'Deyyama Majaka - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 01/11/2023
'దెయ్యమా మజాకా' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
ఒక మారుమూల పల్లెటూరు లో ఉన్న హనుమంతుని గుడి కి పూజారి కృష్ణశాస్త్రి. అతడు దేవునికి పూజలు చెయ్యడమే కాకుండా.. దెయ్యాల గురించి కూడా బాగా తెలుసు. అతని తండ్రి దగ్గర నుంచి ఆ విద్య నేర్చుకున్నాడు. దెయ్యాలను పట్టి బంధించడం.. ఆత్మలతో మాట్లాడడం లాంటి వాటిలో మంచి పట్టు ఉంది. ఊరిలో ఎవరికి దెయ్యం పట్టినా.. కృష్ణశాస్త్రి దగ్గరకే తీసుకొచ్చేవారు. మంత్రించిన బొట్టు పెట్టి.. మంత్రం వేసి దెయ్యాన్ని తరిమి కొట్టేవాడు. ఇలాగ, ఊరిలో ఎందరినో దెయ్యాల బారి నుంచి కాపాడాడు.
ఒకసారి ఊరిలో సర్పంచ్ కూతురికి దెయ్యం పట్టిందని కృష్ణశాస్త్రి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి చాలా విచిత్రంగా ప్రవర్తించడమే కాకుండా.. గట్టి గట్టిగా అరుస్తూ.. అందరినీ భయపెట్టేది. ఇది చాలా మొండి దెయ్యం అని చెప్పాడు పూజారి. పూజ కు అన్నీ సిద్దం చేసి, అమ్మాయికి దెయ్యం వదిలించడానికి పెద్ద పూజ చేసాడు. దెయ్యం అమ్మాయి లోంచి బయటకు వచ్చేసింది.
"నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో.. మళ్ళీ ఇక్కడకు రావొద్దు!" అని గట్టిగా చెప్పాడు కృష్ణశాస్త్రి.
"అలాగే! రాను" అని దెయ్యం చెప్పి వెళ్లిపోయింది.
"మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళొచ్చు..దెయ్యం మళ్ళీ మీ జోలికి రాదు!"
కృష్ణశాస్త్రి ని తెగ మెచ్చుకుని..కృతఙ్ఞతలు చెప్పి..మంచి బహుమానం ఇచ్చి.. అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు సర్పంచ్. కానీ.. దెయ్యం మాట తప్పి కొద్ది రోజులకే.. మళ్ళీ తిరిగి ఊరిలోకి వచ్చేసింది. దానిని గ్రహించిన పూజారి..
"మళ్ళీ ఎందుకు వచ్చావు?" అని గట్టిగా అడిగాడు.
"ఆ అమ్మాయిని ఆవహిస్తే, రోజూ నాకు మంచి భోజనం దొరుకుతుంది..ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటాను"
"నువ్వు అలా చేస్తే, నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను"
"అలా చెయ్యకండి.. నేను ఒక అమ్మాయి ఆత్మను. చిన్నతనంలోనే నేను చనిపోయాను.. నాకు ఇంకా ఈ లోకంలో ఉండాలని ఉంది" అని దెయ్యం అడిగింది.
"నువ్వు అడుగుతున్నది మంచిది కాదు. దెయ్యాలు ఇక్కడ ఉండకూడదు!"
"మీకూ.. నా లాంటి అమ్మాయి ఉంటే, ఇలాగే అంటారా? కనీసం నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి.. మీకు అన్ని పనులు చేసి పెడతాను.. మీ అమ్మాయినే అనుకోండి.. నేను మాములుగానే ఉంటాను.. నన్ను నమ్మండి!"
కృష్ణశాస్త్రి చాలా ఆలోచించాడు. తన భార్య ఇప్పుడు లేదు. తనకి చేసి పెట్టడానికి పిల్లలు కుడా లేరు. వొంటరిగా అన్నీ తనే చేసుకుంటాడు. దెయ్యం తనకి ఏమీ హాని చెయ్యలేదని అతనికి గట్టి నమ్మకం. పైగా, దీనిని వదిలేస్తే, మళ్ళీ ఆ అమ్మాయిలో ప్రవేశిస్తే.. సర్పంచ్ తనని వదలడని తెలుసు. అసలే, సర్పంచ్ కి చాలా కోపం. ఊరి నుంచి పంపించేసినా.. ఆశ్చర్యం లేదు. ఆ దెయ్యానికి ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాడు. తనకీ సాయంగా ఉంటుందని ఆలోచించాడు.
"అలాగే! ఇంతలాగ బతిమాలుతున్నావు కాబట్టి.. మా ఇంట్లో ఉండనిస్తాను.. నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు.."
"అలాగే!" అంది ఆ దెయ్యం.
మొత్తం మీద దెయ్యం పూజారి ఇంట్లో తిష్ట వేసింది. టీవీ చూడడం బాగా ఇష్టపడింది. రోజూ అందులో వచ్చే సినిమాలు తెగ చూసేది. కొన్ని రోజులు బాగానే ఉంది. ఒక రోజు టీవీ లో అన్నీ దెయ్యం సినిమాలే! ఆ సినిమాలు చూసి తనలోని దెయ్యం బాగా ఉత్సాహం పొందింది.
అనుకోకుండా.. పక్కింటి పంకజం టీవీ చూడడానికి అక్కడకు వచ్చింది.
"అమ్మాయి! కొంచం సౌండ్ పెట్టు.. దెయ్యం శబ్దాలు వినిపించట్లేదు!"
సినిమా లో పూర్తిగా లీనమైపోయింది ఆ దెయ్యం.. తన చెయ్యి ని పెద్దది గా చేసి… టీవీ పక్కన ఉన్న రిమోట్ అందుకుని… సౌండ్ పెట్టింది. అప్పుడు ఆ అమ్మాయి రూపం భయంకరంగా.. దెయ్యంగా.. మారిపోయింది. ఇదంతా చూసిన.. ముసలి పంకజం గుండె ఆగిపోయింది.
ఇంటికొచ్చిన కృష్ణశాస్త్రి కి విషయం తెలిసింది. దెయ్యం ఎంతైనా దెయ్యమే కదా! అని అనుకుని.. తన తప్పు తెలుసుకొని.. కోపంతో ఆ దెయ్యాన్ని సీసా లో బంధించి .. ఊరి చివర భూమి లోపల చాలా లోతులో పాతేసాడు..
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments