top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 11


'Amavasya Vennela - Episode 11 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ.

తన టాక్సీ ఎక్కి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న రంగాను మధ్యలోనే దింపేస్తాడు.

సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది.

శ్రీరమణకు సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తానంటాడు మధుసూదన్.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 11 చదవండి

"అదే.. పెళ్లాంతో ముట్టే దానికై ఎగబ్రాకుతున్నాడు. పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నాడు." చెప్పాడు గిరి.


"అవునా. సంబంధాలు చూసుకుంటున్నాడా." అన్నాడు శ్రీరమణ మామూలుగానే.


"పెళ్లాంతో ఏదో కూడిపోతుందని కలలు కంటున్నాడులే." తేలిగ్గా అనేసాడు గిరి.

ఆ వెంబడే..

"నాకా వెంపర్లు ఇష్టం లేదు. పెళ్లంతో వచ్చే దానికి అర్రులు చాచడం ఏమిటి. అది దారుణం." గజిబిజి అవుతున్నాడు గిరి.


శ్రీరమణ వెంటనే ఏమీ అనలేక పోయాడు.

నిముషం లోపే.. తెములుకుంటూ..

"నీ యోచన బాగుందిరా. సుబ్బారావు ఆలోచన బాలే. వాడితో మాట్లాడాలి." అనేసాడు.


"అబ్బే.. వాడికి చెప్పినా వినడుగా. నేను ఎన్నెన్ని మార్లో ఆ పని చేసా. వెధవ.. వాడు ఒక ఒట్టి వెధవ. వాడితో వేగలేం. వదిలేయడమే మేలు." గిరి నిస్సత్తువయ్యాడు.


శ్రీరమణ వెంటనే మాట్లాడలేక పోతున్నాడు.

అంతలోనే..

"సరే.. నేను వెళ్తాను. అప్పగించిన పనిని కానివ్వాలి." అన్నాడు గిరి.


"అలానే.. వేళ అవుతుంది. నేనూ స్టాండ్ కు వెళ్లాలి." అనేసాడు శ్రీరమణ.


***

పదిహేను రోజుల తర్వాత..

హాస్పిటల్ లో.. డాక్టర్ రూంలో..

"అంతా బాగుంది. బాగానే తేరుకుంది. మాట్లాడగలుగుతుంది. మెల్లి మెల్లిగానైనా.. తనంతట తాను నడుస్తుంది.. తన చేతులతో కావలసిన పనులు చేసుకుంటుంది. బట్.." ఆగాడు డాక్టర్.


సావిత్రి, ఇంద్రజ.. డాక్టర్ నే చూస్తున్నారు.

శ్రీరమణ మాత్రం తల ఒంచి చంద్రికనే చూస్తున్నాడు.

ఆ ముగ్గురు చంద్రిక వెనుకనే నిల్చుని ఉన్నారు.

చంద్రిక.. డాక్టర్ ఎదుట.. ఆయన ముందున్న టేబిల్ దరిన.. కుర్చీలో కూర్చుని ఉంది.


"చూపే లేదు. నెమ్మదిగానైనా అదీ రావచ్చు. బహుశా ఆ షాక్ లో మెదడులోని విజువల్ పార్ట్ కంప్రస్ కాబడి ఉండొచ్చు. చూద్దాం. తనంతట తానే తేరుకుంటుందిగా." చెప్పడం ఆపేసాడు డాక్టర్.


ఆ వెంబడే..

"మరి మెడిషన్ అక్కర లేదు. ఇంటిలోనే.. రెస్టులోనే.. మరి కొన్నాళ్లు ఉన్నీయండి. సరేనా."

అన్నాడు.


ఆ నలుగురూ అక్కడ నుండి కదిలారు.

సావిత్రి ఆసరతో చంద్రిక నడుస్తుంది.

శ్రీరమణ వాళ్లను తన కారులోకి ఎక్కించుకుంటున్నాడు.


***

కొద్ది రోజులు తర్వాత..

ఉదయం..

ఆ కాలనీలోని ఒక ఇంటి ముందు పాసింజర్స్ దింపి.. వాళ్లిచ్చిన కిరాయిని అందుకొని.. తన కారుతో కదలబోతున్న శ్రీరమణను ఒక ఆవిడ హడావిడిగా వస్తూ ఆపింది.


"బాబూ.. మా పక్కింటావిడ సొమ్మసిల్లి పడి పోయింది. ఎంత ప్రయత్నించినా లేవకుంటుంది. హాస్పిటల్ కు తీసుకు పోవాలి. వస్తావా." ఆదుర్దగా అడిగింది.


"సరేమ్మా." ఒప్పేసుకున్నాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"ఎక్కడ." అడిగాడు.


ఆవిడ చూపిన ఇంటి ముందు కారు ఆపాడు.

ఆ ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉంది.

ఆ కారు ఆపిన ఆవిడ.. మరో ఇద్దరు ఆడ వాళ్ల సాయంతో.. తను చెప్పిన పడిపోయి ఉన్న ఆవిడను కారులోకి చేర్చింది.

సాయం వచ్చిన ఇద్దరితో..

"మా ఇల్లులు చూస్తుండండి. మా ఆయనకు ఫోన్ చేసానులే. నేను హాస్పిటల్ కు పోయి వచ్చేస్తాను." చెప్పింది.


ఆవిడ కారు ఎక్కగానే.. కారును స్టార్ట్ చేసాడు శ్రీరమణ.

"ఏ హాస్పిటల్ కు." అడిగాడు.


ఆవిడ చెప్పింది.

అటు శ్రీరమణ కారు పరుగులా కదులుతుంది.


***

"ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది.. మా అమ్మ నుండి. మా అమ్మ చొరవతో.. నాకు పెళ్లి సంబంధం కుదిరిపోయిందిరా." చెప్పాడు సుబ్బారావు.


"ఎంతకి అమ్ముడు పోతున్నావు." అడిగాడు గిరి. అతడు చాలా చిరాకవుతున్నాడు.


ఆ ఇద్దరూ.. ఆదివారం కావడంతో.. ఇంటి పట్టునే ఉన్నారు.

ఇంతకు ముందే.. సుబ్బారావుకు ఫోన్ వచ్చింది.

ఫోన్ లో మాటలు అయ్యేక.. ఆ కాల్ కట్ చేసేసి.. ఆ కబురులు గిరికి చెప్పుతున్నాడు.


"ఇంతకీ నేను అడిగిన దానికి బదులు ఇవ్వలేదు." అన్నాడు గిరి.


"అమ్ముడు పోవడం ఏంట్రా. నీ మాటలుకేం కానీ.. మూడున్నర లక్షలు.. అర ఎకరం పంట భూమితో వాళ్ల అమ్మాయి పెళ్లిని నాతో కుదుర్చుకున్నారు. మా ఊరిలోని సంబంధమే." చెప్పాడు సుబ్బారావు.


"అంటే.. నువ్వు కూడా మీ ఊరు పోతావా. వ్యవసాయం చేసుకుంటావా." అడిగాడు గిరి.


"అలాగెందుకు పోతాను. నాకు ఇక్కడ ఉద్యోగం ఉందిగా. ఆ అమ్మాయే ఇక్కడికి రావాలి." చెప్పాడు సుబ్బారావు.


గిరి మరి ఏమీ అనలేదు.. అడగలేదు.


***

శ్రీరమణ ఊతంతో ఆ అస్వస్థతరాలును హాస్పిటల్ లో చేర్పించింది ఆ తోడు వచ్చిన ఆవిడ.

"అబ్బాయ్.. కొద్ది సేపు ఉండు. డాక్టర్ ఏం చెప్తారో వినేక.. నన్ను ఇంటి దగ్గర వదిలేద్దావు." చెప్పింది ఆవిడ.


శ్రీరమణ.. ఆవిడ అస్తవ్యస్తమగుట చూసి.. కాదనలేక పోయాడు. అక్కడే ఆగాడు.

పావు గంట తర్వాత..

డాక్టర్ వచ్చి చెప్పాడు.

"ఆవిడకు మెలుకువ వచ్చింది. బిపి తగ్గి పడిపోయింది. తను నా రెగ్యులర్ పేషంట్. ఆవిడ హెల్త్ కండీషన్ అంతంతగా ఉందంటున్నా తను తన పట్ల అణుకువ అవ్వడం లేదు. మందులు వాడుతున్నట్టు లేదు. ఇలా ఐతే ఎలా. ఆ సెలైన్ ఎక్కేక తనను తీసుకు పోవచ్చు." చెప్పాడు.


ఆ వెంబడే..

"నాతో రండి. మందులు రాసి ఇస్తాను. బిల్లు కూడా కట్టాలిగా." అనేసి.. అక్కడ నుండి కదిలాడు.


ఆ తోడు వచ్చిన ఆవిడ.. ఆ డాక్టర్ ను తొందర తొందరగా అనుసరించింది.

శ్రీరమణ మాత్రం ఆ ఐసియు ముందే ఉండిపోయాడు.

పావు గంట తర్వాత.. డాక్టర్ వెనుక వెళ్లిన ఆవిడ వచ్చింది. ఆమె చేతిలో మందుల కవరు ఉండడం.. శ్రీరమణ గమనించాడు.


"బాటిల్ అయ్యేక.. ఆవిడను తీసుకు పోవచ్చట. ఉండు.. మేము వచ్చేస్తాం." చెప్పింది ఆవిడ.

ఆ వెంబడే..

"నువ్వు అడిగింది ఇస్తాంలే." చెప్పింది.


శ్రీరమణ కాంగా తలాడించేసాడు.

ఆవిడ.. అక్కడి పక్కగా ఉన్న కుర్చీల్లోని ఒక కుర్చీలో కూర్చుంది.

"నువ్వు కూర్చో అబ్బాయ్." అంది శ్రీరమణతో.


శ్రీరమణ కదిలి.. ఆవిడకు రెండు కుర్చీల దూరాన కూర్చున్నాడు.


***

"రమణ నీ కోసమని లీవర్ కొని ఇచ్చాడు. ఇదిగో తిను. ఇట్టివి తింటేనే నువ్వు వేగిరంగా తేరుకో గలవట." చెప్పుతుంది సావిత్రి.


"అబ్బ.. ఏమిటమ్మా.. కుక్కుతున్నావ్." అనీజీ అవుతుంది చంద్రిక.


"కుక్కడమేటే. నేను బాగానే తినిపిస్తున్నా. నువ్వే.. నోరు పూర్తిగా తెరవవు. పైగా నన్ను అంటావు." చిరాకవుతుంది సావిత్రి.


"లే అమ్మా. నేను అక్కచే తినిపిస్తాను." చొరవైంది ఇంద్రజ.


"లేదులేవే. నేను ప్రతి మారులానే పెడుతున్నాగా. తనే తినడానికి సతాయించుతుంది." నొచ్చుకుంటుంది సావిత్రి.


"నేను నెమ్మది నెమ్మదిగా తింటాను. నా ప్లేట్ ను చేతికి అందించేయండి." చెప్పింది చంద్రిక.


"లేదులేవే. నువ్వు తిను. కాస్తా ఏమఱుపాటున ఉండు. చాలు." చెప్పింది సావిత్రి.. ఒక అన్నం ముద్దను చంద్రిక నోటికి అందిస్తూ.


"నోటిలో కాదు.. తన చేతిలో పెట్టమ్మా. అక్క తింటుంది." చెప్పింది ఇంద్రజ.


అప్పుడే చంద్రిక తన కుడి అరచేతిని డొప్పలా చేసి.. ఆ చేయిని ముందుకు చాపింది.

దాంతో.. దాంట్లోకి తన చేతిలోని ముద్దను పెట్టింది సావిత్రి.

దానిని చంద్రిక నోట్లో వేసుకుంటుంది.


***

తమ కాలనీలో.. తన ఇంటి ముందు కారు దిగుతూ..

శ్రీరమణనే పట్టి పట్టి చూస్తున్న తన పక్కింటి ఆవిడతో..

"ఏమిటి హంస.. నేను చూస్తున్నా.. కారు ఎక్కిన లగాయతు.. నువ్వు ఆ అబ్బాయినే చూస్తూ ఉన్నావు." అడిగింది సహాయం వచ్చిన ఆవిడ.


హంస ఏమీ చెప్పకుండానే కారు దిగిపోయింది.

అక్కడ కారు ఆగగానే.. కొంత మంది ఆడవాళ్లు అక్కడ మూగేసారు.

వాళ్లని ఏమీ పట్టించుకోక..

"లక్ష్మీ.. ఆ అబ్బాయిని ఉండమను. డబ్బులు తెచ్చి నేను ఇస్తాను." అంది హంస తనకు తోడుగా వచ్చిన ఆవిడతో.


"లేదు హంస. తర్వాత లెక్కలు చూసుకుందాంలే." అంటూనే సదరు లక్ష్మి.. శ్రీరమణతో..

"ఎంతిమ్మంటావు." అంటుంది.


శ్రీరమణ చెప్పాడు.

లక్ష్మి ఆ డబ్బుకై తన పర్సు తెరుస్తుంది.

అప్పుడే..

"ఆ అబ్బాయ్ ఫోన్ నెంబర్ తీసుకో లక్ష్మీ." అలజడిగా అంది హంస.


శ్రీరమణకు డబ్బులు ఇచ్చేసి..

"నీ ఫోన్ నెంబర్ అట ఇవ్వు అబ్బాయ్. నీ అవసరం తనకేముందో." అంది చిత్రంగా లక్ష్మి.


శ్రీరమణ కారులోకి వంగి.. తన లెక్కలు రాసుకొనే పుస్తకం అందుకున్నాడు. ఆ పుస్తకంలోని చివరి కాగితం చివరన.. తన జేబులోని పెన్నును తీసి.. తన ఫోన్ నెంబర్ రాసాడు. ఆ భాగం కాగితంని చింపి.. దానిని లక్ష్మికి అందించగా.. తను దానిని అక్కడే హంస చేతిలో పెట్టేసింది.


పిమ్మట.. వాళ్లంతా అక్కడ నుండి కదులుతుండగా.. శ్రీరమణ కారు ఎక్కి.. దానిని స్టార్ట్ చేసేసాడు.


========================================================================

ఇంకా వుంది..


========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
113 views0 comments

Comments


bottom of page