top of page

చీకటి వెలుగులు

Writer's picture: Dinavahi SathyavathiDinavahi Sathyavathi

'Chikati Velugulu' - New Telugu Story Written By Dinavahi Sathyavathi

'చీకటి వెలుగులు' తెలుగు కథ

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సుధీర్ ఒక బహుళార్థసాధక కంపెనీలో పని చేస్తున్నాడు. ఉదయం ఎనిమిదింటికల్లా టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు రోజూ. యథా ప్రకారం ఏడింటికల్లా కాఫీ కలిపి తీసుకొచ్చిన లాహిరి, భర్త ఇంకా పడుకునే ఉండడం చూసి నెమ్మదిగా తట్టి లేపింది.


కాఫీ కప్పుతో ఎదురుగా నిలబడిన భార్యను చూసి “అరే అప్పుడే ఏడయ్యిందా?” హడావిడిగా మంచం దిగబోయి నీరసంతో తూలాడు.


“ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? పదండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళదాము” కంగారుపడింది లాహిరి.


“ఎందుకో ఇవాళ నీరసంగా అనిపిస్తోంది లాహిరీ” అన్నాడు తిరిగి మంచం పైన కూర్చుంటూ.


“రాత్రి పడుకోబోయే ముందు మీరు ఎప్పుడూ వేసుకునే మందులు వేసుకున్నారా?”


“ఆ వేసుకున్నాను. కానీ ఈ నీరసం దానివల్ల కాదు అనిపిస్తోంది”


“అయితే ఒకసారి ఆ డాక్టర్ గారికే ఫోన్ చేసి విషయం చెప్పండి”

“అలాగే” ప్రక్కనే బల్ల పైన ఉన్న ఫోన్ అందుకుని చేసాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. మరో రెండుసార్లు ప్రయత్నించాడు. అదే సమాధానం.


“పలకడం లేదు లాహిరీ”


“అయ్యో అవునా! ముందు మీరిలా కదలకుండా పడుకోండి. ఈ దగ్గర్లోనే ఒక డాక్టరు ఉన్నారు. ఆయన హస్తవాసి మంచిదని విన్నాను. ఇప్పుడే వెళ్ళి పిలుచుకుని వస్తాను” కాఫీ కప్పు మంచం ప్రక్కన బల్ల పైన పెట్టి, పరుగున వెళ్లింది.


లాహిరి వెళ్ళగానే నెమ్మదిగా లేచి ముఖం కడుక్కుని, కాఫీ త్రాగి ‘ఈ చుట్టుపక్కల నాకు తెలియని డాక్టరెవరున్నారబ్బా! కొంపదీసి కొత్త డాక్టర్ ఎవరైనా దిగబడ్డాడా? అసలు వాడు లాహిరికి ఎలా తెలుసు? ఎప్పుడూ కలుస్తూనే ఉంటుందేమో! అందుకే అంత నమ్మకంగా చెప్పింది. అంతవరకేనా లేక నా కన్నుగప్పి వీళ్ళిద్దరూ ఏదైనా వ్యవహారం సాగిస్తున్నారా?’ అనుకుని ఒంట్లో అనారోగ్యంకంటే అనుమానపు జబ్బు ఎక్కువ పీడిస్తూంటే, ఎక్కడ లేని శక్తీ కూడదీసుకుని, ఆమెకు తెలియకుండా వెంబడించాడు.

!+!+!+!+!


చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సుధీర్ ని, మేనమామ చేరదీశాడు. కానీ అది ఎంతమాత్రమూ ఇష్టపడని మేనమామ భార్య సాధింపులు ఛీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది సుధీర్. గత్యంతరం లేని పరిస్థితులలో అవమానాలు భరిస్తూనే, ఉపకారవేతనాలపై చదువుకున్నాడు.


చదువైన వెంటనే దొరికిన ఉద్యోగంలో చేరి, నిబద్ధతతో పని చేసి, పై అధికారుల మన్ననలు అందుకుని, అనతికాలంలోనే పెద్ద పదవిలోకి వచ్చాడు. జీవితం సుఖంగా గడిచిపోతోంది అనుకుంటుండగానే డాక్టర్లకి కూడా లొంగని ఓ పాడు రోగం పట్టుకుంది సుధీర్ ని. అది అంటువ్యాధి కాదనీ, క్రమం తప్పకుండా మందులు వాడి వ్యాథి ముదరకుండా చూసుకోవచ్చుననీ, కానీ ఎప్పుడైనా ప్రాణం మీదకి రావచ్చనీ తేల్చారు డాక్టర్లు.


అయితే సుధీర్ సమస్య అదికాదు! అతడు చాలాకాలం నుంచీ సహోద్యోగి లాహిరిని ప్రేమిస్తున్నాడు. చిన్నతనంనుంచీ అనాథాశ్రమంలో పెరిగిన లాహిరి, దాతల సహాయంతో, కష్టపడి డిగ్రీ దాకా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుంది. సుధీర్ మంచితనానికి ఆకర్షితురాలై, ఆమె కూడా తెలియకుండానే అతడిని ప్రేమించసాగింది. అయితే అతడు పెద్ద పదవిలో ఉండటంచేతనూ తమ ఇద్దరికీ మధ్య అంతస్తుల తేడా ఉండడం చేతనూ తన ప్రేమని వెల్లడించడానికి జంకింది.


ఆఫీసు పనిమీద పలకరించినప్పుడల్లా లాహిరి హావభావాలను బట్టి ఆమె కూడా తనని ప్రేమిస్తోందని సుధీర్ గ్రహించగలిగాడు. ‘లాహిరికి నా ప్రేమ గురించి చెపాలనుకుంటున్నప్పుడే ఈ అనారోగ్యం బయటపడింది. ఎంత ప్రేమున్నా ఈ విషయం తెలిసిన ఏ ఆడపిల్లైనా నన్ను చేసుకోవడానికి అంగీకరిస్తుందా?’ తనలో తానే మధనపడసాగాడు.


ఇలా కాదని “నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని లాహిరిని సూటిగా అడిగేసాడు.


అయితే తన అనారోగ్యం గురించిన నిజాన్ని మాత్రం దాచిపెట్టాడు. సుధీర్ ఒకనాడు హఠాత్తుగా పెళ్ళి ప్రస్తావన తెస్తాడని కలలోనైనా ఊహించని లాహిరి ఆనందభరితురాలై వెంటనే అంగీకరించింది. సుధీర్ లాహిరిల వివాహం గుడిలో నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్ళైన తరువాత సుధీర్ అనారోగ్యం గురించి తెలుసుకున్న లాహిరి, విషయం దాచిపెట్టి వివాహం చేసుకున్నాడని ముందు దుఃఖించినా ఇదే అనారోగ్యం పెళ్ళి తరువాత వచ్చుంటే… అనుకుని అతి కష్టం మీద మనసుని సమాధాన పరుచుకుంది.


భర్తని అర్థంచేసుకుని అన్నివిధాలా తోడుగా నిలవాలని నిర్ణయించుకుంది. విద్యావంతుడైన సుధీర్ కి, వదలని శారీరిక రోగంతో పాటు ఉన్న మరొక పెద్ద మానసిక రోగం అనుమానం. అనుమానం జబ్బు పట్టిందంటే వదలడం బహు కష్టం. అది ఆ వ్యక్తితో సహా చుట్టుప్రక్కల ఉన్న అందరి జీవితాలనూ నరక ప్రాయం చేస్తుంది. లాహిరి ఇప్పుడు ఆ నరకంలోనే బ్రతుకుతోంది!


సహజంగా స్నేహశీలియైన లాహిరికి అందరితో నవ్వుతూ సరదాగా మాట్లాడటం అలవాటు. అయినప్పటికీ భర్త అనుమాన గుణం గ్రహించి, జీవితాన్ని ఇంకా దుర్భరం చేసుకోవడం ఇష్టంలేక, భర్తకు అనుగుణంగా మసులుకోవడానికి శతవిధాలా ప్రయత్నించసాగింది.

!+!+!+!+!


భర్త తనని వెంబడిస్తున్న విషయం ఏమాత్రం తెలియని లాహిరి, అతనికి త్వరగా నయమవ్వాలని మనసులో దేవుడిని ప్రార్థిస్తూ, వడివడిగా అడుగులు వేస్తూ, నాలుగిళ్ళ లోగిలిలో ఒక చివరగా ఉన్న చిన్న ఇంటిలోకి అడుగుపెట్టింది. దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ‘డాక్టర్ సుభాష్’ అనే బోర్డు ఉందని కానీ అది ఒక ఆస్పత్రి అనే విషయం కానీ ఎవరికీ తెలియదు.


ఒకసారి పక్కింటి పిన్నిగారు ఒంట్లో బాగాలేదు తోడు రమ్మంటే ఆవిడతో కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చింది లాహిరి. ఆవిడ చెప్పగా వింది హస్తవాసి ఉన్న డాక్టర్ అతడు అని. అది తెలియక సహజమైన అనుమాన బుద్ధితో లాహిరిని వెంబడించి వచ్చిన సుధీర్, ఆమె దృష్టిలో పడకుండా, వేరే వైపునుంచి ఇంటి వెనుకకు వెళ్ళి, అక్కడ చిన్న కిటికీ ప్రక్కన నక్కి, డాక్టర్ గారున్న రూం లోకి తొంగిచూసాడు...


“డాక్టర్ మా వారికి అసలు ఒంట్లో బాగుండలేదు. కదలలేకుండా ఉన్నారు. దయచేసి వెంటనే మీరు నాతో వచ్చి ఆయనను చూడాలి” లాహిరి బ్రతిమిలాడుతోంది.


“ఎవరమ్మా మీరు, అసలు మిమ్మల్ని నేరుగా లోపలికి ఎవరు రానిచ్చారు?”

“నేను వారిస్తున్నా వినకుండా వచ్చేసారు డాక్టర్” వెనకనే వచ్చిన కాంపౌండర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.


“ఏమిటమ్మా ఇది, అయినా మీ ఒక్కరి కోసం వస్తే ఇక్కడి వాళ్లందరిని ఎవరు చూస్తారు? కొంచం అలా బయట కూర్చోండమ్మా” చిరాకుపడ్డాడు కుర్రడాక్టర్.


అతని మాటలకు దుఃఖం తన్నుకు వచ్చి, తన కంటే వయసులో చిన్నవాడైనప్పటికి, గభాలున అతని కాళ్ళ మీద పడి “అలా అనకండి డాక్టర్, మీరు ఎలాగైనా రావాలి. నాకు ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనకేమైనా అయితే నేను బ్రతకలేను. మీరు నాకు తమ్ముడు లాంటివారు. నన్ను ఒక అక్కగా భావించి నా అభ్యర్థనను మన్నించి నాతో రండి” అంటూ ఏడవసాగింది.


ఊహించని ఈ పరిణామానికి డాక్టర్ తత్తరపడి “అరెరె! అదేమిటమ్మా, లేవండి, లేవండి ముందు. సరే, సరే అలాగే వస్తాను పదండి” అప్పటికే పరీక్ష చేయడం పూర్తైన పేషంట్ కి మందులు వ్రాసిచ్చి, కాంపౌండర్ కి ఆస్పత్రి అప్పగించి, మెడికల్ కిట్ తీసుకుని, లాహిరి వెంట బయలుదేరాడు.


ఇదంతా చూసిన సుధీర్ నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకుని, నీరసాన్ని మర్చిపోయి, వాళ్ళకంటే ముందుగా ఇంటికి చేరాలని గబగబా పరిగెత్తినట్లుగా నడిచి, అడ్డదారిలో వచ్చి ఇంట్లో మంచంపై నిస్త్రాణగా వాలిపోయాడు.


పడుకున్నాడన్న మాటేగాని ఆలోచనలు ఇందాక చూసిన సంఘటన చుట్టూనే పరిభ్రమించసాగాయి... ‘మనిషి ఎంత మంచిదో లాహిరి మనసు కూడా అలానే చాలా మంచిది. నే చేసుకున్న పుణ్యంకొద్దీ ఆమెను భార్యగా పొందగలిగాను. అటువంటి దేవతనా ఇన్నాళ్ళూ అనుమానించాను! నా ప్రవర్తన తనని బాధిస్తున్నా అర్థాంగిగా కర్తవ్యం నిభాయిస్తుంటే, నేనేం చేసాను...నా ఒంట్లో జబ్బు దాచి ఆమెను వివాహం చేసుకుని మోసం చేసిందే చాలక ఆ ఉత్తమురాలిని అనుమానించి మరో ఘోర పాపం చేశాను. నా మనసుని అనుమానమనే చీకటి క్రమ్మేయడంతో లాహిరి ప్రేమ వెలుగుని చూడలేకపోయాను.


ఆలుమగల మధ్యన ప్రేమాభిమానాలేగానీ అనుమానాలు అపోహలూ ఉండరాదని, ఇప్పటికి తెలుసుకున్నాను. ఆమె కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకున్నప్పుడే నా పాపానికి ప్రాయశ్చిత్తం’ పశ్చాత్తాపం కన్నీటి రూపంలో హృదయాన్ని ప్రక్షాళన చేస్తుంటే మనసు తేలికైంది సుధీర్ కి. అదే సమయానికి డాక్టరుతో ఇంట్లో అడుగుపెట్టింది లాహిరి.

*****

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


62 views0 comments

留言


bottom of page