top of page
Original.png

నడిచివెళ్ళిన ధర్మం

4 hours ago
5 min read

రైలు బోగీలో బంగారు ఉంగరాన్ని యజమానికి తిరిగి ఇస్తున్న పేద యాచకురాలు – నడిచివెళ్లిన ధర్మం

Nadichivellina Dharmam - Telugu Social Story | M R V Sathyanarayana Murthy

నడిచివెళ్ళిన ధర్మం- తెలుగు సామాజిక కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 13/11/2026


రైలు ప్రయాణంలో ఎదురైన ఓ పేద యాచకురాలి నిజాయితీ, మానవత్వం ముగ్గురు పెద్దమనుషుల ఆలోచనలను మార్చేస్తుంది. ధర్మం మాటల్లో కాదు, చేతల్లో ఉంటుందని చాటి చెప్పే హృదయస్పర్శి సామాజిక కథ ‘నడిచివెళ్లిన ధర్మం’.



విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లే రైలు వేగంగా పరుగెడుతోంది. డి.1 కంపార్ట్‌మెంట్ కిక్కిరిసి ఉంది. 


రిజర్వేషన్ లేని వాళ్లు కూడా ఎక్కేశారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల హడావిడి స్పష్టంగా కనపడుతోంది అక్కడ. 


బాబీ కిటికీ దగ్గర కూర్చుని చెట్లూ, చేమలూ, పచ్చటి పొలాలు, చేను గట్ల మీద ధ్యానంలో ఉన్న మునీశ్వరుల్లా ఉన్న తెల్లటి కొంగలు చూస్తూ సెల్ ఫోనులో ఫోటోలు తీస్తున్నాడు. అతని పక్కనే వాళ్ల అమ్మమ్మ వసుంధర దేవుడి స్తోత్రాల పుస్తకం చదువుకుంటోంది. 


ఆమె పక్కనే కూర్చుని ఉన్న సుమారు ముప్ఫై ఏళ్ల యువతి ఫోన్ చూసుకుంటోంది.

వారికి ఎదురుగా ఉన్న సీటులో కూర్చున్న ముగ్గురు పెరిగిన ధరల గురించి, పిల్లల చదువుల గురించి మాట్లాడుకుని చివరకు రాజకీయాలలోకి వచ్చారు.


“ఉద్యోగస్తుల అవినీతి గురించి అందరూ మాట్లాడుతారు గానీ, రాజకీయ నాయకులు వందల, వేల కోట్లు సంపాదిస్తుంటే వారిని పట్టుకోరు, కేసులు పెట్టరు” అన్నాడు రంగనాథం చిరాగ్గా. అతను ఈమధ్యనే తన పైసంపాదనతో ఒక విల్లా కొనుక్కున్నాడు.


“అవునండి. మా మండల పరిషత్ అధ్యక్షుడు ఈమధ్యనే ఇరవై లక్షలు పెట్టి కారు కొన్నాడు. 


అతను ఎన్నికైనప్పుడు సైకిలు మీద మండల పరిషత్ ఆఫీస్‌కి వచ్చి ప్రమాణం చేశాడు. 


రెండేళ్లలో ఎంత మార్పో” అన్నాడు కాంట్రాక్టర్ కనకారావు, తన రెండు చేతులకి ఉన్న ఎనిమిది ఉంగరాలు మురిపెంగా చూసుకుంటూ. వాళ్ల మండల అధ్యక్షుడు కమిషన్ ఎక్కువ అడిగాడని అతని బాధ.


“ఈమధ్య దేవాలయాలకు కూడా రాజకీయ గ్రహణం పట్టింది. సైకిల్ షాప్ పెట్టుకుని పాచ్చీలు వేసుకునే గురవయ్య కూడా శివాలయానికి ట్రస్టీగా వచ్చాడు, రాజకీయనాయకుడి సిఫారసుతో. 


అతను సైకిల్ తుడుచుకుంటూ, రోడ్ మీద వెళ్తున్న పూజారి గారిని ఆపి, ‘పంతులు గారూ రోజూ దేవుడికి పూజ సరిగ్గా చేస్తున్నారా? ఇలా వచ్చేటప్పుడు నాలుగు అరిటిపళ్లు తెచ్చి నాకు ఇవ్వచ్చుగా?’ అని అడుగుతాడు. పంతులుగారు బిక్కచచ్చిపోయి ‘అలాగే నండి’ అని అంటున్నాడు. ఎంత ఖర్మ చెప్పండి పూజారికి” అన్నాడు శాంతారాం.


వాళ్ల ఎదురుగా, వసుంధర పక్కన ఉన్న యువతి వీరి మాటలు పట్టించుకోకుండా తన ఫోన్ చూసుకుంటోంది.


రైలు ఏలూరు దాటింది. ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న పొలాలు చూసి, బాబీ మరింతగా ఆనందంతో కేరింతలు కొడుతూ ఫోనులో ఫోటోలు తీసుకుంటున్నాడు. వసుంధర ఒకసారి మనవడి కేసి చూసి మరలా తన చదువులో మునిగిపోయింది. 


రైలు ఎక్కేవాళ్లు పెరిగారు గానీ, దిగేవాళ్లు లేకపోవడంతో కూర్చున్న వాళ్లు అనీజీగా ఫీల్ అవుతున్నారు. నిలబడ్డవాళ్లు, ఎవరైనా సీట్ ఖాళీ చేస్తారా? అని ఆశగా చూస్తున్నారు.


ఒక యాచకురాలు చంకన జోలెతో రైలు పెట్టెలో అంత జనం మధ్యనుండి తిరుగుతూ “బాబూ, చంటి బిడ్డకు పాలు కొనాలి. ధర్మం చేయండి బాబూ” అని పాల సీసా చూపిస్తూ అడుక్కుంటోంది. 


ఆమె జోలెలో ఉన్న కుర్రాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఎవరూ ఆమె మాటలు పట్టించుకోవడం లేదు. చాలా తీవ్రంగా చర్చింటుకున్న ఈ ముగ్గురు పెద్దమనుషుల దగ్గరకు వచ్చి అడిగింది యాచకురాలు, ‘ధర్మం చేయమని’. కుర్రవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.


కాంట్రాక్టర్ కనకారావు “నీకు పనీ పాటా లేదా? ఇలా మధ్యలో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. వెళ్లు... వెళ్లు” అని గట్టిగా విసుక్కున్నాడు.


“చంటి పిల్లాడికి పాలు కొనాలి బాబూ. ధర్మం చేయండి” అంది దీనంగా యాచకురాలు. 


మురిగ్గా ఉన్న చీర, చిరుగులతో ఉన్న జోలె, అందులో నల్లగా ఉన్న ఏడాది లోపు పిల్లాడు... ఆమెని పరిశీలనగా చూసిన రంగనాథం “వెళ్లవమ్మా... వెళ్లు. 


ఇలా మీద మీదకు రాకు. చిరాకేస్తోంది. ఎక్కడెక్కడ తిరిగి వస్తారో, ఆ దుమ్మూ ధూళీ మాకు అంటుకుంటుంది. లేనిపోనీ రోగాలు కూడా వస్తాయి” అన్నాడు జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుని.


“అవునవును. వీళ్లు ముష్టివాళ్లు కాదు, దొంగలు. మనం పరాగ్గా ఉంటే మన బ్యాగులు ఎత్తుకుపోతారు. ఈ పిల్లల్ని కూడా ఎక్కడో ఎత్తుకొస్తారు. అన్నీ దొంగ బుద్ధులే... పో... పో” అన్నాడు కనకారావు చేయి ఎత్తి చూపిస్తూ. తన ఉంగరాలు అందరికీ కనపడాలని అతని తాపత్రయం.


“మా తమ్ముడు విశాఖపట్నం బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ల బ్యాంకులో ఒక ముష్టాడు రెండు లక్షల రూపాయలు దాచాడట. పిల్లల్ని కూడా గిల్లి వాడు ఏడుస్తుంటే ఇలా, పాలకని... బిస్కెట్‌ల కోసం అని అడుక్కుంటారు. 


అన్నీ దొంగ బుద్ధులు... నాటకాలూ...” అన్నాడు శాంతారాం.


“నేను దొంగను కాదు బాబూ. వీడు నా సొంత బిడ్డే బాబూ. ఎక్కడా ఎత్తుకుని రాలేదు. ఇలా అడుక్కుంటూ నా బిడ్డని పోషించుకుంటున్నాను. పేదదాన్ని. నా మీద నిందలు వేయకండి” బాధగా అంది యాచకురాలు.


ఫోన్ చూస్తున్న యువతి, హ్యాండ్ బ్యాగ్ తీసి, వెతికి వెతికి ఒక రూపాయి బిళ్ల ఆమెకిచ్చింది. ఆమెకి దండంపెట్టి ముందుకు వెళ్లింది యాచకురాలు. 


ఇంకో ఇద్దరు రెండు రూపాయలు ఇచ్చారు ఆమెకి. ఉసూరుమంటూ వెళ్లి బాత్‌రూమ్ దగ్గర కూర్చుంది పిల్లవాడితో సహా.


“ఒరేయ్ బాబీ ఫోను ఆటలు చాలు. ఈ పాలు తాగు. మనం రాజమండ్రిలో దిగాలి. నువ్వు పాలు తాగలేదంటే మీ అమ్మ నాకు క్లాస్ తీసుకుంటుంది” అంది వసుంధర, ఫ్లాస్కులోంచి పాలు తీసి గ్లాసులో పోసింది. పాల గ్లాసు బాబీకిచ్చింది. బాబీ పాలగ్లాసు చేతిలో పట్టుకున్నాడు.


ఒక్కక్షణం ఆలోచించాడు. వెంటనే సీట్ దిగి బాత్‌రూమ్ దగ్గర ఉన్న యాచకురాలి దగ్గరకు వెళ్లి, ఆమె చేతిలోని ఖాళీ పాలసీసా తీసుకుని, మూతతీసి గ్లాసులోని పాలు అందులో పోసి మూత బిగించి, పిల్లాడికి ఇచ్చాడు. ఎంతో ఆకలి మీద ఉన్న పిల్లాడు, మూతకు ఉన్న పాలపీక చప్పరిస్తూ గబగబా పాలు తాగడం మొదలుపెట్టాడు.


రైలు పెట్టెలోని వారందరూ ముందు ఆశ్చర్యంగా చూసినా, తర్వాత బాబీని అభినందించారు. బాబీ వాడితో రెండు నిమిషాలు ఆడాడు. 


తర్వాత పాలగ్లాసు వాష్ బేసిన్ దగ్గర కడిగి వసుంధరకిచ్చాడు. ఆమె తన ధోరణిలో తను ఉంది, బాబీ ఏమి చేశాడో చూడలేదు. బాబీ కిటికీలోంచి ప్రకృతి దృశ్యాలు ఆనందంగా చూస్తున్నాడు.


కొద్దిసేపటికి కనకారావు బాత్రూం దగ్గరకు వచ్చి, యాచకురాల్ని చూసి, “ఇక్కడ తిష్ట వేశావా?” అని ఈసడించుకుని, బాత్రూంలోకి వెళ్లి, తన పని ముగించుకుని వచ్చి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని, కర్చీఫ్‌తో తుడుచుకుని, జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకుని వెళ్లాడు.


యాచకురాలు, పిల్లాడిని జోలె నుండి దింపింది. వాడు అటూ ఇటూ పాకుతూ, నిలబడి ఉన్నవారి కేసి చూసి నవ్వుతున్నాడు. అది చూసిన నిలబడినవారు చిల్లర రూపాయలు ఆమెకి ఇచ్చారు.


యాచకురాలు అటుగా వచ్చిన టిఫిన్లు అమ్మేవాడిని ఆపింది. “అన్నా, నా దగ్గర ఇవే ఉన్నాయి, ఒక ఇడ్లీ పొట్లం ఇవ్వవా?” అని, తన దగ్గర ఉన్న పదిహేను రూపాయల చిల్లర వాడికి ఇచ్చింది. 


అతను డబ్బులు జేబులో వేసుకుని, ఒక ఇడ్లీ పొట్లం ఇచ్చి వెళ్లిపోయాడు. ఆమె ఇడ్లీలు తిని చేయి కడుక్కుని, వాష్ బేసిన్‌లోని టాప్ తిప్పి నీళ్లు తాగింది. కొద్ది సమయం గడిచింది. పిల్లవాడిని మళ్లీ చంకనున్న జోలెలో వేసుకుని, కనకారావు వాళ్లు ఉన్న సీట్ దగ్గరకు వచ్చింది.


“అయ్యగారూ...” అంది కనకారావు కేసి తిరిగి. అతను ఆమె కేసి కోపంగా చూశాడు.

“ఇందాకా చెప్పానుగా. ధర్మం లేదు, గాడిదగుడ్డు లేదు వెళ్లు” అని హుంకరించాడు కనకారావు.


“బాబూ, నేను ధర్మం చేయమని మిమ్మల్ని అడగడానికి రాలేదు. ఇందాకా మా చంటాడు ఆడుతుంటే దొరికింది. 


మీరు ఇందాకా బాత్‌రూమ్‌కి వెళ్లారు కదా, అప్పుడు ఏమైనా జారిపోయిందేమో చూసుకోండి” అని బంగారపు ఉంగరం చేతిలో పట్టుకుని చూపించింది ఆమె. వెంటనే కనకారావు తన ఎడమచేయి కేసి చూసుకున్నాడు.


మధ్యవేలు ఖాళీగా ఉంది. గబగబా ఆమె చేతిలోని దేవుడి ఉంగరం తీసుకుని, కళ్లకు అద్దుకుని తన వేలికి పెట్టుకున్నాడు. 


లక్షా ఇరవై వేలు పెట్టి నెలక్రితమే చేయించుకున్నాడు. హమ్మయ్య... దొరికింది, తన సొమ్ము గట్టిది అని అనుకున్నాడు. “అవును ఇది నాదే” అన్నాడు కనకారావు. 


చుట్టుపక్కల ప్రయాణీకులు అందరూ అతనినే చూస్తున్నారు. జేబులోంచి పర్సు తీసి, వెతికి ఒక పదిరూపాయల నోటు తీసి “ఇదిగో ఇది తీసుకో” అన్నాడు.


“వద్దు బాబూ. మీ సొమ్ము మీకు చేర్చాను. నేను దొంగను కాను. అది మీరందరూ గ్రహిస్తే చాలు. అయాచితంగా వచ్చిన సొమ్ముకి ఆశపడే మనిషిని కాను. 


నా దురదృష్టం ఇలా ఉంది. నా మొగుడికి యాక్సిడెంట్‌లో రెండు కాళ్లూ పోయాయి. నేను ఇలా యాచన చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను” అంది యాచకురాలు.


ఆమె మాటలకి కనకారావు, రంగనాథం, శాంతారాం తలలు దించుకున్నారు. ఫోన్ చూస్తున్న యువతి ఆమె నిజాయితీని చప్పట్లతో అభినందించింది.


గబగబా అందరూ తమకి తోచిన డబ్బు ఆమె చేతిలో పెట్టారు.

యాచకురాలు నెమ్మదిగా నడుచుకుంటూ బాత్రూం దగ్గరకు వచ్చి నిలబడింది.


ఇంతలో రాజమండ్రి స్టేషన్ వచ్చింది. వసుంధర బాబీని తీసుకుని దిగింది. యాచకురాలూ దిగి వెళ్తోంది. ఆమె అలా వెళ్తుంటే...


‘నడిచి వెళ్తున్న ధర్మదేవతలా’ కనిపించింది వసుంధరకి.

గౌరవనీయ సంపాదకులు,

మన తెలుగు కథలు డాట్ కామ్ పత్రిక వారికి.


నమస్తే. మీరు నిర్వహిస్తున్న ఉగాది కథల పోటీకి, నా కథ “నడిచి వెళ్తున్న ధర్మం” పంపుతున్నాను. పరిశీలించ మనవి. ఈ కథ నా స్వీయ రచన. దేనికీ అనువాదం అనుసరణ కాదు. గతంలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాలేదు. ఏ వెబ్ పత్రిక, ఇతర మాధ్యమాలలో రాలేదు.


*******



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సత్యనారాయణ మూర్తి  M R V

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

సత్యనారాయణ మూర్తి  M R V

సత్యనారాయణ మూర్తి  M R V

telugu emotional story,  wife husband story telugu,  old age home story


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page