top of page

దత్తపుత్రుడు - పార్ట్ 2



'Datthaputhrudu Part 2/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 23/02/2024

'దత్తపుత్రుడు - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ ప్రారంభం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

పిల్లలు లేని తులసి. బిచ్చగాడైన బాలు అనే కుర్రాడిపైన అభిమానం పెంచుకుంటుంది. బాలు కనపడక పోవడంతో ఆందోళన పడుతుంది. 


ఇక దత్తపుత్రుడు పెద్దకథ చివరి భాగం చదవండి. 


“తొందరగా చెప్పండి. నాకేదో భయంగా ఉంది. ” అంది తులసి. కళ్ళల్లో నీళ్ళు టపటపమని నేలమీదకు జారుతున్నాయి. 


“ఏం లేదు తులసి, మన ఊరిలో ఎలక్షన్లు వస్తున్నాయని పెద్ద పెద్ద మినిష్టర్లు వస్తున్నారట. అందుకని ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరిని పోలీసులు తీసుకవెళ్ళి జైల్లో పెట్టారట. ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళను విడిచిపెడతారట. అక్కడ వాళ్ళకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారట. నువ్వేం బాధపడకు. వాడు బాగానే ఉన్నాట్టా. మన గోవిందు చూసాడట. ” నెమ్మదిగా చెప్పాడు మురహరి. 


“ జలజలా దుమికే గోదావరే అయింది తులసి. చాలా సేపు అలా ఏడ్చింది బాలు కోసం. 

ఆమె మనసులో ఉన్న బాధనంతా బయటకు వెళ్ళగక్కగా అప్పుడు,


“తులసి .. నువ్వు వాడికోసమని తిండి తిప్పలు మాని బాధతో కుమిలిపోతున్నావని బాలు ఎక్కడున్నాడో నీకు చెప్పాను. నువ్వు వాడికోసం అంతగా ఎందుకు బాధపడుతున్నావో నాకర్ధం కావడంలేదు. వాళ్ళు వదిలిపెట్టాక ఇక్కడికి రాకపోతే ఎక్కడికిపోతాడు.. కొంచెం ఓపికపట్టు. ” భార్యను ఓదారుస్తూ చెప్పాడు. 


“ఏమండి.. మనం వెళ్ళి బాలును తీసుకవద్దామండి. వాడిని బయట తిరగనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. పాపం అక్కడ జైల్లో ఏం తిండి పెడుతున్నారో ఏంటో. మిమ్మల్ని నేనెప్పుడు ఏది అడగలేదు, ఈ ఒక్కమాట కాదనకండి. ” భర్తను బ్రతిమాలింది. 


“ కానీ.. తులసి.. బాలును మనం ఇంట్లో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో. “ అనుమానం వ్యక్తం చేస్తూ అన్నాడు. 


“బాగుందండి మీరు చెప్పేది.. నలుగురు అనుమానిస్తున్నారంటున్నారా లేకపోతే

మీకే అవమానంగా భావిస్తున్నారా? చూడండి. మనకు నలుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగానే పోయారు. మన కర్మ అనుకుని వదిలేసుకున్నాము. ఎవరి పిల్లలనన్నా

దత్తత తీసుకుందామా అని మీరు ఎన్నో సార్లు నన్నడిగారు గుర్తుందా? నాకు పిల్లలను పెంచే యోగంలేదేమోనని, మళ్ళి ఏ పిల్లవాడిని తెచ్చి పెంచుకున్నా పొరబాటున వాడికి ఏదైనా జరిగితే లోకం మనను నిందిస్తుందని ఆనాడు వద్దన్నాను. 

కానీ.. ఎందుకో బాలు మనకు పరిచయం అయినప్పటినుండి వాడిని నా కన్న కొడుకుకంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. వాడు ఒక్కరోజు కనపడకపోయినా నా మనసు పడే వేదన మీకర్ధం కాదు. మీకు చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను ధైర్యం చాలక చెప్పలేకపోతున్నాను. ” అంటూ చెప్పడం ఆగిపోయింది. 


“ తులసి.. నీ మనసులో ఇంత బాధను నింపుకున్నావా? బాలు మీద ఇంత ప్రేమ ఉందని నేననుకోలేదు. మాములుగా వాడిని చూసి జాలితో తిండి పెడుతున్నా వనుకున్నానుగానీ. నీ మనసు వాడి చుట్టు అల్లుకుపోతుందని ఊహించలేదు. 


 చెప్పు తులసి, నీ మనసులో ఏమనుకుంటున్నావో.. తప్పకుండా నువ్వన్నట్టుగానే చేస్తాను. వాడిని ఒక మంచి హాస్టల్ లో వేసి చదువు చెప్పించమంటావా. లేకపోతే ఇక్కడ మనింట్లో ముందు గదిలో ఉంటూ బడికి పంపించమంటావా చెప్పు. ” ఆత్రుతగా అడిగాడు. 


“ఏమండి .. బాలును చూస్తే మన బిడ్డగా పనికిరాడనా మీరు అలా అంటున్నారు. వాడికేం తక్కువయిందని దేవుడిచ్చిన చక్కటి రూపం. అసలు వాడిని చూస్తే ఎవరైనా ఆనాథ అనుకుంటారా. ఎవరో కని పడేసారు వాళ్ళు చేసిన పాప ఫలితం బాలు అనుభవిస్తున్నాడు. పిల్లలులేని మనకు ఆ దేవుడే బాలు రూపంలో పంపించాడేమోనని అనుకుందాము. 

మనం బాలును దత్తత తీసుకుందాము ఈ ఒక్క కోరిక తీర్చరా నాకు. ” కన్నీళ్లు పెట్టుకుంటూ అమాంతంగా భర్త కాళ్ళు పట్టుకుంది తులసి. 


మురహరికి ఈ పరిస్థితి నుండి తేరుకోవడానికి ఒక్క నిముషం పట్టింది. అయోమయంగా చూడసాగాడు తన కాళ్ళ దగ్గర కూర్చొని మౌనంగా రోదిస్తున్న తులసిని. తమ ఇన్నేళ్ళ కాపురంలో నాకు ఇది కావాలి అని అడిగిన మొట్టమొదటి కోరిక తులసిది. కష్టమైన, సుఖమైన ఏనాడు పెదవి విప్పి చెప్పలేదు. ఎప్పుడు నవ్వుతూ, అందరిని నవ్విస్తూ ఉండేది కానీ తన మనసులోని బాధను ఎవరికి కనిపించనీయలేదు. అటువంటి తను, ఈనాడు జీర్ణించుకోలేని కోరిక కోరింది. ఒక ఆనాథను అందులో బిక్షాటన చేస్తున్నవాడిని నా కొడుకుగా దత్తత తీసుకుంటే. నలుగురిలో తలెత్తుకోగలనా? 


అందరు బిచ్చగాడు నీ కొడుకట గదా అని హేళన చేస్తుంటే నేను భరించుకోగలనా. లేదు నలుగురితో నాకు సంబంధం లేదు నా తులసికోసం ఏమైనా చెయ్యగలను. సంసార రథంలో రెండు చక్రాలు సమర్ధవంతంగా పని చేస్తేనే ఆ జీవితరథం సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు నేను కాదన్నానంటే తులసి మానసికంగా కుంగిపోతుంది. అలా జీవితంలో తనను నా నుండి దూరంచేసుకోలేను. కావాలంటే తులసికోసం ఈ ఊరే విడిచి వేరే చోటికి వెళ్ళిపోయి ప్రశాంతజీవనం గడపాలి అనుకుంటూ మనసు గట్టిచేసుకొని. 


“ తులసి.. ఏమిటి నువ్వు చేస్తున్నపని లే ఇలా చూడు. ” అంటూ రెండుచేతులతో భార్యను లేపి గుండెల కదుముకుంటూ, “ తులసి .. ఇన్నాళ్ళు దీని గురించి నీ మనసులో పెట్టుకుని బాధపడే బదులు నాకు చెబితే ఎప్పుడో బాలుని దత్తత తీసుకునే వాళ్ళం కదా. నీమాట కాదంటానని ఎలా అంటాననుకున్నావు చెప్పు. ” లాలనగా ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు మురహరి. 


 సంభ్రమంగా భర్తవైపు చూస్తూ. “ ఏమండి .. మీరు చెబుతున్నది నిజమా? అంటే మీరు మీరు బాలుని దత్తతకు ఒప్పుకున్నారా? ఎంతమంచి మనసండి మీది. నా కోసం మీరు ఇంత దిగి వస్తారనుకోలేదు బాలుని మరిచిపోలేక రోజురోజుకు పిచ్చిదాన్ని అయిపోతున్నాను. మీకు చెబితే తిడతారేమోనని నాలో నేనే కుమిలిపోతున్నాను. ” అంది ఆశ్చర్యంతో మాటలు రావడం కష్టమయింది తులసికి. 


“చూడు తులసి.. మన జీవితంలో పిల్లలతో సంతోషపడే రాత ఎలాగులేదు. మనమా నడివయసు దాటినవాళ్ళం ఇంకా మనం సాధించేదేముంది కనుక. ఉన్నంతకాలం సంతోషంగా గడపడమే కదా మనకు కావలసింది. నువ్వు బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నీ సంతోషమే నా సంతోషం. నా కోసం నువ్వు నీ కోసం నేను కోరికలను చంపుకొని బతకడం కాదు, ఒకరికోసం ఒకరం బతుకుదాము సరేనా. నేను ఇప్పుడే మన గోవిందును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బాలును తీసుకుని వస్తాను”

నవ్వుతూ భార్య కళ్ళు తుడిచాడు. 


ఇంతమంచి భర్తను ఇచ్చినందుకు మనసారా మదిలోనే భగవంతుడికి దండంపెట్టుకుంటూ అతని గుండెలో గువ్వలా ఒదిగిపోయింది. 


ఇక తులసి హడావుడి అంతాఇంత కాదు. బాలు కోసమని ఏమి వంటలు చెయ్యాలి, వాడికి కొత్త బట్టలుకుట్టించాలి. పడుకోవడానికి మంచం పరుపు తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో సంతోషం పట్టలేక ఇల్లంతా కలియతిరుగుతుంది తులసి. 


“ తులసి .. తులసి ఎవరొచ్చారో చూడు. ” గడపలో కాలు పెట్టకుండానే భార్యను పిలిచాడు. 


“ ఆ ఆ వస్తున్నానండి.. మీరు అప్పుడే లోపలకు రాకండి నేనొచ్చేవరకు అలాగే ఉండండి. ” చీరకుచ్చిళ్ళు జారిపోతుండగా ఒకచేత్తో మంగళహారతి, మరోచేత్తో ఎర్రనీళ్ళు దిష్టి తీయడానికని పట్టుకుని వచ్చింది ఆత్రుతపడుతూ. 


“ నా నాయనే నా తండ్రే వచ్చావురా ఈ అమ్మ కోసం. ” అంటూ హారతిచ్చి ఎర్రనీళ్ళు దిష్టి తీసాక లోపలకు రమ్మంది. బాలు లోపలకు అడుగుపెట్టగానే పరుగున వచ్చి బాలును గుండెలకదుముకుంది. కళ్ళనిండా ఆనంద భాష్పాలు నింపుకుని తనవితీరా ముద్దాడింది. 


ఆ దృశ్యం చూస్తుంటే మురహరికి గోవిందుకు కళ్ళు చెమర్చాయి. తులసిని చూస్తుంటే ఇంత ప్రేమను మనసులో దాచుకుని కుమిలిపోయిందా పాపం అనుకున్నారు. 


ఊరంతా పిలిచి పండుగ భోజనాలు పెట్టారు. ఇక నుండి బాలును ఎవరు చిన్నచూపు చూడకుండా ఉండడానికని,తాము బాలుని దత్తపుత్రుడిగా తీసుకున్నామని తెలియచేయడానికని అందరిని పిలిచి సంతృప్తిగా బట్టలు పండ్లు దానం చేసుకున్నారు

 తులసి మురహరి దంపతులు. 


వచ్చిన వాళ్ళందరు కూడా బాలు మీద తులసికున్న 

ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఏ తల్లి కన్నదో గానీ తులసిలాంటి అమ్మకు కొడుకైనాడు. దేనికైనా పెట్టిపుట్టాలంటారు. బిడ్డలేరని తపించిపోయిన తులసిని అదృష్టం వరించింది. ఏ జన్మలోనో వీళ్ళనుండి తప్పిపోయాడేమో అందుకే మళ్ళి వెతుక్కుంటూ వచ్చాడు. 

చూడడానికి కూడా వీళ్ళకు పుట్టిన బిడ్డ అంటే నమ్మేటట్టు ఉన్నాడు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకోసాగారు. 


“ ఏమండి .. మీరు నాకిచ్చిన ఈ వరం ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను. గొడ్రాలు అన్న పేరున్న నన్ను తల్లిని చేసారు ఈ జన్మకు ఇది చాలు. ” అంటూ వంగి భర్త కాళ్ళకు దండంపెట్టింది తులసి. 


“ తులసి.. నువ్వు కాదు నేను చెప్పాలి నీకు. బిడ్డలులేని మనింట్లో మనిద్దరం ఎలా ఎంతబాధపడుతున్నామో మనకే తెలుసు. ఇన్నేళ్ళు మన జీవితం ఎలాగో గడిచిపోయింది. ఇప్పుడు ఆ దేవుడు కరుణించాడు బాలుని మనకు ప్రసాదించాడు. 


ఇక నుండి వీడి పేరు బాలు కాదు బాలకృష్ణప్రసాద్, తులసి.. మన బాబు పేరు బాగుంది కదూ. ” ఆప్యాయంగా తులసిని ఒకవైపు బాలకృష్ణప్రసాద్ ను ఒకవైపు పట్టుకున్నాడు. 


పన్నెండేళ్ళ ఆ పసివాడి కళ్ళల్లో దారి తప్పిన తన జీవితానికి చేరవలసిన గమ్యం చేరిపోయాననే ఆనందం కనిపిస్తుంది. తులసికైతే అనుకున్నది సాధించుకున్నాను నాకింకా ఏ లోటులేదు. అనుకూలవంతుడైన భర్త కన్నకలలు పండించే కొడుకు తృప్తిగా చూసుకుంది వాళ్ళిద్దరిని. 


========================================================================

సమాప్తం

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 



44 views1 comment
bottom of page