంది చెరుకూరు బామ్మ.
అటు ఊరివారూ, పనివారూ ,ఇంట్లోవారూ అన్నీ ఆమెనడగడం ఆమె ఎవరికేది చెప్పి చేయించాలో అలా చేయించడం మా ఇంటి అలవాటై పోయింది. రానురానూ అంతా నేరుగా ఆమెకే చెప్పి పనులన్నీ సజావుగా చేయించుకునేవారు.
మా చెరుకూరు బామ్మకు యాడాదికి పొలాలపైనా ఆమెకు పసుపు కుంకుమ క్రింద ఇచ్చిన పసుపుతోట పైనా వచ్చే ఆదాయం పెద్ద మొత్తం లోనే వస్తుంది. మాపెద్దతాతగారు చాలా ధర్మాత్ములు , ఆయన ఆమె రాబడినంతా ఆమె పేర బ్యాకులో అకౌంట్ ఓపెన్ చేయించి వేయించేవారు. అది ప్రస్తుతం లక్షల్లో ఉండవచ్చు.
ప్రతిఏడాదీ ఉగాది పండక్కి మా ఇల్లు ఎక్కడెక్కడ వున్న సంతాన మంతా రావటాన ,పెద్ద పెళ్ళి ఇల్లే అవుతుంది. సుమారుగా పూటకు ఎనభై వంద మంది వరకూ భోజనాలకు అయ్యేవారు. నమ్మరు కానీ చాలా సందడిగా ఉండే మా ఇల్లు చూస్తే చాలా మందికి వింతే. ఎవరెవరితో మాట్లాడుతున్నరో అంతా గోలగోలే.మాకు అలవాటైంది కానీ కొత్తవారైతే ఉండలేరు.
ఎంతమంది వచ్చినా మా చావడి చుట్టూతా సుమారుగా పాతిక గదులూ, పైన ఒక పది గదులూ , అన్నీ గదుల్లో అన్ని సౌకర్యాలూ, ఇటీవల పెద్ద తాతగారూ చేయించారు. అంతకుముందు మా ఇంట్లో ఇద్దరు పనివారు అందరికీ స్నానాలకు పొద్దుటే పెద్ద గంగాళాలూ , రాగి అండిగలూ , రాగి కాగులూ పది వరకూ గాడి పొయ్యిల మీద కెక్కించి నీరు కాస్తుండగా స్నానాలకువేడి నీళ్ళ కోసం అంతా క్యూ కట్టే వారు. ఇపుడు కరెంటు వచ్చాక అందరి స్నానాల గదుల్లోకీ, నేరుగా వేడినీరు ట్యాపు తిప్పగానే వచ్చే ఏర్పా టు చేయించారు పెద్ద తాతగారు.
మా చెరుకూరు బామ్మ పనివారందరినీ హెచ్చరిస్తూ అందరికీ అన్నీ సరిగా అమరుతున్నాయోలేదో చూస్తూ ఉండేది. ఉగాది పండుక్కు మూడు నెలల ముందునుంచే కంచి పట్టు చీరలు ప్రత్యేకంగా నేయించి సుమారుగా ముప్పై, నలభై వరకూ అందరికీ తెప్పించేది. నగరాల్లో అంతా ఏం కట్టుకున్నా ఆ పండుగరోజు మాత్రం మా చెరుకూరు బామ్మ కొన్న కంచిపట్టు చీరే కట్టుకు తీరాలి, అంతే. అందరికీ ముందు ఏడాదే ఒక జాకెట్ తీసి ఉంచి పేరు వ్రాసి కవర్లో ఉంచేది, కొలతలకోసం. ఇంట్లో రెండు నెలలకు ముందే ఇద్దరు దర్జీ వారిని వరండాలో మిషన్లతో కూర్చో బెట్టి కుట్టించేది.
ఇలా వారం ముందే అందరి బట్టలూ కవర్లలో ఉంచి ,తాను పడుకునే దక్షిణపు గదిలో వున్న వాళ్ళ తాతలకాలం నాటి పెద్ద భోషాణం చెక్క పెట్టెలో ఉంచేది. ఇహ పుట్టింటివారిచ్చిన పసుపు తోటకు వచ్చిన అయివోజు ఏనాడూ తనకోసం వాడుకేదే కాదు. ఆమె ఒక నేత తెల్లచీర మాత్రమే కట్టు కునేది. మెడలో ఒక రుద్రాక్షమాల ఉండేది.మరే ఇతర వస్త్రాలు కానీ ,నగలు కానీ లేనే లేవు ఆమెకు.
పనివారికీ మంచి మంచి చీరలు ఉగాదికి బహుమతిగా ఇచ్చేది, వారిని స్వంత పరివారం లాగానే చూసేది. ఇంటికి యజమానురాలిలా అంతా గౌరవిస్తున్నా, తన పెద్దన్న ,వదినలనే ,'పెద్దయ్యగారిని అడిగి, పెద్దమ్మ గారిని అడిగి ' అంటూ వారి పెద్దరికం కాపాడేది. అందుకే చెరుకూరు బామ్మను అంతా అభిమానిస్తారు. ఆమెతో చెప్తే పనైపోయినట్లే అని భావిస్తారు.ఎంతమంది నిరుపేదలకు ఆశ్రయం కల్పించిందో , ఎంతమంది పేదలకు విద్యకోసం సొమ్ము ఇచ్చిందో లెక్కలేదు.
ఆయేడాది మా పెదనాన్నల బిడ్డలూ, పిన్నాన్నల బిడ్దలూ పురుడు పోసుకోను వచ్చి అప్పుడే పది నెలల వుతున్నది.
"మీరు వచ్చే నెలవెళ్ళిపోతే ఇల్లంతా బోసి పోతుందే అమ్మలూ! మీరు వెళ్ళిపోతే నేనుండ లేనే "అని రోజుకో మారైనా అనేది చెరుకూరు బామ్మ.
ఇదో శ్రావణ మాసం రానుండగా అందరికీ ఊర్లకెళ్ళే బాలింతలకూ చూలింతలకూ బట్టలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై పోయింది చెరుకూరు బామ్మ. వారికి పసి బిడ్డతో పంపే సారెకోసం పిండి వంటలకు ప్లాన్ వేసుకుని వంటవారితో మాట్లాడి, మరి కొందరు వంట వారిని ప్రత్యేకంగా ,సారె పిండి వంటలు చేయను పిలిపించే ప్రయత్నం లో ఉంది.
ఇలా అందరికోసం తపించే చెరుకూరు బామ్మంటే మా అందరికీ ప్రాణం. తనకోసం ఏమీ చేసుకోక, చూసుకోక ఇలా ఇంటిల్లి పాది కోసం తన సర్వశక్తులనూ వెచ్చించే వారు మరెక్కడా ఉండరేమో అనిపిస్తుంటుంది నాకు. ఒక్క సుఖంలేదు, తాను పన్నెండో ఏట పసుపు కుంకుమలకూ దూరమైనా ,అందరికీ పంచేది. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా మా లోగిట్లోనే ఉండేవారు.
ఆరోజు మరీ ఎక్కువ పోడు గాలి వీస్తుండటాన, బాలింతలందరినీ హెచ్చరిస్తూ ఇల్లంతా తిరుగు తున్నది చెరుకు బామ్మ . ఉన్నట్లుండి మా మూడో బాబాయ్ మూడో కోడలు నందిని పడుకున్న గదిలోంచీ ఆమె కొడుకు అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటున్న వాడు , వారి వంశంలో లేకలేక కలిగిన మగబిడ్డ పక్కనే తల్లి చాపమీద నేలమీద పడుకుని అప్పటిదాకా పాలిచ్చి నిద్రలోకి జారుకున్నాక, కడుపునిండా పాలు గ్రోలి , పారాడుతూ గుమ్మందాటు తుండగా పెద్దగా వీచిన గాలికి బరువైన ఆ ఏక తలుపు ఠక్కున పడింది. బిడ్ద గుమ్మం మీద వున్నాడు. మా చెరుకూరు బామ్మ అక్కడే తారాడుతూ వుండటాన, గబుక్కున వాడ్ని పక్కకు విసిరేసి క్రింద పడి పోయింది. ఆమె తల తలుపుకూ, గుమ్మానికీ మధ్య పడి ఠప్పన్న శబ్దంతో ,కొబ్బరికాయ కొట్టినట్లు పగిలి రక్తం హాలంతా చిమ్మింది.
ఆ శబ్దానికీ హాలు చుట్టూ వున్న గదుల్లో వారంతా హాల్లో కొచ్చారు. తల మాత్రం రెండుగా పగిలి హాల్లో పడున్న చెరుకూరు బామ్మ శరీరం , కొద్ది సేపు గిలగిలా కొట్టుకుని ఆగిపోడం, నేను మాత్రమే చూసాను. ఆ సమయం లో నేను హాల్లో బామ్మచెప్పిన పనిని, పని వారి చేత చేయిస్తూ ఉన్నాను.
అంతా నిశ్చేష్టులమైపోయాం. గోల గోలగా అందరి ఏడుపులూ అరుపులూ విని పడమటి గదిలో విశ్రాంతిగా పడుకుని ఉన్న 98 ఏళ్ళ తాతగారు కర్రపోటేసుకుంటూ వచ్చారు ,దిగ్భ్రమతో ఆ దృశ్యం చూసి కూలబడి పోయారు.
"చెల్లెమ్మా! ముద్దులచెల్లెమ్మా! నీ జీవితమంతా మా ఇంటి కోసం త్యాగం చేసి చివరకు నా ముని మనవడ్ని కాపాడను నీప్రాణం ధారపోసావా తల్లీ! బంగారు తల్లీ!, నీవు చెప్తూనే వున్నా, నేను ఇందుకోసమేనేమో ఈ ఒక్క పనీ పట్టించుకోనే లేదు. తలుపులకు స్టాపర్లు పెట్టించన్నయ్య! పసికూనలున్నారు ' అని చెప్తూనే ఉన్నావు తల్లీ ! 'నాప్రాణం ఈ ఇంటికే ధార పోస్తా ‘నన్న మాట నిలుపుకుని వెళ్ళిపోయావాతల్లీ! "అని రోదిస్తూ ఆమె శారీరాన్ని తడుముతూ విలపిస్తున్న పెద్ద తాతగారిని ఓదార్చేవారే లేకపోయారు. అంతా అదే స్థితిలో ఉండిపోయాం.
ఇది జరిగి పదేళ్ళైనా ఇప్పటికీ చెరుకూరు బామ్మ త్యాగం ఈరోజే జరిగి నట్లుంటుంది నాకు. మాచెరుకూరు బామ్మ తర్వాత చాలా మార్పులు జరిగాయి. మాపెద్ద తాత ,బామ్మ , ఇంకా ఇతర పెద్దవారంతా ఒకరి తర్వాత ఒకరుగా స్వర్గస్తులుకాగా మేమందరం వేరే వేరేగా ఊర్లలో స్థిరపడ్డాం. ఆ ఇల్లంతా మా తాతగారు తాను ఉన్నప్పుడే వృధ్ధశ్రమానికి రాసేసి 'చెరుకూరు బామ్మ వృధ్ధాశ్రమం' మనేపేరు పెట్టించి, ఆమె ఆస్థి నంతా ఆ ఆశ్రమ నిర్వహణకు రాసేశారు.మాఇంటి వైభవ మంతా మా చెరుకూరు బామ్మతోనే పోయింది. ఒక్కోజీవీ ఒక్కో ఇల్లు నిర్వహించి తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా స్వార్థ రహిత సేవలో తరించి పోతారేమో !
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

పరిచయ వాక్యాలు .
శ్రీయుతులు మన తెలుగు కథలు సంపాదకుల వారికి , హృదయపూర్వక నమస్కారాలతో,
ఆర్యా! సాయిరాం!
నేను విశ్రాంత ఉపాధ్యాయినిని. పిల్లలతో 40 సం.కాలం మెలిగినందున ఎక్కువగా పిలల్లకోసం కథలు వ్రాయడం అభ్యసనమైంది .నాలుగు కథల పుస్తకాలు భగవంతునిదయతో అచ్చయ్యాయి. ఈ 2020 లో 108 మానవతావిలువలకు ఉపవిలువల తో ఒక శత కధా సుమమాల అనేపేర పుస్తకం అచ్చైంది.
కేవలం బాలలను దృష్టిలో ఉంచుకుని భగవంతుడు చేయించినది ఇది. సుమారుగా 10,12 పుస్తకాలు, జంతువులు, పక్షులు, పుషాలు,వృక్షాలగురించీ కథల పుస్తకాలూ ఇ బుక్స్ గా కినిగెలో ఉంచడం జరిగింది. అమెరికానుండీ వెలువడే వెబ్ మ్యాగజైన్లో గత కొంత కాలంగా వస్తున్న సామెతలతో చక్కని కథలు అనే పేర ప్రచురించబడిన కథలను ఇ బుక్ గ్రా క్రితం మాసంలో రూపొందింది. సమాజంలో విషయాలు చూస్తూ వింటూ కొన్ని కథలను రూపొందించడం జరుగుతున్నది.అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి, కొన్నింటికి బహుమతులుకూడా వచ్చాయి.
మొన్న కెనడా డే సందర్భంగా వారు నిర్వహించిన కథలపోటీలో ' క్షుత్తు ' అనేకథకు బహుమతి వచ్చింది
భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ బాలవికాస్ గురువుగా గత 40 సం.రాలుగా మానవతా విలువలను సమాజంలో బాల బాలికలకు ఉచితంగా నేర్పించే గురువులకు ట్రైనింగ్ ఇచ్చేకార్యక్రమంలో రాష్ట్రమంతా గత 35 సం. సంచరించడం స్వామివారి కృపే.
పుట్టపర్తి ఆశ్రమసేవలో సేవ చేసుకుంటూ అక్కడే ఉంటుండగా కరోనాకారణాన ఆశ్రమం మూసేయటాన ,ప్రస్తుతం బెంగుళూరులో అమ్మాయి ఇంట్లో మకాం.
ధన్యవాదాలతో,
ఆదూరి.హైమావతి
Comments