top of page
Original.png

అమ్మో సీరియల్స్

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AmmoSerials, #అమ్మోసీరియల్స్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Ammo Serials - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 15/12/2025

అమ్మో సీరియల్స్ - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

"నీకు బయటకు రావొద్దని చెప్పానా అమ్మా!" గట్టిగా అన్నాడు సుబ్బు.


"నీకేం..! చెబుతావు..ఒక రూమ్ ఇచ్చి..అక్కడ ఉండమంటే, ఇదేమైన పెద్దసార్ షో అనుకున్నావా? ఎలా ఉండను? ఏమైనా టాస్క్ ఇస్తావా అంటే.. ఏమీ లేదు. ఒక టీవీ ఉందనుకో...అందులో సీరియల్స్ బ్రేక్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి మరి? సీరియల్ టైం కన్నా ఆ బ్రేక్ టైం ఎక్కువ..బోరింగ్"


"నీ సీరియల్స్ పిచ్చి తగ్గించుకో అమ్మా! ఈ మధ్య ఆ పెద్దసార్ రియాలిటీ షో ఒకటి..అక్కడ వాళ్ళు అరుస్తుంటే, ఇక్కడ నీకు బీపీ పెరిగి ఇప్పటికి రెండుసార్లు పడిపోయావు..నీకు ఆ సీరియల్స్ అవసరమా?"


"నువ్వు మాత్రం చూడవూ! తెలుసులే..అమ్మాయిలు అందంగా ఉంటె, మీ మగ మనసు ఆగదు కదా మరి. నీ పెళ్ళాం చూడదా చెప్పు! తెల్లారితే అదే పని..అవి చూసి ఆ వంట చేస్తే ఏమవుతుంది మరి? ఉప్పు పడదు, కారం ఉండదు..ఏం వంటలో ఏమిటో? "


"ఎవరిగోల వారిదే అమ్మా! మరి నువ్వు ఎందుకు చూస్తున్నట్లో?"


"ఆ తిట్లు ,ఆ గొడవలు భలే కాలక్షేపం లేరా. వీటికన్నా సీరియల్స్ కొంచం బాగా ఉపయోగపడతాయి..చుట్టు పక్కల వారిమీద ప్రయోగించడానికి"


"అవి ఫాలో అవకు...నీకు పుణ్యం ఉంటుంది"


"అవి ఫాలో అయ్యే కదా..టైం కు తిండి తింటున్నా..మందులు వేసుకుంటున్నా. అవి వద్దంటే ఎలా? మాకు వాచీ కంటే ఈ సీరియల్స్ టైం బాగా గుర్తులేరా!"


"జానకీ..! మా అమ్మకి అన్నం గదిలోకి పంపించు ...మళ్ళీ సీరియల్స్ స్టార్ట్ అయితే గోల పెడుతుంది"


"అలాగే లెండి..ఏం చేస్తాం?" అంది జానకి వంట గదిలోనుంచి గొణుక్కుంటూ.


రెండు నెలలు వరకు అందరూ ఒకటేగా ఇంట్లో ఉండేవారు. అప్పట్లో, అందరూ కలిపి ఒకే సీరియల్ చూసేవారు..ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు సీరియల్స్ ఎక్కువ అవడం, అందరికీ ఒక సీరియల్ నచ్చటం లేదు. అత్త, కోడలు సీరియల్స్ కోసం కొట్టుకోవడం  చూడలేక, అమ్మకు ఒక సెపరేట్ గది ఇచ్చేసాడు సుబ్బు. ఆ గదికి గాలి , వెలుతురు, ఒక టీవీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాల్ లో సీరియల్స్ కోసం కోడలికి ఒక టీవీ, అత్తగారికి రూమ్ లో ఒక టీవీ. ఎలాగైతేనే అత్తాకోడళ్ళ గొడవ తప్పిందని ఆనందపడ్డాడు సుబ్బు.


ఒక రోజు...


"ఒరేయ్ సుబ్బు..! ఒక రెండు వేలు ఉంటె ఇవ్వు.."

"అంత డబ్బు ఎందుకే? నీకు కావల్సిన మందులు అన్నీ తెస్తున్నాగా ..."

"నాకూ కొన్ని ఖర్చులుంటాయి కదా..నువ్వు మాత్రం నీ పెళ్ళానికి తెలియకుండా సిగరెట్ తాగవా చెప్పు..ఇవ్వకపోతే చెప్పెస్తా"


"ఏమిటే ఈ బ్లాక్‌మెయిల్..అన్నీ ఆ దిక్కుమాలిన సీరియల్ తెలివితేటలే. కొట్టడం, అవమానించడం, బ్లాక్‌మెయిల్, ఒకటేమిటి సమస్త పనికిమాలిన కళలన్నీ అక్కడే ఉన్నాయి..అవే కదా మీకు ఇవన్నీ నేర్పించేవి"


"నువ్వు ఎంత చెప్పినా నేను వినను..డబ్బులు ఇస్తావా ఇవ్వవా?"


జేబులోంచి రెండు వేలు తీసి ఇచ్చాడు సుబ్బు...


"ఇదంతా చాటుగా గమనించిన జానకి..నేను అడిగితే ఒక వంద ఇవ్వరు గాని..తల్లి అడిగితే వేలకు వేలు గుమ్మరించేస్తారు" అంటూ కళ్ళలో నిప్పులు పోసుకుంది  


"ఏమండీ..! ఏమంటారో మీ అమ్మగారు?"


"ఏం లేదు.."


"నాకు తెలియదు అనుకున్నారా! ఆ డబ్బులు ఏం చేసుకుంటుంది..నా తిండి నచ్చదంటా...ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని అప్పుడప్పుడు తింటుంది"


"పోనిలేవే..ఏదో ఎంజాయ్ చెయ్యని"


రానురాను జానకికి అత్తగారి మీద కోపం, ద్వేషం, అన్నీ ఎక్కువ అవసాగాయి. ఇదంతా ఆ సీరియల్స్ పుణ్యమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకోండి. 'అత్తగారిని హతమార్చడం ఎలా?'  'కోడలిని ఏడిపించడం ఎలా?'  కొత్త సీరియల్స్ ప్రారంభం అని తెగ సంతోషపడ్డారు ఇద్దరు. 


అత్తగారిని అడ్డు తప్పిస్తే, రెండు టీవీల్లో చక్కా రెండు సీరియల్స్ ఒకే సారి చూసుకోవచ్చు..ఆమెకి ఇచ్చే డబ్బులతో పట్టు చీరలు కొనుకోవచ్చు. అత్తగారి మందులకి అయ్యే ఖర్చుతో బోలెడంత షాపింగ్ చేసుకోవొచ్చని జానకి ప్లాన్.


ఆ ప్లాన్ అమలు చెయ్యడానికి 'అత్తగారిని హతమార్చడం ఎలా?' సీరియల్ లో కోడలు అత్తను హతమార్చినట్టుగా ప్లాన్ చేసింది జానకి. మర్నాడు ఆన్లైన్ లో ఒక సీసా తెప్పించి, అందులో పొడి కాఫీలో కలిపి...


"అత్తయ్యగారు..! మీకోసం ఈ రోజు ఎక్కువ పొడి, పంచదార వేసి, చక్కని కాఫీ తెచ్చాను. తాగి..శుభ్రంగా పడుకోండి"


"ఇదేంటి..ఇలా అంటోంది కోడలు" అనుకుంటూనే కాఫీని సింక్ లో వొలకపోసి పడుకుంది అత్తగారు. 


"ఏమండీ..! అత్తయ్యగారు పడుకున్నారు. ఎంత పిలిచినా లేవటం లేదు..నాకు భయంగా ఉంది. మీరు తొందరగా ఇంటికి రండి" అంటూ ఫోన్ లో జానకి. 


ఆఫీస్ నుంచి వచ్చిన సుబ్బు, "అమ్మకి ఏమీ కాదు..చూడు ఎలా లేచి కూర్చుంటుందో" అంటూ తట్టి లేపాడు. 


"అప్పుడే వచ్చావా సుబ్బు..?"


"నీ కోడలు ఏదో అంటేనూ... తొందరగా వచ్చాను"


"ఇంతకీ ఏమైంది కోడలా? అనుకున్నది అవలేదా?"


"మీరు పడుకుని లేవకపోతేనూ..అ..త్త..య్య..గా..రు...అందుకే"


"'అత్తగారిని హతమార్చడం ఎలా?'  సీరియల్ నేనూ చూస్తాను కోడలా..'కోడలిని ఏడిపించడం ఎలా?' సీరియల్ కూడా వస్తుంది. నేను అదీ చూస్తాను"


'మీ ఇద్దరికంటే ముందు నేనే ఆ రెండు సీరియల్స్ చూసి, సీసాలో విషం బదులు పంచదార పొడి మార్చాల్సి వచ్చింది' అని మనసులో అనుకుంటూ తల పట్టుకున్నాడు సుబ్బు. 

***********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page