'Amavasya Vennela - Episode 5 - New Telugu Web Series Written By BVD Prasada Rao
'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.
నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది.
చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ. చంద్రిక పరిస్థితి గురించి హాస్పిటల్ లో వాకబు చేస్తాడు కామేశం.
రూమ్ మేట్స్ అసహనంగా ఉండడంతో ఖాళీ చేసి పార్వతమ్మ మెస్ బయట ఉన్న పాకలో ఉంటాడు శ్రీరమణ.
మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు.
ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 5 చదవండి
ఆ వెంబడే..
"సర్లే కానీ.. ఇంతకీ ఏమైంది" అన్నాడు శ్రీరమణ.
"సుజాత.. తన తల్లిదండ్రులను ఒప్పించలేక పోయింది" నెమ్మదిగా చెప్పాడు వెంకట్.
"నువ్వు వెళ్లి.. ఆ తల్లిదండ్రులతో మాట్లాడాలిగా" అన్నాడు శ్రీరమణ.
"తమ కూతురుకే లెక్క చేయని వాళ్లు. నా మాట కానిస్తారా" అనేసాడు వెంకట్.
"అదే తప్పుడు ఆలోచన. ప్రయత్నం చేయాలిగా. ఆ అమ్మాయే కావాలనుకున్నప్పుడు నువ్వు చొరవ అవ్వాలి. తప్పు నీదే" చెప్పాడు శ్రీరమణ.
వెంకట్ తలెత్తాడు. శ్రీరమణనే చూస్తున్నాడు.
శ్రీరమణ మాత్రం సూటిగానే వెంకట్ నే చూస్తూ..
"పైగా చావాలనుకోవడం మరీ తప్పురా" అంటున్నాడు.
గిరి, సుబ్బారావు శ్రోతలై ఉన్నారు.
"ప్రేమ వ్యవహారం చాలా సున్నితం.." చెప్పుతున్నాడు శ్రీరమణ.
"అందుకే దానిని ఒడుపుగా హేండిల్ చేయాలి తప్పా.. తెగనీయకూడదు" ఆగాడు శ్రీరమణ.
అప్పుడే..
"సుజాత కూడా.. 'నువ్వు దక్కకపోతే నేను చస్తాను' అన్నా.. నన్ను పట్టించుకోలేదురా" మాట్లాడేడు వెంకట్.
"చాల్లే. నువ్వు.. నీ చావు వాలకం" కసురుకున్నాడు శ్రీరమణ.
వెంకట్ తగ్గాడు.
"ప్రేమించుకో ముందే తర్జన భర్జన పడాలి. ప్రేమలో పడేక దానకై కట్టుబడాలి. అంతే. " తేల్చేసాడు శ్రీరమణ.
"ఇప్పుడు ఏం చేయగలం. " అడిగాడు వెంకట్.
"సుజాత.. తన తల్లిదండ్రులను ఒప్పించకోలేక పోయింది మరియు నువ్వు చస్తానన్నా తను పట్టించుకోలేదు.. కదూ" ఆగాడు శ్రీరమణ.
"అవును" అన్నాడు వెంకట్.
"తన పెద్దలు కుదిర్చిన సంబంధంకి తను సమ్మతిస్తుందనుకోవాలా" అడిగాడు శ్రీరమణ.
"అంతే అనుకున్నా. తను మరొకడితో పెళ్లికి సమ్మతించింది కనుకనే.. నన్ను తను లెక్క చేయలేదు" అనేసాడు వెంకట్.
"మరి అట్టి దానికై నువ్వు చావడం ఏమిట్రా" అనేసాడు శ్రీరమణ.
వెంకట్ మాట్లాడ లేదు.
"తను నీ మీద మొగ్గు అగుపరిస్తే ఏమైనా చేయచ్చు. తనే ఖాతరు చేయ నప్పుడు.. మీ మధ్య ప్రేమేట్రా" విస్మయం ప్రదర్శించాడు శ్రీరమణ.
"అంతేగా. రమణ అంది ముమ్మూటికి కరెక్టురా" అప్పుడే అన్నాడు గిరి.
"అవున్రా. అట్టి అమ్మాయి కోసం నువ్వు చావడం ఏంట్రా" అందుకున్నాడు సుబ్బారావు.
"నా మాట ఆలకించు. ఆమె సొద ఆమెకే వదిలేసి.. నువ్వు మామూలు అవ్వు. చక్కగా నీ మానాన నువ్వు ఉండు. నీ ఇజ్జతు వీడకు" చెప్పాడు శ్రీరమణ.. వెంకట్ చూపుల్లోకి చూస్తూ.
ఆ వెంబడే..
"నీ మీద ఆధార పడ్డ వారు ఉన్నారు. వారిని హైరాన పర్చకు" చెప్పాడు.
అందుకు మిగతా ఇద్దరూ వత్తాసు పలికారు.
వెంకట సముదాయించుకోగలుగుతున్నాడు.
***
"అమ్మా పద. హాస్పిటల్ కు పోదాం" చెప్పాడు శ్రీరమణ.
"వద్దులే నాయనా" అనేస్తుంది పార్వతమ్మ.
"లేదు లేదు. నిన్నటి నుండి ఒళ్లు నొప్పులు పడుతున్నావు. ఈ పూట ఒళ్లూ కాలుతుంది. ఓ మారు డాక్టర్ కు చూపితే బాగుంటుంది. లే లే." అన్నాడు శ్రీరమణ.. చొరవగా తన చెయ్యి పట్టి లాగుతూ.
తప్పక పార్వతమ్మ కదిలింది.
తన కారులో.. హాస్పిటల్ కు పార్వతమ్మతో.. బయలుదేరాడు శ్రీరమణ.
దార్లో..
"అమ్మా.. చూస్తున్నా.. నువ్వు ఒక్కతవే కాన వస్తున్నావు. నీకు ఎవరూ లేరా. " అడిగాడు శ్రీరమణ.
పార్వతమ్మ ఏమీ చెప్పలేదు.
"చెప్పు అమ్మా. " మళ్లీ అడిగాడు శ్రీరమణ.
"అందరి బాగు నీకు కావాలి. కానీ నీ సొద మాత్రం చెప్పవు. " అనేసింది పార్వతమ్మ.
"నాకే సొద అమ్మా. నాకు బాగానే ఉంది. " నవ్వేడు శ్రీరమణ.
"అలా కాదు. నువ్వు ఎవరు.. నీ కథ.. " అంటుంది పార్వతమ్మ.
అడ్డై..
"నాదేముందమ్మా. వదిలేయ్. నీది చెప్పు." అన్నాడు శ్రీరమణ.
"లేదు బిడ్డా. నువ్వు చెప్పందే నాది చెప్పను." నికరంలా అంది పార్వతమ్మ.
శ్రీరమణ ఏమీ అనలేదు. మాత్రం చిన్నగా నవ్వేడు.
"చెప్పరా నాన్నా." బతిమలాట అందుకుంది పార్వతమ్మ.
"సర్లే. ముందు నీది కానీ." అనేసాడు శ్రీరమణ.
"నాది చెప్తాను. తర్వాత నీది చెప్పాలి. లేదా నేను చచ్చిన ఒట్టే." అనేసింది పార్వతమ్మ.
"అయ్యో. అయ్యయ్యో. అంతగా అనకు అమ్మా." గబుక్కున అన్నాడు శ్రీరమణ.
"ఐతే.. నాది చెప్తే.. నీది చెప్తావా." ఆశ పడుతుంది పార్వతమ్మ.
"సర్లే. కానీ." ఒప్పేసుకున్నాడు శ్రీరమణ.
"నాదేముంది నాయన. నేను.. వయసులో ఉండగా ఒకర్ని ప్రేమించాను. వాడిని నమ్మి.. వాడితో.. నా వాళ్లను వదిలేసి.. ఊరు విడిచి వచ్చేసాను. వాడు కొన్నాళ్లు సరిగ్గా తిరిగాడు. తర్వాత.. నా ఒంటి మీద బంగారంను తస్కరించి పరారి అయ్యాడు. నేను వెను తిరగలేక.. ఓ హోటల్లో పనికి కుదిరాను. అలా కాలం గడిచేక.. సొంతంగా ఆ చిన్న పాక వంటల కొంప పెట్టుకోగలిగాను.. ఏదో నడుపుతున్నాను.. బతుకుతున్నాను." చెప్పడం ఆపేసింది పార్వతమ్మ.
"నువ్వు భేషైన దానివి అమ్మా" పొంగిపోయాడు శ్రీరమణ.
పార్వతమ్మ ఏమీ అనలేదు.
"కష్టంకి జంకని వాళ్లంటే నాకు భలే మక్కువ" చెప్పాడు శ్రీరమణ.
తల తిప్పి.. శ్రీరమణనే చూస్తుంది పార్వతమ్మ.
అంతలోనే హాస్పిటల్ చెంత కారు ఆపాడు శ్రీరమణ.
"రాత్రికి నాది చెప్తాలే" అనేసాడు.
"రాత్రి భోజనం కాగానే.. తుర్రుమంటావు. పొద్దు ఎక్కుతుండగానే వెళ్లిపోతావు. ఇక ఎప్పుడు చెప్పుతావులే" దిగులు చూపింది పార్వతమ్మ.
"లేదులే అమ్మా. ఈ రాత్రి కారును తీయను లే" చెప్పాడు శ్రీరమణ.
***
ట్యూషన్ ముగిసాక.. తిరిగి పిల్లల్ని తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న శ్రీరమణను ఆపింది సావిత్రి.
"పులిహోర కట్టాను. తీసుకు వెళ్లు." అంది.
రాను రాను శ్రీరమణ మీద మంచి గురి ఏర్పర్చుకోగలిగింది సావిత్రి.
"వద్దలే అమ్మా." అంటున్నాడు శ్రీరమణ.
"లేదు. అమ్మ చేసేది బాగుంటుంది. తీసుకెళ్లు." చెప్పుతుంది అక్కడే ఉన్న ఇంద్రజ.
శ్రీరమణ కాదనలేక పోయాడు.
సావిత్రి ఇచ్చిన బాక్సును పుచ్చుకున్నాడు.
"ఈ మధ్యలానే నేను రేపు సాయంకాలమే వస్తాను. అప్పుడే బాక్సు తెస్తాను అమ్మా" చెప్పాడు.
"అలానేలే" నవ్వేసింది సావిత్రి.
***
రాత్రి భోజనాల తర్వాత.. వంట పాత్రలు తోమి.. వాటిని పక్కన చేర్చేక.. పార్వతమ్మ వచ్చి శ్రీరమణ ఎదుట కూర్చుంది.
"అమ్మా.. చూస్తున్నా. రెండు పూట్ల కలుపుకొని పది మంది వరకే భోజనాలకి వస్తుంటారు. నీకు కిట్టుబాటు అవుతుందా." అడిగాడు శ్రీరమణ.
"అవుతుంది. చాల్లే. అంతకంటే ఎక్కువ మదుపు పెట్టలేను.. శ్రమ అవ్వను. పైగా ఆ వచ్చిన వాళ్లకి నచ్చింది.. వాళ్లు అడిగింది వండి పెట్టగలుగుతున్నానుగా. నాకు ఆ తృప్తే చాలు." చెప్పింది పార్వతమ్మ.
ఆ వెంబడే..
"నాకు దాపుడు అవసరం ఏముంది. ఈ కట్టె చల్లగా ఒరిగిపోతే చాలు." గొణిగింది.
శ్రీరమణ నొచ్చుకుంటున్నాడు.
అప్పుడే..
"సర్లే కానీ.. నాకు నీది చెప్పడం కోసరమే ఈ రాత్రి పూట పనికి పోలేదుగా. మరి చెప్పు." అంది పార్వతమ్మ.
చిన్నగా నవ్వేస్తూ.. తనది చెప్పడం చేపట్టాడు శ్రీరమణ.
"అది పల్లెటూరు.
సోములు అనే వ్యక్తి ఉండేవాడు.
అతడికి తల్లి ఉండేది.
అతడి చిన్నప్పుడే.. అతడి తండ్రి చచ్చిపోయాడు.
అతడికి.. తన తండ్రి కూడేసిన ఒక పావు ఎకరం పొలంతో పాటు.. చిన్న పాకిల్లు కూడా ఉండేది.
సదరు సోములు.. పొలంను బాగుగా సాగు చేసుకుంటూ.. తల్లిని చక్కగా సాకు కుంటూ కలివిడిగా ఉండేవాడు.
ఆ పల్లెటూరులోనే.. ఊరి పెద్దగా చలామణి అవుతుండే ఒక మోతుబరి ఉండేవాడు.
వాడి అకృత్యాలకు అడ్డు ఆపులు ఉండేవికావు.
అట్టి వాడు.. తన పొలాలకు ఆనుకొని ఉన్న సోములు పావు ఎకరం పొలం మీద.. ఒక నాడు చూపు చారించాడు. దానిని తన పొలల్లోకి చేర్చుకో తలిచాడు.
సోములు పోరాడలేకపోయాడు. చివరికి చితికిపోయాడు.
ఆ మోతుబరి కుక్కిన కూసింత ముదరా సొమ్ముతో.. తన పాక అమ్మకంతో ముట్టిన మొత్తంతో.. తన తల్లిని తీసుకొని ఆ ఊరును విడిచాడు.
ఒక మధ్యస్ధ మాదిరి పట్నం లాంటి ఊరి పంచన చేరాడు.
ఈ అవస్థలు తాళలేక అతడి తల్లి ఉసూరుమంటూ జబ్బున పడింది.
తల్లి వైద్యంకు బాగానే డబ్బు హెచ్చించాడు సోములు.
అతడి చేతిలోని డబ్బు కరిగింది కానీ.. అతడి తల్లి అతడికి దక్కలేదు.
తను ఒక రోజున చచ్చింది.
సోములు ఒంటరి అయ్యాడు.
రోజు వారీ కూలీగా మారాడు.
పగలులు పనులు..
రాత్రులు పనుల చోటనే నిద్రలు..
తిళ్ల బళ్ల చెంత కడుపు నింపుకోవడాలు..
అతడి నిత్యకృత్యాలు అయ్యాయి.
అతడు కాలానికి ఎదురీదుతున్నాడు.
ఐనా.. మంచిని మరవడం లేదు.. ఓర్మిని వీడడం లేదు.. ఒబ్బిడిని మీరడం లేదు.
అట్టి సోములు.. ఒక ఆడది కంట పడ్డాడు.
ఆవిడకి సోములు ఒంటి వాలకం కంటె వాటం బాగా మెప్పించగలిగింది.
అంతే.. కన్నెసిన ఆవిడ బరితెగించింది.
సోములు మగ సొత్తును తడవ తడవగా వాడేసుకుంది. సోములును తండ్రి చేసేసింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments