top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9


'Amavasya Vennela - Episode 9 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది.

చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు. పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ.చంద్రికను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళతారు. ఆమె తొందరగా రికవర్ అవుతోందని చెబుతారు డాక్టర్..

మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ.

తన టాక్సీ ఎక్కి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న రంగాను మధ్యలోనే దింపేస్తాడు.

ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 9 చదవండి

మర్నాడు..

ఎప్పటిలాగే పార్వతమ్మ నిద్ర లేచి బయటికి వచ్చింది. ఇంకా శ్రీరమణ నిద్ర పోతుండడం చూసి భీతయ్యింది.

ఫోన్ మోగుతుండగా.. శ్రీరమణ మగత నిద్ర నుండి లేచాడు. ఆ ఫోన్ కాల్ కి కనెక్టయ్యాడు. అటు గొంతు విని.. "అబ్దుల్ అన్నా" అన్నాడు.

"రాత్రి వెళ్లిన కిరాయి నుండి వచ్చేసావా బాయ్" అటు నుండి అబ్దుల్ అడిగాడు గబగబా.

"వచ్చేసాను." చెప్పాడు శ్రీరమణ.

ఆ వెంబడే.. అబ్దుల్ ఆతృతను గుర్తించి..

"ఏం.. అబ్దుల్ అన్న." అడిగాడు.

"ఇప్పుడే టాక్సీ స్టాండ్ లో అనుకుంటుంటే విన్నాను. రాత్రి నువ్వు వెళ్లే దారిన పోలీసులకు బేగ్ నిండా ఏవో మత్తు మందు పౌడర్ పేకెట్స్ దొరికాయట. ఎవరూ దొరకలేదట. దాంతో అటు ట్రాఫిక్ ని నిలిపేస్తూ చెకింగ్ లు చేస్తున్నారట.. ఆపిన బళ్లను ఆపినట్టే పక్కన ఉంచేస్తున్నారట." చెప్పుతున్నాడు అబ్దుల్.

'హమ్మయ్య.' అప్పటికి కుదురు కాగలిగాడు శ్రీరమణ.

"అవునా. నేను రాత్రే వచ్చేసాను. స్టాండ్ కు వస్తాను." చెప్పాడు పొడి పొడిగా.

ఆ వెంబడే..

అబ్దుల్ ఫోన్ కాల్ ను కట్ చేసేసాడు.

***

హాస్పిటల్ లో..

చంద్రికను పరీక్షించిన డాక్టర్..

"చాలా బెటర్మెంట్ ఉంది. త్వరలో తేరుకుంటుంది. ఇప్పటిలాగే మీ ప్రయత్నం కానీయండి. ఇక.. నీళ్లు.. పళ్ల రసాలు తాగించే ప్రయత్నం చేస్తుండండి." చెప్పాడు.

సావిత్రి తలూపింది.

ఇంద్రజ కుదురుగా ఉంది.

"తను తేరుకునే వరకు మీ వాళ్లను ఇప్పటిలాగే ఇంటికి పంపుతుండండి డాక్టర్." చెప్పాడు శ్రీరమణ.

"తప్పక మా వైపు వైద్యం అందుతోంది. మీరు నిదానంగా తిరిగి ఆమెను ఇంటికి తీసుకు వెళ్లండి." నవ్వేడు డాక్టర్.

***

మధ్యాహ్నం భోజనం వడ్డిస్తూ..

"రాత్రి చాలా ఆలస్యమైనట్టు ఉంది. కిరాయి కిట్టుబాటుగా ముట్టిందా." శ్రీరమణని అడిగింది పార్వతమ్మ.

"ఆఁ అమ్మా." అనేసాడే తప్పా.. రాత్రిది ఎవరికీ చెప్పుకోలేదు శ్రీరమణ.

"రాత్రి సరిగ్గా నిద్ర లేదుగా. భోజనం తర్వాత కొద్ది సేపైనా నడుము వాల్చు నాయనా." ప్రేమగా అంది పార్వతమ్మ.

"లేదమ్మా. వెళ్తాను. ఈ రాత్రికి మాత్రం పనికి వెళ్లను. రాత్రి భోజనం అయ్యేక నిద్ర పోతాను." టూకీగా చెప్పాడు శ్రీరమణ.

"ఆ పనైనా చేయి." పార్వతమ్మ కుదుట పడింది.

***

వారం రోజుల తర్వాత..

కిరాయితో కారులో ఉండగా.. శ్రీరమణ ఫోన్ మోగింది. కారును స్లో చేసి.. ఆ కాల్ కు కనెక్ట్ అయ్యాడు.

"చెప్పమ్మా." అన్నాడు.. అటు సావిత్రి అని గుర్తించి.

"రమణ.. చంద్రికను కూర్చుండ పెట్టి.. తాగిస్తే.. నెమ్మది నెమ్మదిగా ఐనా.. గ్లాసుడు బత్తాయి జూస్ తాగేసింది." చెప్పుతుంది సావిత్రి. ఆమె మాటల నిండా ఆనందం తెలుస్తుంది.

శ్రీరమణ హాయయ్యాడు. కారును మరింత స్లో చేసాడు.

"నేను కారు తోలుతున్నాను. కస్టమర్స్ దిగేక.. ఇంటికి వస్తాను." చెప్పాడు.

"అలానే. లేదంటే సాయంకాలం పిల్లల్ని తీసుకు వస్తావుగా. ఏదో నీకు వెంటనే చెప్పేయాలని.. ఇలా ఫోన్ చేసేసాను." చెప్పింది సావిత్రి.

"అవునవునా. ఐతే. సాయంకాలం కలుస్తాను." చెప్పాడు శ్రీరమణ.

సావిత్రి కాల్ కట్ చేసేసింది.

***

నాలుగు రోజుల తర్వాత..

శ్రీరమణకై సుబ్బారావు టాక్సీ స్టాండ్ కు వచ్చాడు. అంతకు ముందు సుబ్బారావు.. శ్రీరమణకి ఫోన్ చేసాడు.

శ్రీరమణ.. టాక్సీ స్టాండ్ లో ఉన్నానని చెప్పగా.. "అక్కడే ఉండవా. నేను నిన్ను కలవాలి." చెప్పాడు సుబ్బారావు.

'సరే' అన్నాడు శ్రీరమణ.

ఆ కాల్ తర్వాత.. ఇరవై నిముషాల లోపే.. సుబ్బారావు వచ్చి.. శ్రీరమణను కలవగలిగాడు.

శ్రీరమణ.. సుబ్బారావుకు టీ ఇప్పించాడు. ఆ ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

ఆ మాటల నడుమ.. "వెంకట్ ఉద్యోగం ఒదులుకొని తన ఊరు వెళ్లి పోయాడు." చెప్పాడు సుబ్బారావు.

"ఏం." విస్మయమయ్యాడు శ్రీరమణ.

"వాడి నాన్నకు యాక్సిడెంట్ అని తెలియగా.. ఎకాఎకీన వెళ్లాడు. తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. తన వాళ్లకు తోడుగా ఉంటూ.. అక్కడే ఏదో తంటాలు పడతాడట. తిరిగి రాలేననేసాడు. నీకు స్వయంగా కలిసి.. నన్ను ఇవి చెప్పమన్నాడు. నాకు కుదరక వెంటనే నిన్ను కలిసి చెప్పలేక పోయాను." చెప్పాడు సుబ్బారావు.

"నాకు వాడు ఫోన్ చేయవలసింది." అన్నాడు శ్రీరమణ.

"అప్పటి నుండి వాడు నిన్ను ఫేస్ చేయడానికి జంకుతూనే ఉన్నాడు." చెప్పాడు సుబ్బారావు.

"సర్లే. నేను కాల్ చేసి వాడితో మాట్లాడతా." చెప్పాడు శ్రీరమణ.

ఖాళీ టీ గ్లాసులను పక్కన పెట్టేసి.. ఆ టీ స్టాల్ నుండి బయటికి వచ్చారు ఆ ఇద్దరు.

"గిరి ఎలా ఉన్నాడు." అడిగాడు శ్రీరమణ.

"బాగున్నాడు." చెప్పాడు సుబ్బారావు.

"మీ ఇద్దరు కలిసే ఉంటున్నారా." అడిగాడు శ్రీరమణ.

"ఆఁ." అన్నాడు సుబ్బారావు.

అప్పుడే.. కిరాయికి ఎవరో రావడంతో.. శ్రీరమణ అటు తిరిగాడు.

"మరి నేను వెళ్తాను. మళ్లీ కలుద్దాంలే." అనేసి సుబ్బారావు కూడా వెను తిరిగాడు.

***

రెండు రోజుల తర్వాత..

మధుసూదన్ ఇంటి ముందు కారు ఆపాడు శ్రీరమణ.

డ్రయివింగ్ వైపు ఉన్న సాగరను చూస్తూ.. "బై మేడమ్." అన్నాడు.

"గెట్ డౌన్ టూ. డాడీ వాన్ట్స్ టు టాక్ టు యు. హి ఆస్క్డ్ మి టు బ్రింగ్ యు బేక్." చెప్పి.. కారు దిగింది సాగర.

శ్రీరమణ కూడా కారు తిగేసాడు.

"కమ్." అంటూ ఇంటి వైపు కదిలింది సాగర.

డోర్ బెల్ నొక్కింది. లక్ష్మి తలుపు తీసింది.

తన వెనుకే ఉన్న శ్రీరమణతో.. "కమ్ ఇన్." అంటూ సాగర ఇంటి లోకి నడిచింది.

"ఇంటిలోకి రా రమణ. సార్ నీతో మాట్లాడవలసింది ఉంది." చెప్పుతుంది లక్ష్మి చిన్నగా నవ్వుతూ.

శ్రీరమణ మొహమాటం పడుతూనే ఆ ఇంటిలోకి నడిచాడు.

హాలులో..

సోఫాలో మధుసూదన్ కూర్చుని ఉన్నాడు. తండ్రి పక్కన కూర్చుంది సాగర.

శ్రీరమణని చూసి.. "అలా కూర్చో రమణ." చెప్పాడు మధుసూదన్.. చేతిలోని పుస్తకంని టీపాయ్ మీద పెడుతూ.

లక్ష్మి అక్కడి సింగిల్ సోఫా కుర్చీలోకి చేరింది. శ్రీరమణ నిల్చునే ఉన్నాడు.

"అరె. అలా కూర్చో." మరో సింగిల్ సోఫాను చూపిస్తూ చెప్పాడు మధుసూదన్.

శ్రీరమణ ఇబ్బందవుతూనే.. "లేదు.. చెప్పండి." అన్నాడు.

అప్పుడే.. "సిట్ డౌన్." ఆర్డర్ లా అంది సాగర.

శ్రీరమణ ఆ సింగిల్ సోఫాలో ఒబ్బిడిగా కూర్చున్నాడు.

"అమ్మాయి చెప్పుతుంది. తనకు డ్రయివింగ్ బాగా వచ్చేసిందని. నువ్వు.." మాట్లాడుతున్న మధుసూదన్ కు..

అడ్డై..

"డాడ్.. ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. హి నోస్ హవ్ మచ్ హి యాజ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫ్రమ్ మి." గొప్పగా అంది సాగర.

మధుసూదన్ అడగడం ఆపి.. చిన్నగా నవ్వేసి..

"ఓకే ఓకే బేబి. రమణ.. అవర్ గర్ల్ యాజ్ లెర్న్డ్ టు డ్రయివ్ వెల్. యువర్ వర్డ్ ఈజ్ ఫైనల్." అన్నాడు శ్రీరమణను చూస్తూ.

శ్రీరమణ సర్దుకుంటూ.. "సార్.. చాలా బాగా నే.." చెప్పుతున్నాడు.

సాగర గమ్మున.. "హే.. ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్." అంది, శ్రీరమణ మీద చూపు నిలిపి.

లక్ష్మి సన్నగా నవ్వింది.

శ్రీరమణ తెములుకుంటూ.. "సర్.. కెన్ లెర్న్ వెరీ వెల్." చెప్పాడు.

అప్పుడు.. అతడి చూపు సాగర వైపున తచ్చాడుతుంది.

సాగర చిన్నగా నవ్వుకుంటుంది.

"గుడ్.. ది రీజన్ ఫర్ కాలింగ్ యు లైక్ దిస్.. మై డాటర్ ఈజ్ బైయింగ్ ఎ కార్. కెన్ ఐ బై ఇట్ ఫర్ హెర్.." శ్రీరమణని అడిగాడు మధుసూదన్.

"హా.. యు కెన్ బై ఇట్ అండ్ గివ్ ఇట్ టు హెర్." చెప్పాడు శ్రీరమణ.

ఆ వెంబడే..

"సర్.. బిఫోర్ థట్ యు స్టే ఇన్ ద కార్ వైల్ యువర్ గర్ల్ ఈజ్ డ్రయివింగ్. యు విల్ ఫీల్ కాన్ఫిడెంట్.. ప్లీజ్." అన్నాడు.

"నో నో. ఐ హేవ్ ఎ లాట్ ఆఫ్ ఫైత్ ఇన్ యు." నవ్వేడు మధుసూదన్.

అప్పుడే.. "రమణ చెప్పింది బాగుంది. మనం అమ్మాయి డ్రయివింగ్ లో కొంత మేరకు కారు పయినం చేద్దాం." అంది లక్ష్మి.

"అంతే అంటావా." అన్నాడు భార్యను చూస్తూ మధుసూదన్.

'అంతే' అన్నట్టు తలాడించింది లక్ష్మి.

"సరే.. ఇప్పుడే వెళ్దాం." అన్నాడు మధుసూదన్.

ఆ వెంబడే..

సాగరను చూస్తూ.. "వాట్స్ అప్ బేబీ." అన్నాడు.

"ఐ యామ్ రడీ." లేచి నిల్చుంది సాగర.

ఇంటికి తాళం పెట్టి.. ఆ నలుగురూ శ్రీరమణ కారు ఎక్కారు.

డ్రయివింగ్ సీట్ లో సాగర.. ఆ పక్క సీట్ లో శ్రీరమణ.. బేక్ సీట్లలో మధుసూదన్, లక్ష్మి కూర్చొని ఉన్నారు.

సాగర కారు స్టార్ట్ చేసింది.

దారిలో..

"రమణ.. ఈ కారుకు రోజు వారి అద్దె ఎంత కడుతున్నవని చెప్పావు." అడిగాడు మధుసూదన్.

శ్రీరమణ చెప్పాడు.

"నీకు రోజుకు ఏం మిగులుతుంది.. నీ కష్టమే ఎక్కువ." అన్నాడు మధుసూదన్.

శ్రీరమణ ఏమీ అనలేదు.

గంట తర్వాత..

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






109 views0 comments

Comentários


bottom of page