top of page

సడి


'Sadi - New Telugu Story Written By Ashok Anand

'సడి' తెలుగు కథ

రచన: అశోక్ ఆనంద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

‘ఓడిపోయావ్.. ఐదు రూపాయలు తీయ్’ అని చెస్ బెట్టింగులో ఓడిపోయిన సాయి వైపు చేయి చాచి అడిగింది ఎదురుగా కూర్చున్న దీపిక.

సాధారణంగా సాయి ఎప్పుడూ బెట్టింగులకి చెస్ ఆడడు. ఓడిపోతాడనే భయంతో కాదు. అవసరంలో ఉన్నవారికి అనవసరమైనవి దగ్గరగా, అవసరమైనవి దూరంగా ఉంటాయన్న సిద్ధాంతం సాయికి బాగా తెల్సు.


మొదటిసారి దీపిక అడగడంతో కాదనలేక ఐదు రూపాయల పందెంకి ఆడాడు. అంతకంటే ఎక్కువ డబ్బులకి ఆడితే సాయి ఎప్పుడూ తినే రెండు ఇడ్లీ ఆ రాత్రి మానేయాల్సొస్తుంది.


ఐదు రూపాయల బిళ్ళను తీసి దీపిక చేతిలో పెట్టాడు. వంటగదిలో గిన్నె లోంచి ఒలుకుతున్న కాఫీను రెండు కప్పుల్లో బంధించి, మేడ మీదున్న దీపికకు ఒక కప్పు అందించి పక్కనే కూర్చున్నాడు సాయి.

ప్రేమించే మనిషి పక్కనున్నప్పుడు మాటలనెందుకు వారధులు చేయడమని మౌనంగా ఒకరినొకరు చూస్కుంటున్నారు. బాహ్య ప్రపంచానికి కనిపించని గాంభీర్యం, వాళ్ళిద్దరి ఆలోచనల కౌగిళ్ళలో సందడి చేస్తుంది.

పని లేని సమయం కాలుగాలిన పిల్లిలా పరుగెడుతుంది. 'సరే ఇక నే బయల్దేరతాను' అని లేవబోయింది దీపిక. తను వెళ్ళడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు సాయికి. కానీ తప్పదు. ఆరోజు సాయిని చూడ్డానికి దాదాపు ఐదు గంటలు ప్రయాణం చేసొచ్చింది. ఆ క్షణానికే దీపికకు ఉన్న గడువు దాటిపోతూంది. తను తిరిగి 'చాలా దూరం' ప్రయాణం చేయాల్సిన సమయమది.

'ఉండిపో' అనే పదానికి వ్యుత్పత్యర్థం ఇదేనేమో అన్న గొంతుతో 'మళ్ళీ ఎప్పుడొస్తావ్' అనడిగాడు.

'నా పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా, అప్పుడొచ్చేస్తానే.. కథలు చెప్పుకుందాం, చెస్ ఆడుకుందాం' అన్న దీపిక పదాల కంటే, విప్పారిన పెదాలే సాయి చెవులను ముందుగా తాకాయి. సాయికి చెవులపై పెట్టే ముద్దంటే మహా ప్రేమ. సముద్రపు లోతుల్లో సృష్టించబడ్డ శంఖపు సంగీతాన్ని చెవులకు ఆన్చి వినడం ఒకప్పుడు సాయికి బాగా ఇష్టమైన పని. దీపిక పరిచయమయ్యాక సాయి దగ్గరున్న శంఖం అనాధ అయ్యింది.

దీపిక బయల్దేరి అరగంట పైబడింది.

గదిలోకి వెళ్ళిన సాయికి శబ్దం చేస్తూ, చెస్ బోర్డ్ పై ఓ లెటర్ కవర్ కనిపించింది. అలవాటైన పనైనా సరే అదే అత్యుత్సాహం చూపిస్తూ వెళ్ళి చేతినందుకున్నాడు. దీపిక పరిచయమైన నాలుగేళ్ళ నుంచీ, కలిసిన ప్రతిసారి లోకం మర్చిపోయిన కళ ప్రతిబింబించేలా తన స్వహస్తాలతో ఏదోటి తయారుచేసివ్వడం దీపికకు అలవాటు. ఈసారి అందులో మందంగా ఉన్న ఒక పసుపు పచ్చని కాగితంపై దీపిక అర చేతి ఆకారం గీసి ఉంది.


'నీ ఒంటరితనం నాకు తెలుసు. శారీరకంగా నేను నీ పక్కన లేని ప్రతిసారి, నీ చీకటి విశ్వంలో నా చెయ్యి నీ తోడుగా ఉంటుంది. నన్నెప్పుడు మిస్సవుతున్నట్లు అనిపించినా ఆ శంఖాన్ని చెవులపై, నీ అరచేతిని నా అరచేతిపై ఆన్చి మౌనంగా నిద్రపో. మరుక్షణం అలల హోరునై నీ హృదయంలో ప్రతిధ్వనిస్తా' అని రాసి ఉంది.


దాంతో పాటు ఆ కవరుకు ఒక వెయ్యి రూపాయల డబ్బు జత చేసి ఉంది.

మొదటిసారి నాలుగేళ్ళ క్రిందట దీపిక ఇలా డబ్బునివ్వడం జాలిగా భావించి బాధ పడ్డాడు. చిన్నప్పుడు నుంచీ సాయికి స్నేహితులు లేరు.

'ఆడు మన దగ్గర తినడం తప్ప, ఎప్పుడూ రూపాయి బయటకి తీయడు' అన్న స్నేహితుల గునపాలు పదేళ్ళ ముందు సాయి గుండెల్ని చీల్చినప్పుడే లోకంతో తెగదెంపులు చేసుకుని, కవిత్వాలతో కాపురం పెట్టాడు.

సాయికి డబ్బు మీద ఆశే ఉంటే చెస్ పందెంలో ఓడిపోయేవాడే కాదు.

పిసినారితనానికి, పేదరికానికి మధ్య తేడా తెల్సిన దీపిక అతని జీవితంలోకి వచ్చాక, 'తను నాపై దయ చూపడం లేదు, ధైర్యాన్ని నింపుతోంది' అని అర్థమైంది సాయికి.

హిమాలయాలు చూసాడు, తాజ్ మహల్ చూసాడు, కన్యాకుమారిలో సూర్యోదయం కూడా చూసాడు. చూడడమేంటి, తాకాడు. అవును. మీరు తాకగలరా సూర్యుణ్ణి? అవసరమైతే ఇంకో సూర్యుణ్ణి సృష్టిస్తాడు. అక్షరాల మధ్య నుంచి అనంత విశ్వాన్ని చూసిన సాయికి.. హిమాలయాలను, కన్యాకుమారిలో ఉదయించే సూర్యుణ్ణి, తాజ్ మహల్ను ఆరు బయట అడుగు పెట్టకుండానే అనుభవించిన సాయికి, తన చీకటి గదిలో పదివేల పుస్తకాల మధ్య కుంచె పట్టి సమాంతర విశ్వాన్ని సృష్టించడం ఒక లెక్క? కళను కళ్ళతో చూడాలంటే ఖర్చు అవుతుందేమో గానీ, కళను సృష్టించే వాడికి డబ్బు గురించి బెంగ ఎందుకు!


వెధవ డబ్బు. అసలు ఎవడికి కావాలి బోడి డబ్బు. కళను సృష్టించే శక్తి లేనోడికి కావాలి. ప్రపంచంతో పరుగులెత్తే వాళ్ళు, ఆత్మ గల హృదయం లేని వాళ్ళు, రేపటి కోసం భయపడే పిరికివాళ్ళు వెంపర్లాడతారు డబ్బు చుట్టూ. ప్రాణమున్న మనిషిని, ప్రాణం లేని డబ్బు శాసించడమా! అవివేకుల పని. సాయికి నవ్వొస్తుంది కలియుగాన్ని చూస్తుంటే.


ఆ సాయంత్రం..

బోరుమని కురుస్తున్న వర్షం కంటే వేగంగా పరిగెడుతుంది దీపిక నడుపుతున్న బండి. ఆకాశానికి కోపమొచ్చింది. భువిపైకి పిడుగొచ్చింది. రెప్పపాటు క్షణంలో అయిదు కేజీల అస్థికలపై అయిదు రూపాయల బిళ్ళ విలయ తాండవమాడింది.

దీపిక పుట్టినరోజు వచ్చింది. సాయికి బాధ లేదు. ఎందుకు బాధ పడాలి? వస్తా అని, చెస్ ఆడుతా అని మాటిచ్చి మోసం చేసి వెళ్ళిపోయిన దీపికపై, సాయి కన్నీళ్ళు కోపంగా ఉన్నాయి.


దీపిక పరిచయం అవ్వని ముందు వరకూ సాయికి ఒంటరిగా చెస్ ఆడుకోవడం అలవాటు. ఎదురుగా పేర్చి ఉన్న చెస్ బోర్డుపై తన వైపున్న తెలుపు పావును జరిపాడు. పాపం కోపాన్ని ఒడిసి పట్టుకోలేకపోయింది వెర్రి కన్నీరు.


లేచి వెళ్ళి శంఖాన్ని, పసుపు పచ్చని ఉత్తరాన్ని తెచ్చుకున్నాడు.

అరచేతిని మౌనంగా స్పృశించాడు. శంఖాన్ని చెవులపై ఆన్చి ఉంచాడు. ఉన్నపాటుగా హోరుగాలి. కానీ శంఖం నుంచి కాదు. బయట నుంచి. కిటికీ రెక్కలు మూసి వద్దామని లేచాడు. వెళ్ళాడు. తిరిగొచ్చాడు. నిలబడి నివ్వెరబోయాడు... చెస్ బోర్డుపై ఆ వైపునున్న నలుపు పావు జరిపి ఉంది.


***

అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అశోక్ ఆనంద్.

రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త


48 views0 comments
bottom of page