top of page

చెత్త సినిమా

Updated: Jul 31

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #ChetthaCinema, #చెత్తసినిమా, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Chettha Cinema - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 22/07/2025

చెత్త సినిమా - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

ఎమ్మెల్యే గోవర్ధన్ బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ తీసుకున్నాడు. 


ఇంతలో అతను ఫ్రీ గా ఉండడం చూసి ఐదుగురు వ్యక్తులను లోనికి పంపాడు గోవర్ధన్ పర్సనల్ సెక్రెటరీ. 


వచ్చిన వ్యక్తుల్లో ఒక మనిషి "నమస్తే సార్!" అంటూ వచ్చి "సార్ ఈయన 'బెండు కుమార్ బాబు' అని గొప్ప డైరెక్టర్ సార్" అంటూ పరిచయం చేసారు. 


అతన్ని చూసిన గోవర్ధన్ "నాకెందుకు తెలియదు? న్యూస్ లో చూస్తుంటాను" అన్నాడు. 


కూర్చోండి అనగా అందరూ కూర్చున్నారు. 


"చెప్పండి ఇంతకీ ఏం పని మీద వచ్చారు" అని అడిగాడు ఎమ్మెల్యే గోవర్ధన్. 


దానికి బెండు కుమార్ "అదే సార్! ఇప్పుడు లేటెస్ట్ గా నేను తీస్తున్న సినిమా 'నీచాతినీచుడు' అని పాన్ ఇండియా సినిమా కంప్లీట్ అయింది. ఓపెనింగ్ భారీ ఫంక్షన్ చేస్తున్నాను. మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి" ఆహ్వానించాడు బెండు కుమార్. 

"ఆహా అవునా! ఇంతకీ కథ ఏంటి?" క్యూరియాసిటీగా అడిగాడు గోవర్ధన్. 


"చాలా బాగుంటుంది సార్. నవరసాలు కలిసిన మూవీ"


"మరీ టైటిల్ ఏంటయ్యా 'నీచాతి నీచుడు' అని పెట్టావు" సందేహంగా అడిగాడు గోవర్ధన్. 


"అవును సార్! ఇప్పుడు నెగటివ్ టైటిల్స్ దే హవా. ఎంత దిగజారి పెడితే అంత పబ్లిసిటీ" అన్నాడు బెండు కుమార్. 


"అయినా మరీ అంత దరిద్రంగానా" అసంతృప్తిగా అన్నాడు గోవర్ధన్. 


"సార్ మీరు సినిమా కథ వింటే ఈ టైటిలే కరెక్ట్ అంటారు. విన్న ప్రతి ఒక్కరు ఇదే సరిగ్గా ఉంది అని ఫీల్ అయ్యారు" అన్నాడు డైరెక్టర్. 


"అవునా! సరే కథ ఏంటో చెప్పు" అడిగాడు గోవర్ధన్. 


బెండు కుమార్ గొంత సవరించుకొని "హీరో బేసిగ్గా కూలి పనికి పోతుంటాడు సార్! ఆ కూలి డబ్బులతో ఎన్నాళ్లకు పైకి వస్తామని చెప్పి దొంగతనాలు మొదలు పెడతాడు. అలా పెంచుకుంటూ పోయి ఆ డబ్బులు సరిపోలేదని దోపిడీలు చేస్తాడు. అలా వచ్చిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ ఒక ప్రముఖ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ఉంది సార్. భలే ఉంటుంది 'వస్తావా రావా డించిక్ డించిక్' అంటూ భలే సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్! ఇలా మందు, సిగరెట్లు డ్రగ్స్ తీసుకుంటూ, కనిపించిన అమ్మాయిని వెంట పడుతూ, డబ్బులు ఇస్తాను వస్తావా? అని ఆఫర్లు ఇస్తుంటాడు. ఇక్కడ భలే తమాషా సార్! ఇలా అందరు అమ్మాయిలనూ అడగడం గమనించిన హీరోయిన్ ‘అందరి వెంట పడుతున్నావ్. నా వెంట ఎందుకు పడడం లేదు?’ అని హీరోని నిలదీస్తుంది. ఇక్కడ భలే కామెడీగా ఉంటుంది సార్! దానికి హీరో ‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అందుకే అడగలేదు’ అంటాడు. 


హీరోయిన్ తనని పెళ్లి చేసుకోవాలంటే కోటి రూపాయలు తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తుంది సార్! దానికోసం హీరో మాఫియా మైంటైన్ చేసి, చేయకూడని పనులన్నీ చేసి కోటి రూపాయలు తెస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. తర్వాత హీరోయిన్ ఎన్నాళ్ళు ఇలా ఉంటాము మనము గొప్ప స్టేజ్ కి పోవాలి కదా! రాజకీయాల్లోకి వెళ్దాం అంటుంది. 


దాంతో హీరో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే అవుతాడు. ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసి మినిస్టర్ అవుతాడు. తర్వాత ముఖ్యమంత్రిని చంపించి తానే సీఎం అవుతాడు. తర్వాత రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం మొదలు పెడతాడు. 4 లక్షల కోట్లు సంపాదించి ప్రధానమంత్రి కావాలని ప్లాన్లు వేస్తాడు.."


చేతిలోని పేపర్ విసిరి కొట్టి "ఆపరా" అని గట్టిగా అరిచాడు ఎమ్మెల్యే గోవర్ధన్. 


ఉలిక్కిపడ్డాడు డైరెక్టర్. 


"ఇందులో ఏం నీతి ఉందిరా?" కోపం గా అడిగాడు గోవర్ధన్. 


"నీతి అంటే అది.. నీతి.. నీతి ఎందుకు సార్ మనకి " తడబడ్డాడు బెండు. 


"జనాలకి ఏం మెసేజ్ ఇచ్చావు రా?" మళ్లీ ప్రశ్నించాడు గోవర్ధన్. 


"మెసేజ్ లంటే అది.. మెసేజ్ లు మనకెందుకు సార్. ఏదో ఎంటర్ టైన్మెంట్" అన్నాడు బెండు.

 

ఎమ్మెల్యేకి ఎక్కడో కాలింది. 


"ఆ బోడి ఎంటర్ టైన్మెంట్. నీ తొక్కలో ఎంటర్టైన్మెంట్ ఎవడిక్కావాల్రా?" కోపంతో అరిచాడు గోవర్ధన్. 


 డైరెక్టర్ షాకింగ్ గా చూస్తూ ఉండిపోయాడు. 


"ఏంట్రా.. హీరో దొంగతనాలు దోపిడీలు చేసి పైకొస్తాడా? హీరోయిన్ మాఫియాలా మారమంటుందా? చిత్తకార్తెలా కుక్కలా తిరిగే వాడు హీరోనా? హీరోయిన్ అలాంటి వాడివెంట పడుతుందా? అంటే అదికూడా అలాంటిదేనా? హీరోయిన్ కారెక్టర్ లను కూడా పాడు చేస్తున్నారా? ఇలాంటి దరిద్రపు గొట్టు సినిమాని నేను లాంచ్ చేయాలా?ఇలాంటి సినిమాలు తీసి ఎవర్ని చెడగొడదామనిరా? యూత్ వీటిని చూసి దొంగలు స్మగ్లర్ లుగా తయారు కావాలా? ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటారా? పైగా రాజకీయాల్లోకి వస్తాడా? రాజకీయాలను కూడా చెడగొడతాడా?" నిలదీశాడు గోవర్ధన్. 


 డైరెక్టర్ నీళ్లు నములాడు. 


ఎమ్మెల్యే చెప్పుకుపోతున్నాడు. "హీరో అంటే అందరికీ ఆదర్శంగా ఉండాల్రా. మంచికోసం, పదిమంది బాగు కోసం పోరాడే వాడు హీరో. హీరో, హీరోయిన్ లకు ఒక వ్యక్తిత్వం ఉండాలి. వాళ్లను చూసి పదిమంది బాగుపడాలి. వాళ్లురా హీరోలు, హీరోయిన్ లు. అదిరా హీరోయిజం. పనికిమాలిన వాళ్లు, డ్రగ్ అడిక్ట్ లు, మోసగాళ్లు, స్మగ్లర్ లు, స్వార్థపరులు హీరోలు ఎట్లయితార్రా?. 


ఒకవేళ కథాపరంగా మొదట చెడు దారిలో నడిచినా అది మంచి పనికోసం అయ్యుండాలి. సెకండాఫ్ లో మారిపోయి మంచిదారికి రావాలి. అదీ మంచి కథ అంటే. సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం. దానిని మంచికి ఉపయోగించాలి. ప్రాథమిక సూత్రాలు కూడా తెలుసుకోకుండా ఎలా డైరెక్టర్ లు అవుతారో? ఇకనైనా మారండి రా. మంచి సినిమాలు తీయండ్రా. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతార్రా పిచ్చోళ్లారా!" అంటూ హెచ్చరించాడు గోవర్ధన్. 


అతని ఉగ్రరూపం చూసి మెల్లిగా పిల్లుల్లా జారుకున్నారు డైరెక్టర్, అతని అనుచరులు. 

 

 -----------------------------------------------------

పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments


bottom of page