top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3


'Amavasya Vennela - Episode 3 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు.

అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది.

గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.

ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది.

చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 3 చదవండి..

హాస్పిటల్ ముందు.. బైక్ ఆపాడు కామేశం.

బండి దిగి చుట్టూ చూస్తున్నాడు.

ఎవరెవరో అగుపిస్తున్నారు.

చంద్రిక భోగట్టా ఎలా తెలుసుకోవాలో యోచిస్తున్నాడు కామేశం.


అప్పుడే కంపౌండర్ వీరయ్య.. యాద కొచ్చాడు.

బైక్ ను పక్కన నిలిపి హాస్పిటల్ లోకి కదిలాడు.

వీరయ్యకై వాకబు చేపట్టాడు.

పావుగంట లోపునే వీరయ్యను కలవగలిగాడు.


"ఏంటి సారూ." అడిగాడు వీరయ్య.


"ఒకరి గురించి తెలుసుకోవాలని వచ్చాను." చెప్పాడు కామేశం.


"ఎవరికై." అడిగాడు వీరయ్య.


"ఉదయం స్కూటీ యాక్సిడెంట్ ఐంది. ఆ అమ్మాయిని ఇక్కడికే తెచ్చారు. దాని కోసమే వచ్చాను. నువ్వు ఇక్కడి వాడివేగా. తెలుస్తుందని.." మెల్లి మెల్లిగా మాట్లాడుతున్నాడు కామేశం.


అంతలోనే..

అటుగా.. చంద్రిక ఉన్న స్ట్రెచర్.. దాని వెనుక ఇద్దరు ఆడ వాళ్లు.. వాళ్ల వెనుక పోలీసులతో కూడిన ముగ్గురు మగాళ్లు.. రావడం చూసిన కామేశం.. మాటలు ఆపేసాడు.

వాళ్లలోని శ్రీరమణను పోల్చాడు.


'ఇతడి కారుకేగా చంద్రిక స్కూటీ గుద్దుకుంది..' అనుకున్నాడు.

ఆ వెంబడే..

'చంద్రికను హాస్పిటల్ కు తీసుకెళ్లింది ఇతడేగా..' అని కూడా అనుకున్నాడు.


వెనుక్కు తగ్గాడు.

ఆ స్ట్రెచర్ తో పాటు.. వాళ్లంతా తనను దాటుకు పోయేక..


"వీరయ్య.. ఇదే.. ఈ సంగతే.. ఈ అమ్మాయే.." అనగలిగాడు కామేశం తడబాటులతో.


"ఓ. ఇదా. అమ్మాయికి పెద్దగా దెబ్బలేమీ కాలే. కానీ యాక్సిడెంట్ షాక్ కు తెలివి పోయింది. ఇంట్లో పెట్టుకొని వైద్యం చేయించుకుంటారట." చెప్పాడు వీరయ్య.


"అంటే.. బతుకుతుందా." ఆత్రమయ్యాడు కామేశం.


"ఏమో. కోమా లాంటిదేనట. తెలివి రాందే ఏమీ చెప్పడం కాదట." చెప్పాడు వీరయ్య.


ఆ వెంబడే..

"ఏం. ఆ అమ్మాయి మీకేమైనా కావలసిందా." అడిగాడు టక్కున.


"ఆఁ. అబ్బే. ఆ యాక్సిడెంట్ నేను కళ్లారా చూసాను. ఆ మాత్రం దానికే ఆతృత ఐ వచ్చాను. అంతే.. అంతే." ఏదోలా చెప్పేసాడు కామేశం.


ఆ వెంబడే..

"సర్లే. పని చూసుకో. నేను వెళ్తాను." అంటూనే అక్కడి నుండి కదిలిపోయాడు.


హాస్పిటల్ బయటికి వచ్చేక..

తనకి దగ్గరగానే.. శ్రీరమణ తన కారులో.. చంద్రికను వెనుక సీటులోకి ఎక్కించుకోవడం.. ఆ ఇద్దరు ఆడవాళ్లులో ఒకరు చంద్రికతో వెనుక సీటులోనే ఉండడం.. మరొకరు ముందు సీట్లలోకి ఎక్కడం చూసాడు కామేశం.


అలాగే..

ఆ మగాళ్లలో ఇద్దరు తమ తమ కారుల్లో వెళ్లడం చూసాడు.


అలాగే..

"ఆ అమ్మాయి స్కూటీని ఒన్ టౌన్ స్టేషన్ లో పెట్టించాం. వచ్చి తీసుకో." అని ఒక పోలీస్.. శ్రీరమణకి చెప్పడం విన్నాడు.


ఆ తర్వాత..

శ్రీరమణ తన కారు ఎక్కి స్టార్ట్ చేసి పోవడం చూసాడు.

అలానే..

ఆ ఇద్దరు పోలీసులు అక్కడి నుండి జీపులో కదిలాక..

తను బైకు ఎక్కి అక్కడి నుండి కదిలాడు.


***

"మధ్యాహ్నం కూడా తిండికి రాలేదు.. ఇంత చీకటి పడ్డాక తిరిగి వచ్చావు. మంచి గిరాకీ కుదిరిందా." అడుగుతున్న పార్వతమ్మకు ఏమీ చెప్పక..


"ఆకలి జాస్తీ అవుతుంది. తిండి పెట్టమ్మా." అన్నాడు శ్రీరమణ.


పార్వతమ్మ భోజనం వడ్డన చేసింది.

శ్రీరమణ తిండి ఆవురావురను చూస్తూనే..

"మధ్యాహ్నం నెత్తళ్లు పులుసు ఉంది. వడ్డించనా." ఆత్మీయతగా అడిగింది పార్వతమ్మ.


పెట్టమన్నట్టు తలాడించేసాడు శ్రీరమణ.


చిన్నగా నవ్వుకుంటూ.. నెత్తళ్లు పులుసు అతడి పళ్లెంలోని అన్నం మీద పోసింది పార్వతమ్మ.


"ఇంత ఆకలితో ఉన్నావు. ఎక్కడా మధ్యాహ్నం ఏమీ తినలేదు కదూ." అడిగింది.


'లేదు' అన్నట్టు తలాడించాడు శ్రీరమణ. తిండిని మాత్రం ఆపలేదు.


"అయ్యో. ముందు తిను. తర్వాత.. సంగతి చెప్పుదవులే." అనేసింది పార్వతమ్మ.


పావు గంట తర్వాత.. శ్రీరమణ తిండి అయ్యేక..

"వెళ్దువు కానీ.. కూర్చో." చెప్పింది పార్వతమ్మ.


శ్రీరమణ బల్ల అంచున కూర్చున్నాడు.

పార్వతమ్మ అతడి ముందు నేల మీద చతికిల పడింది.

"పూటకూళ్లమ్మను ఐనా.. నన్ను నువ్వు అమ్మా అనిపిలుస్తుంటావు. ఆ చనువుతో చెప్పుతున్నాను. బేరాల్లో పడి ఆరోగ్యం పాడు చేసుకోకు నాయనా.." చెప్పుతుంది పార్వతమ్మ.


అడ్డై..

"అబ్బే. లేదమ్మా. ఏ పూటైనా రాకపోతినా. ఈ రోజు.." చెప్తూ ఆగిపోయాడు శ్రీరమణ.


అతడినే చూస్తుంది పార్వతమ్మ.

శ్రీరమణ లేచి నిల్చుంటూ..

"అమ్మా.. ఒళ్లంతా నొప్పులుగా ఉంది. పోయి నిద్ర పోతాను." అంటూనే బయటికి పోయాడు.


పార్వతమ్మ నొచ్చుకుంటుంది. కానీ అతడ్నే చూస్తుంది.

శ్రీరమణ కారు ఎక్కి.. దానిని స్టార్ట్ చేసేసాడు.


***

శ్రీరమణ కారును.. తను ఉంటున్న అద్దె ఇంటి ముందు ఆపాడు.

ఆ ఇంటి తలుపు కొట్టాడు.

గిరి తలుపు తీసాడు.


ఇంటిలోకి వెళ్తూనే.. "సుబ్బారావు రాలేదా." అడిగాడు.


"వచ్చాడు. ఉన్నాడు." చెప్పాడు గిరి తిరిగి ఆ ఇంటి తలుపు లోపలి గడియ పెట్టేస్తూ.


శ్రీరమణని చూస్తూనే తల తిప్పేసుకున్నాడు సుబ్బారావు.

వెంకట్ అతడి పక్కనే పడుకొని చూస్తున్నాడు.

అతడి పక్కన నడుము వాల్చాడు గిరి.

శ్రీరమణ డ్రస్ మార్చుకొని బాత్రూంకి వెళ్లి వచ్చాడు.


"పోలీసు తతంగం ఏమీ లేదు. అంతా సవ్యంగా ఐంది." శ్రీరమణే చెప్పాడు.


ఆ ముగ్గురూ ఏమీ మాట్లాడలేదు.

శ్రీరమణ వాళ్లకి దరిలోనే.. వాళ్ల లానే నేల మీద.. తన పక్క పర్చుకున్నాడు. దాని మీద నడము వాల్చాడు.


గిరి లేచి.. లైట్ ఆర్పేడు.

ఆ నలుగురూ నిద్రపోయారు.


***

సావిత్రి ఇల్లు..

చంద్రికకు ఐవి ఫ్లూయిడ్ పెట్టాడు ఆయన.

అక్కడే ఉన్నాడు శ్రీరమణ.

"ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేయాలి." చెప్పాడు ఆయన.


"వారం వారం ఇస్తుంటాను." చెప్పాడు శ్రీరమణ.


"కుదరదు. రోజూ నేనే రాను. డాక్టర్ గారు పంపేబట్టే ఎవరో ఒకరం హాస్పిటల్ నుండి వస్తుంటాం." చెప్పాడు ఆయన.


"ఎంత ఇవ్వను." అడిగాడు శ్రీరమణ.

"మీ దయ. డిమాండ్ ఎందుకు." అంటున్నాడు ఆయన.


అక్కడే నిల్చుని ఉన్న సావిత్రి, ఇంద్రజ.. శ్రీరమణనే చూస్తున్నారు.

పది నోటు అందించాడు శ్రీరమణ.


ఆయన తీసుకున్నాడు.

"మీరు ఐవి సూది తీసేయ గలుగుతున్నారుగా." అడిగాడు ఆయన.


ఇంద్రజ.. "నేను తీసేస్తున్నాను." చెప్పింది.


"రేపు ఇంజక్షన్ ఉంది. తీసుకొని ఉంచండి." చెప్పాడు ఆయన.


"పదిహేను రోజులకు సరిపడ్డ మందులన్నీ కొని పెట్టాను." చెప్పాడు శ్రీరమణ.


ఆయన వెళ్లిపోయాడు.

"నేను వెళ్తాను. అవసరమైతే.. నాకు ఫోన్ చేయండి. లేదా నేను రేపు వస్తాను." చెప్పాడు శ్రీరమణ.


ఆ తల్లి కూతుళ్లు ఏమీ అనలేదు.

శ్రీరమణ అక్కడ నుండి బయటికి కదిలాడు.

ఆ ఇంటి ముందు నిలిపిన తన కారులో కూర్చొని.. స్టార్ట్ చేసాడు.

నేరుగా ఓనర్ ఆఫీసుకు వెళ్లాడు.


"సర్.. మరో షిప్టు కూడా కారు తిప్పుతాను." చెప్పాడు.


"అంటే.. మరో షిప్టు అంటే.. రాత్రి ఒంటి గంట వరకునా." అడిగాడు అక్కడి గుమస్తా.


అంతలోనే.. "రాత్రులు తిరగలేనన్నావుగా." అడిగాడు అక్కడే ఉన్న ఓనర్.


"తిరగలేననలేదు సార్. తిప్పను అన్నాను." చెప్పాడు శ్రీరమణ.


"ఏదోలే. మరి ఇప్పుడు ఏమిటి ఇది." చిక్కని వెటకారం ఒంపేడు ఓనర్.


"అవసరం సార్." చెప్పాడు శ్రీరమణ.


"ఏదోలే. తిప్పు. మాకూ డబ్బులు వస్తాయిగా." అనేసాడు ఓనర్ వెకిలిగా నవ్వేస్తూ.


"ఉదయం ఆరుకు తీసుకొని.. రాత్రి ఒంటి గంటకు కారును ఇచ్చేస్తుండాలి. షరతులన్నీ మామాలే." చెప్పాడు గుమస్తా.


తలాడించేసాడు శ్రీరమణ.


***

వారం రోజుల తర్వాత..

ఉదయం డ్యూటీకి వెళ్తున్న శ్రీరమణతో..


"ఈ మధ్య రాత్రులు ఆలస్యంగా వస్తున్నావు. మా నిద్రలు పాడవుతున్నాయి." చెప్పాడు వెంకట్.


"రాత్రి షిప్టులు కారు తిప్పుతున్నాను." చెప్పాడు శ్రీరమణ.


"అది నీ ఇష్టం. మాకు నిద్రలు పాడు చేసుకోవడం కష్టం." చెప్పాడు గిరి.


"మీవి కంపెనీ పనులు. మీకు వేళలు ఉంటాయి. నాకు అలా కాదుగా." చెప్పాడు శ్రీరమణ.


"మాకూ రాత్రులు నిద్ర పాడుచేసుకోవడం కుదరదు." చెప్పాడు గిరి.


"మరైతే ఏమంటారు." అడిగాడు శ్రీరమణ.


"నువ్వు వేరే చోటుకు మారు." చెప్పేసాడు వెంకట్.


అక్కడే ఉన్న సుబ్బారావు వంక చూసాడు శ్రీరమణ.

అతడు తల దించుకున్నాడు.


"అలాగే. అందుకు ఒకటి రెండు రోజులు ఇవ్వండి." అడిగాడు శ్రీరమణ.


ఆ వెంటనే బయటికి నడిచాడు.. వాళ్ల జవాబుకై ఆగకనే.


========================================================================

ఇంకా వుంది..



========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








115 views0 comments
bottom of page