top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' పార్ట్ 11


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 11' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 11' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.


అతని పిల్లల స్కూల్ అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానంటుంది రూపవతి. చెప్పినట్లుగానే అడ్మిషన్ ఇప్పిస్తుంది. ఆమె తనకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహిస్తాడు రామభద్రం.

మెస్ లో సహాయకురాలిగా ఉన్న మంజుల రూపవతికి సంబంధించిన రహస్యాలు చెబుతుంది. రూపవతి భర్త మరణించి చాలా కాలమైందన్న విషయం విని ఆశ్చర్యపోతాడు రామభద్రం.


మంజులదేవి, సోమనాథాల వివాహం జరుగుతుంది.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 11' చదవండి.


మరెందుకో మరి— ఇక్కట్లలో ఉన్న తన బామ్మర్ది విషయమై సోమనాధం దగ్గర ప్రస్తావించాలన్న తలంపు రాలేదు రామ భద్రానికి. ఎందుకంటే— సెలయేళ్లు వంకర్లుపోతూ చిట్టచివర నదిలోకి వచ్చి చేరినట్టు అతడు కూడా రూపవతి వద్దకు వచ్చి సలహా అడుగుతాడేమో! ఆ మాటకు వస్తే ఇంటా బైటా పెట్టుబడి అంతా ఆమెదేగా! ఆర్ధిక వనరులపైన పట్టు కూడా రూపవతిదేగా! ఆమెను మీరి సోమనాథం గాని— మంజులదేవి గాని ఇప్పటిప్పుడు ముందుకు వెళ్ళరు. వెళ్లలేరు.


అంచేత అతడి మనసిప్పుడు సూదంటురాయిలా రూపవతి వైపే లాగుతూంది; చివరి ఆసరా దొరక్క అసహాయంగా అంబ విగ్రహం వేపు చేతులు చాచే దేవీ ఉపాసకుడిలా- నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా తనను ఆదుకునే ఆర్ద్రత ఆమెకు మాత్రమే ఉందన్న విశ్వాసం అతడిలో ఇసు మంతం కూడా తరగలేదు. కాని- అదే సమయం-- ఇంట్లో వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలు- వార్నింగులు అతణ్ణి వెంటాడటం మానలేదు. ఏదైనా ఎక్కడైనా మరీ ఎక్కువగా ఎదురు చూస్తే భంగపాటు ఎదురయే తీరుతుందిగా!


అందులో తనకు ఆమెతో ఈమధ్య చనువు కూడా పెరిగింది. ఇప్పుడు తను ఏది అడిగినా, వేడుకోలుగా ఏమన్నా తను ఆ చనువుని తనకనుకూలంగా ఉపయోగించడానికి పూనుకున్నాడని రూపవతి తలపోస్తే- అపార్థం చేసుకుంటే-- ఒకసారి సింహాద్రి పంతులుగారు చెప్పలేదూ- మనిషి అదుపులేని తన ఆశల వల్లనే ముప్పు తెచ్చుకుంటాడని; తమ పొడవైన కాళ్ళ వల్లనే వలలో చిక్కుకు పోయే పక్షుల్లా. ఈ ఆలోచన వచ్చిన తోడనే అతడి గుండె కొట్టుకోనారంభించింది.


నిజానికి రామభద్రం రెండు మూడుసార్లు విషయ ప్రస్తావన చేయడానికి రూపవతి దగ్గరకు సరాసరి దూసుకు వెళ్ళాడు కూడాను. తీరా ఆమె ఏమికావాలని అడిగే సరికి తను ఇంకేదో చెప్పి వెనుతిరిగాడు. తను అంతటి బంగారు కొండ వంటి మనసు గల స్త్రీ మూర్తి వద్దకు వెళ్ళి మాట్లాడడానికి జంకుతున్నాడంటే- నిజంగా తను అడగబోతున్న దాంట్లో సహేతుకత లేదనేగా! బంగారు గుడ్లు పెట్టే బాతుకి అసహనం కలిగించడమేగా!

--------------------------------------------------------------------

ఆ రోజు సోమవారం. చెల్లెలు లలిత వద్దనుండి నాలగవ ఉత్తరం వచ్చింది;బావకు ఉద్యోగమూ సద్యోగమూ లేక కుటుంబం అగచాట్లు పడుతుందని, చుట్టు ప్రక్కల అప్పులు కూడా పుట్టడం లేదని— పి. ఎఫ్ నుండి తీసుకున్న అడ్వాన్సు కూడా ఐపో యిందని-- అతడు ఆవిషయం గురించి ఆలోచిస్తూనే-- ఇటు క్యాష్ క్యాబిన్ లో కూర్చుని మాలినికి వోచర్స్ నమోదు చేయడంలో సహకరిస్తూనే రూపవతికి అడపా తడపా దస్త్రాలు అందిస్తూనే లోపలకు వెళ్లి మల్లశాలలోని వంట పనుల్ని పర్యవేక్షించి వస్తున్నాడు- అప్పుడు ఉన్న పాటున అతడికి తెలియకుండానే అతడిలో యేదో అదృశ్య శక్తి ఆవహించినట్టు ఉద్వేగం పెను తరంగమై లేచింది ”రూపవతి గారూ!” అని వేగిరపాటుతో పిలిచాడు.


ఆమె ఇటు తిరిగి ‘చెప్పండి’ అంటూ తనతో ఏదో చెప్తూ నిల్చున్న ఖాతాదార్లు ఇద్దరిని సాగనంపి అడిగిందామె. అతడు వెంటవే సర్దుకున్నాడు- “అబ్బే! మరేమి లేదు. మొన్న నాకు ప్రమోషన్ ఇచ్చి నా జీతానికి పెంపునిచ్చారు కదా! ఇంట్లోవాళ్లు మీకు కృతజ్ఞతులు చెప్పమన్నారు. అదప్పుడు చెప్పడం మరిచి నట్టున్నాను. ఇప్పుడు చెప్తున్నాను- మరేమీ అనుకోకుండి! ”


ఆ మాట విని రూపవతి పక్కున నవ్వింది. తెలివైనది- విద్యాధికురాలు- అందులో దక్షతగల బిజినెస్ విమన్ కూడాను. నోరు తెరిస్తే ప్రేవులు లెక్కపెట్టే శక్తి ఉండదా మరి! ఆమె అదే నవ్వుతో లేచి నిల్చుంది “అలా నాతో క్యాబిన్ లోకి రండి రామభద్రం! ” అంటూ మాలినిని పనులు చూసుకొమ్మని ఓ మాట చెప్పి లోపలకు కదలింది. అతడు ఆమెకు సమానంగా కుర్చీ తీసుకోకుండా పొట్టి స్టూలొకటి తీసుకుని కుదురుగా కూర్చున్నాడు.


“చూడండి రామభద్రం! నిజానికి జీతంలో పెంపునిచ్చింది మీకే కాదు. మాలినికి కూడా ఇచ్చాను. ఆమె అప్పుడే వాళ్ళింటి వాళ్ళను తీసుకు వచ్చి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయింది. అది మాత్రమే చెప్పడానికి మీరింత జాప్యం చేస్తున్నారంటే- మీరు చెప్పదలచిన విషయం ఇది కాదని తెలుస్తూనే ఉంది. నేను ప్రూవ్ చేయనా?”


అతడు పేలవంగా నవ్వి తలూపాడు.


“నాలుగు రోజులుగా మిమ్మల్ని మాసిపోయిన గడ్డంతోనే చూస్తున్నాను. కచ్చితంగా ఇది ఇప్పటి స్టయిల్ మాత్రం కాదు. ముఖం జేవురించి కూడా ఉంది. ఇంటికి పిలిచి అడగాలనుకున్నాను. కాని మంగళూరు నుండి ఇంటికి బంధువులొచ్చి ఉన్నారు. అంచేత వీలు కాలేక పోయింది. మనిద్దరమూ ఒకరి కొకరం క్లోజ్— అది నా మనసుకి తెలుసు. మీ మనసుకీ తెలుసు. ఇక చెప్పడానికి సందేహం ఎందుకు? ఎంత సేపని అలవి కాని అంతర్మథనానికి లోనవుతూ పరి పరి విధాల పరితపిస్తూ పని చేస్తారు?"


ఆ మాటతో అతడి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. అతడికీ తెలియకుండానే కనుకొలకలు తడిసాయి. ఎప్పుడో ఎక్కడో చదివిన కమ్మటి తెలుగు పలుకులు మనసున చెరువు గట్టున ఉదయ కాలపు గాలి వీచి కల్లా కదిలాయి.


’అధరం మధురం- నయనం మధురం- హసితం మధురం- గమనం మధురం- హృదయం మధురం- వదనం పవిత్రం‘

అతడు ఉద్వేగానికి లోనై అసంకల్పితంగా ఆమె చేతిన తన చేతిలోకి తీసుకోబోయాడు.


అప్పుడామె వారించింది- “హాఁ హాఁ! ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. బయట మాలిని ఉంది కదూ! తిన్నగా పులినోట్లో తల పెట్టినట్లవుతుంది, ఇక విషయానికి రండి- బుధ్దిమంతురాలై వింటాను. ఇన్నాళ్ళ స్నేహం తరవాత కూడానూ నాతో మనసు విప్పి చెప్పడానికి మీరు సందేహిస్తున్నారంటే- నా ప్రవర్తనలో ఏదో లోపం ఉందన్న మాటేగా!”


రామభద్రం తలవంచుకుని యెట్టకేలకు పెదవి విప్పాడు- “లేదు. అటు వంటిదేమీ లేదు మేడమ్. నా వరకు మీరు నా కుటుంబం లో ఒక్కరుగానే కనిపిస్తారు- కనిపించడం యేమిటి- మా కుటుంబంలో మీరు ఎప్పుడూ ఒక్కరుగానే ఉంటారు” అంటూ ఆమె మాటను ఖాతరు చేయకుండా ఆమె కుడిచేతిని అందుకుని కళ్ళకద్దుకుని తన చెల్లి కుటుంబానికి వాటిల్లిన గడ్డు పరిస్థితి గురించి వివరించాడు.


అంతా విన్న రూపవతి అడిగింది- “ఏదైనా హోటెల్ లోగాని ఎప్పుడైనా పని చేసిన అనుభవం ఉందా మీ బావకి? దానికి సంబంధించిన ప్రశంసా పత్రాలు తెచ్చుకోగలడా మీ బావ? నాకు తెలిసిన ఇద్దరు హోటెల్ ఓనర్లు ఉన్నారు. వాళ్ల ద్వారా ప్రయత్నిస్తాను”


ఆమాట విన్నంతనే అతడు తలబలం గా విదిలించాడు. “వాసు దేవ రావుకి ఒక్క అకౌంట్సు పరిధిలో తప్ప మరొక రకమైన అనుభవం ఉందనుకోను. అంతే కాక- అతను ఊరు కాని ఊళ్ళో మరెక్కడా మనుగడ సాగించలేడు. ఇక్కడే మనమధ్యే ఉండనివ్వండి- మా చెల్లి మాట మరచిపోకుండా-- ”


“ఓకే ఓకే! ఎమోషనల్ ఐపోకండి. సమస్య మనది. దానిని మనమే కదా పరిష్కరించుకోవాలి. బిడ్డలెంతమంది?"


“ఇద్దరు— ఒక ఆడపిల్లా- ఒక మగకుర్రాడూను”


అప్పుడామె కాస్తంత విరామం తీసుకుని అంది- “మీరు అనుకున్నట్లే ఉద్యోగం యిచ్చి ఇక్కడే వాసుని అకామడేట్ చేద్దాం. కాని- ఎక్కడుంటాడాయన? నా ఇల్లు మీకిచ్చేసానుగా--. నేనేమో నాకు సరిపడా చిన్న ఇల్లు తీసుకున్నాను. డిల్లీ వంటి నగరంలో మీ బామ్మర్దికి ఇల్లు చూడటమంటే అంత సులభతరం కాదు కదా! ఇక వాళ్ళను మీ ఇంట్లో ఉండమనడం కష్టమేనేమో! ”


రామభద్రం తలూపుతూ బదిలిచ్చాడు- “ఔను మేడమ్. మా యింట్లోనయితే- మీరన్నట్టు ఎక్కువలో ఎక్కువ నాలుగు రోజులపాటు సర్దుబాటు చేసుకోవచ్చేమో-- ఐతే నాకొక ఆలోచన ఉంది—మీరుగాని ఒప్పుకుంటే-”


“భలే వారే! మీరు చెప్తే నేనొప్పుకోనా! చెప్పండి—”


“డాబా పైన సోమనాథంగారికి కేటాయించిన ప్రత్యేకమైన గది ఉందిగా! అది పాకశాల చీప్ కుక్ కి కదా మీరు కేటాయిస్తారు. ఇప్పుడు సూపర్ వైజింగ్ కుక్ ని నేనే కదా! దానిని నాకిచ్చే బదులు మా బామ్మర్దికి ఇచ్చేయండి” మెరిసే కళ్లతో వివరించాడు రామభద్రం.


రూపవతి నిదానంగా చూసి అంది- “మీ ఆలోచన బాగానే ఉంది. కాని అది చిన్నది కదా! అందులో నలుగురు ఎలా ఉంటారు? ఇద్దరు పిల్లలతో మరీ ఇరుగ్గా ఉండదూ-- ”


“దీనికి కూడా పరిష్కార మార్గం ఉంది మేడమ్. గది బైటంతా ఖాలీ స్థలమేగా-- గదిని పై కప్పులా ఉడన్ వర్కుతో కాస్తంత విస్త రిస్తే భార్య భర్తలిద్దరూ, పిల్లలిద్దరూ దానితో సర్దుకుపోతారు. దానికి దగ్గర్లో బాత్ రూమ్ కూడా ఉంది. ఇప్పటికి వాళ్లను ఆదుకునే బాధ్యత నాకే ఉంది మేడమ్-- ”


రూపవతి ఇంకేమీ అనలేదు. అతడిలో ప్రస్పుటిస్తూన్న గుణాంశాలు ఆమెను మిక్కిలిగా ఆకట్టుకున్నాయి. తనతో అతడి కి ఏర్పడ్డ చనువుని తానుగా తనకనుకూలంగా స్వార్ధ చింతనతో ఉపయోగించడానికి అతడేమాత్రమూ ప్రయత్నించలేదు. ఇప్పటి పరిస్థితిలో అతడు గాని పెదవి విప్పి అడగాలే గాని- తనెలా కాదనగలదు? ఏది కాదనగలదు?


ఇక రెండవది- సౌఖ్య వంతమైన జీవన స్రవంతిలో తేలుతూ తన తోవ తను చూసుకోకుండా తోబుట్టువు కోసం అతడు పడుతూన్న తాపత్రయం ఆమె మనసుని మాటలకందని మృదు భావనతో నింపింది.. రాను రాను పల్చబడుతూన్న నేటి సంబంధాల మద్య తనకు తోచిన రెండు రూకలు విసిరేసి బాధ్యతల్ని దులిపేసుకుని తన మానాన తను జారుకోకుండా చెల్లి కష్టాన్ని తన కష్టంగా స్వీకరించి మధన పడటం—ఆమె చూపులో అతణ్ణి ఉన్నతుణ్ణి చేసింది.


రూపవతికి రామభద్రం పైన అభిమానం ముప్పిరిగొని అతడి చేతిని మృదువుగా నిమిరుతూ అంది- “మాలిని వద్దనుండి క్యాష్ తీసుకుని వెంటనే గ్రాండ్ ఎక్స్ ప్రెస్ కి టిక్కెట్లు బుక్ చేసి కొరియర్ ద్వారా పంపించండి. వచ్చేటప్పుడు మరచి పోకుండా దళసరి దుప్పట్లు తీసుకు రమ్మని చెప్పండి. ఎందుకంటే వచ్చేటప్పుడు ట్రైనులో చలి ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లల ఒరిజినల్ జన్మ ధ్రువపత్రాలతో సహా స్కూళ్ల నుండి టీ. సీ. లు తెచ్చుకోవడం మరవకని గట్టిగా గుర్తు చేయండి. అంచేత- అవన్నీ చూసుకొని రావడానికి వీలుండేలా సరైన గ్యాప్ ఇవ్వండి టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు.


ఇక్కడకు వచ్చిన తరవాత మీలాగే వాసు దేవరావుకి కూడా అడ్వాన్స్ ఇచ్చి వార్మ్ క్లాత్స్ కొనుక్కోమందాం. నేను ప్లంబర్ ని పిలిచి డాబా గదిని షెడ్డుతో ఎక్స్ టెండ్ చేయమని చెప్తాను—అవన్నీ దగ్గరుండి చూసుకోండి”


అతడు బుర్రూపుతూ అక్కణ్ణించి లేచాడు.


ఆరోజు మధ్యాహ్నం కమల కాంతం వంట పనుల్లో మనసుంచ లేకపోయింది. ఇక్కడ తమతో చేరబోతూన్న ఆడపడు చు లలిత గురించి ఆమెకు తెలుసు. ముఖ్యంగా రెప రెపలాడే ఆమె మనస్తత్వం గురించి తెలుసు. ఇక పైన అత్తామామల వత్తా సుతో కోర్కెల చిట్కా విప్పుతుంది. కావాలనుకున్నప్పుడు రాకపోయినా అదను చూసి సమయోచితంగా కంటనీరు నింపుకుని తనకనుకూలంగా కార్యసాధనకి పూనుకుంటుంది. అన్నయ్యను తనవేపు మొగ్గేలా చూసుకుంటుంది. ఆ సాధించే కళ లలితకు తెలిసేలా మరొకరికి తెలవదు. ఇకపైన తన కుటుంబానికి యెటువంటి గతి పడ్తుందో!


అలవికాని తన గొంతెమ్మ కోర్కెలతో రూపవ తి మేడమ్ గారికి యెంతెత్తు చిరాకు తెప్పిస్తుందో! ఇక్కడకు రాకముందు స్త్రీల సహజ ఆకాంక్షల గురించి జరిపించిన సర్వేక్షణ కమల కాంతానికి గుర్తు రాసాగింది. అరవై యెనిమిది మంది శాతం సంపాదన మొదలవగానే స్థిరాస్తులు కొనాలనుకుంటారట. డభ్భైయెనిమిది శాతం మంది మహిళలు యింటిని కుటుంబాన్ని సామాజిక భద్రతగా మలచుకోవాలని ప్రయత్నిస్తారట.


అరవై శాతం మంది యెలాగో ఒకలా సొంతిల్లు సంపాదించు కోవాలని కలలు కంటారట. అరవై రెండు శాతం మంది ఆడాళ్ళు మిగుల్చుకున్న సంపాదనతో స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని పూనుకుంటారట. మరి తను—అటువంటివేమీ ఆశించలేదు. ఇకపైన ఆశించదు కూడాను;ఒక్కటి తప్ప—


తన కొడుకులిద్దరూ స్కూల్ ఫైనల్ చదువుల కంచెను దాటేయాలని.. తల్లిగా తను కోరు కుంటున్నది అత్యాశా! ఈ చిన్నపాటి ఆశకు ఆడపడుచు గండి కొట్టబోతుందేమో! ఏది యేమైనా ఈ ఒక్క విషయంలో తను అందరి మధ్యా ఒంటరిగానే మిగిలిపోతుందేమో! ఒంటరి పోరాటమే చేయవలసి వస్తుందేమో!

------------------------------------------------------------------------------------------------------------------------------------------

వారం రోజులుగా రూపవతి ఇంట్లో మకాం పెట్టిన మంగళూరు బంధువులు యెట్టకేలకు గృహాభిముఖులై కర్ణాటక వేపు సాగిపోయారు. వాళ్లు వెడలిపోయిన మరొక మూడు రోజుల తరవాత రామభద్రం చెల్లెలు లలిత భర్త వాసుతో తన ఇద్దరు పిల్లలతో న్యూఢిల్లీలో దిగింది. వాళ్లందర్నీ బోగీనుండి దింపించి సామాను గట్రా ట్రాలీలోకి ఎక్కించుకుని స్టేషన్ బైటకు చేరే వరకు రామభద్రం మిత్రుడు గంగాధరం తోడుగా ఉన్నాడు. వాళ్ళకు ఆసరాగా రూపవతి తన సుమో బండిని పంపించింది కాంట్రాక్ట్ డ్రైవర్ తో సహా-


అక్కడ కొందరు డ్రైవర్లు పార్ట్ టైమ్ సిబ్బందిలా అవర్లీ ప్రాతిపదికన కారు తోలడానికి కుదురుతుంటారు. డ్యూటీ కూడా గంటల ప్రకారం లెక్కించి భత్యం తీసుకుంటారు.

నిజానికి రూపవతి సుమో పంపడం చూసి రామభద్రం కంటే గంగాధరమే మిక్కిలి సంతోషించాడు.


సుమో బండిలో వరసగా చోటు చేసుకుని కూర్చున్న మేనగోడలి ఉత్సాహపు అరుపులు వింటూ మేనల్లుడి ముచ్చటైన చూపులు గమనిస్తూ కూర్చున్న రామభద్రానికి సంతోషంతో గుండె తడిసింది. ఎన్నాళ్ళ తరవాత వీళ్ళను చూస్తున్నాడు తను! ఇకపైన ఈ ఇద్దరు చిన్నారుల లేత జీవితాలకు మనుగడ ఇక్కడే- ఢిల్లీ నగరంలోనే, మేడమ్ రూపవతి మెస్సు ప్రాగంణంలోనే- ఇంకా చెప్పాలంటే ఆమెగారి కనుసన్నల్లోనే అంకురార్పణం జరగాలి.


రామభద్రం తనలో తను ఆనందపడిపోతూ కాస్తంత ముందుకి వంగి మేనల్లుడినీ మేనగోడలినీ ముద్దు పెట్టుకున్నాడు.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



41 views0 comments
bottom of page