top of page

దేవతలు మెచ్చే తీర్పు


'Devathalu Mechhe Thirpu' New Telugu Story

Written By K. Lakshmi Sailaja

'దేవతలు మెచ్చే తీర్పు' తెలుగు కథ

రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ


"నీ పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పాయసం నువ్వు తిని, 'చాలా బాగుంది,' అంటావు. వెంటనే ఈ లెటర్ నీకిచ్చి నేను తలుపేస్తాను. నీ గదిలో, నీ ఫోన్ నీ దగ్గర లేకుండా ఉన్న నువ్వు, ఈ లెటర్ మొదలు పెట్టే సమయానికి, నేను బయట సోఫాలో కూర్చొని టి.వి. ఎక్కువ సౌండ్ పెట్టి, నీ గురించి, నీ స్కూల్ గురించి వార్తలు చూస్తుంటాను. నీకు సపోర్ట్ వస్తున్న వారెవరైనా వుంటే, వాళ్ళు ధైర్యంగా అందరి ముందుకు రాలేరు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత నీచమైంది కనుక.


పోలీస్ లు …..పంపితే నిన్ను జైలుకు పంపుతారు. ఆ శిక్ష నీకు చాలదు. పెళ్ళైన తరువాత నీ చెడు తిరుగుళ్ల గురించి నాకు తెలుస్తున్నా పరువు మర్యాద కోసం నేను నిన్ను వదిలి నా పుట్టింటికి వెళ్ళలేదు. నా తల్లితండ్రులు ఎంతగానో బతిమిలాడుతున్నారిప్పటికీ…నీ లాంటి నికృష్టుడి దగ్గర జీవితం అవసరం లేదు, పుట్టింటికి వచ్చెయ్యమని. అలా వెళ్ళనందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.


పైగా మీ అమ్మగారు నాతో 'నీ కెవరో తప్పు చెప్పారు. నా కొడుకు బంగారం' అన్నది. అందుకని ఇప్పుడు నువ్వు పసికూన మీద చేసిన అఘాయిత్యానికి, వాళ్ళ బంగారానికి ఇప్పుడు నేను వేస్తున్న శిక్షను వాళ్ళు.. అంటే మీ అమ్మా, నాన్నలు కళ్ళారా చూస్తారు.


నేను తలుపు వేసే సమయానికే నేను…నువ్వు కూర్చున్న కుర్చీకి, ఐరన్ సైకిల్ చైన్ కు కట్టి తాళం వేసి వుంటాను. నువ్వు గమనించకుండా చైన్ పైన టవల్ చుట్టేస్తాను. కుర్చీ వెనుక వైపు ఇంకో చైన్, కుర్చీని టేబుల్ కు కట్టేసి వుంటుంది. టేబుల్ మీది ఏ వస్తువూ నీకు అందదు. నువ్వు పోలీస్ లకు కనపడకుండా మన ఇంటి వెనుక వైపు వచ్చి దాక్కున్నప్పుడే నిన్ను చూసిన నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.


కానీ నీతో మంచిగా మసిలి, నిన్ను పోలీస్ ల నుంచి దాచిపెడ్తానని చెప్పాను. నువ్వు నిజంగానే దాచాననుకొని సంబరపడిపోయావు.


చిన్న పిల్ల.. స్కూల్ లో చదివే చిన్నారి పువ్వు.. నీ కామానికి ఈ రోజు జీవితమంతా అందరూ వేలెత్తి చూపే పరిస్థితిలో వుంది. రేపు ఆపిల్ల ఎలాబతకాలి? దౌర్భాగ్యుడా….. జీవితానికి ఆశయం లేకుండా గాలికి తిరిగిన నిన్ను, డ్రైవర్ గా పని చేస్తున్నాడు అని చెప్తే …'సరే లే' అనుకొని అమాయకమైన నేను పెళ్ళి చేసుకున్నాను. 45 సంవత్సరాల వయసులో కూడా నీకు కామం తో కళ్ళు మూసుకు పొయ్యాయి.


నాకు పిల్లలు కలుగలేదని ఇన్ని రోజులూ ఎంతో బాధ పడ్డాను. పిల్లలు కావాలని భగవంతుని వేడుకున్నాను కూడా. కానీ భగవంతుని దయవల్ల నాకు పిల్లలు కలుగలేదనీ ఇప్పుడనుకుంటున్నాను. మనకు పిల్లలు ఉండి వుంటే ఈ రోజు వాళ్ళు ఎంతో తల వంచుకొని బ్రతక వలసి వచ్చేది. అందరూ 'అదుగో, వాళ్ళ నాన్న తప్పు పని చేశాడు' అని లోకం నిందిస్తూవుంటే పిల్లలు అవమానంతో తల వంచుకొని ఏడ్చే వాళ్ళు. ఆ బాధ నుంచి నాకు పుట్టని నా పిల్లలు తప్పించుకున్నారు.


కానీ నేను ఎదుర్కోక తప్పదు. అందుకే నీకు శిక్ష కూడా నేనే వేస్తున్నాను. నిన్ను శిక్షించి నందుకు 'చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకోకూడద'ని నన్ను ప్రభుత్వం వారు శిక్షిస్తారని నాకు తెలుసు. ఫరవాలేదు. నేను చేసింది తప్పు కాదని నాకు తెలుసు. ప్రభుత్వానికీ తెలుసు. కానీ ఇలాంటి హత్యలను ప్రోత్సహించ కూడదని వారు నన్ను జైలుకు పంపుతారు. జైల్ లో ఉన్నందుకు నేను బాధపడను. నా తల్లి తండ్రులే కాదు, ఈ లోకం కూడా నేను చేసిన పనికి హర్షిస్తుంది.


ఒక దోషికి సరైన శిక్ష విధించాననే తృప్తితో నేను జైల్ జీవితం గడుపుతాను.


ఈ ఉత్తరం నువ్వు మొదలుపెట్టగానే నిన్ను కట్టేసి పోలీస్ లకు పట్టిస్తాననుకొని వుంటావు. కానీ నేను నీకోసం డాక్టర్ అనామిక గారి సహాయం తో ( డాక్టర్ గారి పేరు చెప్పి వారిని ఇబ్బంది పెట్టను) నేను చేసిన కొత్తరకం పాయిజన్ కలిపిన పాయసం తిన్న నువ్వు, అరగంటకు యమధర్మ రాజు దగ్గరకు వెళ్ళిపోతావు. ఈ రాత్రి పూటనువ్వు టేబుల్ దగ్గర ఏం చేసినా, ఎంత అరిచినా ఎవ్వరికీ వినపడదు. రూం కిటికీల అద్దాలు కూడా వేశాను. టి.వి. సౌండ్ పెద్దగా వుంటుంది.


కాబట్టి ఒక గంటకు తలుపు తీసి, నాచేత శిక్షించ బడ్డ నీ చేతిలో ఉన్న ఈ లెటర్ పోలీస్ లకు నేనే చూపించి జైల్ కు వెళ్తాను."


ఒక గంట తరువాత తలుపు తీసిన వారాహి, టేబుల్ దగ్గర దృశ్యం చూసి…కసితో కళ్ళల్లో నిప్పులు రాలుతుండగా భర్త చేతిలోని ఉత్తరం తీసుకుంది. అతను టేబుల్ మీదకు ఒరిగి వున్నాడు. అతనీ లోకాన్ని పూర్తిగా విడిచి పెట్టాడని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత ఫోన్ చేతిలోకి తీసుకుంది, పోలీస్ లకు ఫోన్ చెయ్యడంకోసం.

***

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


56 views0 comments

Comentários


bottom of page