top of page
Original.png

డిజిటల్ స్వరూపంగా మారిన భోజన సదుపాయాలు

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #డిజిటల్ స్వరూపంగా మారిన భోజన సదుపాయాలు, #TeluguArticle

 

Digital Swarupamga Marina Bhojana Sadupayalu - New Telugu Article Written By R C Kumar Published In manatelugukathalu.com On 18/01/2026

డిజిటల్ స్వరూపంగా మారిన భోజన సదుపాయాలు - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


నానాటికి పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు పాక శాస్త్ర నిర్వచనాన్ని మార్చేసాయి. స్మార్ట్‌ఫోన్‌లు మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడకం పెరగడంతో స్విగ్గి, ఉబెర్ ఈట్స్, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సాంప్రదాయ భోజన అనుభవాన్ని తిరగరాసి డిజిటల్ భోజన ఉత్పాదనలుగా మార్చేసాయి. సామాన్య ప్రజలనుంచి సంపన్నుల వరకు వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ సరఫరా విధానం రెస్టారెంట్ పరిశ్రమను తనదైన శైలిలో శాసించడం మొదలుపెట్టి హోటల్ పరిశ్రమ విధివిధానాలు, వ్యాపార పద్ధతులలో పెను మార్పులు తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు స్మార్ట్ ఫోన్ లో సులభంగా ఆర్డర్ చేసి, పది, పదిహేను నిమిషాల్లో డెలివరీ తెప్పించుకొని జిహ్వచాపల్యాన్ని తీర్చుకొని తృప్తి పడడం అప్పటికి బాగానే ఉంటుంది.‌ కానీ దాని వల్ల వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు మరియు ఆర్థిక, పర్యావరణ పరిణామాల గురించి నేటి సమాజం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోవిడ్ తర్వాత ఈ అలవాటు మరింతగా పెరిగింది. న్యూక్లియర్ ఫ్యామిలీ ట్రెండ్ పెరుగుతున్న ఈ రోజుల్లో పెళ్లై కాపురానికి వచ్చిన కొత్త కోడళ్ళు కూడా వంటగదిలో శ్రమపడటానికి ఇష్టపడడం లేదు. ఒక అంచనా ప్రకారం మనదేశంలో ఒక సెకండ్ కు 50 ఫుడ్ ఆర్డర్లు పెడుతున్నారు.


సౌకర్యంతో కూడిన సౌలభ్యం

++++++++++++++++++

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విధానం విలాసవంతమైనది కాదని ఇప్పటికే నిరూపించబడ్డది. ఈ విధానం యొక్క ముఖ్యమైన ఆకర్షణ వినియోగదారులకు అందుతున్న అసమానమైన సౌలభ్యమే. ఇంట్లో కూర్చుని  ఉన్నపళంగా నచ్చిన పదార్థాలు తినాలని కోరిక జనిస్తే అప్పటికప్పుడు వాటిని వండుకొని తినడం అసాధ్యం. వేగవంతమైన ప్రపంచంలో, బిజీబిజీ జీవితంలో తీరిగ్గా తినుబండారాలు చేసుకోవాలంటే సమయాభావంతో పాటు బద్ధకం కూడా తోడవుతుంది. కావలసిన అన్ని రకాల ముడి పదార్థాలు వంటగదిలో సిద్ధంగా ఉండకపోవచ్చు. అప్పటికప్పుడు బయటికి వెళ్లి కోరుకున్న రెస్టారెంట్ చేరుకొని మెనూ చెక్ చేసి, ఆర్డర్ పెట్టి తినేటంత ఓపిక, సమయం ఎక్కడిది. సరిగ్గా ఇలాంటప్పుడే ఆన్లైన్ డెలివరీ ఆలోచన బుర్రలో తళుక్కుమంటుంది. కోరుకున్న పదార్థంతో జిహ్వచాపల్యాన్ని తీర్చే అనేక రకాల విభిన్న వంటకాలను డెలివరీ యాప్ లో చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ తో డిజిటల్ చెల్లింపులు కూడా సులభంగా చేయవచ్చు. ఎంతసేపట్లో డెలివరీ అవుతుందో కూడా జిపిఎస్ ట్రాకింగ్ లో చెక్ చేసుకోవచ్చు.


మూడు పువ్వులు ఆరు కాయల వ్యాపారం

+++++++++++++++++++++++++++

హోటల్ వ్యాపారులకు ముడి పదార్థాల ఖర్చులో ఎంత మిగిలితే అంత లాభం. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వారు సహజంగానే పదార్థాల నాణ్యత, నూనె, పరిశుభ్రత విషయాల్లో రాజీపడతారు. ఇవేవీ పట్టించుకోకుండా డెలివరీ తీసుకున్న ఆహారం వేడిగా, రుచిగా ఉంటే చాలు, ఆత్రంగా ఆరగించడం పరిపాటి అయింది. తద్వారా అనారోగ్యం బారిన పడటమే కాక, లొట్టలేసుకుంటూ తినే జంక్ ఫుడ్ తో ఊబకాయానికి ఊతమిస్తున్నారు. ఇంట్లో మన సొంత ఆహారాన్ని వండుకోవడానికి బద్దకించి, నిమిషాల్లో రెడీగా ఆహారాన్ని పొందాలనే కోరికతో మనమే సృష్టించిన ఆహార సరఫరా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతోంది.‌ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలన్నీ కలిపి 2024 సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకున్నాయి. ఈ సంస్థలన్నీ ఒకరితో మరొకరు పోటీపడుతూ మార్కెటింగ్ వ్యూహాలతో ప్రమోషన్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ల వరాల జల్లు కురిపిస్తూ అన్ని వర్గాల వారి నుండి భారీగా ఆర్డర్లు సేకరిస్తున్నారు. వినియోగదారులకు ఆహార సరఫరా సౌలభ్యం సౌకర్యాలతో కూడిన ఈ మార్పులు జన జీవితంలో కుటుంబ సంబంధాలపై, ఆరోగ్య సమస్యలపై, పర్యావరణ సమతుల్యతపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి అనడంలో సందేహం లేదు.


స్వయంకృతాపరాధం

++++++++++++++

పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఆబాలగోపాలం ఈ యాప్‌లపై ఆధారపడడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. అందరూ చెప్పుకునే రెండు కారణాలు సౌలభ్యం, సమయాభావం. ఈ రెండు కాక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నేటి యువత ఇంట్లో వంట చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొని తెచ్చుకోవడం, వంటిల్లు సర్దుకోవడం, గిన్నెలు శుభ్రపరుచుకోవడం లాంటి పనులు చేసుకోవడానికి బద్దకిస్తూ సాధారణ వంటకాల తయారీ పద్ధతులను కూడా మరిచిపోతున్నారు. తీరిక దొరకగానే సోషల్ మీడియా, టీవీల్లో నిమగ్నమై ఉండడం వల్ల వంట మీద ధ్యాస తగ్గుతోంది. భార్య, భర్త, పిల్లల, పెద్దల వ్యక్తిగత అభిరుచులు, ఆహార అలవాట్లు నియమాల మేరకు వివిధ రకాల వంటలు చేయడం కూడా భారంగా ఫీల్ అవుతున్నారు. సాంప్రదాయ వంటకాల మీద మోజు తగ్గి, కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా వెరైటీ పదార్థాలు తినాలనే కోరిక పెరగడం వల్ల ఆన్లైన్ మెనూపై మొగ్గు చూపుతున్నారు. ఒక స్పూన్ నూనె ద్వారా దాదాపు 120 క్యాలరీలు లోపలికి వెళ్తాయి. అలాంటిది హోటల్లో వేసే దోసెలో రెండు నుంచి మూడు స్పూన్ల నూనె ఉంటుంది. ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే రుచికర పదార్థాలు, ప్రాసెస్ చేసి ప్యాక్ చేయబడిన పదార్థాలను ఆర్డర్ చేసుకొని తింటూ మధుమేహం, బిపి, స్థూలకాయం కొని తెచ్చుకుంటున్నారు. ఆచరణ యోగ్యమైన అమ్మ చేతి వంట, బామ్మ గారి పిండి వంటలు, బాబాయ్ భోజనం వంటి మాటలు ఇప్పుడు హోటల్ పేర్లకే పరిమితమైనాయి.


ఆధునిక క్లౌడ్ కిచెన్

+++++++++++++

ఆధునిక క్లౌడ్ కిచెన్ (దీనిని గోస్ట్ కిచెన్, డార్క్ కిచెన్ లేదా వర్చువల్ కిచెన్ అని కూడా పిలుస్తారు) అనేది భోజనాలయం, సర్వింగ్ సిబ్బంది లేకుండా వంటపని వారితో మాత్రమే పనిచేసే ఆహార తయారీ కేంద్రం. సాంప్రదాయ రెస్టారెంట్ లా కాకుండా, ఇది డెలివరీ మరియు టేక్ అవే కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. వీటిలో వినియోగదారులు వచ్చి కూర్చుని తినే అవకాశం ఉండదు. కస్టమర్లు ఆన్లైన్ డెలివరీ యాప్ ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. జనసాంద్రత గల ప్రాంతాల్లో పరిమిత ప్రాంగణంలో నిర్వహించబడే ఇటువంటి "డెలివరీ ఓన్లీ మోడల్" యొక్క అద్దె, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌లను, డెలివరీ కోసం వచ్చే వారిని ట్రాక్ చేయడానికి మరియు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న పదార్థాలను కావలసిన పరిమాణంలో సిద్ధం చేయడానికి వారు డేటా మరియు సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడతారు. హైదరాబాదు నగరంలో షాదాబ్ గో, ఘర్ దిక్లౌడ్ కిచెన్, అలిఘర్ హౌస్ బై ఈట్ ఫిట్, ది లోకల్ అవన్ వంటి క్లౌడ్ కిచెన్ లు లాభదాయకంగా కొనసాగుతున్నాయి. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు సంభవిస్తున్న దిశగా సాంకేతిక పరిజ్ఞానం ఆహార సరఫరా గొలుసుతో బలంగా అనుసంధానం అవుతున్నది. కావున ఈ రంగంలో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది.


పర్యావరణానికి కలిగే హాని

+++++++++++++++++

పర్యావరణాన్ని దెబ్బతీసే ప్యాకింగ్ మెటీరియల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. చాలావరకు రెస్టారెంట్లు మరియు డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు పర్యావరణ అనుకూలమైన, బయో డిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ వాడకానికి మొగ్గు చూపడం లేదు. ఆహారం లీక్ అవ్వకుండా, తాజాగా ఉంచడానికి ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్లు, కవర్లు, స్పూన్లు, ఫోర్కులు ఉపయోగిస్తారు. అవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లే (ఒకసారి వాడి పారేసేవి). ఢిల్లీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రో బయాలజీ లో పనిచేస్తున్న శ్రీమతి అమితా గుప్తా గారు చెబుతున్నదాని ప్రకారం ఆహార పొట్లాల నుండి చాలా రకాల రసాయనాలు ప్లాస్టిక్ నుంచి విడిపోయి క్రమంగా ఆహారంలో కలిసిపోతాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ తక్కువ పరిమాణంలో ఉన్నా, అవి హార్మోనల్ సమతుల్యతను దెబ్బతీసి ఆరోగ్యంపై దుష్పరిణామాలను కలిగిస్తాయని స్పష్టం చేశారు. ఒక హోటల్ కిచెన్ లో రోజుకి 100 ఆన్లైన్ ఆర్డర్లపై పనిచేస్తుంటే అందులో 10 కిలోల ప్లాస్టిక్ వినియోగించాల్సి వస్తుంది. భారతదేశంలో ఒక అంచనా ప్రకారం 2024 వరకు సుమారు 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకున్నాయి. అందులో రీసైకిలింగ్ చేయబడుతున్న వ్యర్ధాలు తొమ్మిది శాతం మాత్రమే.


ముగింపు

++++++

కర్రీ పాయింట్లు, ఆన్లైన్ భోజన పదార్థాలు సాధ్యమైనంత మేరకు తగ్గించుకొని ఇంటి భోజనంతో తృప్తి పడితే వంటికి మేలు మరియు పర్సుకి, పర్యావరణానికి హితం. అన్నిటికీ మించి కుటుంబ సభ్యులతో చేయి చేయి కలిపి సరదాగా వంట చేసుకుని, కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోంచేస్తే బంధాలు, అనుబంధాలు మరింతగా బలపడతాయి. అటువంటి ఇళ్ళే కదా స్వర్గసీమలు. 


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page