top of page
Original.png

కరోనా కలిపింది ఇద్దరిని

14 hours ago
6 min read

కరోనా సమయంలో మళ్లీ ఒక్కటైన భార్యాభర్తలు – కరోనా కలిపింది ఇద్దరిని కథ

Corona Kalipindhi Idharini - Telugu Social Story | Sudhavishwam Akondi

కరోనా కలిపింది ఇద్దరిని - తెలుగు సామాజిక కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 13/11/2026


దాంపత్య జీవితంలో అపార్థాలు, కుటుంబ కలహాలు ఎంతటి దూరాన్నైనా సృష్టించగలవు. కానీ ఒక్క అనుకోని సంఘటన మనసులను మార్చి, విడిపోయిన ఇద్దరినీ మళ్లీ ఒక్కటి చేయగలదని చెప్పే కథే “కరోనా కలిపింది ఇద్దరిని”.


నూతన, వరదన్ దంపతులు శ్రావణి దంపతుల ఎదురు ఫ్లాట్‌లోకి కొత్తగా దిగారు. తమిళనాడు నుంచి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చారు.


ఆరోజు నూతన వచ్చి శ్రావణి తలుపు తట్టి...


“ఐ యామ్ నూతన! మా ఆయనను ఇక్కడి బ్రాంచ్‌లో వేశారు. చెన్నై బ్రాంచ్ నుంచి వచ్చాం! ఇంతకీ మీరు ఇటు వచ్చి ఎన్నాళ్ళయ్యింది అక్కా?” అని అడిగి, శ్రావణి ఇంకా జవాబు చెప్పకముందే...


“కొంచెం వాటర్ కావాలక్కా!” అంటూ అడిగి ఇంగ్లీషులో మాటలు కలిపింది. ఇంకా వాళ్ళింటి విషయాలు కూడా చెప్పుకుంటూ పోయింది.


అవతలి వాళ్ళ స్థితి చూడకుండా తాను లొడలొడా వాగే రకమేమో అని మనసులో అనుకుంటూ మొహమాటంగా ఓ చిరునవ్వు నవ్వి, వాటర్ బాటిల్‌లో నీళ్లు నింపి ఇచ్చింది శ్రావణి.


“థాంక్స్ అక్కా! చిన్న పాప ఉంది. పాలు ఎక్కడ దొరుకుతాయి?” అని అడిగింది నూతన.

“పొద్దున్నే కొద్దిదూరంలో పాలబూత్ ఉంది. అక్కడ దొరుకుతాయి. ఎమర్జెన్సీకి కొద్దిదూరంలో రిలయన్స్ ఉంది. ప్రస్తుతం ఈ పాలు తీసుకో” అంటూ ఇచ్చింది శ్రావణి.


మళ్ళీ ఒకసారి 'థాంక్స్' చెప్పి వెళ్ళింది.


అది ఒక చిన్న ఫ్లాట్స్ సముదాయం. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్స్ అది. శ్రావణి వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అయ్యింది. 


శ్రావణి వాళ్ళాయన ఆ కంపెనీలో లీగల్ అడ్వయిజర్. ఢిల్లీ నుంచి ట్రాన్స్‌ఫర్ వల్ల వచ్చారు. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా బ్రాంచులు ఉన్నాయి.


ఈ నూతన వాళ్లకు ముందు కూడా వేరే తమిళ్ వాళ్లే ఉండేవారు ఆ ఫ్లాట్‌లో. వాళ్ళు తమిళనాడుకు ట్రాన్స్‌ఫర్‌లో వెళ్లిపోయారు. అదే ప్లేస్‌లో నూతన వాళ్లు వచ్చారు.


శ్రావణి అమ్మలక్కల ముచ్చట్లకు దూరంగా ఉంటుంది. అనవసరంగా అందరి వ్యక్తిగత విషయాలను ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఇతరుల విషయాలు మాట్లాడుకోవడం నచ్చదు శ్రావణికి. 


అందుకే ఎవరైనా వచ్చి పలుకరిస్తే, వారికి అతిథి మర్యాదలు చేసి, బాగా మాట్లాడుతుంది. కావాల్సిన సాయం చేస్తుంది.


కానీ ఫ్లాట్స్ ముందు కూర్చుని అందరిపై అవాకులు చెవాకులు మాట్లాడడానికి వెళ్ళదు. 


భర్తను ఆఫీసుకి, పిల్లల్ని స్కూల్‌కి పంపాక ఇంట్లోనే టీవీ చూడడమో, తనకిష్టమైన పుస్తకాలు చదువుకోవడమో చేస్తూ ఉంటుంది. అవసరం అయితే దగ్గర్లోని షాప్‌కి వెళ్లి వస్తూ ఉంటుంది.


మరునాడు ఏదో అవసరం కోసం షాప్‌కి వెళ్లి వస్తుండగా లిఫ్ట్‌కి ఇరువైపులా ఉన్న ఫ్లాట్స్ వాళ్లు వాళ్ల ఇంటిముందు కూర్చుని, నలుగురు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు.


ఒకటే అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌కి ఇటువైపు రెండు, అటువైపు రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. అదే విధంగా మూడు ఫ్లోర్స్ లో ఉన్నాయి. 


లిఫ్ట్ వద్ద ఉన్న ఫ్లాట్స్ ముందు కూర్చుని ఉన్నారు వాళ్లంతా. అందరి విషయాలు మాట్లాడుకుంటారు. అందుకే ఆ నలుగురు మంచి ఫ్రెండ్స్.


బయట నుంచి వస్తున్న శ్రావణిని బలవంతంగా అక్కడే కూర్చోబెట్టి, ముచ్చట్లు మొదలుపెట్టారు.


అందులో రామేశ్వరి ఇలా అంది...


“శ్రావణి! నీకో విషయం తెలుసా? మీ ఇంటి ఎదురుగుండా కొత్తగా వచ్చారు కదా! ఆవిడ.. అదే నూతన! వాళ్ళది లవ్ మ్యారేజీ అట! పెళ్లయి మూడేళ్లు అయ్యిందట. 


ఆవిడ పొద్దున్నే లేచి వంట చేయదట రోజూ! పాపం! ఎలాగో ఒక బ్రెడ్ తిని పోయాడట వాళ్ళాయన ఈరోజు కూడా. 


అందుకని ఇప్పుడు లంచ్ రెడీ చేసి బాక్స్ సర్దుకుని, ఆ చిన్న పాపను చంకలో వేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది వాళ్ళాయన బ్రాంచ్‌కి. 


ఇప్పుడే వెళుతూ ఆ విషయాలన్నీ చెప్పి వెళ్ళింది. పొద్దున్నే లేచి వండి పెట్టాలి కానీ ఇదేం పని? ఓవర్ యాక్షన్ కాకపోతే! ఎందుకు మీ ఆయన ఇవ్వాళ్టికి బయట హోటల్‌లో తింటాడు కదా! అంటే మాది లవ్ మ్యారేజీ! నేను చేసింది ప్రేమగా పెడితే అది వేరు. 


ఇలా చాలాసార్లు తీసుకెళుతుంటాను అంది. హవ్వ! మరీ చోద్యం కాకపోతే! ఇలా ప్రేమ ఉందని ప్రకటించుకోవాలా? అదీ ఇలా క్యాబ్‌లో వెళ్లి మరీ” అంటూ పెద్దగా నవ్వింది. మిగతా అందరూ శృతి కలిపారు.


“అవునా” అంది కానీ... నూతన చేసిన పని విచిత్రంగానే అనిపించింది శ్రావణికి. 'పోనీ! భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటే మంచిదే కదా' అనుకుంది.


వారం రోజుల్లోనే తన ఆలోచన తప్పు అని తెలుసుకుంది శ్రావణి.


ఆ మరుసటి రోజు నుంచి రెండు రోజులు సెలవు కలిసి వచ్చిందని, పిల్లల్ని తీసుకుని తిరుపతి వెళ్లారు శ్రావణి దంపతులు.


దర్శనం చేసుకుని వచ్చాక, భర్త, పిల్లలూ ఆఫీసుకీ, స్కూళ్లకూ వెళ్ళిపోయాక ప్రసాదాల పొట్లం తీసుకుని, అందరికీ పంచడానికి వెళ్ళింది శ్రావణి. 


అప్పుడు లిఫ్ట్ వద్ద ఫ్లాట్‌లోని రామేశ్వరి...


“శ్రావణి! మీరు ఊరు వెళ్ళాక చాలా పెద్ద గొడవ జరిగింది తెలుసా! మీ ఎదురు వాటా వాళ్ళు అదే నూతన, వాళ్ళాయన పెద్దగా గొడవ పడ్డారు. ఆమె ఏడుస్తూ కిందకు వచ్చింది. అదీ రాత్రి 11 గంటలకు. వాళ్లకు సర్దిచెప్పి మేము పడుకునేసరికీ అర్ధరాత్రి అయ్యింది.”


“అవునా” అంటూ ఆశ్చర్యపోయింది.


అంతకుముందు నూతన వాళ్ళు ఫ్లాట్‌లోకి వచ్చిన మరునాడు మధ్యాహ్నం వచ్చి, కూర్చుని వాళ్ళది లవ్ మ్యారేజ్ అనీ, తన వెంట మూడేళ్లు తిరిగాడు అనీ చెప్పుకొచ్చింది. అదంతా గుర్తొచ్చింది శ్రావణికి.


“అక్కా! నేను చెన్నైలో ఒక కంపెనీలో జాబ్ చేసేదాన్ని! మా స్ట్రీట్‌లోనే ఉండేవాళ్ళు ఈ వరదన్ వాళ్ళు. పెళ్లి చేసుకొమ్మనీ నా వెంట పడ్డాడు. ముందు పట్టించుకోకున్నా, తర్వాత ఇష్టపడ్డాను. 


మా నాన్నకి తెలియకుండా మా అమ్మ మా పెళ్లి అవ్వడానికి చాలా సాయం చేసింది. పెళ్లి కాకముందు మేమిద్దరం కలిసి మాట్లాడుకోడానికి, మా నాన్నకు తెలియకుండా వీలు కల్పించింది మా అమ్మే!


చూడడానికి అందంగానే ఉన్నాడు. మంచి జాబ్ ఉంది. వెంటపడి మరీ ప్రేమించి, పెళ్లి చేసుకొమ్మంటున్నాడు కనుక నేను చెప్పింది వింటాడు అనుకున్నాను. కానీ అలా లేదు అని పెళ్లి అయిన వన్ ఇయర్‌లోనే అర్థం అయ్యింది అక్కా!


పెళ్లి అయ్యాక వాళ్ళింటికి వెళ్ళాం. వాళ్ళమ్మకు అస్సలు చదువు రాదు. పూర్తిగా పల్లెటూరు మొద్దు. అస్సలు శుచి, శుభ్రత లేదు. నేను పాలు తాగే గ్లాస్‌లో ఏదో చెత్త పడితే వేలు పెట్టి తీసేసింది. అసహ్యం వేసింది. ఇంకెప్పుడూ నేను మీ ఇంటికి రాను. నేను కావాలంటే నువ్వే మా ఇంటికిరా అని వరదన్‌కి చెప్పాను. దానికి పెద్ద గొడవ పెట్టుకున్నాడు.


మాది చాలా గొప్ప వంశం. ఎంతో మందికి దానధర్మాలు చేసిన వంశం. వాళ్లేమో చాలా తక్కువ మా ముందు. ఒక రకంగా చెప్పాలంటే అలగా జనం. అయినా నన్ను ప్రేమించాడని పెళ్లికి ఒప్పుకున్నా.


ఆ తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్నాం. అప్పుడే పాప కడుపులో పడింది. డెలివరీ అయ్యాక మా అమ్మతో ఏదో వంకతో గొడవ పెట్టుకున్నాడు.


'మా అమ్మ వద్దకు రానంటున్నావు కదా! మీ అమ్మవాళ్లు కూడా రావద్దు. మీ అమ్మ నాతో గొడవ పెట్టుకుంది' అన్నాడు.


అక్కడ గొడవలు ఎక్కువగా అవుతున్నాయని ఆఫీస్‌లో వాళ్ళ బ్రాంచ్ హెడ్ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఇప్పుడు బాగానే ఉన్నాం. నా మాట వింటున్నాడు” అంటూ సంతోషంగా చెప్పింది.


అప్పుడు 'ఈ అమ్మాయికి అత్తగారు అన్నా, భర్త అన్నా చులకన భావం చాలా ఉన్నట్టుంది' అనిపించింది శ్రావణికి. కానీ అది పైకి అనకుండా...


“ఓ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా! ఎంజాయ్” అని వదిలేసింది.

ఇప్పుడు మళ్లీ ఇంతలా గొడవా! అనుకుంది.


అదే రోజు అర్ధరాత్రి మళ్ళీ వాళ్ళ గొడవ వినబడింది. మొగుడు పెళ్ళాం కొట్టుకున్నారు. కాసేపటికి ఎలాగో సర్దుమణిగింది.


ఆ రోజు ఉదయం అందరూ వెళ్ళిపోయాక, తినేసి, కాస్త తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తోంది శ్రావణి (మూలప్రతిలో కల్యాణి అని ఉన్నది). ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే నూతన.


“రా నూతనా! కూర్చో! అలా ఉన్నావేంటి? పాప పడుకుందా? ఏంటి విశేషాలు?” అని పలకరించింది శ్రావణి ఆమె ముఖం డల్‌గా ఉండడం చూసి.


ముందు మాట్లాడకుండా కూర్చుని, వెంటనే చేతులు ముఖంపై పెట్టుకుని బోరుమని ఏడ్చింది.


“ఏమైంది అసలు? ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది శ్రావణి.

ముందురోజు గొడవ అంతా చెప్పుకొచ్చింది నూతన.


“ఎందుకు అలా గొడవ పడుతున్నారు? చిన్న పాప ఉంది కదా! పాప కోసమైనా సర్దుకోరా? చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పావుగా! అప్పుడు సంతోషించాను. ఇలా ఎందుకు గొడవపడుతున్నారు?”


“కష్టపడి నేను ఆయన కోసం వంట చేసి పొద్దున్నే బాక్స్ పెట్టడం అవ్వకపోతే, క్యాబ్‌లో వెళ్లి మరీ ఇచ్చి వస్తాను. కానీ ఆయనకు నాపై ప్రేమనే లేదు అక్కా! అప్పుడు ఏదో నాటకం ఆడాడు ప్రేమ ఉన్నట్టు. 


ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. ఏమీ మాట్లాడడు. తినడం, పడుకోవడం ఇదే పని. అదే అడిగితే గొడవపడుతున్నాడు.


నీకో విషయం చెప్పనా అక్కా! మా మధ్య ఏమీ లేదు. అదే ఫిజికల్ రిలేషన్ లేనేలేదు. దాని గురించి నేను అడిగితే...


'అప్పుడు నా మగతనం నిరూపించుకోవాలని ఈ కూతురిని కన్నాను. ఎవరో జ్యోతిష్కుడు నీకు పిల్లలు పుట్టరు అని చెప్పాడు. 


అందుకని అతని జోస్యం తప్పని నిరూపించాలని వెంటనే పెళ్లి అవ్వగానే కన్నాను. అంతే!' అని అన్నాడు. ఆ మాట వినగానే చాలా బాధేసింది.


ఏదైనా నాకు డ్రెస్ కొంటే వెంటనే వాళ్ళ అమ్మకూ, అక్కకూ కాల్ చేసి తనకు డ్రెస్ ఇంత డబ్బు పెట్టి కొన్నానని చెబుతాడు. అలా ప్రతి విషయం చెప్పడం ఎందుకు అంటే నాపై అరుస్తాడు, నన్ను కొడతాడు” ఇలా చాలా బాధలు చెప్పింది.


ఇద్దరిలో తప్పు ఉంది అనిపించింది శ్రావణికి.


“నూతనా! చిన్న పాప ఉంది మీకు. తన కోసమైనా ఇద్దరూ ఓపిగ్గా ఉండాలి. చాలామంది మగవాళ్ళు చాలా మటుకు అలానే ఉంటారు. 


ఎప్పుడూ సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. మా ఇంట్లో అంతే! ఇంట్లో మాట్లాడాలంటే కష్టం వాళ్లకు. 


సినిమాలోలా రియల్ లైఫ్ ఉండదు నూతనా! కొంత ఓపిక ఉండాలి. ఒకరు అలా ఉన్నప్పుడు మరొకళ్ళు సర్దుకుపోవాలి. అయినా సార్‌తో చెబుతానులే మీ ఆయనతో మాట్లాడమని” అంటూ సర్ది చెప్పింది శ్రావణి.


ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళమ్మ ఊరినుంచి వచ్చింది. కాసేపు కూతురుతో మాట్లాడి, అల్లుడు వచ్చే టైం కల్లా చుట్టాలింటికి వెళ్ళిపోయింది. 


శ్రావణి ఫోన్ నెంబర్ అడిగి తీసుకెళ్లింది. తన కూతురును కొంచెం చూడండి అని చెప్పి వెళ్ళింది. 


అల్లుడు రావొద్దన్నాడు కదా అని ఎప్పుడు వచ్చినా ఇలానే చూసి వెళ్తుందట. మరునాడు పొద్దున్నే చెన్నై వెళ్ళిపోయింది. తిరుపతి నుంచి చెన్నై దగ్గరే కనుక అలా వచ్చి, ఇలా వెళుతోంది.


అతగాడు అలా చేయడం చాలా తప్పని అనిపించింది శ్రావణికి. భార్య చిన్నది, తనకైనా ఓపిక ఉండాలి కదా అని అనుకుంది.


ఆ మరునాడు ఆదివారం. సాయంకాలం పిల్లల్ని సరదాగా బయటకు తీసుకుని వెళ్లి, వస్తూ కూరలు, ఇంటికి అవసరమైన సామాను తెచ్చేసుకుంటూ ఉంటారు శ్రావణి వాళ్లు. 


ఆ రోజు కూడా వెళ్లారు. కాస్త దూరం వెళ్ళేసరికి శ్రావణి ఫోన్ మోగింది. చూస్తే నూతన వాళ్ళమ్మ ఫోన్.


“అమ్మా! నా కూతురు ఫినాయిల్ తాగేసిందట. అల్లుడు వంట బండకేసి తోసాడట. తలకు కొట్టుకుంది. ఫోన్ చేస్తే చెప్పింది తను. సరిగ్గా మాట్లాడట్లేదు. దయచేసి నా కూతురును కాపాడండి” అని ఏడుపు.


“ఆంటీ! ఏడవకండి. మేము బయటకొచ్చాము. ఇప్పుడే వాపసు వెళ్తున్నాం. నూతనకు ఏమీ అవ్వదు. మీరేమీ అధైర్య పడవద్దు. నేను వెళ్లి తనతో మాట్లాడాక మీకు కాల్ చేస్తాను” అని చెప్పింది.


ఏమైందోనని ఇంటికి వచ్చారు. శ్రావణి భర్త వాళ్ళిద్దరిని పిలిచాడు. ఆయన వరదన్ పై ఆఫీస్‌లో, పై హోదాలో ఉన్నాడు.


శ్రావణి నూతనతో మాట్లాడడానికి వెళ్ళింది. ఫినాయిల్ ఏదో కొంచెం నోట్లో పోసుకుందట. ఏమీ డేంజర్ కాలేదు. బెంగళూరులో జాబ్ చేస్తున్న నూతన పెద్దనాన్న కొడుకు వచ్చాడు హడావుడిగా.


“నీకేమైనా పిచ్చా! చచ్చి ఏమి సాధిస్తావు? నీ కూతురిని అనాథగా చేస్తావా? ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తావు. అలా ఉండకూడదు” అని హితోపదేశం చేసింది కానీ అంత వినేలా కన్పించలేదు.


ఇక్కడ...


“చూడు వరదన్! ఆడపిల్లపైన చేయి చేసుకుంటావా? అంతలా కొట్టడం ఎందుకు? అలా ఆవేశపడిపోవద్దు. ఓపిక ఉండాలి” అని శ్రావణి భర్త సర్దిచెప్పబోతే...


“ఆవిడ ఎంతలా మా పేరెంట్స్‌ని అవమానిస్తుందో మీకు తెలియదు...” అని ఆమె ఇలా టార్చర్ చేస్తుందని చెప్పడం మొదలుపెట్టాడు వరదన్.


“ఆమె కోపంతో వెళ్లి నీపై కేసు వేస్తే నీ జాబ్ పోతుంది. నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఏదైనా ప్రశాంతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి” అంటూ చెప్పాడు చివరికి కొంత బెదిరింపుగా, అలాగైనా సర్దుకుంటాడని.


ఎవ్వరు చెప్పినా వినకుండా చెన్నై వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయింది నూతన.

కొన్నాళ్ళకి పెద్దవాళ్ళు మాట్లాడి కలిసివుండేట్టు చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా అంత సఫలం కాలేదు. ఎంతో కాలం కలిసి లేరు. మళ్ళీ గొడవలు. 


చివరికి విడాకులకు అప్లై చేశారు.

తను వేరే జాబ్ చూసుకుని బ్రతుకుతానని పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఇతను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఖాళీ చేసి.


కేసు నడుస్తోంది.


ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చింది. కోర్టులు సరిగ్గా పని చేయలేకపోయాయి. కేసులు వాయిదా పడ్డాయి.


అలాంటి సమయంలో నూతనకు కరోనా వచ్చి కొద్దిగా సీరియస్ అయ్యింది. అప్పుడు ఎంతో జాగ్రత్తగా తనే దగ్గరుండి అన్ని అవసరాలు చూసుకున్నాడు వరదన్, తనకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.


దాంతో నూతన కూడా తన భర్తకు తనపై ఉన్న ప్రేమకు చలించిపోయింది. కరోనా పూర్తిగా తగ్గిపోయి మామూలు మనిషి అయ్యింది. పాత సంగతులు మర్చిపోయి, మళ్ళీ ఇద్దరూ ఒక్కటయ్యారు. కేసు విత్‌డ్రా చేసుకున్నారు.


వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వసంతం చిగురించింది. అలా కరోనా ఆ ఇద్దరిని కలిపింది.

ఒక్కోసారి ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసినా రాని మార్పు, ఒక చిన్న సంఘటన వల్ల మార్పు రావచ్చు! మంచి చేయవచ్చు! అంతా కాల మహిమ!


రచన: సుధావిశ్వం

- శుభం -


  


సుధావిశ్వం

-సుధావిశ్వం






1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

I have read your story..kalam kalipindi iddarini. Good Concept. But something missing between pre carona and carona time. How husband came to know and how he reached wife..some explanation necessary

Like
bottom of page