top of page

చినుకు తడికి చివురించిన ప్రేమ

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #ChinukuTadikiChivurinchinaPrema, #చినుకుతడికిచివురించినప్రేమ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Chinuku Tadiki Chivurinchina Prema - New Telugu Story Written By - Veluri Prameela Sarma

Published In manatelugukathalu.com On 01/08/2025

చినుకు తడికి చివురించిన ప్రేమ - తెలుగు కథ

రచన: వేలూరి ప్రమీలాశర్మ


"మీరేదో హోటల్ నడుపుతున్నారట కదా! నేను పెద్దగా చదువుకోలేదు. ఈ పల్లెటూరు దాటి బయటకు వచ్చిందీ లేదు. ఏరి కోరి సంబంధం కలుపుకోవడానికి వచ్చారని పెళ్లి చూపుల పేరుతో మీ ముందు నన్నిలా కూర్చోబెట్టారు. సిటీలో పుట్టి పెరిగిన వారికి నాలా పల్లెటూరిలో పుట్టి పెరిగినవారితో అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుందేమో! మరోసారి ఆలోచించుకోండి. వెతికి చూస్తే నాకన్నా అందమైన అమ్మాయి మీకు దొరుకుతుంది. " మనసులో ఉన్న మాటలు బెరుకు లేకుండా ధైర్యంగా చెబుతున్న గీతిక వంక కన్నార్పకుండా చూస్తున్నాడు వినేష్. 


"హోటల్ బిజినెస్ అంటే నీకు సరైన అభిప్రాయం లేనట్టుంది?" సూటిగా పాయింట్ కి వస్తూ అడిగాడు వినేష్. 


 ఆ మాటకి గతుక్కుమన్నట్టు తలదించుకుంది గీతిక. 


"అంటే.. అలాగని కాదు! కానీ అలాంటి చోటికి రకరకాల మనుషులు వస్తారు. వారికి అనువైన ఆనందాలు వెతుక్కోవడానికి అలాంటి చోటికి వస్తారన్న భయం నాకుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం మన మీద చాలా ప్రభావం చూపుతుంది అంటారు. ఇంటిని పవిత్రమైన దేవాలయంగా భావిస్తాం. మనం పని చేస్తూ గడిపే ప్రదేశం కూడా అలాగే ఉండాలని అనుకుంటాను. అందుకే బిజినెస్ చేసే వారిని కాకుండా.. " 


ఆమె ఏం చెప్పబోతోందో అర్థమైంది వినేష్ కి. 


"ఒకసారిలా వచ్చి పక్కన కూర్చుంటావా?" అభ్యర్థనగా అడిగాడు. 


అయిష్టంగానే వచ్చి కూర్చుందామె. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తాను నడుపుతున్న క్యాప్సూల్ హోటల్ కమ్ ఆర్ట్ కేఫ్ కి సంబంధించిన వీడియోలు ఆమె ముందుంచాడు. 


కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా వాటన్నింటినీ పరిశీలిస్తోంది గీతిక. 

 "ఆర్ట్ కేఫ్ అంటే!?"


"చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచీ మనసులో ఉన్న ఆలోచనను కాన్వాస్ పై రంగురంగుల చిత్రంగా మలిచి చూడడం అలవాటు. ఒక చిత్రం గీసిన తర్వాత మనసులో ఉన్న ఒత్తిడి అంతా దూరమైపోయేది. ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించేది. సాఫ్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాక పని ఒత్తిడి వల్ల దేని మీదా దృష్టి పెట్టలేక ఇబ్బంది పడేవాడిని. అలాంటప్పుడు నాకున్న అభిరుచి మేరకు కాన్వాస్ మీద ఏదైనా చిత్రిస్తే బాగుండును అనుకునేవాడిని. కానీ అందుకు సమయం దొరికేది కాదు. జీవితం యాంత్రికంగా మారిపోయింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలూ ఇబ్బంది పెట్టేవి. అన్నింటికీ కారణం ఒత్తిడి అని తేలింది. 


అనుకోకుండా ఒక రోజు మా మామయ్య తనతోపాటు ఊరికి వస్తావా అని అడిగాడు. ఆయనకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సరదాగా పల్లెటూరులో రెండు రోజులు గడపాలనిపించి సెలవు పెట్టుకుని నేనూ బయలుదేరాను. అలా మీ ఊరికి వచ్చిన నాకు బంధువుల ఇంట్లో ఆత్మీయంగా లభించిన ఆదరణ మనసుకి ఊరటనిచ్చింది. యాంత్రిక జీవితం నుంచి ఎంతో రిలీఫ్ కనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను.. పెళ్ళంటూ చేసుకుంటే ఈ ఊరి పిల్లనే చేసుకోవాలని. అదే మాట మావయ్యతో చెబితే ఇదిగో ఇలా.. ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు." తాను ఇంత దూరం రావడం వెనక ఉన్న కారణం చెప్పాడు వినేష్. 


"అది సరే! కానీ.. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని మాకు చెప్పలేదే. ఏదో హోటల్ బిజినెస్ అన్నారు" సందేహంగా చూసిందామె. 


"అవును. చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆర్ట్ కేఫ్ ఒకటి ఓపెన్ చేసాను. ఇదిగో చూడు. ఆర్ట్ కేఫ్ అంటే ఎలా ఉంటుందో.. " అంటూ వివరంగా చూపించాడు. 


 రెండంతస్తుల ఆ భవనంలో పై అంతస్తులో క్యాప్సూల్ హోటల్ నిర్వహణకు అనుకూలంగా డిజైన్ చేయించాడు. సుమారు పదిహేను వరకు సింగిల్ కాట్ వేసి ఉన్న చిన్న చిన్న గదులు.. ఎంతో అందంగా వుడెన్ పార్టిషన్స్ తో ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి సిటీలో పని ఉండి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన గదులు అవి. వాటితో పాటే కింది అంతస్తులో తాను నిర్వహిస్తున్న ఆర్ట్ కేఫ్ కి సంబంధించిన వీడియోలు చూపించాడు. 


 అక్కడికి ఎంతోమంది యువతీ యువకులు వచ్చి సరదాగా తాము గీసుకున్న ఆర్ట్ కి సంబంధించిన గాజు, పింగాణీ, ఇంకా నేచురల్ కలర్స్ అద్దిన మట్టి బొమ్మలూ దాచుకునేందుకు అనువుగా ఏర్పాటు చేసిన షెల్ఫులతో కూడిన ఆహాలు వాతావరణం చూస్తే గీతికకి చాలా సంభ్రమంగా అనిపించింది. తినడానికి రుచిగా వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలు వారి టేబుల్స్ పై నోరూరిస్తుంటే, అక్కడికి వచ్చినవారు అలసటని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడపడం గమనించింది. ఆ హాల్లో వినేష్ కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్న కుర్చీకి వెనుకగా ఉన్న వాల్ పోస్టర్ పై ఆమె దృష్టి నిలిచిపోయింది. పెదవులపై చిరునవ్వుతో ఆ చిత్రాన్ని గమనిస్తున్న ఆమె బుగ్గలు, సిగ్గుతో ఎరుపెక్కడం గమనించి చిన్నగా నవ్వుకున్నాడు వినేష్. 


"ఈ చిత్రంలో ఉన్నది నేనే కదూ!" గుండ్రని కళ్ళు మరింత పెద్దవి చేసి, వేలితో లాప్టాప్ లో కనిపిస్తున్న చిత్రం వైపు చూపిస్తూ అడిగింది గీతిక. 


"అవును. ఆరు నెలల కిందట ఈ ఊరికి నేను వచ్చినప్పుడు కోదండ రామాలయం వైపు వచ్చాను. అప్పటికే వర్షం పడుతోంది. కాస్త తెరిపిచ్చాక, అంతవరకూ ఆలయం ముందు ఆపుకున్న కారులో కూచున్న నేను కారు దిగి, మెల్లగా ఆ చినుకుల తడిలో తడుచుకుంటూ గుడి వైపు అడుగులు వేశాను. అక్కడే మొట్టమొదటిసారి నిన్ను చూశాను. పావంచా వద్ద మెట్లపై గొడుగు వేసుకుని కూర్చుని, వర్షాన్ని ఆస్వాదిస్తున్న నిన్ను చూస్తే నా మనసు ఆనందంతో ఉరకలేసింది. జాజి తీగలాంటి సన్నని నీ శరీరంపై, మంకెనపూ రంగులో ఉన్న అద్దాల చీర మెరుస్తూ.. తళుక్కుమంటున్న చినుకుల అందంతో పోటీపడుతోంది. వదులుగా అల్లిన నీ జడ అల్లికలు నేలపై పారాడుతూ, అంతవరకూ కురుస్తున్న వర్షానికి ఏర్పడిన నీటి అలలను స్పృశిస్తుంటే.. రెక్కలు చాచి ఎగురుతున్న తూనీగలా అనిపించావు. 


నీ చేతిలో పట్టుకున్న నల్లని గొడుగు చివరల నుంచి జారుతున్న నీటి బిందువుల్ని అల్లరిగా ఒడిసి పట్టి.. గాల్లోకి ఎగరేస్తూ కాలి అందెల సవ్వడుల నడుమ గలగలలాడుతూ నవ్వుతున్న నీ నవ్వు.. నా మనసులో సృష్టించిన అలజడికి రూపమే నేను చిత్రించిన ఈ చిత్రం. పరవశంతో కనులు మూసుకుని, సన్నగా నువ్వు హమ్ చేస్తున్న పాటకు, నీ చెవి లోలాకులు తాళం వేస్తుంటే.. చూడ్డానికి ఎంత అందంగా కనిపించావో తెలుసా? నువ్వు కూర్చున్న పావంచాకి వెనుక వైపు ఉన్న గోడ మధ్య నుంచి మొలిచిన పచ్చని రావి ఆకులు, నీటి తడికి ఆ క్షణం ఎంత అద్భుతంగా మెరిసాయో తెలుసా? ఆ చినుకుల తడి నా మనసులో ఇంకా ఆరలేదు. అందుకే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. " చిలిపిగా చెబుతూ లాప్టాప్ క్లోజ్ చేశాడు వినేష్. 


 రెండు చేతుల్లో ముఖం దాచుకుని వేళ్ళ సందుల్లోంచి అతనిని గమనిస్తూ నవ్వుతున్న గీతిక ఒడిలో తల పెట్టుకుని నేలపై కూర్చున్న అతని మనసుకి ఆ క్షణం.. నింగి నుండి నేలకు వంగి ముద్దాడుతున్న ఇంద్రధనస్సు వర్ణాల నడుమ అందంగా మెరిసిపోతున్న ప్రకృతి కన్యలా ఆమె కనిపించింది. 


 —----సమాప్తం—----


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




1 commentaire


కథలో ప్రకృతి వర్ణన అద్భుతం

J'aime
bottom of page