top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4


'Amavasya Vennela - Episode 4 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు.


అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది.


గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.


ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది.


చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

చంద్రిక పరిస్థితి గురించి హాస్పిటల్ లో వాకబు చేస్తాడు కామేశం.

రూమ్ మేట్స్ అసహనంగా ఉండడంతో వేరే రూమ్ చూసుకోవాలనుకుంటాడు శ్రీరమణ.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 4 చదవండి

మధ్యాహ్నం..

భోజనం చేస్తూ..


"అమ్మా. ఇప్పుడు ఉంటున్న రూంలో ఉండడానికి నాకు కుదరడం లేదు. రోజూ నా రావడాలు రాత్రి రెండు ఐపోతుంటుంది. నాలుగు గంటలే పడక." చెప్పుతున్నాడు శ్రీరమణ.


అతడినే చూస్తుంది పార్వతమ్మ.

"నువ్వు ఒప్పుకుంటే.. ఆ నాలుగు గంటలూ.. నీ పాకలో.. ఈ బల్లల మీద పడుకుంటాను. ఆ సమయంలో నువ్వు తలుపు తీయవలసి పని కూడా ఉండదు. నువ్వు లోపలే పడుకో. తెల్లారాకే తలుపు తీయి. నా కొద్ది సామాను నీతో లోపల పెట్టు. చాలు." చెప్పడం ఆపాడు శ్రీరమణ.


చిన్నగా నవ్వుతూ.. "నీ కష్టాలు చెప్పవు. అన్నింటికీ సర్దుకు పోతావు. ఏమిటి నాయనా నీ వాలకం." అంది పార్వతమ్మ.


శ్రీరమణ ఏమీ అనలేదు. ఆవిడనే చూస్తున్నాడు.

"సర్లే. నువ్వంటే నాకు గురి. నీ మాట కాదన లేను. నీకు నచ్చినట్టు చేసుకో." ఒప్పేసుకుంది పార్వతమ్మ.


"రాత్రి భోజనానికి వచ్చేటప్పుడు నా సామాను తెచ్చి పెడతాను. ఇక్కడ ఉన్నందుకు డబ్బులు.. భోజనాలకు ఇచ్చే డబ్బులతో ముట్ట చెప్పుతాను." చెప్పాడు శ్రీరమణ.


"చాల్లే.. నీ వాటమే వింత." అంది పార్వతమ్మ.


ఆ వెంబడే..

"నేను అడిగినా నువ్వు చెప్పేది లేదు. నీకు బోద పడినప్పుడే.. నీవి నాకు చెప్పు. నా దగ్గర.. నీకు నచ్చినట్టు తిరుక్కో." చెప్పింది.


శ్రీరమణ భోజనం చేస్తున్నాడు.

***

పక్షం రోజుల తర్వాత..

"నేను రోజూ రావడంతో.. మీ సంగతులు దగ్గరగా చూస్తున్నాను." చెప్పుతున్నాడు శ్రీరమణ.


సావిత్రి వింటుంది.

తల్లి చెంతనే ఇంద్రజ ఉంది.

చంద్రికకు ఐవి ఫ్లూయిడ్ ఎక్కుతుంది.


"మీకు టైలరింగ్ ద్వారా ముట్టిందే ఆదాయంలా తోస్తుంది." ఆగాడు శ్రీరమణ.


"అంతే." సావిత్రి అనేసింది ముభావంగా.


"ఇంద్రజ.. ఏం చదివావు. మాథ్స్ వచ్చా." అడిగాడు శ్రీరమణ.


"ఇంటర్. యంపిసి. నాకు మాథ్స్ అంటే భలే ఇష్టం." గొప్పగా చెప్పింది ఇంద్రజ.

ఆ వెంబడే..

"ఐనా ఏం లాభం. తర్వాత.. చదువు కుదర లేదు." నొచ్చుకుంది.


"చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే.. నాదో సహకారం." ఆగాడు శ్రీరమణ.

అతడ్నే చూస్తున్నారు ఆ ఇద్దరు.


"నేను ఆరుగురు టెన్తు క్లాస్ పిల్లల్ని రోజూ కారులో తిప్పుతున్నాను. వాళ్లంతా ఒకే అపార్ట్మెంట్ వాళ్లు. వాళ్ల మాటలు బట్టి.. వాళ్లకు మాథ్స్ ట్యూషన్ అవసరంలా ఉంది. నువ్వు వాళ్లకు ట్యూషన్స్ చెప్పవచ్చుగా." చెప్పాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"సరేనంటే.. వాళ్లతో నేను మాట్లాడగలను." చెప్పాడు శ్రీరమణ.


ఇంద్రజ తల్లిని చూస్తుంది.

సావిత్రి తనని చురచుర చూస్తుండడంతో..

"చెప్తాను.. ట్యూషన్ చెప్తాను." అనేసింది ఇంద్రజ.


"ఇది చెప్పుతుంది. ఎంతో కొంత ముట్టడం మాకు అవసరం." అంది సావిత్రి.. శ్రీరమణతో.


"సరే. రేపు వచ్చినప్పుడు దాని గురించి మీతో మాట్లాడగలను." చెప్పి.. అక్కడ నుండి వెళ్లి పోయాడు శ్రీరమణ.


***

"మీ పిల్లలకు మాథ్స్ కొరకు ట్యూషన్ కావలసినట్టు ఉంది. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. తను చెంత ట్యూషన్ పెట్టించండి. మీ పిల్లల్ని నేనే తీసుకు వెళ్లి.. తీసుకు వస్తుంటాను. నాది పూచీ." ఎంతో ఇదిగా చెప్పాడు శ్రీరమణ.. ఆ పేరెంట్స్ తో.


"అవునా. నువ్వు చాన్నాళ్లుగా మా పిల్లల్ని తిప్పుతున్నావు. నీలో మంచి కేరింగ్ ఉంది. సో.. కానీ.." అనేసింది ఒక తల్లి.


"మేమూ మా పాపను పంపుతాం. మాత్రం నెల రోజులు చూస్తాం. బాగుంటేనే కంటిన్యూ చేస్తాం." చెప్పింది మరో తల్లి.


"మేమూ అంతే." అన్నారు మిగతా తల్లులు.


శ్రీరమణ సంతోష పడిపోయాడు.


***

తెల్లారుతుండగా.. ఎప్పటిలాగే.. పార్వతమ్మ తలుపు తీసుకొని బయటికి వచ్చింది.

వీథి కొలాయి వద్ద బట్టలు ఉతుక్కుంటూ శ్రీరమణ అగుపించాడు.


పార్వతమ్మ బాగా నొచ్చుకుంది. నిలతీసింది.

"ఏం. నా కొడుకులా అనుకుంటున్నాను. నీ బట్టలు నేను ఉతికి పెట్టరాదా." అంది.


శ్రీరమణ ఏదో చెప్పబోయాడు.

పార్వతమ్మ జోరయ్యింది. దాంతో శ్రీరమణ తగ్గక తప్పలేదు.


"ఎప్పుడు ఇవే బట్టలు అగుపిస్తున్నాయి. రెండు జతలు కొనుక్కోరాదు." అంది.


"చాల్లే అమ్మా. సరిపోతున్నాయిగా." అనేసాడు శ్రీరమణ.


తర్వాత.. నాలుగు పూటలు గడిచాక..

డ్యూటీకి సిద్ధమవుతున్న శ్రీరమణతో..

"ఇదిగో రెండు కొత్త జతల బట్టలు. నీ పాత బట్టలను కొలతగా చూపి తీసాను. నీకు సరిపోతాయి. వద్దనకు. నా మీద ఒట్టు." టకటకా చెప్పేసింది పార్వతమ్మ.. ఒక కవర్ అందిస్తూ.


శ్రీరమణ డంగు అయ్యిపోయాడు.

"తీసుకో. తల్లిగా తీసాను. అంతే." గట్టిగా చెప్పగలిగింది పార్వతమ్మ.


ఇంకా ఆ కవరును అందుకోలేక పోతున్నాడు శ్రీరమణ.

"నీకు బాగా కుదిరినప్పుడు.. ఒక కొడుకుగా నాకు ఒక బట్ట పెట్టు. నేను తీసుకుంటాను." చెప్పింది పార్వతమ్మ.


ఆ కవరు అందుకున్నాడు శ్రీరమణ.


***

పది రోజుల తర్వాత..

గిరి ఫోన్ చేస్తున్నాడు.

శ్రీరమణ పాసింజర్స్ తో కారులో ఉన్నాడు. ఐనా ఆ కాల్ కు కనెక్ట్ అయ్యాడు.


"చెప్పు." అన్నాడు.


"రమణ.. ఏడ." అడిగాడు గిరి.


"కిరాయికి బండి తోలుతున్న." చెప్పాడు శ్రీరమణ.


"అట్టానా. నీతో మాట్లాడాలి." చెప్పుతున్నాడు గిరి.


అడ్డై..

"అరగంట తర్వాత మాట్లాడదాం." చెప్పాడు శ్రీరమణ.


"అర్జంట్ మేటర్. నీకు ఖాళీ కాగానే కాల్ చేయవా." గిరి కోరాడు.


"సరే." కాల్ కట్ చేసేసాడు శ్రీరమణ.


రమారమీ అర గంట తర్వాత..

గిరికి ఫోన్ చేసి.. "ఇప్పుడే ఖాళీ ఐంది." అన్నాడు.


"అదె. నువ్వు ఏడ ఉన్నావ్." అడిగాడు గిరి.


"హెడ్ పోస్టాఫీస్ దగ్గర." చెప్పాడు శ్రీరమణ.


"అలానా. నేను ఇక్కడే.. సుమిత్రా స్టోర్ చోటునే ఉన్న. నువ్వు ఆడే ఉండవా. నేను నిన్ను కలుస్తాను." చెప్పాడు గిరి.


"సరే. రా." కాల్ కట్ చేసేసాడు శ్రీరమణ.


పది నిముషాల లోపే.. గిరి అక్కడికి వచ్చాడు. శ్రీరమణని కలిసాడు. వెంకట్ విషయం చెప్పాడు.

"అరె. వాడు అలా చేసాడా. ఇప్పుడు ఎలా ఉన్నాడు." శ్రీరమణ ఆతృత పడ్డాడు.


"హాస్పిటల్ లో చూపాం. కట్టు కట్టి.. మందులు ఇచ్చారు. రూంకి తీసుకు వచ్చేసాం. ఇప్పుడు బాగున్నాడు." చెప్పాడు గిరి.


"రూంకి వెళ్దాం." అంటూనే కారు ఎక్కేసాడు శ్రీరమణ.


గిరి అతడి పక్క సీటులోకి ఎక్కేసాడు.

దారిలో..

"సుబ్బారావు ఎక్కడ ఉన్నాడు." అడిగాడు శ్రీరమణ.


"వెంకట్ దగ్గర ఉన్నాడు." చెప్పాడు గిరి.


ఆ వెంబడే..

"వాడే చెప్పాడు. నీకు ఫోన్ చేసి చెప్పమని." చెప్పాడు.


శ్రీరమణ కారును ముందుకు జోరుగా పోనిస్తున్నాడు.

"మాట్లాడి ఒప్పించుకోగలగాలి. కానీ.. ఇలా చచ్చే ప్రయత్నం చేయడ మేమిటి. వెంకట్ చెత్తగా ఆలోచన చేసాడు. ఛ." విసుక్కుంటున్నాడు శ్రీరమణ.


గిరి ఏమీ అనలేదు. కానీ శ్రీరమణనే చూస్తున్నాడు.

కారును ముందుకు పోనిస్తున్న శ్రీరమణ.. అప్పుడే గుర్తుకు వచ్చినట్టు కదిలాడు. జేబు లోని ఫోన్ ను తీసాడు.


***

టేబుల్ మీది రింగవుతున్న తన ఫోన్ ను తీసుకుంది సావిత్రి.

"హలో రమణ." అంది.


"అమ్మా.. ఈ రోజు చంద్రికకు ఇంజక్షన్ ఉంది. హాస్పిటల్ నుండి వచ్చారా." అడిగాడు శ్రీరమణ.. కారుని స్లో చేస్తూ.


"ఇంకా లేదు." చెప్పింది సావిత్రి.


"వచ్చే టైం. వస్తారు. నేను రాలేను. మీకు డబ్బులు ఇచ్చానుగా. అందులోంచి వచ్చిన వారికి రోజువారీ డబ్బులు ఇచ్చేయండి." చెప్పాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"నేను సాయంకాలం పిల్లల్ని ట్యూషన్స్ కు తీసుకు రావాలిగా. అలా వచ్చి చూస్తాను." చెప్పాడు.

"అలాగే." అనేసింది సావిత్రి.


శ్రీరమణ ఆ కాల్ కట్ చేసేసాడు.


***

పది నిముషాల తర్వాత..

తను గతంలో ఉండే ఇంటిలో ఉన్నాడు శ్రీరమణ.


"గిరి చెప్పాడు. నువ్వు చేసిన పని బాలే." వెంకట్ తో అన్నాడు.


వెంకట్ తల దించుకొనే ఉన్నాడు.


"వీడి సుజాతకి సంబంధం చూసారట." చెప్పాడు సుబ్బారావు.


"వీడు మాట్లాడడేమిటి. ఏమ్రా. ఏం జరిగింది." అడుగుతున్నాడు శ్రీరమణ.


బెదురు బెదురవుతున్నాడు వెంకట్.

"వివరంగా చెప్పరా." రెట్టిస్తున్నాడు శ్రీరమణ.


నెమ్మదిగా తెలెత్తి.. శ్రీరమణను చూస్తూ..

"సారీరా. నీకు నేను సాయం కాకపోయినా.. నువ్వు నాకు సాయంగా రావడం నీ గొప్పేరా." అన్నాడు వెంకట్.


ఆ వెంబడే..

"తప్పు చేసానురా." చెప్పాడు కూడా.


"చాల్లే. ఇప్పుడు ఆ కబుర్లు వద్దు. అవకాశం బట్టే చేతలు ఉంటాయి." తేలిగ్గా అనేసాడు శ్రీరమణ.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

118 views0 comments

Comments


bottom of page