top of page
Writer's pictureNeeraja Prabhala

దేవత



'Devatha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 16/04/2024

'దేవత' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



జ్యోతి అందమైనదే కాక భాగ్యవంతులైన ఆనంద్ - దేవికల ఒక్కగా నొక్క పిల్ల. వ్యాపారస్తుడైన తండ్రి, ఉద్యోగస్తురాలైన తల్లి. వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటూ జ్యోతిని చాలా క్రమశిక్షణతో పెంచారు. కూతురి ఇష్టాయిష్టాలు, మనసును అర్థం చేసుకోకపోగా వాళ్ళు చెప్పిన రీతిలోనే ఉండాలి అన్న ధోరణి వాళ్ళది. తల్లితో కూడా జ్యోతి తన మనసులోని మాటను చెప్పే స్వతంత్రం లేదు. తనకు తోడబుట్టిన వాళ్ళుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకునేది. 


ఒంటరితనంతో బాధపడుతూ ఆప్యాయత, అనురాగాలు తెలీకుండానే పెరుగుతూ కాలేజీలో డిగ్రీలో చేరింది. స్వతహాగా బిడియస్తురాలవటంతో స్నేహితులు కూడా ఎవరూ లేరు. కాలేజీ, ఇల్లు తప్పితే మరో లోకం తెలీదు జ్యోతికి. 


డిగ్రీ ఆఖరి సం.. లో క్లాస్ మేట్ ప్రదీప్ జ్యోతి మనసుకు నచ్చాడు. అతని కలుపుగోలుతనం, మాటతీరు, ప్రవర్తన జ్యోతి మనసునాకర్షించాయి. ప్రదీప్ చదువులోనూ, కల్చరల్ యాక్టివిటీస్ ల లోను ముందంజగా ఉండేవాడు. చక్కని స్నేహశీలి. అతను కూడా జ్యోతిని ఇష్టపడుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. 


క్రమేపీ ఇద్దరూ స్నేహితులయ్యారు. జ్యోతి కుటుంబ నేపధ్యాన్ని ఆమెద్వారా తెలుసుకుని ఆమెకు మానసిక ధైర్యాన్ని కలుగచేసి ఒంటరితనం పోగొట్టే ప్రయత్నం చేశాడు. అతని సాహచర్యంలో జ్యోతి తను ఒంటరిననే బాధ మర్చిపోయింది. అతనే తన జీవిత భాగస్వామి అయితే జీవితమంతా హాయిగా గడపవచ్చు అనుకుంది జ్యోతి. 

 క్రమేణా ఇద్దరి మనసులూ కలిసి ఇంకో రెండు నెలల్లో చదువు అయిపోగానే ఉద్యోగం చూసుకుని పెళ్ళిచేసుకుందామనుకున్నారు. 


తరచూ సినిమాలు, షికార్లు.. వీళ్ళ విషయం ఇరువైపులా పేరెంట్స్ కు తెలిసింది. వాళ్లు వీళ్ల ప్రేమను అంగీకరించలేదు. జ్యోతికి పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఆమె తల్లిదండ్రులు. ఆ విషయాన్ని ప్రదీప్ కు చెపితే ‘మనము రాజమండ్రి వెళ్ళి పెళ్ళి చేసుకుందాము, ఫలానా తేదీ‌, సమయం, కలిసే చోటు అన్నీ చెప్పి వస్తూ కొంత నగదును కూడా తెమ్మన్నాడు’ ప్రదీప్. 


అనుకోకుండా జ్యోతి తల్లిదండ్రులు ఏదో పనిమీద ఊరు వెళ్ళాల్సి వచ్చి ఆమెకు అనేక జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఇదే అదనుగా భావించి జ్యోతి కొంత నగదును, బట్టలను తీసుకుని ప్రదీప్ చెప్పిన తేదీన, అతను చెప్పిన సమయానికి, ఆ చోటుకు చేరి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. జ్యోతి మనసంతా మధుర ఊహలతో తేలియాడుతోంది. ప్రదీప్ ని గురించి ఆలోచిస్తూ అతను తన వెంట ఉంటే జీవితమంతా తనకు స్వర్గమే కదా! అని అనుకుంటూ అతని ఆలోచనలతో గతంలోకి వెళ్ళింది. 


కాలి వద్ద చురుక్కుమనటంతో 'అబ్బా! ఏదో కుట్టింది ' అనుకుంటూ తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ లోకంలోకి వచ్చింది జ్యోతి. కాలి వద్ద కుట్టిన చోటుని చూసుకుంటే నల్లని పెద్ద గండుచీమ కాలికి గట్టిగా పట్టేసింది. విపరీతమైన బాధ.. దాన్ని చేత్తో గట్టిగా లాగి అవతల విసిరేసి 'ఇంతసేపయినా ఇంకా ప్రదీప్ రాలేదేమిటా?' అని అనుకుంటూ చుట్టూ పరిసరాల్లో తేరిపార చూసింది.

 

తనకు కొంచెం దగ్గరలో ఎవరో ఇద్దరు అబ్బాయిల మాటలు వినిపిస్తున్నాయి. వారిలో ఒకడు ఇంకొకడితో "ఏరా! మన ప్రదీప్ గాడు బంగారు బాతుని పట్టాడురా. అది వాడిని నమ్మేసిందిరోయ్. " అని అన్నాడు. 


'ప్రదీప్ ' అన్న పదం విని " వీళ్ళు ఎవరు? వీళ్ళు మాట్లాడుకునేది తన ప్రదీప్ ని గురించేనా? తను వీళ్ళనెప్పుడూ చూడలేదే ! 'ప్రదీప్' అనే పేరు చాలా మందికి ఉంటుంది కదా! అయినా తన ప్రదీప్ అలాంటి వాడు కాదులే" అని అనుకుంది జ్యోతి. 


"అవున్రోయ్! వాడి వలలో అది ఎన్నో నెంబరురా ! ఇహ దాని జీవితం మటాష్. అయినా వాడు మనల్ని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడురా? " అని అన్నాడు ఇంకొకడు. 


‘వీళ్ళని తను ఎప్పుడూ చూడలేదు. తనెవరో వాళ్ళకు తెలీదు. అయినా తన ప్రదీప్ ఇంకా రాలేదు. ఎందువలనో‌? ఏంటో? అయినా వీళ్ళు చెప్పుకునే ప్రదీప్, తన ప్రదీప్ ఒకటేనా? కొంపతీసి వీళ్ళేమన్నా అతని స్నేహితులా?’ అని అనుకుంటూ ఎందుకైనా మంచిదని చప్పుడు కాకుండా లేచి తన బాగ్ తీసుకుని కొంచెం చాటు ప్రదేశం చూసుకుని వాళ్ళకు తను కనబడకుండా కూర్చుని చాటుగా వాళ్ళ మాటలు వినసాగింది. 


వాళ్ళు పెద్దగా మాట్లాడుకోవడంతో వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి జ్యోతికి. 


కొంత సేపటికి ప్రదీప్ వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళ భుజం మీద చెయ్యెసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ప్రదీప్ కూడా చాలా వల్గర్ గా తన లవర్ని గురించి అని, తన పేరును చెప్పి చెడ్డగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకు తను కనబడదు. అక్కడ ప్రదీప్ ను చూసి నిర్ఘాంతపోయింది జ్యోతి. అంటే ఇప్పటి దాకా వాళ్ళు చెడ్డగా మాట్లాడుకున్నది తన ప్రదీప్ ని గురించా? నిజంగా ప్రదీప్ అలాంటి వాడా? ప్రదీప్ కూడా తన గురించి అదీ, ఇదీ అని ఎంతో చెడుగా వాళ్ళతో చెబుతున్నాడు. వాళ్ళేదో ప్లాన్ లోనే ఉన్నారు అని తెలుస్తోంది జ్యోతికి. అందుకే ప్రదీప్ తనను ఇక్కడికి రమ్మన్నాడు అని అర్థమవుతోంది. 


జ్యోతికి ఒక్కసారిగా భూమి తలకిందులైనట్లు అనిపించింది. ఆమెకు మనసంతా చాలా బాధతో, ప్రదీప్ పట్ల అసహ్యంతో నిండిపోయింది. 


నెమ్మదిగా కొంత సేపటికి జ్యోతి తేరుకుని ధైర్యాన్ని కూడదీసుకుని ప్రదీప్ వద్దకు వచ్చి చాలా ఆవేశంతో అతని కాలరును పట్టుకుని నిలదీసి చెడామడా అతని చెంపలు వాయించి " ఇదా నీ నిజస్వరూపం ! నిన్ను నమ్మి నీ ప్రేమ నిజమనుకుని నీతో పెళ్లికి సిధ్ధపడి నా కన్నవాళ్ళను కూడా మోసంచేయబోయాను. ఇంకా నయం. పెళ్ళి కాకుండా నీ నైజం ముందే నాకు తెలిసింది. లేకపోతే జీవితమంతా కుళ్ళి కుళ్ళి ఏడవాల్సొచ్చేది నాకు. ఒరేయ్! నీవు ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావురా ? ఉండు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను" అని షీ టీమ్ వాళ్ళకు కాల్ చేసి చెప్పింది. 


పోలీసులు అనేటప్పటికి అతని స్నేహితులు కాళ్ళకు బుధ్ధి చెప్పారు. ప్రదీప్ కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగా షిటీమ్ వాళ్ళు పట్టుకుని అతన్ని అరెస్టు చేశారు. 


"శభాష్ జ్యోతీ! నీవు ధైర్యం చేసి మాకు చెప్పి వాడిని అరెస్ట్ చేయించావు. నీలాగే ఆడపిల్లలందరూ ఉంటే లోకంలో ఏ అఘాయిత్యాలు, మోసాలు జరగవు. ఇంక నీవు మీ ఇంటికి వెళ్ళు జ్యోతీ!" అని జ్యోతిని మెచ్చుకుని ప్రదీప్ ని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళారు షిటీమ్ వాళ్లు. 


తనను ప్రేమించానని నమ్మిన ప్రదీప్ ఎంత మోసం చేశాడు? మంచివాడని అతన్ని నమ్మి అతనికోసం తన పేరెంట్సుని కూడా మోసంచేసి వాళ్ళకు తెలీకుండా తను ఇంత దూరం వచ్చింది. 


"ఆ చీమే కనుక తనను కుట్టకపోయి ఉంటే ప్రదీప్ ను గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు, ప్రదీప్ రాక, ఆతని నిజస్వరూపము తనకు తెలిసేది కాదు. చీమ తన పాలిట దేవత లాగా వచ్చి వాడి బారినుంచి తనను రక్షించింది " అని మనసులోనే తనను కుట్టిన నల్లని గండుచీమకు కృతజ్ణతలు తెలుపుకుని తన బాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది జ్యోతి. 


 "ప్రదీప్ తో ఇంత వరకూ జరిగింది ఒక పీడకలగా అనుకుని మర్చిపోవాలి. తన తల్లిదండ్రులు చూసిన సంబంధమే తను చేసుకోవాలి, పేరెంట్స్ అన్నీ ఆలోచించే తనకు మంచి జరిగేట్టు చేస్తారు. వాళ్ళకు జీవితానుభవం ఎక్కువ ' అని మనసులో నిశ్చయించుకుని నిశ్చింతగా నిద్రపోయింది జ్యోతి. 

   ….సమాప్తం.


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





46 views0 comments

Comentários


bottom of page