top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' పార్ట్ 10


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 10' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 10' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.

తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.

అతని పిల్లల స్కూల్ అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానంటుంది రూపవతి. చెప్పినట్లుగానే అడ్మిషన్ ఇప్పిస్తుంది. ఆమె తనకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహిస్తాడు రామభద్రం.


మెస్ లో సహాయకురాలిగా ఉన్న మంజుల రూపవతికి సంబంధించిన రహస్యాలు చెబుతుంది. రూపవతి భర్త మరణించి చాలా కాలమైందన్న విషయం విని ఆశ్చర్యపోతాడు రామభద్రం.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 10' చదవండి.


ఆ రోజు సోమవారం.. మధ్యాహ్న వేళ.. కస్టమర్ల రాకపోకలతో యమరద్దీగా ఉంది మెస్సు. భోజనాలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది నెలసరి కార్డు ఖాతాదార్లు కాబట్టి-- వాళ్ళు ఇస్తూ వెళ్లే టోకెన్లను మాలిని మంజుల ఇద్దరూ జాగ్రత్తగా అందుకుం టూ పకడ్బందీగా ఖాతాలో వేసుకుంటున్నారు. క్యాష్ క్యాబిన్ మధ్య సీటువేసుకుని కూర్చుని అంతా సూపర్ వైజ్ చేస్తూ కూర్చుంది రూపవతి.

అప్పుడు ఉన్నపాటున రూపవతి సెల్ ఫోను రింగయింది. రూపవతి ఎవరితోనో మాట్లాడి సీట్లోనుండి లేస్తూ మంజులతో అంది “నేను అర్జంటుగా బైటికెళ్తున్నాను. మరొక గంటలో వస్తాను. లేదా- ఫోను చేస్తాను. ఆలోపల పని రద్దీ తగ్గు తుంది. రామభద్రాన్ని రెడీగా ఉండమను- సుమో పంపుతాను-- “ అంటూ రోడ్డుకి ఓరన ఉన్న పార్కింగ్ షెడ్ వేపు వేగంగా నడిచింది.

ఆ మాటకు తత్తర పడుతూ వేగంగా వెళ్లి బండిలో కూర్చుని వెళ్ళిపోతూన్న వదిన వేపు తేరిపార చూస్తూనే లోపలకు వెళ్లి వదినిచ్చిన ఆదేశాన్నిరామభద్రానికి అందించింది మంజుల.

మరొక గంటలో ఫోను రాలేదు గాని- రూపవతి మాత్రం స్వయంగా వచ్చింది. సుమోలోనుంచి దిగకుండానే కబురందిం చింది రామభద్రం కోసం. వెంటనే వెళ్లి బండిలో కూర్చున్నాడు- కూర్చుంటూనే అడిగాడు- “ఏమైంది రూపవతిగారూ! ఎందుకంతగా గాభరాగా కనిపిస్తున్నారు? ” అంటూ--

ఆమె బదులివ్వకుండానే కారుస్టార్ట్ చేస్తూ అంది- “గాభరా నాకు కాదు- మీకు కలగకూడ దనే నా వేగిరపాటు. కంగారు పడకుండా వినండి. ఏమీ కాలేదు కాబట్టి ఇంత నిదానంగా చెప్తున్నాను. మీ నాన్నగారిని ఆస్పత్రి లో చేర్పించి వస్తున్నాను”.

స్టట్టన్నయిపోయి చూసాడతను. “మా బాబుని ఆస్పత్రిలో చేర్పించారా! ఎందుకూ? ఏమైంది?"

“నేను ముందే ఏమన్నాను? ఏమీ కాలేదనేగా అన్నాను. ఉన్నపాటున ఉబ్బసం ఎక్కువైపోయి ఊపిరందక కష్టపడ్డారు. తిన్నగా తీసుకు వెళ్లి ఎయిమ్స్ లో చేర్పించి వచ్చాను. అక్కడ నాకు తెలిసిన మెడికల్ స్పెషలిష్టులున్నారు. వాళ్లద్వారా అడ్మిషన్ సంపాదించగలిగాను” ఆమె సుమోని మలుపు తిప్పుతూనే వివరించింది.

అతడికి ఊపిరందుకోవడానికి కొన్ని క్షణాలు పట్టాయి. ”అది సరే మేడమ్- మీకు బాబు జబ్బున పడ్డాడని ఎలా తెలుసు? ” వణకుతూన్న గొంతుతో అడిగాడతను.

“అదా మీ అనుమానం-- మీ ఆవిడే నాకు ఫోను చేసింది—మామగారి పరిస్థితి సీరియస్ గా ఉందని. ఇప్పుడు మీ అమ్మతో బాటు కాంతం కూడా అక్కడే ఉంది. అబ్బాయిలిద్దరి గురించి చింతించకండి. మాలిని వెళ్లి ఇద్దర్నీ స్కూలు నుండి మెస్సుకి తీసుకు వస్తుంది. ఇప్పుడు మీకు సాంత్వన హస్తం లభించినట్లేనా--”

అతడేమీ అనకుండా మౌనంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పెద వులకు హత్తుకున్నాడు. పులకించిన మనసుతో ఆమె అడిగింది- “ఇంతేనా! మరేదీ ఇవ్వరా! లేక ఇవ్వడానికి మనస్సు--”

“అడగండి మేడమ్.. ఏదైనా ఇస్తాను ముమ్మాటికీ మాటతప్పకుండా--”.

“అంత పెద్దదేమీ వద్దుగాని—మీ ఇద్దరి అబ్బాయిలలో ఒకడ్ని ఇచ్చేయండి. నా కొడుకుగా పెంచి పెద్ద చేసుకుని తోడుగా ఉంచు కుంటాను- కాంతం యవ్వనవతేగా- మూడవ కాన్పులో వరూధిని వంటి గంధర్వ కన్యను కని మీ చేతికందిస్తుంది”.

అతడు ఆవేశం ముప్పిరిగొని కాసేపు వరకూ మాట్లాడలేకపోయాడు. ఇటువంటి హృదయమున్న స్త్రీ అడగాలేగాని తన ను తను తక్షణం సమర్పించుకొని లక్షార్చన చేయడూ! ఎట్టకేలకు అతడు నోరు తెరిచాడు- “ఇద్దరూ నాకు మాత్రమే స్వంతం కాదు కదా! కాంతం కన్నతల్లి- దాని గుండె పగిలిపోదూ! ”

“మీరు తలచుకుంటే అవనిపనా! నాకు తప్పకుండా ఒక కొడుకుని ఇవ్వగలరు”

దానికతడు తలూపుతూ ఆలోచనలో పడ్డాడు. బహుశ: కాంతం బిడ్డలు కనే అర్ఙత కోల్పోయిందన్న వైనం రూపవతికి తెలియదేమో! అప్పుడామె నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సుమోవేగాన్ని తగ్గిస్తూ అంది- “మరి కొద్ది సేపట్లో మనం ఎయిమ్స్ కి వచ్చేస్తున్నాం. నేనొకటి చెప్పాలి. చెప్పేదా?"

“చెప్పండి—మిమ్మల్ని ఆపగలిగే ధైర్యం నాకుందా! ”

“అంత పెద్దమాటలిప్పుడు ఎందుకు గాని—నేనడగబోయేది చిన్నదే- మనం ఎదురెదురుగా ఉన్నప్పుడు కూడా మీరు నన్ను మేడమ్ అని- గారూ కంగారూ అని సంబోధించాలా?"

దానికతడు చిన్నగ నవ్వడానికి ప్రయత్నిస్తూనే స్పందించాడు- “అలవాటు ఆరోగుణం వంటిదంటారు. నేను తప్పీ జారి నలుగురి ముందు మిమ్మల్ని ఏక వచన ప్రయోగంతో సంబోధించానంటే—మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి.. నా వల్ల ఏ కోణాన కూడా మీ మర్యాదకు భంగం కలగకుండా చూసుకోవడం నా కర్తవ్యం. అందునా- బాస్ గా కాకుండా ఒక స్త్రీమూర్తిగా, విద్యావంతురాలిగా మీకు చిన్నతనం కలగడం నేను భరించలేనండీ! దయచేసి అర్థం చేసుకోండి”

ఆ మాటతో ఆమె కళ్లు ఆర్ద్రతతో చెమ్మగిల్లడం అతడు చూడకపోలేదు.

రిసెప్షన్ కొంటర్ వద్ద వివరాలు తీసుకుని వాళ్ళనుండి అనుమతి చీటీ కూడా అందుకుని లోపలకు వెళ్లి ఐ. సి. యు. సెంటర్ ముందు నిల్చున్నారు ఇద్దరూ-- బయటనుంచే లోపలకు మిర్రర్ విండో ద్వారా తొంగి చూసారు. రాఘవయ్య ముఖానికి కవ ర్ తొడిగిన స్థితిలో నిద్రపోతున్నాడు.

“ఇప్పటికి మనం ఏమీ చేయలేం రామభద్రం. ఇన్ఫెక్షన్ వస్తుందని లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు. మన ఉనికి గాని వాళ్ళకు అవసరమని తోస్తే—స్టాఫ్ నర్సులు ఎవరైనా వచ్చి చెప్తారులే—” అంటూ అక్కణ్ణించి కదిలింది రూపవతి.

ఆమెను వెన్నంటి నడుస్తూనే అడిగాడు రామభద్రం- “అమ్మగాని కాంతం గాని- ఎవ్వరూ కనిపించరేం?” అని.

“మీ అమ్మ లోపల ఉంది. మెడికల్ టెస్టులు చేయిస్తున్నాను”.

ఆ మాటతో కళవళ పడుతూ చూసాడు- “అమ్మకేమి చేసింది?”

“ఏమీ కాలేదు, రేపు ఏమీ కాకూడదనే ఈ టెస్టులు- ఎంతైనా యేజింగ్ ఫ్యాక్టర్ ఉందికదా- దానిని మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఇంతకూ మీ నాన్నకూ మీ అమ్మకూ ఆఖరు సారి ఎప్పుడు మెడికల్ టెస్టులు చేయించారో గుర్తుందా? ”

ఆ మాట విని అతడు ఉలికిపాటుతో చూసాడు. మెడికల్ టెస్టులా! ఖరీదైన ల్యాబ్ లోనా! తనుగాని కాంతం గాని ఊహించగలరా? అంతెత్తు ఖర్చు భరించగల స్థాయి తమకున్నదా!

జవాబివ్వడానికి తడబడుతూన్న అతడి పరిస్థితి గమనించి అతడికి వత్తాసుగా చేతిని అదుముతూ అంది- “వయసు ముదురుతున్నప్పుడు కొన్ని వ్యాధులు వాటికి అవే పుట్టుకొస్తుంటాయి; రేపు మనకి కూడానూ-- టెస్టులయి మందులు వ్రాసిచ్చిన తరవాత డిస్చార్జ్ అయి ఇల్లు చేరిన తరవాత ఇక చాల్లే అంటూ రజాయీలో ముడుచుకుని పడుకుంటే చాలదు. మీ అమ్మచేత ఉదయమూ సాయంత్రమూ నడక చేయించండి. మీకు తెలుసో తెలియదో- ఒక దశలో మందు లు పనిచేయవు- ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళకు.. అంటే మన ఆరోగ్యాన్ని మనమే నిలబెట్టుకోవాలి. అది మన చేతిలోనే ఉంటుంది”

అలా మాట్లాడుకుంటూ ఓ. పి. మెడికల్ సెంటర్ కి చేరుకునేటప్పటికి రక్తాన్ని ఇచ్చి కూర్చున్న తాయారమ్మ ఉన్న పాటున కొడుకు వద్దకు పరుగెత్తుకు వచ్చింది కంటనీరు పెట్టుకుంటూ-- “మీ బాబు ఉల్లి గడ్డలా బాగానే ఉన్నాడురా! ఉన్నపా టున ఎవరో బాణం వేసినట్టు గిలగిల తన్నుకోసాగాడురా, ఎక్కుళ్ళతో ఊపిరాడక! ఈ తల్లిగాని సమయానికి రాకపోతే ఈ పాటికి నా తాళిబొట్టు తెగిపోయుండునురా భద్రా!” అంటూ కన్నీరుని ఆపుకోలేక ఏడ్వసాగింది.

అత్తయ్యతో కాంతం కూడా గుడ్ల నీరు కక్కుకుంటూ బిత్తర చూపులు చూడసాగింది. అతడు తల్లిని అక్కున చేర్చుకుంటే—ఒక వైపు రూపవతి కాంతాన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చసాగింది- “ఇంకా దు:ఖించడం దేనికి- చాముండీశ్వరీదేవి దయవల్ల అపాయం దాటిపోయింది కదా! “ అంటూ-

తాయారమ్మకు మెడికల్ టెస్టులు పూర్తయిన తరవాత- ఓసారి స్పెషల్ మెడికల్ ఆఫీసర్ అనుమతితో స్పెషల్ కవరింగ్ ట్రాన్స్ పరెంటు కవరు తొడుక్కుని ఐ. సి. యు. సెంటర్ లోకి వెళ్లి రాఘవయ్యను చూసి వచ్చింది. పిదప- రూపవతి అందర్నీ తీసుకు వెళ్ళి ఎయిమ్స్ క్యాంటీనులో భోజనం ఇప్పించి తను కూడా వాళ్లతో కలసి తీసుకుంది. అప్పుడు అన్నం తింటూనే రామభ ద్రం అటు అసంకల్పితంగా చూసాడు. తాయారమ్మ మెతుకులు నములుతుందే గాని చూపులన్నీ రూపవతి పైనే--

భోజనాలు ముగించి బైటకు వచ్చిన తరవాత రూపవతి వాళ్ళను అక్కడే ఉండమని చెప్పి చకచకా బైటకు వెళ్లింది. అందరూ ఎవరో మెడికల్ ఆఫీసర్ ని కలుసుకోవడానికి వెళ్ళుంటుందేమోననుకున్నారు. కాని ఆమె వెళ్లింది వెళ్లినట్టుగానే పది నిమిషాలలో వచ్చేసింది; ఒక చేతిలో కొత్త ఫ్లాస్కూ- మరొక చేతిలో బిస్కట్లు గట్రా పట్టుకుని.

“ఫ్లాస్కు నిండా టీ ఉంది. సంచీలో తినడానికి బిస్కట్లు కూడా తెచ్చాను. నేనిప్పుడు వెళ్లి మెస్సుని ఓ చూపు చూసి- అబ్బాయిలిద్దరినీ బుజ్జగించి సాయంత్రం లోపున వస్తాను. మీరు గాని దగ్గర లేకపోతే—పిల్లకాయలు బెంబేలు పడవచ్చు. సాయంత్రానికల్లా మీరిద్దరూ నాతో వచ్చే యండి. ఇక్కడ అంకుల్ గారిని కనిపెట్టుకుని రామభద్రంగారు ఉంటారు” అంటూ ఆమె వెళ్లిపోయింది కార్లు ఉంచే సెల్లారు వేపు—

-----------------------------------------------------------------------

మంచి కార్యాలెప్పుడూ ఉన్నపాటున చకచకా జరగవు. వర్షపు ఋతువు ప్రారంభ సమయాన చిన్నచిన్నగా మెల్ల మెల్లగా కురిసే చినుకులాగే చల్లగా నిశ్శబ్దంగా మలయమారుతంలా జరుగుతుంది శుభకార్యం. ఆలోచనా పరురాలైన మంజులదేవి సోమనాథాన్ని ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకుంది. అంతా రూపవతి ఆధ్వర్యాన జరిగింది. తంజావూరు నుంచి సోమనాథం వదినలిద్దరూ ఊళ్ళోని కొందరు దూరపు బంధువుల్ని తోడ్కొని వచ్చారు. నాలుగేళ్ళు పూర్తిగా దాటని సోమనాథం కూతుర్ని వెంటబెట్టుకుని, మంగళ సూత్ర ధారణ జరిగి మూడు రాత్రుల ఇల్లరికం పూర్తయిన తరవాత సోమనాధం వదినలిద్దరూ కూతుర్ని మళ్లీ తమతో ఊరికి తీసుకెళ్ళాలని తహత హలాడారు.

కన్న ప్రేమకన్న పెంచిన ప్రేమ గొప్పదంటారు అందుకేగా! మాటా మంతీ పూర్తయిన తరవాత ఇద్దరు వదినమ్మలూ సడలింపుగా ఒకమాట అన్నారు; వీలుచూసుకుని పాపను మళ్ళీ ఢిల్లీకి తీసుకు వస్తామని చెప్పారు. కాని- మంజుల ఒప్పుకోలేదు. పాప ఇకపై తమతోనే ఉంటుందని సాధ్యమైనంత సౌమ్యంగా తేల్చి చెప్పేసింది. సోమనాథం మరు మనువాడటానికి అసలు కారణం పాపే కదా! ముఖ్యంగా ఆమె పైన నమ్మకం ఉంచేకదా--

ఇకపోతే—లోతైన మనసూ చూపూ గల రూపవతి కర్తవ్య చింతనతో రామభద్రం సహితం ఊహించలేని రీతిన నిర్ణయాలు తీసుకుంది. చకచకా తీసుకుని ఆచరణలోకి పెట్టింది. తనకు బంధువుగా మారిన సోమనాథం ఇకపైన తన వద్ద అణగి మణగి పని చేయడం మంచిది కాదంటూ తీర్మానించి, ప్రక్కనే ఉన్న సుగంధ్ నగర్ లో అంతవరకూ మూతపడి ఉన్న ఒక ప్రాత హోటెల్ ని లాంగ్ టైమ్ ప్రాతిపదికన లీజుకు తీసుకుని దానిని కొత్తగా పునరుధ్దరణ చేసి సౌత్ ఇండియన్ మెస్సుగా మార్చి పెళ్లి కానుక గా సోమనాథానికి అందించింది.

కొత్తమెస్సు తగురీతిన పుంజుకోవడానికి వీలుగా అనుభవం ఉన్న వంటగాళ్లను అకౌంట్స్ స్టాఫ్ ని తనే స్వయాంగా యెంపికి చేసి పంపించింది. పనిలో పనిగా రూపవతి మరొక ఏర్పాటు కూడా చేసింది. రామభద్రం ఉద్యోగాన్ని పై స్థాయికి తీసుకు వెళ్తూ అతణ్ణి సోమనాథం స్థానాన వంటశాల సూపర్ వైజర్ ని చేసింది. అదే సమయాన క్యాష్ సెక్షన్ లో తనకు అసిస్టేంటుగా ఉండేటట్లు, తనకు చేదోడుగా ఉండేటట్లు పార్ట్ టైమ్ అకౌంట్సు క్లర్కుగా కుదుర్చుకుంది; దైవ కార్యంతో బాటు స్వకార్యమూ సజావుగా సాగాలంటే ఆమె ముందున్న రాజమార్గం అదొక్కటే కదా!

-------------------------------------------------------------------------------------

ఒక రోజు సాయంత్రం మెస్సునుండి ఇంటికి వచ్చి స్నానం కానిచ్చి దైవప్రార్థన ముగించిన తరవాత కాంతం అందిస్తూన్న కాఫీ కప్పుని తీసుకుంటూ పడక కుర్చీలో చేరబడబోయిన రామభద్రాన్ని పిలిచాడు రాఘవయ్య-

“అందేంవట్రా భద్రయ్యా! ఈ మధ్య లలిత గురించి అసలు ప్రస్తావించడమే మానుకున్నావు. నా అనారోగ్యం వల్లనో మెస్సు పనుల వల్లనో-- ఎంత హడావిడిగా ఉంటే మాత్రం తోబుట్టువుని మర్చిపోతారా యేమిటి? లేక మీ చెల్లి పైన కోపం కలిగిందా ఏమిటి?"

మొదట తెల్లబోయినట్టు చూసి బదులిచ్చాడు రామభద్రం- “లలితపై నాకెందుకు కోపం బాబూ! ”

“ఇంకెందుకట? డబ్బులు అడుగుతుందని-- ఇక్కడి పరిస్థితులు దానికి తెలియవు కదా—స్వెట్టర్ల కొనుగోళ్లూ- రజాయీ కొను గోళ్లూ- పిల్లకాయల స్కూలు చదువులూ—నేను ఆస్పత్రిలో చేరిన వైనమూ దానికి తెలియదు కదా—” అంటూ చెప్పడం ఆపి కొడుకు కళ్ళలోకి తేరి చూస్తూ కొనసాగించాడు.

“లలిత ఉత్తరం వ్రాసింది. ఇది మూడవ ఉత్తరం. నీ పరిస్థితే మీబావకు కూడా యెదు రైనట్లుంది. వాసు పనిచేస్తూన్న నలభీమ రెస్టారెంటు మూసేవేసారట. ఇద్దరు పిల్లల గలవాళ్లు. ఎంతటి ఇక్కట్లు పడుతున్నారో! ఇప్పటికైనా వాళ్ల దుస్థితి అర్థం చేసుకోరా! ”

అంతలో తాయారమ్మ కూడా వచ్చి కొడుకేమంటాడోనని ముఖంలోకి చూస్తూ నిల్చుంది. అప్పుడు కాసేపాగి స్వగతంలా అన్నాడు రామభద్రం- “మరిక్కడకు వచ్చేస్తే ఉద్యోగమో! బావకు అక్కడున్నంత మంది పరిచయస్థులు ఇక్కడుండరు కదా! ”

“రూపవతి మేడమ్ వద్దకు వెళ్లి మా బామ్మర్ది ఉపాధికి మార్గం చూపించమని అడిగి చూడు--”.

అతడేమీ అనలేదు. కాఫీ తాగు తూ ఉండిపోయాడు. సమస్య అటు తిరిగి ఇటు తిరిగి కడకు యిటే వస్తుందని అతడికి తెలుసు. మరి ఇస్తుంది కదానని రూపవతి సహానుభూతిని మరీ సాగదీస్తే పలచబడ్డ మజ్జిగలా తెగిన గాలిపడగ దారంలా బెడిసి కొట్టదూ! ఒకసారి తెగితే మళ్లీ మరొక సారి అతుక్కుంటుందా!

ఈసారి కాంతం కూడా అక్కడకి చేరింది- “మిమ్మల్ని చూస్తుంటే నాకోక సామెత గుర్తుకొస్తుందయ్యా! ఎక్కువ పుణ్యం సంపాదించడానికి సముద్రంలో మునకేస్తే ఉన్నది కూడా ఊడిందట. ఒక వేళ మా ఆడపడుచు వస్తానన్నా, మనం దానికి సరేనన్నా మరి వాళ్ళకు బిడ్డలెంత మందో ఆలోచించారా! ఇద్దరు. అంత మందికి అద్దె ఇల్లు మాట్లాడి ఇవ్వగల స్తోమత మనకుందా! ” అని యిటు విసురుగా తిరిగి భర్తనుద్దేశించి కొనసాగించింది-

“ఆ తరవాత మీ మేనగోడలి చదువూ—మేనల్లుడి చదువు గురించి మళ్లీమేడమ్ గారి వద్దకు వెళ్లి సహాయం అడుగుతారా? అప్పుడు మొత్తానికి మోసం వస్తే--”

అంటే—అన్నట్టు భార్య ముఖంలోకి చురుగ్గా చూసాడు రామభద్రం.

“అది కూడా నానోటంట రావాలనే చూస్తున్నారా! మీ పిల్ల లిద్దర్నీ స్కూలు ఫైనల్ వరకూ మెట్లెక్కించాలని ఉబలాటపడుతున్నారే, అది బెడిసి కొడ్తే-- అలాగ్గాని జరిగితే మీరు తట్టుకో గల రేమో గాని-- నేను మాత్రం తట్టుకోలేను. మనం ఇంత వరకూ ఊరు కాని ఊరుకి వచ్చి తంటాలు పడ్తున్నది వాళ్ల భవిష్యత్తు కోస మేగా! ”

రామభద్రం బరువుగా నిట్టూరుస్తూ ఖాలీ కప్పుని ప్రక్కన పెట్టి లేవబోయాడు. రాఘవయ్య కొడుకుని ఆపాడు. ”బాగా వినరా భద్రం! లలిత పిల్లలిద్దరికీ నువ్వు మేనమామవి. వాళ్ళ బోగోగుల విషయంలో నీకు బాధ్యత ఉంది. కాదన లేని బాధ్యత ఉంది-- ”

రామభద్రం ఓసారి భార్యవేపు, మరొకసారి తల్లి వేపు చూసి నిశ్శబ్దంగా కదలి వెళ్ళిపోయాడు.

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.33 views0 comments

Kommentare


bottom of page