top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 12


'Amavasya Vennela - Episode 12 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ. సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది. శ్రీరమణకు సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తానంటాడు మధుసూదన్.


హంస అనే ఆవిడను హాస్పిటల్ లో చేర్చడంలో సహాయం చేస్తాడు శ్రీరమణ.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 12 చదవండి


శ్రీరమణ కిరాయిలో ఉండగా..

అతడి ఫోన్ మోగుతుంది.

ఆ ఫోన్ ను చేతిలోకి తీసుకున్నాడు. వస్తున్న కాల్ కి కనెక్ట్ అయ్యాడు.

"చెప్పండి." అన్నాడు.


"నేను హంసని. నీ కారులోనే ఇందాక నన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్లి.. తీసుకు వచ్చావు." చెప్పింది హంస.


"ఓ. మీరా. చెప్పమ్మా." అన్నాడు.


"నీతో మాట్లాడాలని ఫోన్ చేసాను." చెప్పుతుంది హంస.


అడ్డై..

"అమ్మా.. కిరాయికి కారు డ్రయివ్ చేస్తున్నా. కొంత సేపు తర్వాత మాట్లాడ వచ్చా." అడిగాడు శ్రీరమణ.


"సరే. ఖాళీ అయ్యేక ఫోన్ చేస్తావా." అడిగింది హంస.


"సరే అమ్మా." అనేసాడు శ్రీరమణ.

హంస ఆ కాల్ కట్ చేసేసింది.


***

తమ ఇంటి హాలులో.. తనంతట తానుగా.. అటు ఇటు నిదానంగా తిరుగుతుంది చంద్రిక.

ఆమెకు దగ్గరగానే ఇంద్రజ కూడా.. చంద్రికతో పాటు తిరుగుతుంది.

మంచం అంచున సావిత్రి కూర్చుని ఉంది.


"ఇంద్రా.. సాయంకాలం ట్యూషన్ కై పిల్లల్ని తీసుకు వస్తాడుగా రమణ. అప్పుడు అతడిని అడుగుతాలే." చెప్పింది చంద్రిక.


"అక్కా.. నువ్వే మాట్లాడాలి. అమ్మది తొందర తొందర. నువ్వే పని అయ్యేలా చూడవే." చెప్పింది ఇంద్రజ.


"ప్రయత్నిస్తాను." చెప్పింది చంద్రిక.


ఆ వెంబడే..

"మీ ఇద్దరు.. లేదా కనీసం నువ్వు ఐనా.. ఇప్పటికే అడిగేయ వలసిందే." అంది.


"బిడియం అక్కా. ఇప్పటికే ఎన్నెన్నో మనకి చేసి పెడుతున్నాడు. మనని తన మనుషులుగా చూసుకుంటున్నాడు. ఇంకా నాకంటూ ఎలా ఇబ్బంది పెడతాను." చెప్పింది ఇంద్రజ.


సావిత్రి శ్రోతలా మెసులుతుంది.

"అవును. నాకు స్పృహ వచ్చినప్పటి నుండి.. నాకు ఎఱిక అవుతుందిగా. ఆ రమణ మనను బాగా ఆదుకుంటున్నాడు. ఇదేమిటో నాకు బోధ పడకుంటుంది.. దేనికో కూడా అర్ధం కాకుంటుంది." అంది చంద్రిక.


ఆ వెంబడే..

"నిజానికి నా ఈ స్థితికి రమణ కారణం కాదు. ఆ రాస్కెల్ కామేశం. అతడి విషయం నేను చెప్పేదాక మీకు తెలియదు. మీరు రమణని అనుమానించారు. కానీ ఆ మనిషి మంచోడు కనుక.. గొప్పగా చేయూత ఇచ్చాడు." చెప్పుతూ ఆగింది.

మిగతా ఇద్దరూ ఏమీ అనలేదు.


"నేను మాట్లాడగలిగాక.. కామేశం గురించి చెప్పి.. 'నీ తప్పు లేదు' అనినా.. రమణ తప్పుకోలే. తన సాయంని కొనసాగిస్తూనే ఉన్నాడు. మన అదృష్టం. రమణ కాకపోతే మరొకరితో మనం ఇలా తేరుకునేది ఉండేదే కాదు. మనం మరీ రమణను పీక్కోవడం సరి కాదు." చెప్పడం ఆపింది చంద్రిక.


సావిత్రి తల దించుకుంటుంది.

"అక్కా.. ఆగిపోకు.. నడుస్తుండు. డాక్టర్ చెప్పారుగా.. ఒంటికి నడక ఒక వ్యాయామము లాంటిదని." చెప్పుతుంది ఇంద్రజ.

నిల్చిన చంద్రిక తిరిగి నడక మొదలెట్టింది.


ఇంద్రజ తిరిగి కదిలింది.

"నాకా చూపు లేదు. ఇక ఏదీ నాకు చేత కాదేమో. నేను ఉన్నా మీ ఇద్దరికీ నేను భారమే." నసిగినట్టు అంటుంది చంద్రిక.


సావిత్రి తలెత్తింది. చంద్రికనే చూస్తుంది.

ఇంద్రజ నొచ్చుకుంటుంది.

ఆ వెంబడే..

"అమ్మ పనికి అంతంతే ముట్టేది. ఇంద్ర నిలదొక్కుకోవాలి. అదే దిక్కు అవ్వాలి. దాని కోసమేనా రమణని ఇంకా ఇబ్బంది పెట్టక తప్పదు." అనేసింది చంద్రిక.


మిగతా ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.


***

ఖాళీ రావడంతో..

శ్రీరమణ గుర్తుగా హంసకు ఫోన్ చేసాడు.

హంస తన కాల్ కు కనెక్ట్ కాగానే..


"అమ్మా.. నేను.. శ్రీరమణని. కారు డ్రయివర్ ని. ఇందాక నాకు ఫోన్ చేసి మాట్లాడాలి అన్నారు." చకచకా చెప్పాడు.


"ఓ. నీ పేరు శ్రీరమణ." అంది హంస.

శ్రీరమణ ఏమి అనలేదు.


"నీది ఏ ఊరు." టక్కున అడిగింది హంస.


"ఈ ఊరే. చాన్నాళ్లుగా ఇక్కడే ఉంటున్నా." చెప్పాడు శ్రీరమణ.


హంస గబుక్కున మాట్లాడ లేదు.

ఆగి.. "చాన్నాళ్లుగా అంటున్నావు. అంటే.. ముందు నీదేదో ఊరు అయ్యి ఉండొచ్చు. అయితే.. ఆ ఊరు ఏది."

అడగ్గలిగింది.


"అదొక చిన్న ఊరు." అన్నాడు. ఆ ఊరి పేరు చెప్పాడు.


"అవునా. ఆ ఊరు నుండే.. ఈ ఊరు వచ్చేసావా." అడిగింది హంస.


"లేదు లేదు. అది మా నాన్న ఊరు." చెప్పాడు శ్రీరమణ.

హంస ఏమీ అడగలేదు.


"నేను పుట్టింది అక్కడ కాదు." అంటూ తను పుట్టిన ఊరు పేరు చెప్పాడు శ్రీరమణ.


అటు.. గతుక్కుమంది హంస. క్రమేపీ ఆందోళన వైపు నెట్టబడుతుంది.

ఇటు.." హలో.. హలో.." అంటున్నాడు శ్రీరమణ.


విదిలించుకున్నట్టు కదిలి..

"నీకు.. అదే.. అదే.. నీ తల్లిదండ్రులు ఎవరు."

తడబడిపోతుంది హంస.


"నాకు తల్లిదండ్రులు లేరు. నాకు ఎవరూ లేరు." చెప్పాడు శ్రీరమణ.


ఆ వెంబడే..

"ఈ వాకబులు ఏమిటి. మీరు ఎవరు." అడిగేసాడు శ్రీరమణ.


"నీతో మాట్లాడాలి బాబూ.. ఓ మారు ఇంటికి రావా." కోరింది హంస.

శ్రీరమణ ఏమీ అనలేదు. అతడికి అంతా అయోమయంగా ఉంది.

"రా బాబూ. దయచేసి రావా." బతిమలాడుతుంది హంస.

దాంతో.. ఆ తోవనే..


"కలుస్తాను." అనేసాడు శ్రీరమణ. ఆ కాల్ ని తనే కట్ చేసేసాడు.


తనలో హంసను కలవాలన్న ఆత్రం ఉన్నా..

సాయంకాలం అవుతుండడంతో..

పిల్లలను కూడ తీసుకొని.. సావిత్రి ఇంటికి వచ్చాడు శ్రీరమణ.


ఆ పిల్లలకు.. ఆరు ప్రశ్నలు ఇచ్చి.. వాటికి జవాబులు వ్రాయమంది ఇంద్రజ.


ఆ వెంబడే.. తను వరండాలోనించి.. ఇంటి లోకి నడిచింది.

అప్పటికే అక్కడ మంచం అంచున.. సావిత్రి.. ఆవిడ పక్కన చంద్రిక.. కూర్చొని ఉన్నారు.


శ్రీరమణ వాళ్లకు దరినే బల్ల మీద కూర్చొని ఉన్నాడు.

చంద్రిక పక్కకు చేరి.. నిల్చుంది ఇంద్రజ.

ఇంద్రజను చూసి.. ఆమె చేతికి.. తన చేతిలోని దిన పత్రికను అందించాడు శ్రీరమణ.


"ఇంద్రజ.. మూడో పేజీలో బాక్స్ కట్టిన వార్త ఉంటుంది. దానిని చదువు." అన్నాడు.

"ఇంద్రజ వచ్చిందా. ఇంద్ర.. ట్యూషన్ చెప్పవా." అడిగింది చంద్రిక.


"రమణ చెప్పేలా.. పిల్లలకు వర్క్ ఇచ్చి వచ్చాను. ఏదో చదివి పెట్టాలి.. రా.. అన్నాడు." చెప్పింది ఇంద్రజ.


"రమణ.. నువ్వు చదవలేవా." అడిగింది చంద్రిక.


"లేదు. నేను చదువుకో లేదు. చదవ లేను." చెప్పాడు శ్రీరమణ.


చంద్రిక ఏమీ అనలేదు.

శ్రీరమణ చెప్పిన ఆ వార్తను ఇంద్రజ చదివేక..


"చంద్రిక.. నువ్వు ఆ కామేశం గురించి చెప్పేక.. నేను పోలీసులను కలిశాను. విషయం చెప్పాను. వాళ్లు అతడి మీద నిఘా పెట్టారు. వాళ్లకి నిన్న కామేశం రెడ్హేండెడ్ గా చిక్కాడు. పోలీసులు ఆ కామేశంని అరెస్ట్ చేసారు. అదే వార్తగా ఈ రోజు పేపరులో వచ్చింది." చెప్తూ..


తల తిప్పి.. సావిత్రిని చూస్తూ.. "మీకు తెలుసుగా అమ్మ.. నాలా డ్రయివర్ కాశిం. వాడు ఈ వార్తను చూసి నాకు చెప్పాడు. వాడికి నేను కామేశం గురించి చెప్పి ఉన్నాను." చెప్పడం ఆపాడు శ్రీరమణ.


"అవునా. ఆ రాస్కెల్ కి శిక్ష పడాలి. చెత్త మనిషి," విసురుగా అంది చంద్రిక.

ఆ వెంబడే..

"రమణ.. థాంక్స్. మా కోసం నువ్వు చాలా ఇదవుతున్నావు." అంది.


"అవును రమణ.. నీ కోసమే చంద్రిక తెగ తలుస్తుంది. నిజమే.. నీ మేలు మాకు అందకపోతే మేము ఏమైయే వాళ్లమో." కలగచేసుకుంది సావిత్రి.


"అయ్యో. అలా అనుకో వద్దు. నొచ్చుకో వద్దు. మనం మనుషులం." అన్నాడు శ్రీరమణ.


"మనం మనుషులమే. కానీ మనమంతా అలా అనుకుంటున్నామా. అంత వరకు ఎందుకు నీలా మేము మెసులుకుంటామా. అసాధ్యమే.. అనుమానమే." అనేసింది చంద్రిక.


శ్రీరమణ ఏమీ మాట్లాడ లేదు.

మిగతా వాళ్లు మాట్లాడ లేదు.

నిముషం తర్వాత..


"రమణ.. నేను కోలుకుంటున్నాను. మరి.. నువ్వు ఇక్కడికి రావడం ఆగిపోతుందిగా." నెమ్మదిగా అంది చంద్రిక.


శ్రీరమణ ఏమీ అనలేదు. కానీ ఆమెనే చూస్తున్నాడు.


"నిజమే.. ఇకపై నీ వంతు పని ఆపడమే సబబు. ఇంకా నీ నుండి.. నీ సాయం తీసుకోవడం మాకు ధర్మం కాదు.." చెప్పుతుంది చంద్రిక.


"అయ్యో. ఏ అవసరమైనా కబురు తెల్పండి. వస్తుంటాను." చెప్పాడు శ్రీరమణ.


"అది కాదు రమణ. నీ మంచితనాన్ని ఇంకా వాడుకోవడం సరి కాదని.. ఈ అక్కాచెల్లెలిద్దరూ తర్జనభర్జన అవుతున్నారు." కలగచేసుకుంది సావిత్రి.


తల తిప్పి సావిత్రిని చూస్తున్నాడు శ్రీరమణ.


"నువ్వు రావడం ఆగిపోతే.. ఇంద్రజ ట్యూషన్ లు అవకాశం కూడా పోతుందని వీళ్లు హైరానా అవుతున్నారు." చెప్పింది సావిత్రి.


" లేదు లేదు. దాని గురించే ఇంకా మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అంతలోనే మీరే అనేసారు." చెప్పాడు శ్రీరమణ.


అతడు చెప్పబోయే దానికై వేచి ఉన్నారు ఆ తల్లి కూతుళ్లు.

"ఆ రోజు పోలీసులు నుండి తీసుకున్న.. చంద్రిక స్కూటీని.. సరి చేసి పెట్టి.. మీకు ఇచ్చి ఉన్నానుగా. అది మంచి కండీషన్ లో ఉంది. దాని మీద ఇంద్రజ వెళ్లి పిల్లలకు ట్యూషన్స్ చెప్ప వచ్చు.." అంటూ ఆగి..

ఇంద్రజను చూస్తూ.. "అన్నట్టు.. నువ్వు స్కూటీ తిప్పగలవా." అడిగాడు శ్రీరమణ.


"నాకు వచ్చు." చెప్పింది ఇంద్రజ.


"మరేం. ఇంద్రజ ట్యూషన్ పని పోదు. నేను ఇంద్రజను తీసుకు వెళ్లి.. ఆ పిల్లల పేరెంట్స్ కు పరిచయం చేస్తాను. ఇక్కడికి వస్తున్న పిల్లలు ఒకే చోటు వారు. అక్కడికి వెళ్లి.. ఇంద్రజ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు." చెప్పాడు శ్రీరమణ.


ఇంద్రజ కుదురయ్యింది.

చంద్రిక రీతిగా ఊపిరి పీల్చుకుంది.

సావిత్రి ఏమీ అనలేదు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

104 views0 comments

Comments


bottom of page