top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - పార్ట్ 9


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 9' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 9' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.

అతను ఆఫీసుకు రాకపోవడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది రూపవతి. అతను పార్కులో ఎవరితోనో గొడవ పడ్డట్టు తెలుసుకొని బాధ పడుతుంది. అతని పిల్లల స్కూల్ అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానంటుంది.


చెప్పినట్లుగానే అడ్మిషన్ ఇప్పిస్తుంది. ఆమె తనకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహిస్తాడు రామభద్రం.

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 9' చదవండి.


ఏ కారణం చేతనో ఆ రోజు మెస్సులో కస్టమర్ల రద్దీ అంతగా లేదు. వరుస సెలవులు రావడం వల్ల వాళ్ళ వాళ్ల ఊళ్ళకి రెగ్యులర్ కస్ట మర్లు తరలి వెళ్లిపోయినట్టున్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు- కుటుంబాలతో గడిపి రావడానికి. అప్పుడు రూపవతి ఏదో బ్యాంకు పని పైన వెళ్లినట్లుంది. ఆ సమయాన మంజుల వంటశాల వరకూ వచ్చి లోపలకి తొంగి చూసి పిలిచింది రామభద్రాన్ని-- “డ్రెస్ మార్చుకుని వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి”.


అతడు వెంటనే అనుకున్నాడు— ఏ విషమై తనతో మాట్లాడబోతుందో తనకు తెలియనిదా! అతడు తలూపుతూ సోమనాధం వేపు అర్థవంతంగా చూపు సారించి బట్టలు మార్చుకునే కౌంటర్ గది వేపు వెళ్ళాడు.


అప్పుడు సోమనాధం మనసు కూడా నిలకడ కోల్పోయి రెపరెపలాడింది. అతడి జీవిత గమ్యం ఇప్పుడు వాళ్లిద్దరి చేతు ల్లో- ముఖ్యంగా రామభద్రం చేతుల్లోనే ఉంది. ఎప్పుడూ ఎటూ మనసు పోనివ్వని తను మంజుల వేపు తేరిచూడనారంభించాడు. పదే పదే తలపోయ నారంభించాడు.

ఇటువంటి విషయాలలో మనసుకి కూడా మరొక మనసుంటుందేమో! అతడికి త్యాగయ్య కళ్ళ ముందు మెదిలాడు. ఆదితాళంతో నాటకరాగంలో ఆయన పాడిన కీర్తన మదిలో కదలాడింది.

“ఎందరో మహానుభావులంద రికీ వందనములు- చందురు వర్ణుని యందచందమును హృదయార విందమునcజూచి బ్రహ్మానంద మనుభవించుకువారు—ఎందరో మహానుభావులు!”

ఇప్పుడతని చూపులో రామభద్రం నిజంగానే ఒక మహానుభావుడనేమో!


రామభద్రం పార్కువేపు నడుస్తూ అసంకల్పితంగా మంజులదేవి ముఖంలోకి చూసాడు. నుదుట మంగళకరమైన గుండ్ర టి బొట్టు మెరుస్తూంది. తనకు తెలిసి ఆమె అటువంటి ప్రత్యేకమైన బొట్టు పెట్టుకొనిరావడం తను చూడలేదు. ఆడదానికి అదొక సంతోషకర శుభకర సంకేతమేమో! అలా నిశ్శబ్దంగా నడుస్తూ పార్కులోకి ప్రవేశించి చెట్టు క్రింది చప్టాపైన కూర్చున్నారిద్దరూ--

మొదట అతనే ఆరంభించాడు సంభాషణ- “ఉఁ! చెప్పండి మంజులగారూ! ”


దానికామె చిన్నగ నవ్వి అంది- “నాకు మరీ మర్యాద లు పోసి పెద్దదాన్ని చేసి పలకరించకండి. మీతో రెండు విషయాలు ప్రస్తావించాలి. రెండూ ముఖ్యమైనవే! కాస్తంత పెద్దమనసు చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని కోరుతున్నాను”


“నాకంటూ మనసన్నది ఉందని మీరు నమ్మితేనే--- “


దానికామె పక్కున నవ్వేసింది. “మీకు మనసన్నది ఉంది కాబట్టి నేను మీ పనులకు ఆటంకం తెచ్చి ఇక్కడకు పిలుచుకు వచ్చాను. మొదటి విషయం మా వదిన గురించి-- ఆమెకు మా అన్నయ్యంటే చాలా ప్రేమ. పంచప్రాణాలు”


“ఇందులో వక్కాణించి చెప్పడానికేముంది మంజులా? బుర్రమీసాలతో మీ అన్నయ్యగారి పెద్దపాటి ఫోటో చెప్పడం లేదూ! ”


“ఇక్కడే ఉంది కీలకాంశం రామభద్రంగారూ! కొంచెం గుండె దిటవు చేసుకుని కకావికలం కాకుండా వినండి-- మా అన్నయ్య యిప్పుడిక్కడ లేడు”


ఆ మాటకతడు చిన్నగ నవ్వి స్పందించాడు- “అతనెక్కడో రాజస్థాన్ లో యేదో ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నాడని నాకు తెలుసు“ .


అది విని మంజుల తల అడ్డంగా ఆడించింది. ”మా అన్నయ్య అక్కడ కూడా లేడు. నిజానికి అన్న య్య ఈ లోకంలోనే లేడు“.


రామభద్రం ఉలిక్కి పడ్డట్టయాడు. అర్థ రహితంగా చూసాడు.


“ ఔను. సరి హద్దు పోరాటంలో నాలుగేళ్ళ ముందే చనిపోయాడు”.


ఆ మాటతో రామభద్రం కళ్ళు పెద్దవి చేసుకుని అలాగే కొన్ని క్షణాల సేపు చూస్తూండిపోయాడు చూపు మరల్చకుండా--. తను వింటున్నది నిజమేనా? లేక అదేదో థ్రిల్లర్ సినిమాలో ని సీనులా భ్రమించి నిల్చుండిపోయాడా? ఎట్టకేల కు అతడి పెదవి విప్పగలిగాడు-


“మరి ఇన్నాళ్లూ ఆమె నుదుట బొట్టు పెట్టుకుని అప్పుడప్పు పట్టుచీర కూడా కట్టుకుని- భర్త లీవు తీసుకుని వస్తున్నాడంటూ మంగళూరుకి బయల్దేరడం—ఇవన్నీ వాస్తవాలు కావా? ”


దానికి మంజుల తల అడ్డంగా ఆడించి చెప్పసాగింది- “మీరన్నట్టు అవన్నీ వాస్తవాలు కావు. ఒక పధ్ధతి ప్రకారం మా వదిన అలా చేయాల్సి వస్తూంది. అలా చేయడానికి ఆమెలోని సహజమైన మానసికపరమైన లోపం ఒకటుంది. అదేమంటే-- ఆమె సాధారణంగా ఎవ్వరినీ నమ్మదు; ముఖ్యంగా అపోజిట్ సెక్స్ వాళ్ళను-- అదంతా దూరపు కొండల నునుపనుకుంటూ ఎవరి మంచినీ నమ్మటానికి సిధ్ధపడదు.


ఇకపోతే, అసలు విషయానికి వస్తే- మా వదినను మరు మనువాడటానికి, మా దూరపు బంధువులు కొందరు అభ్యుదయ వాదులమంటూ ముందుకి రాక పోలేదు. మా యింట్లోవాళ్లు కూడా వదిన పెళ్ళికి అభ్యంతరం చెప్ప లేదు. దానికి మారుగా ప్రోత్సహించారు కూడాను. ఎలాగూ వదినెకు పిల్లా పీచూ లేరుగా—అందుకని-- కాని ఎవరినీ నమ్మకుండా అందర్నీ దూరంగా ఉంచి ఇక్కడకు వచ్చింది. చాలా వరకు ఇదంతా సైకలాజికల్ అంశం, అనుమానపు ప్రవృత్తీనూ—“


అతడు ఆసక్తి ఆపుకోలేక అడిగాడు- అదేమిటని--


“ఆమె చూపులో మా అన్నయ్యకంటే మంచి వ్యక్తీ సహృదయుడూ ఈ ప్రపంచంలో మరొకడు లేడు. అంచేత అతడితో బాటే తన జీవితం ముగిసి పోయిందన్న వైరాగ్యం-- ఆ తరవాత-- తనను రెండవ సారి మనువాడటానికి వస్తున్నవారందరూ తనకున్న ఆస్తిపాస్తులు చూసే వస్తున్నారు గాని—పెద్ద మనసు చేసి- తన వ్యక్తిత్వా న్ని చూసి కాదని, అలా అనుకోవడానికి కారణం ఉంది.


అదేమంటే- మా వదిన పేర హుబ్లీలో యాభై ఎకరాల పంట భూముంది. నిజంగా చూస్తే- మైసూర్ యూనివర్సిటీ బిజినస్ డిగ్రీ సంపాదించిన మా వదిన తిరుగులేని ఆస్థిపరురాలు. పెద్దపాటి కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించ గల సమర్థనీయురాలు. మరైతే- ఇంత దూరం వచ్చి నానా అగచాట్లు పడుతూ ఇక్కడ మెస్సు నడపవలసిన అ వసరం ఏమొ చ్చిందన్నదేగా మీ అనుమానం—అంతే కదూ! ”


అతడు కళ్ళప్పగించి చూస్తూ ఔనన్నాడు.


“చాలా వరకు ఇది మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం. ఈ మెస్సుని బ్రతికున్నరోజుల్లో ఆమె తండ్రే నడిపేవారు. దీనిని అమ్మకానికి పెట్టమని కొందరు వచ్చి అడిగిన మాట కూడా వాస్తవం. కాని అలా జరగడానికి వీలు లేకుండా పోయింది. కారణం- ఏది ఏమైనా ఇక్కడ ఉద్యోగం చేస్తూన్న వారిని తీసివేయడానికి వీల్లేదని ఆంక్ష విధించాడాయన బ్రతికున్నరోజుల్లోనే! ఐతే—ఒక కోణంలో ఇసుమంత సడలింపు చేయడానికి కూడా అంగీకరించాడు.


మా వదిన గాని మరుమనువాడితే—భర్తతో కలసి మెస్సుని నడిపించే తీరాలన్నారాయన. అలా నడిపించడానికి తన కాబోయే భర్త గాని ఒప్పుకోక పోతే మెస్సు మూసి తను కొత్త మెట్టింటికి వెళ్లిపోవచ్చని అంగీకారం తెలిపాడు. ఏది ఏమైనా వదినకు తన కాబోయే భర్త మాట మాత్రమే శిరోధార్యమని వక్కాణించాడు మా మామయ్య, ఆ విధంగా మా వదిన రెండు కాళ్ళకూ బంధాలు పడ్డాయి.


తండ్రి కోరిక ప్రకారం మరు మనువాడి మెస్సుని సేల్స్ కి పెట్టి వెడలి పోవచ్చు. అంటే-- అంతవరకూ ఇక్కడే ఉండి మెస్సుని నడిపిస్తూ ఉండాలి. మంచం పట్టిన తండ్రిమాటను అప్పటికప్పుడు మనసా వాచా కర్మణ: కాదనలేక వదిన రెండు చర్యలు చేపట్టింది. మొదటిది- నన్నూ మాలినీని ఇక్కడకు తోడుగా తీసుకురావడం.


రెండవది—ఇక్కడి పరిస్థితులను బట్టి తన భర్త ఇంకా సర్వీసులోనే ఉన్నాడన్నట్టు భ్రమ చుట్టు ప్రక్కల వారికి కలుగచేస్తూ గడపడం- అదే సమయాన అసాంఘిక శక్తుల నుండి తనను తను కాపాడు కోవడానికి ఇద్దరు పయిల్వాలను నియమించడం—“


ఆ మాట విన్నంతనే అతడు ఆశ్చర్యపోతూ అడిగాడు-- “నేనింత వరకూ వాళ్ళెలా ఉంటారో చూడనేలేదే--” అని.


దానికి బదులిచ్చిందామె- “ఔను. నాకు తప్ప- మాలినికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లిద్దరికీ ప్రతినెలా కొంత భత్యం ఇవ్వాలి. మా మూలు కస్టమర్లలా వస్తూ పోతుంటారు. ఇక అసలు పాయింటుకి వస్తున్నాను. చాలా రోజుల తరవాత- మా వదినలో రవంత మార్పు కనిపించింది. అదేమంటి- మీలోని మంచితనం—నికార్సయిన వ్యక్తిత్వం వదినకి నచ్చింది. ఎట్టకేలకు మీపైన నమ్మకం పరిపూర్ణంగా కలిగినట్లుంది”


రామభద్రానికి నిజంగానే ఆశ్చర్యపోయాడు. ” నాపైన విశ్వాసం కలిగితే ఏమి లాభం మంజులా! నేను వివాహితుణ్ణి కదూ! నాకు ఇద్దరు కొడుకులున్నారన్నది మేడమ్ గారికి కూడా తెలుసు కదా! మొన్న స్కూలు ఆవరణలో మా కుటుంబ సభ్యులందర్నీ చూసిందామె. ఇక నా వేపు చూపు మరల్చడంలో నాకు దగ్గరవడంలో అర్థమేముంటుంది? ”


ఆ మాటకామె పేలవంగా నవ్వింది. ”అందరికీ ఆడదాని మనసు అర్థం కాదు. అందునా మా వదినంతటి లోతైన స్త్రీమూర్తిని అర్థం చేసుకోవడానికి ఒక జన్మ చాలదు. మీరు మరీ మొహమాటంతో మరీమరీ ఆమెనుండి దూరంగా తొలగి పోతుండటం చూస్తే మీ మానసిక తత్వం తెలుస్తూనే ఉంది కదా; మీకంటూ బలీయమైన స్వంత అభిప్రాయాలు ఉన్నాయని- మీరు ధన్యులని-"


రామభద్రం కళ వళ పడ్డాడు. ఇంతవరకూ తను అనుకుంటున్నది ఒకటి—ఇప్పుడు స్వయంగా వింటున్నది మరొక టీను-- అనివార్య పరిస్థితుల వల్ల భర్తకు దూరం కావడం వల్ల ఏర్పడ్డ వియోగాన్ని భరించలేక తమ మెస్సు మేడమ్ తనతో యెడనెడ పొద్దు పుచ్చడానికి చనువు చూపిస్తుందను కున్నాడు; సహజ వాంఛిత ప్రలోభ వీచికల ప్రకంపనలకు లోనవుతూ-- పైకి గంభీరంగా కనిపిస్తూ మోతాదున పెద్దరికం చూపిస్తూ తన తండ్రిగారి మెస్సులో నిర్వహణ సాగిస్తూ హడావిడి చేసే రూపవ తి నిజంగా వితంతువన్న మాట! మనసు అలజడిని తట్టుకోలేక తనకు దగ్గరవడానికి అల్లనల్లన ప్రయిత్నిస్తుందన్నమాట!


భగవంతుడా! ఇప్పుడు—ఇదంతా తెలుసుకున్న తరవాత, తను ఆమెనుండి దూరంగా తొలగి ఉండటం ఎలాసాధ్యం? తన కుటుంబం యావత్తు ఇప్పుడు ఢీల్లీ నగరంలో నిటారుగా ఉండగలుగుతున్నదంటే-- ఆమె చాచిన గొడుగు క్రింద తలదాచుకు నేగా!


అప్పుడు అతడి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ మంజులాదేవి అంది- “అదేంవిటి అలా ఉండిపోయారు రామభద్రం? మా వదిన గురించి చెప్పిందంతా విని స్టన్నయి పోయారన్నమాట—”

అతడు తలూపుతుండగా ఆమె మళ్లీ అందుకుంది—“ఇక్కడ ఆడదాని మనసు గురించి ఆరిందానిలా ప్రస్తావించానే గాని—అసలు విషయాం విడమర్చి చెప్పనే లేదు. అదేమంటే- అన్ని సందర్భాల లోనూ కాకపోయినా కనీసం కొన్ని సందర్భాలలోనైనా మన మనసు మన మాట వినదండీ! ఇదే వాస్తవం. ఈ వాస్తవాన్ని మీవంటి సఛ్చీలురు ససేమిరా కాదన వచ్చు. కాని తరవాత— ఏదో ఒక సందర్భాన ఒప్పు కుంటారు. మరొక విషయం. మీలో తేజరిల్లే నిజాయితీ స్వయంగా తెలుకునే మీ పట్ల అభిమానం పెంచుకుంది మా వదిన. అలా మీ పైన నమ్మకం పెంచుకోవడం ఆషామాషీగా మాత్రం కాదు”


అదేమిటన్నట్టు ప్రశ్నార్థంగా చూసాడు రామభద్రం.


“చెప్తాను వినండి. కాని ఇది ఎవరికీ చెప్పకండి. మా మెస్సులోని చాలా మంది వర్కర్లకు— విస్తళ్లు వేసే పనివాళ్లతో సహా-- బైటి కిరాణా షాపు వాళ్ళతో కాయగూరలు పంపిణీ చేసే వాళ్ళతో సహా లోపాయికారి అవగాహన చాలా రోజులుగా ఉంది. అంచేత వాళ్ళకు ప్రతి నెలా కమిషన్ రూపంలో మొత్తాలు అందుతుంటాయి. ఇది మా వదినమ్మకు తెలియదను కుంటారు వాళ్ళు. ఇక పోతే— అటువంటి చిన్నతనపు చిల్లర వ్యవహారాలకు మీరు మాత్రమే మినహాయింపని మా వదిన నాకు స్వయంగా చెప్పింది. అటువంటిదేమీ మీరు ముట్టుకోరట. అల్ప విషయాల పట్ల ఆసక్తి చూపరట”

ఆ మాటతో అతడు రూపవతి ఆడపడుచు వేపు తదేకంగా చూస్తూండిపోయాడు.


రూపవతి నిజంగానే ఒక నిఘానేత్రమే! నెత్తిపైన గిరగిరా తిరిగే డ్రోన్ వాహక యంత్రమే! సందేహం లేదు. చిన్న చిన్న విష యాలలో కూడా ఆమె ఇంతటి లోతైన చూపులతో పాతాళ లోకంలోకి గుచ్చి చూస్తున్నట్టు నిఘా ఉంచ కలుగుతున్నదంటే— ఈమెకు కచ్చితంగా పూర్వజన్మ స్పృహ వంటిదేమైనాఉందేమో!


అప్పుడతని ఆలోచనలకు అడ్డుకట్టవేస్తూ అతడి చేతిని కుదిపింది మంజుల—“ఇక ఇప్పుడు నా విషయానికి వచ్చేదండీ! ”


అతడింకా రూపవతి గురించి ఆలోచిస్తూనే పరధ్యానంగా సరేనన్నాడు.


“మీరు మన చీఫ్ కుక్ సోమనాథంగారి వి షయమై మా వదినకేదో చెప్పినట్టున్నారు. ఆయన గురించి నిజంగా నాకు పూర్తి గా తెలియదని ఒప్పుకుంటాను గాని-- దీనికి మొదట బదులివ్వండి—అతడికి నాపైన ధ్యాస ఉందని మీకెప్పుడు తోచింది? ఇప్పటికే అతడు వివాహితుడే కాక-- విడోయర్— ఒక బిడ్డ తండ్రి కూడాను-- అంతేకాదు— మెస్సు ఓనర్ గారి ఆడపడు చునని కూడా తెలుసు కదా- నాగురించిన అటువంటి తలంపు ఎలా వచ్చింది?"


అప్పుడతను కాస్తంత వ్యవధి తీసుకుని చెప్పసాగాడు-- “ఇన్ని ప్రశ్నలకు ఒకే సారి జవాబివ్వడం కొంచెం కష్టమేనేమో! ఐనా ప్రయత్నిస్తాను. కొన్ని కూరగాయలు మేం బేరమాడుతున్నప్పుడు అవి పైకి పచ్చగా నిగనిగలాడుతూ కనిపించవచ్చు. కాని లోపల అక్కడక్కడ పుచ్చిపోయుండ వచ్చు. దానిని పై చూపుతోనే కనిపెట్టాలంటే అనుభవం కావాలి. ఇదే అంశం మీకూ వర్తిస్తుంది.


మీరు అందరి పట్లా చూపించే మన్నన పైపైన కనిపించే పటారం కాదని గ్రహించాను. మీరు మా పట్ల చూపించే మంచీ మర్యా దలో ఔదార్యం కనిపించింది. అంచేత మీకు మేలు- అంటే మంచి చేయాలనిపించింది. అదీను మనస్పూర్తిగా-- మీవంటి వారు పిల్లాపాపలతో పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది కదానని ఊహించుకునే వాణ్ణి. ఎందుకంటే- కారణాలు నూరున్నా, వయసు— అందునా ఆడదాని వయసు అల్లు కున్న తీగలా త్వరగా ప్రాకిపోతుంది కదా!


ఇక రెండవ అంశానికి వస్తాను. మేం అప్పుడప్పుడు అలా ఆదివారపు సంతలోకి కలసి వెళ్లి వస్తుంటాం. ఎత్తుగా ఏపుగా పెరిగిన ఉత్తరాది అమ్మాయిలు పచ్చగా విలసిల్లే పంజాబీ స్త్రీలు ఎదురవుతుంటారు. ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా అటువెళ్ళే మగాళ్ల చూపులన్నీ ఆడాళ్ళ కంఠస్వరాలపైనే వ్యాపించి ఉంటాయి.


ఒక్కసారి- ఒక్కసారి కూడా సోమనాథం చూపు అటు వేపు ఆబగా వెళ్లడం నేను చూడలేదు. ఈ విషయంలో నాకే మనిపించిం దంటే—ఇతడికి నిగ్రహింపు అధికం—స్త్రీల పట్ల గౌరవ భావం మిక్కుటం. ఇక అసలు విషయానికి వస్తే, నేను రెండు మూడు సార్లు చూసాను కూడాను-- గోడ ఓర నుంచి సోమనాథం మిమ్మల్ని తదేకంగా చూస్తూ నిల్చోవడం. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది—

ఎవరి వేపూ కన్నెత్తి కూడా చూడని సోమనాథం మిమ్మల్ని మాత్రం తదేకంగా చూడటమేమిటని? అంటే—దాని అర్థం- మీరు అతడి కళ్లకు నిండుగా ఆశగొల్పేలా కనిపిస్తున్నారన్నమాట!

అతడికి ఒక ఆడకూతురుందన్నమాట వాస్తవమే—


ఆ పిల్లను అతగాడి వితంతు వదినలిద్దరూ చూసుకుంటున్నారు. ఇంతకీ అతడు బొత్తిగా లేనివాడేమీ కాడు. తంజావూరులో రెండు మూడు అరటి తోటలతో బాటు వరి పొలాలు గట్రా ఉన్నాయి. కొన్ని కారణాంతరాల వల్ల అక్క ణ్ణించి తొలగి ఉండాలన్న ధ్యాస తోనే ఇక్కడకు వచ్చేసాడు ఐన వాళ్ళందరినీ విడిచి-


ఇక ముఖ్యమైన సంగతి—అతడికి ఊరినుంచి చాలా సంబంధాలే వస్తున్నాయి. కాదంటూ తొలగిపోతూనే ఉన్నాడు. అతడికి గాని- అందునా మీవంటి సంస్కారవంతురాలు మృదు మనస్కురాలు సహచరిగా లభిస్తే తప్పకుండా ఊరినుండి తన కూతుర్ని ఇక్కడకు తెచ్చుకుంటాడేమో- ఇకపోతే- చివరి మాటగా ఒకటి చెప్తాను—సావధానంగా వినండి.


భూమిపైన చాలా చెట్లు—పచ్చ పచ్చగా—రంగులు రంగులుగా మురిపాలు చిందిస్తూ కనిపిస్తాయి. కాని అన్నిటి మధ్యా వటవృక్షం మాత్రమే ఆటు పోటులకు ఎదురీది గాలి వీచికలకు యెదురొడ్డి నిలకడగా నిల్చుని నీడనిస్తుంది. ఇక-- మీరు ఆలో చించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇందులో తొందరపాటుకి లోనుకావటానికో—ఒత్తిడికి లొంగిపోవడానికో ఆస్కారమే లేదు. వ్యక్తి త్వం గల స్త్రీ మీరు. మంచి నిర్ణయమే తీసుకోగలరు. ఇక మనం వెళ్దామా మంజులా!” అంటూ చప్టాపైనుంచి లేచాడతడు.


తల దించుకున్నది తలదించుకున్నట్లే మంజుల కూడా లేచింది- పైకి తలెత్తి చూస్తూ—ఆమె కళ్ళకు ఆకాశం విచ్చుకున్న మల్లె పూవులా ఉంది.


\అదే రోజు సాయంత్రం యథా ప్రకారం మెస్సులోని దేవుడి పటాలకు హారతినిచ్చి రూపవతి రామభద్రాన్ని చుట్టు ప్రక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని నుదుట బొట్టు పెట్టింది. మునుపైతే, తను ముందే పెట్టుకున్నాననో- లేక తనే కుంకుమ తీసి పెట్టు కుంటాననో చెప్పి తప్పించుకునే వాడు రామభద్రం. కాని ఆరోజు మాత్రం అతడు కాంతం ముందు నిల్చున్నట్టు భక్తి పూర్వకంగా తలవంచి ఆమె కోరికను మన్నించాడు.


ఈ ప్రపంచంలో ఇంకా సభ్యతా సంస్కారాలుగల మృదుస్వభావులు పొల్లులేని గింజల్లా అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఎదుటి వారిని;అందునా విశాల హృదయులైన రూపవతి వంటి స్త్రీలను ముఖా ముఖి కాదనలేరు. వాళ్ళను గాయపరిచి - ‘నాకేమొచ్చిందిలే! ’అన్నరీతిన ఇష్టారాజ్యంగా మనుగడ సాగించ లేరు.


రూపవతి వంటి స్త్రీల ముందు తాముగా వినమ్రులై ఆదే శించినప్పుడల్లా ఉపాసకుల్లా శిరసావహిస్తూనే ఉంటారు, ఏదో అదృష్యశక్తి అల్లంత దూరం నుంచి సంకేతమిస్తున్నట్టు. ఏమో—ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమేమో గాని తను రూపవతి సౌందర్యం ముందు నడుమొంపుల ముందు లొంగి పోతున్నాడేమో!


రామభద్రానికి వేమన గుర్తుకి వచ్చాడు సముద్రహోరులా—


“వెర్రి వానికైన వేషధారికైన

రోగికైన పరమయోగికైన

స్త్రీల జూచునపుడు చిత్తంబు రంజిల్లు “


ఈ విషయంలో తను కూడా సగటు మనిషేనేమో--

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



31 views0 comments

Kommentare


bottom of page