top of page

ఆకాశరామన్న


'Akasaramanna' - New Telugu Story Written By Surekha Puli

'ఆకాశరామన్న' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

చిరునవ్వుతో స్వాగతం పల్కె అంజలి మోము ఈ రోజు సిరీయస్గా వుంది. అశోక్ ఎంత పలకరించిన జవాబు చెప్పలేదు.


జ్యూస్ తాగి సేద తీరుచుకుంటున్న భర్త చేతిలో ఒక నీలి రంగు కవరు ఇచ్చింది. “ఏమిటీ” అన్నట్లు భార్య మొహంలోకి చూశాడు. అంజలి కళ్ళు మౌనంగా రోదిస్తున్నాయి, బహుశా తన పేరిట వుందని విప్పలేదేమో.


నీలి రంగు కవరు తెరిచే ప్రయత్నంలో వున్న అశోక్ రెండు చేతులు పట్టుకొని, అంజలి అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పింది..


“మన గత జీవితంలో, కలతలు రేకెత్తించిన ఈ నీలి రంగు కవరు మళ్లీ దాపురించింది. సరైన యే ఆధారాలు లేక అనవసరంగా నా ప్రవర్తన పైన ఇప్పటికే మీలో అనుమాన అంకురం వుంది. ఇందులో ఎలాటి సారాంశం వున్నా, ప్లీజ్, దయచేసి మీరు నన్ను బాధ పెట్టకండి!”


ఆతృత హెచ్చి, కవరు చింపి ఉత్తరం తీసి చదవడం మొదలు పెట్టాడు.


“నమస్తే!


నేను నేనుగా యింత వరకు పరిచయం చేసుకోలేదు కదూ. నా చేతి వ్రాత చూస్తే నేనెవరో మీకు యిట్టే అర్థం అయి వుండొచ్చును.


మీ పెళ్లికి ముందు నేనే మీ భార్య ప్రవర్తన మంచిది కాదని మీకు ఆకాశరామన్న ఉత్తరాలు రాశాను గుర్తుందా? నిన్న మీ జంటను సిన్మా హల్లో చూసి చలించి పోయాను. ఎందుకో తెల్సా? గతంలో నేను పచ్చి బూతుల్తో ఉత్తరాలు రాసినా, మీ భార్యను శంకించకుండా, అన్యోన్యంగా వుంటున్నదుకు, నిజంగా మీకు నా హృదయపూర్వక జోహార్లు!


నేను, అంజలి చిన్ననాటి స్నేహితులం. ఎన్నో విషయాల్లో అందరూ అంజలిని పొగుడుతూ వుంటే నాలో ఈర్ష్య మొదలైంది. అందుకే అంజలి వాళ్ళ నాన్నగారికి నేనే ఆకాశరామన్న ఉత్తరాలు సృష్టించి పంపే దాన్ని. దాంతో వాళ్ళ నాన్నగారు నా అబద్ధపు ఉత్తరాల ఫలితంగానే అంజలి చదువుకి స్వస్తి పలికారు.


ఈర్ష్యతో మొదలు పెట్టిన నా ఈ పని నాకు ఏదో చెప్పలేని తృప్తిని, ఆనందాన్ని యిచ్చేది. రాను రాను ఇదొక అలవాటుగా మారి పోయింది.


అంజలి యించు మించ అందరితోనూ స్నేహం మానేసి ఇంట్లో నాలుగు గోడల మధ్య వుండేది. మీతో పెళ్లి సంబంధం నిశ్చయమైన తరువాత ఎలాగో అలాగా మీ అడ్రసు సంపాదించి మీకు ఆకాశరామన్న ఉత్తరాలు రాశాను. అదొక కాలర్ ఎగరేసె ఆనందం! కానీ అంజలి మంచు కడిగిన మల్లెపూవు!!


ఎంతో సహృదయత కల్గిన మీకు, జీవిత భాగస్వామి కావటం, అంజలి పూర్వ జన్మ సుకృతం.


దయచేసి ఈ ఉత్తరం అంజలికి చూపించకండి లేదా చర్చించకండి. ఇంకా నాపైన అసహ్యం పెంచుకుంటుంది. ప్లీజ్, నా కోరిక మన్నించండి.


ఇట్లు,

ఆకాశరామన్న


అంజలి యింకా అలాగే దోషిలా నిలబడి అశోక్ ముఖకవళికలు గమనిస్తున్నది.


కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. కాని ముఖంలో ఏ భావనా కనపర్చక “నీకు సంబంధించిన ఉత్తరం కాదులే. ” అంటూ ఈజీ చైర్ నుండి లేచి అలమార లాకర్ తెరచి, మరికొన్ని నీలిరంగు ఉత్తరాలను చేత పుచ్చుకొని, బట్టలు మార్చుకొని మారు మాట్లాడకుండా బయటికి దారి తీశాడు అశోక్.


అశోక్ పార్కులో తీరిగ్గా కూర్చొని పాత ఉత్తరాలతో, ప్రస్తుత ఉత్తరాల చేతి వ్రాతను పోల్చి చూశాడు. ఎక్కడా వ్యత్యాసం లేదు. ఆశ్చర్యం నుండి తేరుకోవటము చాలా కష్టంగా వుంది.


*****


అంజలి అందానికి అశోక్ సరిపోడు. పెళ్లి చూపుల తంతు జరిగిన మొదలు అశోక్ మధ్యవర్తి ద్వారా పలుమార్లు ముహూర్తం కోసం వెంట పడుతూనే వున్నాడు.


కాని పెద్దమ్మాయి ఆర్తి పెళ్లి కానిదే అంజలి పెళ్లి చేయటము భావ్యం కాదని అంజలి పెద్దలు జాప్యం చేశారు. కనీసం నిశ్చితార్ధం అయినా జరిగితే పెళ్లికి తొందర ఏమి లేదన్నారు.


ఆర్తి చదువుకొని, వుద్యోగం చేసుకుంటూ, తండ్రికి చేదోడు వాదోడుగా వుంది. చెల్లెలికి అశోక్కి ఈడుజోడు కుదరదు అనకొని, ఒకరోజు తీరిగ్గా కూర్చుని చెల్లెలికి నచ్చచెప్పింది. చదువు ఒంట బట్టక, వూరికే ఖాళీగా ఇంట్లో కూర్చున్న అంజలికి మరో వ్యాపకం లేక పెళ్లి మీద కోరిక హెచ్చింది. దాంతో నిశ్చితార్థం అయిందనిపిచ్చారు.


రోజులు గడుస్తున్నాయే తప్ప పెళ్లి గురించి మాటా-ముచ్చటా లేదు. అశోక్కి దిక్కు తోచలేదు. ముద్దుగుమ్మ అంజలి తన నుండి తప్పి పోతే, అమ్మో! అంజలికి పెళ్లి సంబంధాల లోటు లేదు. నష్టపోయిది తానే, లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి.


ఒక రోజున ఆర్తి ఆఫీసుకు అశోక్ ఓ నీలి రంగు కవర్తో వచ్చాడు. లోపల దాగిన ఉత్తరం తీసి ఆర్తి చేతిలో పెట్టాడు. ఎవరో ఆకాశరామన్న రాసిన ఉత్తరం. అంజలి ప్రవర్తన పట్ల అసహ్యమైన భాషలో అసభ్యంగా రాశారు. “అశోక్ గారు ఇలాంటివి నమ్మకండి. ” అని సులువుగా కొట్టి పారేసింది.


మరో పదిహేను రోజులకు అంజలి తండ్రి అనంతయ్య గారికి మరో కొత్త వుత్తరం సృష్టించి ఇచ్చాడు. పచ్చి బూతులతో అంజలిని ప్రేమించిన విధాన్ని వివరించిన ఆకాశరామన్న; అనంతయ్య గూర్చి కూడా బెదిరిస్తూ ప్రగల్భాలు. అసలే బి. పి. ; ఖాళీగా వున్న చిన్న కూతురు పెళ్లి జరిపించటమే సబబు అనుకున్నాడు.


ఆర్తి అభ్యంతరం తెలిపింది. “నాన్నా, ఇంకా కొన్ని రోజులు ఆగుదాము. అదీ కాక, నేను పీఎఫ్ లోన్ కూడా అప్లై చేశాను. అంజలికి చదువు, ఉద్యోగం లేవు, అందుకని మనం ఏదో రూపేణ డబ్బు, బంగారం పెళ్ళిలో యిద్దాము. ఈ అశోక్ కాకుంటే మరొక వ్యక్తి, బాగా చదువుకొని, మంచి వ్యక్తిత్వం, సంపాదన కల్గిన సంబంధమైతే బాగుంటుంది. ”


పెద్దమ్మాయి చెప్పే మాట కూడా వాస్తవమే అనుకున్నాడు తండ్రి, “ఆర్తిీ, ఇంతలో నీకు ఏదైనా మంచి సంబంధం వస్తే నువ్వు కూడా పెళ్లికి రెడిగా వుండాలి, దేవుడి దయ వలన ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు ఒకే సారి జరిగితే, ఎంత భాగ్యం!”


“నాన్నా, నా పెళ్లి గురించి మరచి పొండి, నాకు మీరు, మీకు నేను వుందాము. ఇంటిపన్లు, ఉద్యోగం, ఇది చాలు, నా జీవితానికి. ”


“ఇప్పుడు అలాగే వుంటుందమ్మా, నేను పోయాక నువ్వు ఒంటరిగా వుండే బదులు.. ”


“నాన్నా, అంజలి పిల్లల్ని నేను పెంచుతాను, నా భవిష్యత్తు గురించి చింతించకండి. ”


“నీకు తెలియదు తల్లీ, ఎవరి సంసారాలు వాళ్ళకు వుంటే సుఖం. ”


ఇక నాన్న వినిపించుకోరని, “సరే, చూద్దాం, మన తలరాత ఎలా వుంటే అలాగే లైఫ్ ముందుకు సాగుతుంది. ”


*****


అశోక్ పట్టిన పట్టు వదలలేదు. ప్రతీ పది, పదిహేను రోజులకు ఒక నీలి రంగు కవరు తెచ్చి అనంతయ్య బి. పి., పెంచడము జరగుతూనే వుంది.


పదే పదే అబద్దం మారు మ్రొగితె, అంతా అబద్ధాన్నే నిజమని అనుకొంటారు. కన్న కూతురి మాటల కంటే కనబడని ఆకాశరామన్న మాటలకే విలువ పెరుగుతుంది.


ఎవ్వరి మాట వినదల్చు కోలేదు అనంతయ్య. మంచి రోజు చూసి అంజలి, అశోక్ల వివాహం జరిపించాడు.


అశోక్ విశాల హృదయానికి, మరి అపవాదులను దరి చేర్చుకున్న యువతిని వివాహం చేసుకునే పెద్ద మనసున్న మహానుభావుడని అందరూ అశోక్ని వేనోళ్ల కొనియాడారు.

అంజలి దృష్టిలో కూడా అశోక్ దేవదేవుడు. అదేదో పెద్ద ఆపద రాబోయే సమయంలో అడ్డుగా నిల్చిన గోవర్ధన గిరధారి! ఎవరి పిచ్చి వారికి ఆనందం!


కానీ ఏమిటో, వారంలో ఒకమారు అయినా అశోక్ భార్యను ఆకాశరామన్న ఉత్తరాల వునకిని కదపక పోతే తోచదు. వాటిని వెండి-బంగారం కంటే పదిలంగా దాచుకున్నాడు.


అశోక్ ఈ ఉత్తరాలను అడ్డు పెట్టుకుని, “నేనొక పురుష పుంగవుడిని, నా ఆధీనంలోనే నీ బ్రతుకు, ” అని, తెలివిగా అంజలిని శాసించేవాడు. శీలాన్ని శంకించే ఆ ఉత్తరాలు భద్రపరిచి అప్పుడప్పుడు గౌరవంగా బాధించేవాడు.


అత్తింటి కష్టాలు పుట్టింటిలో చెప్పరాదని తెల్సినా, ఈ మానసికి క్షోభ భరించ లేక భయబ్రాంతుల అంజలి, తోబుట్టువుతో మనోవేదన పంచుకున్నది.


అంజలి పడే మనస్తాపం గ్రహించిన అక్క ధైర్యం చెప్పింది.


*****


“ఏమండీ, మా అక్కకు ప్రమోషన్ వచ్చిందిట, మనిద్దరిని భోజనానికి సెలవు రోజున ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ”


“అంత ఈజీగా మీ అక్కకు ప్రమోషన్ ఎలా వస్తుంది? పై అధికారికి ఏదో ఎర వేసే వుంటుంది. ”


“నేను అడిగేది మనం వేళదామని, అంతేగాని అనవసరపు మాటాలెందుకు?”


“ఉన్నమాట అంటే ఉలిక్కి పడతా వెందుకు. నువ్వు వెళ్ళు, నాకు వేరే పనులున్నాయి, నీలా ఖాళీగా లేను. ”


కొరివితో తల గోక్కొవడం ఎందుకని, అంజలి అక్కడితో మాటలు ఆపేసింది.


“తొందరగా ఇంటికి వచ్చేసేయి, ఇక్కడి మాటలు ఒక్కటి కూడా మీ వాళ్ళతో ముచ్చటించొద్దు. సరేనా?”


“సరేనండి, కానీ ఒక్క మాట, నేను పెళ్ళిలో పెట్టుకున్న బంగారు గాజులు, జూకాలు ఒక్క సారి పెట్టుకొని వెళ్తాను. ”


“అవి అవసరమా?”


“మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఏదో వంకతో వాళ్ళకు చూపించక పోతే, బలమైన కారణం ఏదో వుందని మీ వ్యసనాలకు వాడుకున్నారని అపవాదు మీకే వస్తుంది మరి. ”


“అబ్బో! తెలివి చాలానే వుంది. సరే, పెట్టుకుని వెళ్ళు. కానీ పుట్టింటిలోనే మర్చి పోకుండా జాగ్రత్తగా తీసుకొనిరా, అవి రోల్డుగోల్డ్ కాదు, బంగారం. ”


“అల్మార లాకర్ తాళం చెవులివ్వండి మరి. ”


అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. పేకాట ఫ్రెండ్స్ వచ్చారు.


“మా ఆవిడ పుట్టింటికి వెళుతున్నది, మా ఇంట్లోనే కూర్చుందాం. ”


“వద్దురా, మీ ఇంట్లో ఎంజాయ్ చేయలేము. ప్రక్కనే ఇంటి ఓనరొక కట్టు-దిట్టాలా మహారాజు; మధ్యం, మాంసం అన్నీ కరువే. ”


“ఓకే, ఓకే. ” అని స్నేహితుల మాటలకు తలవంచి, “అంజలీ, నేను వెళ్తున్నా, నా దగ్గర ఇంటి కీస్ వున్నాయి, నువ్వు తాళం వేసుకొని వెళ్ళు. ”


“అలాగే, నా గాజులు, జూకాలు యిచ్చి వెళ్ళండి” జవాబు రాలేదు.


“అరెయ్ అశోక్, త్వరగా రారా. ”


“వస్తున్నా.. ”


“ఇదిగో ఈ అల్మార లాకర్ కీస్…తీసుకో…” అని బయటకు పరుగు పెట్టాడు అశోక్.


ఆభరణాలతో పాటు లాకర్లోని ఆకాశరామన్న ఉత్తరాలన్నీ తీసుకుంది. చక్కగా ముస్తాబై, వీధి చివరన వున్న జిరాక్స్ షాప్లో అన్ని ఉత్తరాలను కాపీ చేయించి, మళ్ళీ ఇంటికి వచ్చి అసలైన ఆకాశరామన్న ఉత్తరాలన్నీ యధాస్థానంలో సర్దేసింది.


తండ్రికి కూతురి రాక ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.


అంజలి తెచ్చిన వుత్తరాల్లోని చేతి వ్రాతను, దస్తూరిని, కొన్ని రోజుల పాటు అభ్యాసం చేసి, మరో ఉత్తరం సృష్టించింది ఆర్తి.


*****


అశోక్ బాగా చీకటి పడ్డ తరువాత ఇంటికి వచ్చాడు. బుర్ర బాగా వేడెక్కింది.


అంజలి తన చేయి జారి పోకుండా, తానే స్వహస్తాలతో, చేతిరాత మార్చి ఆకాశరామన్న ఉత్తరమని ఆర్తికి ఇస్తే, సోషల్గా వుండే ఆర్తి కొట్టి పారేసింది.


మరొక ఉత్తరం సృష్టించి మామగారికి విష బీజం నాటాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం విషబీజం మొక్కగా చిగిర్చింది.


పెళ్లి జరిగింది. కానీ స్త్రీ అంటే చిన్న చూపు గల అహంకారం, దానికి తోడు పురుషాధిక్యం, ఎక్కువ పాళ్ళల్లో కల్గి, భార్య ఎల్ల వేళల వూడిగం చేయాలనే కోరిక. అందులోనూ ఆడవాళ్లే అసూయ పడే అందం. ఇవన్నీటి సమ్మేళనకు జతగా అనుమానం కూడా బలీయంగా వుంది.


అందుకే ఆకాశరామన్న ఉత్తరాలను ఇంటి రిజిస్ట్రీ కాగితాల వలె భద్రంగా అల్మారా లాకర్లో దాచుకున్నాడు.


అపుడప్పుడు అంజలి పైన ప్రయోగిస్తే, నోరు, మనసు అన్నీ క్రమబద్దంగా వుంటుందనే కుంచిత స్వభావి అంజలి భర్త.


కానీ ఈ రోజు ఈ వుత్తరం! అచ్చు తాను రాసినట్టే వుంది. అంటే నాలాగ ఇంకా ఆకాశరామన్నలు వున్నారు.


ఎవరై వుంటారా వ్యక్తి?


ఎంతో రహస్యంగా దాచిన నా మనసులోని విషయాలు ఎవరు పసి గడుతున్నారు?

నిజంగానే అంజలికి ఎవరైన బాల్య స్నేహితులున్నారా? అడగాలి ??


“ఏమని అడగాలి? నేను క్రితం రాసిన వుత్తరాల రహస్యం బయటపడితే?? భార్యగా కాదు, అసలు మనిషిగా కూడా నన్ను క్షమించదు. నన్ను వదిలేసి పోయినా ఆశ్చర్యం లేదు!! నాకు మరో భార్య దొరుకునో లేదో గాని అంజలికి మాత్రం మరో భర్త సునాయాసంగా దొరుకుతాడు. ”


వద్దు, అసలు ఏమి జరగనట్టు వూరుకుంటే సరి.


ఎవరై వుంటారా వ్యక్తి? ఎవరైన గాని, యిక పై ఈ ఉత్తరాల ధ్యాసే వద్దు.


ఇంట్లో అడుగు పెట్టి, బట్టలు కూడా మార్చు కోకుండా పడుకున్నాడు.


“అన్నం తినండి. అంజలి అర్ధింపు. ”


"వద్దు నాకు ఆకలిగా లేదు. ” అశోక్ నిరసన.


“కనీసం పాలైన తాగండి. ” అంటూ వాక్యం పూర్తి చేయకుండానే వంటింట్లోకి దారితీసింది.


అశోక్ అల్మార లాకర్లో జాగ్రత్త చేసిన నీలిరంగు ఉత్తరాల కట్టను తీసుకుని వంటింట్లోకి అడుగుపెట్టాడు.


తన వెనకాలే ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. పాలు కాచి, స్టౌ మంటను సిమ్లో పెట్టి, గిన్నెల స్టాండ్ నుండి గ్లాస్, స్పూన్ తీసుకుంది.


పాల పాత్రను పక్కన పెట్టి, చేత వున్న నీలిరంగు ఉత్తరాల కట్టను గ్యాస్ స్టౌ మంట పైన పెట్టి, అవి కాలి మసి అయ్యే వరకు ఆగి, వెను తిరిగాడు.


అమాయకంగా చూస్తూన్న అంజలి రెండు చేతులు పట్టుకుని, “ఐ యాం సారీ” అన్నాడు.


“ఎందుకండి సారీ?’


జవాబు ఇవ్వక బెడ్ రూమ్ వైపు నడిచాడు.


అంజలిని గుప్పిట్లో పెట్టుకోవాలని మానసికంగా బాధ పెట్టాడు కనుక ప్రత్యక్షంగా ‘సారీ’ చెప్పి ఉపశమనం పొందాడు.


తన కలతల కాపురాన్ని తెలివిగా ఆదుకున్న ఆర్తికి మనసులో థాంక్స్ చెప్పింది అంజలి.


*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


80 views0 comments
bottom of page