కుక్ విత్ పాకం డాట్ కామ్
- Malla Karunya Kumar
- 2 days ago
- 5 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #CookWithPakamDotCom, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Cook With Pakam Dot Com - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 08/10/2025
కుక్ విత్ పాకం డాట్ కామ్ - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"నమస్కారం, నా పేరు కర్మ!. నేను చెప్పబోయేది, రాబోయే మీ కర్మ. ఈ నెల మీ రాశి ఫలితాలు. " రాశి ఫలాలు వినిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ కర్మ!.
నోరు వెళ్ళబెడుతూ చూస్తూ వున్నాడు పాకా....
"ఈ రాశి వారికి ఈ నెల తిరుగుండదు!. దశ తిరిగే సమయం మొదలైంది. ఈ నెల ఏదైనా వ్యాపారం చేస్తే మీ గతి మారిపోతుంది. " అని కర్మ పాకా రాశి గురించి చెప్తుంది.
"అబ్బో! ఆర్టిఫిషియల్ ఇంటిల్లెజెన్స్ పంచాంగమా!. గొప్ప ఐడియా ఇచ్చింది ఈ కర్మ. ఇన్నాళ్లు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను!. ఇప్పుడు వచ్చిందన్న మాట ఆ సమయం. " అని అనుకుంటూ ఉండగా,
ఇంతలో తన ఫోన్ అరిచి గీ పెట్టడం తో, "అబ్బా!, ఈ సమయంలో ఎవరు?. " అని విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాడు. బ్రాండో బ్రాండు అని చూపిస్తుంది ఐడి కాలర్లో!.
"ఎవరు ఈ బ్రాండో బ్రాండు?.. " ఆశ్చర్యంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు.
"హాల్లో!, పాకా గారేనా?... "
"అవునయ్యా నేనే.. "
"అంటే పాకం కన్నం గారు కదండీ!. "
"అవునయ్యా పాకం కన్నం నే, పాకలు తీయడం లో మనం ఫేమస్ అందుకే నాకు ఆ పేరు వచ్చింది, ఇంతకీ తమరెవరో?. "
"నేను బిబి - బ్రాండో బ్రాండు యజమానిని అండి!. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం. మీరు పేరు మోసిన పాక పిశాచని విన్నాం!. అందుకే మీతో బిగినేస్ డీల్ మాట్లాడడానికి సిద్దమయ్యాం. "
"పాక పిశాచా!. పిశాచి కాదయ్యా పిపాసి. ఇంతకీ ఏమిటా బిగినిస్?, ఛీ ఛీ, బిజినెస్!"
"మేము కొన్ని వంట సరుకులు మీకు ఇస్తాం మా బ్రాండ్ మీరు ప్రమోట్ చెయ్యాలి, మీరు పదివేలు కడితే చాలు. ప్రమోషన్ లో మీకు కూడా లాభం ఉంటుంది. మిగతాది మేము చూసుకుంటాం పిశాచి గారు. "
"ఎన్ని సార్లు చెప్పాలయ్య, అది పిశాచి కాదు పిపాసి అని. "
"సారీ, సారీ... పిపాసి గారు. ఈ డీల్ మీకు ఓకేనా?. "
"అది సరే, నా గురించి మీకు ఎవరు చెప్పారు?. " ఆశ్చర్యంతో అడిగాడు పాకా.
"అదా, మీరు మీ వివరాలు కుక్ విత్ పాకం డాట్ కామ్ యాప్లో అప్లోడ్ చేశారు కదా, దాంట్లోనే తెలుసుకున్నాం. "
"ఓహ్!, అదా మ్యాటర్!. సరే సరే, ఏదో ఒక రోజు ఆ సామాన్ల తో మా ఇంటికి వచ్చి తగిలేట్టు, మిగతాది అంతా నేను చూసుకుంటాను. అది సరే నాకు ఏంటి లాభం?. "
"మా దగ్గర ఒక వంటకం ఫార్ములా వుంది. బ్రహ్మాండంగా ఉంటుంది!. దాన్ని మీకు ఇస్తాం, చూపిస్తాం కూడా. దాని పేరు జీవితం సారం!. "
"ఏ సారం?.. "
"జీవిత సారం.. "
"ఏదోక సారం లే, సర్లే కొత్త ఐటం అంటున్నారు కదా, చూద్దాం. " అని ఫోన్ పెట్టేశాడు పాకా.
వారం రోజులు తర్వాత వీధిలో నిలబడి అటు ఇటూ తిరుగుతున్నాడు పాకా.
పాకా ను గమనిస్తూ వుంది అతని భార్య మేనక....
"ఏమైంది ?. ఏంటి ఇక్కడ తిరుగుతున్నారు?. " అని అడిగింది మేనక.
"ఉండు ఊర్వశి!. " అని అంటూ అటు వైపు చేతులు నలుపుకుంటూ చూస్తున్నాడు.
ఒక్కసారిగా గిచ్చింది మేనక. గావుకేక పెడుతూ, "ఏంటే అలా గిచ్చావు?. " అని రుద్దుకుంటూ అడిగాడు.
"కాకపోతే ఊర్వశి ఎవరు?. కొంప తీసి ఆ ఊర్వశి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారా?. " కోపంతో అడిగింది.
“అయ్యో, అది కాదు. నా బిజినెస్ పార్టనర్ వస్తానని చెప్పాడు అతని గురించి ఎదురుచూస్తున్నాను. అదుగో వచ్చేస్తున్నారు. " అని వస్తున్న వ్యాన్ వైపు చూపిస్తూ అన్నాడు పాకా.
ఆశ్చర్యంతో చూస్తూ వుంది మేనక. ఇంతలో పాకా ముందు ఆగింది ఆ వ్యాన్, వేగంగా అందులో నుండి బయటకు దిగుతూ హడావుడి చేస్తూ సామానులు కిందకు దింపి, టేబుల్ ఏర్పాటు చేసి, మొత్తం సామాన్లు పేర్చాడు ఆ వ్యక్తి..
"హాయ్ పాకా. మై నేమ్ ఇస్ బాకా!. "
"బాకా?. "
"బ్రాండ్ కాంతారావు!. ఈ బ్రాండో బ్రాండు స్థాపకుడ్ని... "
"నైస్ టు మీట్ యూ బాకా!"
"ఇప్పుడు పలకరింపులు కు సమయం కాదు. నువ్వు పని ప్రారంభిస్తే నేను వేగంగా వెళ్లిపోవాలి. ఇంకో పార్టనర్ని కలవాలి. "
"ఇంకో పార్టనర్ఆ?. " అయోమయంగా అడిగాడు పాకా.
"చెప్పాను కదా, ఈ బ్రాండ్ ప్రమోట్ చేయాలి. అది కూడా సగం ధరకే. అయితే ఐటెమ్స్ ఎక్కువే వున్నాయి కాబట్టి నీకు నచ్చిన వాళ్లకు అమ్ముకోవచ్చు. లేదంటే నువ్వే ఉంచుకోవచ్చు. ముందు పదివేలు ఇవ్వు. " అని అడిగాడు బాకా.
"ఇదంతా మన దగ్గర ఉంచే కంటే, ఇప్పుడే ఎనభై శాతం ధరకు అమ్మేస్తే. ఈ పది వేలు, పైగా ఇంకా కొంత వస్తుంది. " అనుకుంటూ పది వేలు బాకా చేతిలో పెట్టాడు.
పాకా ఇంటిముందు హడావుడి చూసిన చుట్టూ పక్కల వాళ్ళు అక్కడికి చేరారు. అందరిని పిలుస్తూ వివరాలు చెప్పి, ఆ సామానులు కొనమని చెప్పాడు పాకా.
పాకా మీద అభిమానం తో కొనడానికి సిద్దమయ్యారు చుట్టూ పక్కల వాళ్ళు.
"ఏంటి పాకా!, కాస్త డిస్కౌంట్ ఇవ్వచ్చు గా. నాకు కూడా డిస్కౌంట్ ఇవ్వవా?. " అని కాస్త వయ్యారం వొలక బోస్తూ ఎదురింటి బుంగమూతి బంతి అడగడం తో.
కాస్త బెండ్ అయ్యి, "అయ్యో బంతి!, నీకు లేకపోవడం ఏమిటి డిస్కౌంట్. తీసుకో ఫిఫ్టీ పర్సెంట్ కు. " అని ఆమెకు ఇచ్చేశాడు.
"పాకా!, మొన్న నీ వంటకాలు ప్రమోట్ చేసి. నీకు ఎక్కువ ఆర్డర్లు ఇప్పించాను. ఇంకా మా బంధువుల ఇంట్లో పెళ్ళిళ్ళు వున్నాయి, చూసుకో మరి. " అని కాస్త మృదువు గా అంది తారుమారు తాయారు, ఆర్డర్ల వున్నాయని ఆశ చూపిస్తూ.
"అయ్యో!, నీకు ఇవ్వకపోవడం ఏమిటి?. తీసుకో నీకు కూడా ఫిఫ్టీ పర్సెంట్. " అని అన్నాడు పాకా.
ఇలా సరుకులన్నీ అమ్ముడు పోయే వరకు ఆ చుట్టు పక్కల వాళ్ళు, పాకా చుట్టూ ఈగల్లా చేరి చివరకు అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయారు.
"ఇదేంటి ఇప్పటి వరకు పులిహోర కోసం ఎగబడిన ఆకలి సామ్రాజ్యాల్లా ఇక్కడే ఉండి. అప్పుడే పోయారు. పోతే పోనీలే బాకా తెచ్చిన సరుకు అయిపోయింది. హమ్మయ్య!" అంటూ అక్కడే కూర్చున్నాడు పాకా.
ఎదురుగా వున్న సామాన్లు పూర్తిగా చెల్లిపోయాయి. అలాగే వ్యాన్ కూడా కనిపించడం లేదు!.
"ఈ బాకా ఎక్కడ?. " అని చుట్టూ చూస్తున్నాడు పాకా.
ఇంతలో అక్కడకు చేరుకుంది మేనక..
"అయిపోయిందా మీ సంత. అంతా చూస్తున్నాను. మీరు వేసిన వేషాలన్నీ చూస్తున్నాను. ఆ పర్సెంట్లు, ఆర్డర్లు, నవ్వులు, అన్నీ చూస్తున్నాను. " అని అంది మేనక కోపంగా.
"అబ్బా!. ఉండవే, అదంతా బిజినెస్ స్టార్ట జీ, నీకు తెలియదు లే. అది సరే, ఇంతకీ ఆ బాకా ఎక్కడ?. " చుట్టూ చూస్తూ అడిగాడు పాకా.
"ఇంకెక్కడ బాకా. ఇందాకే వెళ్ళిపోయాడు కదా. ఆ మరిచిపోయాను ఈ జీవితం సారం వంటకం మీకు ఇమ్మన్నాడు. ” అని ప్యాక్ చేసిన పెట్టెను పాకా చేతిలో పెట్టింది.
"వెళ్లిపోయాడా?. వెళ్లిపోవడం ఏమిటి?. ఈ సామాన్లకు కలెక్ట్ చేసిన డబ్బులు అన్నీ వాడి దగ్గరే వున్నాయే. " గుండెలు పట్టుకుంటూ అన్నాడు.
"అయ్యో! అయ్యో, మొత్తం పోగొట్టారా?. అనుకుంటూనే ఉన్నాను. మీ డిస్కౌంట్ లు చూసి. లోపలికి రండి మీ సంగతి చెప్తాను. " అని ఇంటి లోపలికి చేరుకుంది.
"మేనక!, మేనక!, అది కాదు, నా మాట విను. " అని ఆమె వెనుక పడ్డాడు పాకా ఆ బాక్స్ పట్టుకొని.
ఇంటికి వెళ్లే సరికి అప్పుడే కరెంట్ రావడం తో, ఇంతకు ముందు ఆఫ్ చేయని టీవీ దానంతట అదే ఆన్ అయ్యింది.
"తక్కువ ధరకే సామాన్లు బిజినెస్ అని మీ దగ్గరకు వచ్చారా?. తస్మాత్ జాగ్రత్త. పెద్ద పెద్ద షాపుల్లో సామాన్లు కాజేసి, వాటిని మార్చి మళ్ళీ అమ్మేస్తున్నారు. మీరు ఆ వలలో చిక్కుకోకండి. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ చిక్కుకున్నారా. మీ కథ ఏంటో... కథనం తో రాత్రి కి వస్తాను బై బై. " అని మాయం అయ్యాడు ఆ యాంకర్.
"ఓరి నీ, ఇదేదో ముందే చెప్పొచ్చు కదరా. " అని లబోదిబో మంటూ, సోఫాలో కూర్చున్నాడు పాకా బాక్స్ కింద పడేస్తూ.
ఎదురుగా తెడ్డు, తన వంట సామాన్లు తో ప్రత్యక్షం అయ్యింది మేనక!
"పోయి, ఆ పదివేలు తీసుకు వచ్చేవరకూ నాకు కనిపించకండి. " అని బయటకు తోసి, తెడ్డు, మిగిలిన సామానులు ముఖాన విసిరి కొడుతూ తలుపు వేసింది మేనక.
ఇంతలో ఫోన్ అరిచింది!. కంగారులో ఫోన్ ఎత్తాడు పాకా.
"హాయి మిస్టర్ పాకా, నీ కారణంగా మాకు మంచి గిట్టుబాటు అయ్యింది. నీ మేలు మరిచిపోలేను. "
"ఓరి బాకా!, నువ్వా?. నీ బ్రాండో బ్రాండు దెబ్బకు. నా జీవితం బ్యాండో బ్యాండు అయ్యింది కదరా. నిన్ను వదిలిపెట్టాను రా. " కోపంతో అన్నాడు పాకా.
"పట్టుకో చూద్దాం. బ్రాండో బ్రాండు, నీకు బ్యాండో బ్యాండు. " అని ఒక్కసారిగా ఫోన్ కట్ చేశాడు బాకా.
ఇంతలో తనకు ఏదో వచ్చి తగిలింది. చూసే సరికి బాకా ఇచ్చిన పెట్టే, ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూసాడు పాకా, షాక్ తగిలినట్టు అయిపోయాడు!.
"ఓరి, బాకా, 'జీవిత సారం' ఐటం ఫార్ములా అని చెప్పి ఉగాది పచ్చడి కి కావాల్సిన ఐటెమ్స్ ప్యాక్ చేసి ఇస్తావా. " ఎదురుగా వున్న ఉగాది పచ్చడి ఐటెమ్స్ చూసి తిట్టుకుంటూ, " ఏ ఐ యాంకర్ కర్మ మాటలు నమ్మి, అనుసరించి నందుకు, నా కర్మ ఇలా కాలిపోయింది. " అని తల బాదుకుంటూ ముందుకు సాగాడు పాకా.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Comments