చీర కట్టు.. ప్రైజ్ కొట్టు
- Mohana Krishna Tata
- Jan 21, 2024
- 3 min read

'Cheera Kattu Prize Kottu' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 21/01/2024
'చీర కట్టు ప్రైజ్ కొట్టు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
చీర అంటే మన భారతీయ సంప్రదాయంలో ఎంత గొప్ప స్థానం ఉందో అందరికీ తెలుసు. అలాంటి చీరకట్టుకు స్టానం.. రోజు రోజుకూ తగ్గిపోవడం దురదృష్టకరం. ఏ పెళ్ళి కో, ఫంక్షన్ కో తప్పితే.. చీర గుర్తుకు రావట్లేదు చాలా మంది ఆడవారికి. ఇప్పుడు నైటీ, నైట్ డ్రెస్ లోనే ఇంట్లో ఉంటున్న ఆడవారి సంఖ్య అధికం అవుతుంది.
"వావ్! శ్రీవారు! మీ స్పీచ్ అదిరింది! చాలా బాగుంది.. చీరంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... " అంది హారిక.
"చీరంటే నువ్వు.. నువ్వంటే చీరకట్టు శ్రీమతి.. " అన్నాడు హరీష్
"ఏమండీ! నేను ఎదురింటి కళ్యాణి ఇంటికి వెళ్తున్నాను. ఆవిడ వాళ్ళింటికి తాంబూలానికి పిలిచింది.. "
"వెళ్లి రా! హారిక... "
"ఈ ఆకుపచ్చ రంగు చీర ఎలాగుందండీ?... ఇప్పుడు నేను కట్టుకుంటాను... "
"నువ్వు ఏ చీర కట్టుకున్నా.. ఆ చీరకే అందం వస్తుంది తెలుసా! నీ చీరకట్టు చేత.. ఆ చీర అందం రెట్టింపవుతుందనుకో హారిక.. !"
"మీరు మరీను.. !"
"ఈ చీరకట్టు ఎక్కడ నేర్చుకున్నావు.. ?"
“అది చాలా పెద్ద కథ శ్రీవారు…”
****
“నేను చిన్నతనంలో మా అమ్మ తో నాకు చీర కొనమని మారం చేసేదానిని. అప్పుడు నా వయసు ఆరు. మా అమ్మ తను ఎక్కడకు వెళ్ళినా.. నన్ను తీసుకుని వెళ్ళేది.
అక్కడ అందరూ రంగు రంగుల చీరలు ధరించేవారు. నాకు చీర కావాలని గొడవ పెట్టేదానిని. దానికి అందరూ నవ్వేవారు. కానీ, మా నాన్న మాత్రం నువ్వు ఇంకా చిన్నదానివి... కొంచం పెద్దయ్యాక కొంటానని చెప్పేవారు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏదైనా అన్నారంటే.. అది ఖచ్చితంగా చేస్తారు. అప్పటినుంచి నేను ఎప్పుడు ఆ టైం వస్తుందా! అని ఎదురు చుసేదానిని.
నేను లంగా వోణి వేసుకునే టైం వచ్చింది. ఆ రోజు మా నాన్న నాకు నచ్చిన రంగు చీర గిఫ్ట్ గా ఇచ్చారు. మీకు ఇప్పుడు చూపించింది అదే చీర.. గ్రీన్ కలర్. అప్పుడు నేను నాన్న గిఫ్ట్ ఇచ్చిన గ్రీన్ కలర్ చీర కట్టుకున్న తర్వాత..
"హారిక! నీకు ఈ చీర బాగా సూట్ అయ్యింది తల్లీ! నువ్వు చీర లో చాలా బాగున్నావు.. " అని నాన్న మెచ్చుకున్నారు. అప్పటినుంచి చీరలంటే నాకు ఇంకా ఇష్టం పెరిగింది. నా మొదటి చీర కట్టడం మా అమ్మ నేర్పించింది. మా నాన్న కూడా మీలాగే.. అమ్మ చీరకట్టును చాలా మెచ్చుకునేవారు.. ఆ తరువాత నుంచి ఇలా ఇప్పటివరకు అదిగో... రెండు బీరువాల చీరలు ఉన్నాయి ఇప్పుడు నా ఖాతా లో..”
****
"బాగుంది! నీ చీర కథ హారికా... "
"మాటల్లోపడి మరచిపోయాను.. ఎదురింటి ఆవిడ తాంబూలానికి వెళ్ళాలి.. వస్తాను.. "
"గ్రీన్ కలర్ సారీ లో నిన్ను మళ్లీ పెళ్ళి చేసుకోవాలన్న ముద్దుగా ఉన్నారు శ్రీమతి గారు.. "
"చాల్లెండి! మీ సరసం... మీరూ!"
హారిక తాంబూలానికి ఎదురింటి కళ్యాణి ఇంటికి వెళ్ళింది..
"రండి హారికగారు! కూర్చోండి... ఇప్పుడే వస్తున్నాను.. ఉండండి.. చీర కట్టుకుని వస్తాను. ఈ నైట్ డ్రెస్ లో ఉన్న అంత సౌకర్యం ఎందులోని వుండదండీ హారిక గారు... "
"అలాగనకండి కళ్యాణి గారు!... చీర లో ఉన్నంత నిండుతనం, గొప్పతనం ఎందులోని ఉండదు... "
కళ్యాణి చీర కట్టుకుని వచ్చింది..
"హారిక గారు! ఈ చీరకట్టు ఉండడం లేదండి... "
"ఇది పట్టుచీర కదండీ... అందుకే.. !"
"మీ చీరకట్టు చాలా బాగుంటుందండి. నాకు మీలాగా.. చీర కట్టుకోవడం నేర్పించరూ!... " అని అడిగింది కళ్యాణి.
"అలాగేనండి!... అదెంతపని... లోపలికి పదండి" అని ఇద్దరు రూమ్ లోకి వెళ్లారు
కళ్యాణి కి మళ్ళీ అందంగా చీర కట్టింది హారిక...
"ఇప్పుడు చూడండి.. ఎంత బాగున్నారో.. ! అంది హారిక.
"అంతా మీ చీర కట్టడం మహిమే.. " నవ్వుతూ అంది కళ్యాణి
"ఇదుగోండి తాంబూలం.. స్వీకరించండి... "
"'ఓకే'! కళ్యాణి గారు.. నేను ఇంక బయల్దేరతాను.... "
"ఏవండీ.. నేను ఇంటికి వచ్చేసాను... ఎక్కడ ఈయన... లేరే. !"
"ఏవండోయ్... ! ఎక్కడ.. ?"
"ఇక్కడ బాల్కనీ లో.. "
"ఏం చేస్తున్నారు ఇక్కడ... ?"
"మన చుట్టూ చూస్తున్నాను హారిక... "
"ఏముంది అక్కడ.. ?"
"కనుచూపు మేరలో... చీర కట్టుకునే ఆడవారే కనిపించట్లేదు హారిక.. !"
"ఎందుకు కనిపిస్తారండీ.. ! ఇప్పుడు నేను వెళ్ళానా.. కళ్యాణి గారింటికి.. ఆవిడ నైట్ డ్రెస్ లోనే ఉంది... తాంబూలం కోసమే చీర కట్టుకుంది. కొత్తగా పెళ్లైంది.. చీర కట్టుకోవడం సరిగ్గా రాదంటే.. నేనే కట్టడం నేర్పించాను.. తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్ వేసేసుకుంది. లోకం మారిపోయింది స్వామీ!.. మీరు కోరుకునే ఆ చీరల లోకం నుంచి బయటకు రండి... "
"హారిక! నీకు ఒక విషయం చెప్పడం మరచాను. మా ఆఫీస్ లో చీరకట్టు కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. అందులో ఎంప్లాయి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనవచ్చు.. నువ్వూ రావాలి.. "
"ఎందుకండీ?.. "
"మొన్న.. మా ఆఫీస్ లో జరిగిన విషయం చెబుతాను. మా ఆఫీస్ లో ఆడవారు.. చీర కట్టేది సంవత్సరానికి ఒక్క సారైనా.. మిడిసిపాటు చాలా ఎక్కువ..
*****
"హరీష్! ఈ చీర లో నేను ఎలా ఉన్నాను?" అడిగింది ఆఫీస్ లో దామిని.
"మాములుగానే ఉన్నావు.. " అన్నాను.
"అదేంటి.. ? అలాగన్నావు.. ? అందరూ సూపర్ గా ఉన్నానని మెచ్చుకుంటూ ఉంటే... !"
"ఈ చీర నీకు సూట్ అవలేదు... నువ్వు చీర కట్టుకునే విధానం అంత ఇంపుగా లేదు.. "
"నీకు చీరలు, చీరకట్టు గురించి ఏం తెలుసు హరీష్.. నన్ను కామెంట్ చెయ్యడానికి?"
"అయితే.. చెబుతాను విను దామిని.. చీరలు తయారు చేసిన దాన్ని బట్టి పట్టుచీరలు, నూలుచీరలు, నైలాన్ చీరలు రకాలు ఉన్నాయి. పట్టుచీరలలో ఫేమస్ అయినవి కంచి, ధర్మవరం, పోచంపల్లి, మైసూర్ మొదలైనవి. చీరలని ఒకొక్క ప్రాంతం లో ఒక్కొక్క విధంగా కడతారు. మొత్తానికి నలభైకి పైగా చీరలలో రకాలు ఉన్నాయి..
మా ఆవిడకి అన్ని రకాల చీరకట్టు తెలుసు.. కావాలంటే వచ్చి నేర్చుకో... " అని అన్నాను
"అయితే ఛాలెంజ్.. ! వచ్చే నెలలో మన ఆఫీస్ లో జరిగే చీరల పోటి లో మీ ఆవిడని గెలిపించి చూపించమను... అప్పుడు ఒప్పుకుంటాను.. "
"నేను గెలిస్తే... నువ్వు ఉద్యోగానికి రిజైన్ చెయ్యాలి... అలాగే నువ్వు గెలిస్తే నేను రిజైన్ చేస్తాను.. " అన్నాది దామిని
*****
"నాకు డిసైడ్ చేసుకోవడానికి టైం కుడా ఇవ్వకుండా... 'ఓకే' చేసేసింది ఆ దామిని. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేసింది. నన్ను గెలిపించు హారి! ప్లీజ్.. !"
"మా ఆయన తో ఛాలెంజ్ చేస్తుందా.. ? పేరేమిటన్నారు.. ?"
"దామిని.. "
"ఆ దామిని సంగతి నేను చూస్తాను... మీకు వర్రీ వద్దు శ్రీవారు... హ్యాపీ గా ఉండండి.. "
ఆ పోటీ రోజు రానే వచ్చింది. హరీష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే స్టేజి మీదకు హారిక పేరు అనౌన్స్ చేసారు. మొత్తం అన్ని రకాల చీరలలో.. అన్ని రకాల చీరకట్టులతో అందరి దృష్టిని ఆకర్షించింది హారిక... జడ్జీలు చాలా ఇంప్రెస్ అయ్యారు. దామిని అన్ని రకాలుగా మెప్పించలేకపోయింది. హారిక కు ప్రైజ్ రావడం తో హరీష్ ఊపిరి పీర్చుకున్నాడు.
"నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను హరీష్.. నేను రిజైన్ చేస్తున్నాను"
"దామిని గారు! ఎవరికీ ఏదీ ఒక్కసారిగా రాదు. మీకు నేను చీరకట్టు నేర్పిస్తాను.. మీరు రిజైన్ చేయనవసరం లేదు... " అంది హారిక.
"హారికగారు! మీరు చీర ఎంత అందంగా కడతారో!... అంతే అందమైనది మీ మనసు!.. " అని మెచ్చుకుంది దామిని
************
Comments