చిరకాల స్వప్నం
- Sairam Allu

- Jun 27
- 8 min read
#AlluSairam, #అల్లుసాయిరాం, #ChirakalaSwapnam, #చిరకాలస్వప్నం, #సామాజికసమస్యలు, #StoryOnSocialProblems

Chirakala Swapnam - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 27/06/2025
చిరకాల స్వప్నం - తెలుగు కథ
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం. ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయన్నట్టు పుష్టిగా వర్షాలు పడడం వల్ల, రైతులు తమ పొలాల్లో వరి నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. పంటలు బాగా పండాలని రైతులంతా గ్రామదేవతకి మంగళవారాలు అనే మూడురోజుల పండుగ జరుపుతున్నారు. పట్టణంలో ప్రైవేటు జాబ్ చేస్తున్న మధు పండుగకి వస్తూ, తన ఫ్రెండ్ రాంబాబుని కుడా తమ వూరి పండుగకి చూడడానికి తీసుకొచ్చాడు. పండుగకి వచ్చిన చుట్టాలతో వూరంతా కిక్కిరిసిపోయింది.
ఊరిలో గ్రామదేవత గుడి దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం వూరి విద్యార్థులంతా కలుద్దామని ముందునుంచే వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు. మధు అందరిని రమ్మని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, తన ఫ్రెండ్ రాంబాబుతో పండుగ చూసుకుంటూ, అందరు కలుద్దామనుకున్న ప్లేస్ కి వచ్చారు.
“వీడు యింకా రాలేదేంటి!” అని మధు సతీష్ కి ఫోన్ చేసి "సతీష్! ఎక్కడున్నావురా. మనోళ్లందరూ ఎక్కడున్నార్రా? సాయంత్రం ఐదుగంటలకు కలుద్దామనుకున్నాం కదా. ఇప్పుడు ఆరు అవుతుంది. ఒక్కడు కూడా రాలేదు యిక్కడికి! ప్రతి సంవత్సరంలాగే, యిసారి కూడా ఎగ్గొట్టేద్దామనుకుంటున్నారా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ యిరోజు ఏదొక నిర్ణయం తీసుకోవాల్సిందే!" అని కూసింత కోపంగా ఫోన్లో అడిగాడు.
అవతలి వైపు నుంచి సతీష్ అంతే చిరాగ్గా "బాబు! ఎవరో సంగతి నాకు తెలియదు కానీ, నేను అయితే ఐదునిమిషాల్లో అక్కడికి వచ్చేస్తున్నా. మాట్లాడుదాం. ఉండు!" అని చెప్పి ఫోన్ కట్ చేసి, బైక్ నడుపుతూ మీటింగ్ స్పాట్ కి వస్తున్నాడు.
సతీష్ వచ్చి బైక్ పార్క్ చేసి, వాళ్లిద్దరి దగ్గరికి వస్తూ “హాయ్ రా!” అని అంటూ నవ్వుతుంటే, మధు "ఏంటిరా! మనోళ్లు ఏమనుకుంటున్నారో! వాట్సాప్లో మెసేజ్లు పెట్టమంటే, ఒక్కొక్కడు వందేసి మెసేజ్లు పెడతారు. కానీ ఏదైనా చేద్దాం, కలిసి మాట్లాడదామంటే, మాత్రం ఒక్కరు కూడా బయటికి రారు! అందుకే సంవత్సరాలు దాటిపోతున్నాయి!" అని కోపంగా అడిగాడు మధు.
"ఓరి బాబోయ్! దానికి నేనేం చేయాలి! మనోళ్లందరికి ఫోన్లు చేశాను. మెసేజ్లు పెట్టాను. వస్తామంటున్నారు! కావాలంటే, యిదిగో నా ఫోన్ కాల్స్ లిస్ట్ చూడు!" అని తన మొబైల్ లో ఫోన్లు చేసిన కాల్ లిస్ట్ చూపిస్తూ చెప్పాడు సతీష్.
"ఇంకెప్పుడు వస్తారురా? సాయంత్రం ఐదుగంటలకి మీటింగ్ ఉంటుందని, నెలరోజుల ముందు నుంచి రోజూ మన వూరి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతూనే ఉన్నాం. అటు కొంతమంది, ఇటు కొంతమంది, ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూనే ఉన్నారు. ఇలా ఆన్లైన్లో కాకుండా, అందరం నేరుగా కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటే, విషయం ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నాక కుడా, ఎవరు రాకపోతే ఎలా ఉంటుంది! ఏమనుకోవాలి?" అని గట్టిగా అన్నాడు మధు.
"మనకి యిది కొత్తేం కాదు కదా. మనోళ్లు యిలా ఉన్నారు కాబట్టే, యించుమించు పదిహేను సంవత్సరాల నుంచి యి విషయం ఎటు తేలడం లేదు. మనం ఓ పెద్ద గోల పెట్టుకుని ప్రతిసారి మెసేజ్లు పెట్టడం, వాట్సాప్ గ్రూపుల్లో రచ్చ రచ్చ చేసి, అసలు అవసరమైన విషయం మర్చిపోయి, పార్టీలని, రాజకీయాలని, అనవసరంగా సాగదీసి సాగదీసి ఒక్కొక్కరి ఈగోలు రెచ్చగొట్టుకుని, చివరికి ఎందుకు డిస్కషన్ మొదలుపెట్టామో తెలియకుండా చేసేస్తారు. నాలుగైదు నెలలు తర్వాత మళ్లీ మొదలవుతుంది!" అని సతీష్ తన లోలోపల ప్రస్ట్రేషన్ తో అన్నాడు.
సతీష్, మధు లు యిద్దరు కోపంగా మాట్లాడుతున్న మాటలు పూర్తిగా అర్థం కాక ఆశ్చర్యపోయి చూస్తున్న రాంబాబు “మధు! మీయిద్దరి మాటలు వింటుంటే కొరియన్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్లుంది నాకు. సందర్భం తెలియకపోతే, తెలిసిన తెలుగులో మాట్లాడినా, ఒక ముక్క అర్ధం కావట్లేదు!” అని అన్నాడు.
మధు నవ్వుతూ "ఆఁ మీయిద్దరికి పరిచయం చేయడం మర్చిపోయాను. సతీష్! తను బి. టెక్ ఫ్రెండ్ రాంబాబు. ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. తనది విజయవాడ. మన వూరి వారాలు పండుగ చుద్దామని తీసుకొచ్చాను! రాంబాబు! తను సతీష్. ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్!" అని మధు యిద్దరికి పరిచయం చేస్తే, వాళ్ళిద్దరూ హాయ్ అంటే హాయ్ అని పలకరించుకున్నారు.
"అసలు ఏం జరిగింది బ్రదర్? ఎవరు రావట్లేదు? ఏంటి ఆ సంవత్సరాలు గడుస్తున్నా జరగని మాష్టర్ ప్లాన్? నాకు తెలియాలి!" అని అని ఆసక్తిగా అడిగాడు రాంబాబు.
దానికి అంతవరకు కోపంగా కనిపించిన మధు, సతీష్ లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వారు.
"ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు బ్రదర్? ఎప్పుడు నుంచో అందరం కలిసి చేద్దామనుకుంటున్నది జరగట్లేదు. అందుకే.. !" అని నవ్వుతూ అన్నాడు సతీష్.
"అదే! ఏం జరగట్లేదు బ్రదర్! చెప్పండి!" అని తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాడు రాంబాబు.
సతీష్ చెప్పడం మొదలు పెడుతూ "బ్రదర్! నువ్వు, మధు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చూసే ఉంటావు. మా ఊరు సిటీకి ఎంత దూరం ఉందో! యిది మన రాష్ట్ర బోర్డర్ ఏరియా! కాబట్టి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెద్దగా ఉండవు. ఇంటర్, డిగ్రీ చదువులకి, కోచింగ్ సెంటర్లకి చాలా దూరం వెళ్ళాలి. అందుకని, చాలావరకు స్టూడెంట్స్ పెద్దగా చదువుకోవడం వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
బోర్డర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి, వైన్స్, మత్తు పదార్థాలు బాగా దొరుకుతాయి. వాటికి బాగా అలవాటు పడిపోతున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అని చదవడానికి, కోచింగ్ తీసుకోవడానికి వెళ్లిపోతున్నారు. వాళ్లకి ఉద్యోగాలు వస్తే అక్కడే సెటిల్ అయిపోతున్నారు. రానురానూ యిక్కడ చదువులు మరి దిగజారిపోతున్నాయి!
హైస్కూల్ చదువుల వయసు నుంచే వ్యసనాలకి అలవాటుపడిపోతున్నారు! ఊరిలో గ్రంథాలయం ఉంటే బాగుంటుంది కదా అని మా చిన్నప్పటినుంచి ఊరిలో గ్రంథాలయం కట్టించాలని వూరి విద్యార్థులమంతా అనుకుంటున్నాం. మా సూపర్ సీనియర్స్ ట్రై చేశారు. మా సీనియర్స్ ట్రై చేశారు. మేము ట్రై చేశాం. మా జూనియర్స్ ట్రై చేస్తున్నారు.
దాదాపు పదిహేను సంవత్సరాలవుతుంది. ఇప్పటికీ గ్రంథాలయం అనేది ఒక కలగానే మిగిలిపోయింది! చదువు అయిపోయినోళ్ళు గవర్నమెంట్ జాబ్ రాకపోతే, ఏదోక కంపేనీలో దూరిపోయి చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు!" అని వివరంగా చెప్పాడు సతీష్.
"అవునా! పెద్ద కథే!" అని ఆశ్చర్యపోతూ అడిగాడు రాంబాబు.
"దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మావూరి విద్యార్థులకి ఊరిస్తూ అందకుంటున్న గ్రంథాలయం కథ. షార్ట్ కట్ లో చెప్తే, ఇలా. మొత్తం కథ చెప్తే, భారీగా ఉంటుంది!" అని అన్నాడు సతీష్.
"పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయత్నించిన కుడా మీ వూర్లో గ్రంథాలయం కట్టించడం యింతవరకు కుదరలేదంటే ఆశ్చర్యంగా ఉంది! మీరంతా కలిసి మండల తహశీల్దారుగారికి, లేదా విద్యాశాఖ అధికారులకి ఊరిలో గ్రంథాలయం కట్టించడానికి అర్జీ పెట్టొచ్చు. ప్రభుత్వం తరపున గ్రంథాలయం కట్టించడానికి అనుమతి యిస్తారు. పొలిటికల్ గా ప్రయత్నిస్తే, ఈ ఏరియాలో మీకు తెలిసిన పెద్దమనుషులతో మాట్లాడితే పని జరిగిపోతుంది!" అని రాంబాబు ఆలోచిస్తూ చెప్తుంటే,
మధు మధ్యలో కలుగజేసుకుని "నాయనా రాంబాబు! అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. ఇక్కడ అందరికి తెలివితేటలు లేక కాదు, తెలివితేటలు ఎక్కువైపోయి పని జరగట్లేదు. ఇకపోతే పెద్దమనుషులు, రాజకీయ నాయకులు అన్నావు కదా! ఆ కథ కూడా చెప్తాను విను!!
అది 2004 ఎలక్షన్ టైం. మేము ఐదోతరగతి చదువుతున్నాం. అప్పుడు వూరి స్టూడెంట్స్ అంతా ఏకమై గ్రంథాలయం కావాలని చిన్న, పెద్ద తేడా లేకుండా విద్యార్థులందరం కలిసి ఎలక్షన్లలో పోటీ చేసే నాయకులు దగ్గరికి వెళ్ళాం. మాలో అప్పుడే కొత్తగా ఓటు వచ్చిన మా సూపర్ సీనియర్స్ నాయకులతో మాట్లాడుతుంటే, మేమంతా వెనక్కి వీధుల్లో, మాకు గ్రంథాలయం కావాలని అరుస్తూ తిరిగే వాళ్ళం. నాయకులు చాలా తెలివిగా, తాము ఎన్నికల్లో గెలిస్తే, ఊరికి గ్రంథాలయం కట్టిస్తామని మాట యిచ్చారు. దాంతో మాకు గ్రంథాలయం కల నెరవేరినట్టుగా అనిపించింది. అంతవరకు బాగానే ఉంది!
ఈ గ్రంథాలయం విషయం గురించి నాయకులతో పాటు ఎలక్షన్ల టైంలో తిరిగే క్రమంలో మా సూపర్ సీనియర్స్ రాజకీయాలు బాగా ఎక్కించుకొని అసలు విషయాన్ని పక్కకు పెట్టేశారు. ఎలక్షన్లు అయిపోయాయి. మెజారిటీలు వచ్చి నాయకులు గెలిచారు. నాయకుల రాజకీయ వ్యూహాలు ఫలించి, మా సూపర్ సీనియర్స్ మాత్రం వాళ్ళలో వాళ్లు కులాలు, పార్టీలు అని విడిపోయి గొడవలాడుకొని విడిపోయారు. నాయకులు ఆనందించారు. అక్కడితో గ్రంథాలయం కలకి బ్రేకులు పడ్డాయి. మళ్లీ గ్రంథాలయం విషయం మాత్రం ఎవరు ఎత్తలేదు!" అని చెప్పాడు.
రాంబాబు తలవూపుతూ "అవునులే. ఎక్కడికెళ్లినా మనకి యి దరిద్రం పోదు! గెలిచినవాళ్ళు, ఓడిపోయినవాళ్లు బాగానే ఉంటారు. వాళ్ల వెనక్కి తిరిగిన కార్యకర్తలు మాత్రం అనవసరమైన గొడవలాడుకొని, కుటుంబాల మీదకి తెచ్చుకొని, ఎప్పుడు కలవరు! ఒకవేళ తిరిగి కలుద్దామనుకున్న ఆ నాయకులు వీళ్లని కలవనివ్వరు!" అని అనుభవపూర్వకంగా చెప్తుంటే,
సతీష్ వెంటనే "అంతే బ్రదర్! మంచి మాట చెప్పావు! ఇక్కడ అదే జరుగుతుంది! ఎట్టకేలకు గ్రంథాలయం విషయం కదిలింది. 2009 ఎలక్షన్ల టైం. మేం టెన్త్ క్లాస్. గత ఎలక్షన్లలో జరిగిన తప్పులు యిసారి జరగకూడదని, ముందుగా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుని, ముందులాగే నాయకుల దగ్గరికి వెళ్లి కలిస్తే, గతసారి లాగే యిప్పుడు కూడా ఎలక్షన్లలో గెలిస్తే, గ్రంధాలయం కట్టిస్తామని అన్నారు. మా సూపర్ సీనియర్స్ ని మా మీదకి అస్త్రాల్లా ప్రయోగించి, ఒక్కటిగా వచ్చిన మమ్ముల్ని రెండు ముక్కలుగా చేశారు!" అని చెప్పాడు.
రాంబాబు ఆసక్తిగా "అంటే యిసారి కూడా అవ్వలేదా?" అని అడిగాడు. "అంత సింపుల్ గా అయిపోతే యింత గోల ఎందుకు! ఈసారి మావంతు వచ్చింది. మళ్లీ 2014 ఎలక్షన్ల టైం. మాకు 20 సంవత్సరాలు. కొత్తగా ఓటు వచ్చింది. మా డిగ్రీలు అయిపోయాయి" అని మధు చెప్తుంటే, రాంబాబు కలుగజేసుకుని "బ్రదర్! నాకు ఒక డౌట్. మీరు ప్రతిసారి ఎలక్షన్ల గురించి ఎందుకు చెప్తున్నారు? ఎలక్షన్లకి, ఎలక్షన్లకి మధ్యలోనున్న ఐదు సంవత్సరాలు మీరు ప్రయత్నం చెయ్యట్లేదా? ఎవర్ని అడగట్లేదా? అదేదో ముహూర్తం పెట్టినట్టు ఎలక్షన్ల టైం అప్పుడు ఎందుకు అడుగుతున్నారు?" అని అడిగాడు రాంబాబు.
"సూపర్ లాజిక్ లాగావు! మధ్యలో కూడా ప్రయత్నిస్తున్నాం. ఒరిస్సాకి వెళ్లే లారీలు ఎక్కువగా తిరగడంతో మా ఏరియా రోడ్లు పెద్ద పెద్ద గోతులు పడి, బాగుచెయ్యమని అర్జీలు పెడితే దిక్కు లేదు. ఇంకా యి విషయానికి అంటే కష్టమే. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరూ మాటలు పెట్టుబడి పెడతారు కానీ, డబ్బులు తీయ్యం కదా. మరి పొలిటికల్ గానే ట్రై చెయ్యాలి. నాయకులతో మాట్లాడేది మాలో పెద్దవాళ్ళు కదా.
వాళ్లు డిగ్రీలు అయిపోయి, వేరే కోర్సులు చదవడానికో, ఏదో ట్రైనింగులకో, లేకపోతే చిన్నదో, పెద్దదో ఉద్యోగం చేయడానికో సిటీలకి వెళ్లిపోతున్నారు. మళ్లీ ఎప్పుడో సంక్రాంతికో, దసరాకో వూరికి వస్తారు. పండుగ టైంలో నలుగురు కలిసి మాట్లాడేటప్పుడు మళ్లీ గ్రంథాలయం విషయాలన్ని కదులుతాయి. ఆ పండుగ రోజుల్లో ఎవర్ని కదిపినా, అది చేసేద్దాం, యిది చేసేద్దాం అని అంటారు. మరుసటిరోజు చూస్తే, అందరూ సిటీకి జంప్!
ఒక్కరు కనిపించరు! అవకాశమే కానీ, అత్యవసరం కాదు కదా. అందుకు ఆమాత్రం నిర్లక్ష్యం ఉంటుంది! అయితే నాయకులు కుర్రోళ్ళకి రాజకీయాలు బాగా పట్టించేసి, వారి అదుపులో పెట్టుకుని, ఓటు రాజకీయాలు చేస్తున్నారు. అందుకని, కుర్రోళ్ళు ఎలక్షన్ల టైం ముందే వూర్లో దిగుతారు!" అని సంజాయిషీగా చెప్పాడు మధు.
"ఒకే! విషయం అర్ధమైంది. మరి, 2014 లో మీవంతు వచ్చేసరికి మీరు ఏం చేశారు? మీరు కూడా మీ సీనియర్స్ లాగే, ఎలక్షన్ల ముందు నాయకుల్ని అడిగి, వాళ్ళు గెలిస్తే చేస్తామని చెప్తే, చక్కగా ఓట్లు సమర్పించుకుని, తర్వాత చక్కగా గొడవలాడుకుని విడిపోయారా?" అని కాస్త ఊహించి అడిగాడు రాంబాబు.
"మేం ఆ ఛాన్స్ యివ్వలేదు! సీనియర్స్ సంగతి ఎలా ఉన్నా, ఎవరు వచ్చినా, రాకపోయినా, మనమైనా గ్రంథాలయం విషయం ముందుకు తీసుకెళ్దామని గట్టిగా డిసైడ్ అయ్యాం! ప్రతిసారి వాళ్ళు గెలవడం జరుగుతుంది. కానీ, గ్రంథాలయం కట్టడం మాత్రం జరగట్లేదు!
ముందుగా తహశీల్దార్ గారికి ఊరి విద్యార్థుల తరఫున గ్రంథాలయం కావాలని అర్జీ రాసి, మండలానికి వెళ్లి, తహశీల్దార్ గారిని విషయం చెప్తే, ఆయన సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం తరఫున గ్రంథాలయం కట్టడానికి అనుమతి యిస్తాం. అయితే, మీరు మీవూరి తరఫున గ్రంథాలయం కట్టడానికి భూమిని చూడండి. వెంటనే, కట్టడానికి అనుమతి దొరుకుతుందని చెప్పారు!
ఇలా జరిగిందని తెలుసుకున్న ఊర్లో కొంతమంది, మేమే చెయ్యలేకపోయాం. మీరేం చెయ్యగలరు, అది జరగదులే అని అనుకునేవారు! మళ్లీ నాయకుల దగ్గరికి వెళ్లి కలిసేటప్పుడు, వాళ్లు అదే కథ వినిపించారు. అలా అయితే కుదరదని మేం కరాకండిగా చెప్పేశాం. ఎప్పుడో గెలిస్తే కట్టించడం కాదు. తహశీల్దార్ గారు కుడా అనుమతి యిచ్చారు.
ఊరి తరఫున భూమి చూసి, ఎలక్షన్లకి ముందే గ్రంథాలయం కట్టాలి. మీరు ఓట్లకి ఎలాగైనా డబ్బులు యిస్తారు కదా. మా దగ్గర దాదాపు యాభైకి పైగా ఓట్లు ఉన్నాయి. యింకా చాలామంది స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాం. ఆ ఓట్ల డబ్బులతో గ్రంథాలయం కట్టించండి అని గట్టిగా మేమందరం పట్టుబట్టేసరికి, నాయకులకి వేరేదారి లేక, జుట్టు పీక్కోని, గ్రామకంఠంలోని కొంత భూమిని గ్రంథాలయం కట్టడానికి చూపించారు.
ఇప్పుడు ఎలక్షన్లకి మాకు చాలా ఖర్చవుతుంది. కాబట్టి, బిల్డింగ్ మొత్తం యిప్పుడు కట్టలేం. శంకుస్థాపన యిప్పుడు చేసి, గెలిచాక పూర్తిచేస్తామంటే సరేనన్నాం.
అనుకున్నట్టుగానే గ్రంథాలయం శంకుస్థాపన జరిగింది. దురదృష్టవశాత్తు, మాకు మాటిచ్చిన నాయకుడు ఎలక్షన్లో ఓడిపోవడంతో, మళ్లీ గ్రంథాలయం శంకుస్థాపన వరకే జరిగి బ్రేకులు పడ్డాయి!" అని చెప్పాడు సతీష్.
రాంబాబు నవ్వుతూ "గ్రంథాలయం భవిష్యతేమో గాని, యి కట్టడం వెనుకున్న గతం మాత్రం చెప్పుకోవడానికి బాగుంటుంది. మరి 2019 ఎలక్షన్లకి మళ్లీ గ్రంథాలయం విషయం తెరపైకి రాలేదా?" అని అడిగితే, మధు నవ్వుతూ "నీకు కుడా మావూరి గ్రంథాలయానికి, ఎలక్షన్లకి మధ్యలోనున్న అవినాభావ సంబంధం అర్థమైపోయింది! నీకు తెలుసు కదా. 2019 ఎలక్షన్ల టైం కి, నువ్వు, నేను సిటీలో రూం లో ఉన్నాం కదా! అయినా కుడా, 2019 లో అందరం గట్టిగానే ప్రయత్నించాం. చందాలు కూడా వసూలు సేకరించాం.
నాయకుల సహకారంతో గ్రంథాలయం పునాదులు పూర్తయి, గోడలు కట్టడం వరకు వచ్చింది. ఆ బాధ్యతలు జూనియర్స్ కి అప్పచెప్పి, మేం మళ్లీ సిటీకి వచ్చేసరికి, చందాల డబ్బుల విషయం కదా, నాకెందుకంటే, నాకెందుకంటే అని వారు గొడవలాడుకోవడం వలన, మధ్యంతరంగా నిలిచిపోయింది. ఈసారి తప్పు మాదే! 2024 ఎలక్షన్స్ వరకు చూసి, నాయకులు మీద ఆదారపడకూడదని నిర్ణయించుకుని, చందాలు ఎత్తుకుని, తాత్కాలికంగా ఒక రేకు షెడ్డులో గ్రంథాలయం మొదలుపెట్టాం.
నెల రోజులు బాగానే నడిచింది. మళ్లీ ఎవరో రాజకీయాలు వాడి ఆపేశారు. అక్కడ నుంచి మళ్లీ కదలలేదు! ఇప్పుడు మీటింగ్ అనుకున్నాం. ఇంకా ఎవరు రాలేదు!" అని కొంచెం బాధగా చెప్పాడు.
"ఇంత చరిత్ర గల ఆ గ్రంథాలయాన్ని రేపు ఒకసారి నాకు చూపించండి బ్రదర్!" అని ఆసక్తిగా అడిగాడు రాంబాబు.
"కొత్తగా చూపించడమేంటి బ్రదర్! మనం యిప్పుడు కూర్చున్నది ఆ గ్రంథాలయం గోడల మీదే!!" అని సతీష్ చెప్పేసరికి, గోడ మీద కూర్చున్న రాంబాబు దిగి ముందుకు నడిచి "నిజంగా! యి బిల్డింగేనా!!" అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు.
"అవును! " అంటూ నవ్వుకుంటూ రాంబాబు పక్కకు వచ్చారు మధు, సతీష్.
పూర్తిగా మొక్కలతో నిండిపోయిన బిల్డింగ్ చూస్తున్న రాంబాబుకి ఒళ్ళు మండి "లెక్క ప్రకారం మీరు మళ్ళీ 2029 ఎలక్షన్ టైంలో మాట్లాడాలి కదా. అప్పటికి ఈ గ్రంథాలయం బిల్డింగ్ లో ఉన్న చిన్న మొక్కలు కాస్త పెరిగి, పెద్దచెట్లుగా అయ్యి, ఉన్న గోడల కాస్త బీటల బారిపోయి, పునాదులు శిధిలమైనప్పుడు కదా, మాట్లాడాలి.
లేకపోతే, మరొక రెండు, మూడు ఎలక్షన్ల వరకు ఆగితే, మీకు పెళ్లిళ్లు అయ్యి, మీ పిల్లలు కూడా పెరిగి, వాళ్లు కూడా యి గ్రంథాలయం స్లాబు కట్టడానికో, పెయింటింగులు వెయ్యడానికో వచ్చేవాళ్ళు కదా! మరి మధ్యలో యిప్పుడు యి అత్యవసర మీటింగులన్ని ఎందుకు?
ప్రతి ఊరికి గుడి, బడి ఎలాగో, గ్రంథాలయం అనేది అవసరం. అవకాశం కాదు. రిటైర్మెంట్ అయిపోయిన వూరిలో ఉన్న ఉపాధ్యాయులు వీలు చూసుకుని, గ్రంథాలయం దగ్గర ఉంటే, విద్యార్థులకి చాలావరకు చదువులో సందేహాలు ఉండవు. జాబ్ వచ్చినవారు కొన్ని బుక్స్ కొనేసి యివ్వాలి అనే నియమం పెట్టుకుని, ప్రిపేర్ అయిన రన్నింగ్ నోట్స్ గ్రంథాలయంకి ఉంచాలి.
ఊరిలో చిన్న పెద్ద విద్యార్థులందరూ ఒక దగ్గర చదువుకుంటే, ప్రత్యేకంగా ట్యూషన్లు, పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ల అవసరం ఉండదు. ఎక్కడికో వెళ్ళి, సిటీల్లో రూంలో ఉండి, కోచింగ్ సెంటర్లకి వేలలో ఫీజులు కట్టే బదులు, గ్రంథాలయమే ఉత్తమం. ఉపయోగాలు తెలిసి కుడా నిర్లక్ష్యం చెయ్యడం తప్పు!" అని రాంబాబు సూటిగా యిద్దర్ని ప్రశ్నించేసరికి, సతీష్, మధు లిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు.
మధు నవ్వుతూ "నువ్వు చెప్పింది నిజమే! ఆలోచిస్తే మాకు అర్థమైంది. అందుకే యిప్పుడు యింత తొందర పడుతున్నాం. యిసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ల వరకు ఆగేది లేదు! ఇప్పుడు ఆ విషయమే వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పెట్టాను. ఊరి ప్రెసిడెంట్ తో మీటింగ్ రేపు ఉంది. అందరూ కచ్చితంగా రావాల్సిందేనని! అప్పుడు చూద్దూవు గాని, మా ప్రతాపం! యిప్పుడు పదా, పండుగ చుద్దాం!" అని అంటూ బైక్ స్టార్ట్ చేశాడు.
రాంబాబు నవ్వుతూ “ఇంకో ఎలక్షన్స్ వరకు ఆగిపోతే, చాలు!” అని అంటే, ముగ్గురు నవ్వుకుంటూ, వూరి వైపు బైకులపై బయలుదేరారు.
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.




Comments