దిక్కు
- Srinivasarao Jeedigunta

- Jul 21, 2025
- 6 min read
#JeediguntaSrinivasaRao, #దిక్కు, #Dikku, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Dikku - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 21/07/2025
దిక్కు - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సీతాపతి, జానకి యిద్దరూ మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వాళ్ల ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఎన్నోసారులు తమతోపాటు వచ్చి ఉండమని అడిగినా వున్న విశాఖపట్నం వదలలేక “మాకు ఓపికపోయినప్పుడు వస్తాములేరా, అయినా హైదరాబాద్ ఏమైనా పరాయి దేశంలో వుందా, రాత్రి ఎక్కితే తెల్లారి హైదరాబాద్” అన్నాడు కొడుకులతో సీతాపతి.
“మీరు ఎక్కాలి కదా నాన్న, యిన్నిసారులు బ్రతిమిలాడించు కోవడం బాగుండలేదు. మాకు తాతయ్యా బామ్మలతో ఎక్కువ కాలం గడిపే అవకాశం రాలేదు, ఆ అవకాశం మీ మనవాళ్ళకి ఇవ్వండి. డెబ్భై అయిదు ఏళ్ళు దాటిన తరువాత కూడా మా అంతట మేము ఉండగలము అనుకోవడం మంచిది కాదు” అన్నాడు పెద్దకొడుకు వేణు.
“చూడు అన్నయ్యా! నాన్న వాళ్ల తమ్ముడు, వాళ్ల ముగ్గురి పిల్లలని మూడు ఫ్లోర్ల లో ఉంచుకుని హాయిగా వున్నాడు పిల్లలతో” అన్నాడు చిన్నకొడుకు రమేష్.
“ఒరేయ్! బాబాయ్ వున్న ఊరు వదిలిపెట్టి చెన్నై లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, అక్కడే సెటిల్ అయ్యాడు. పిల్లలకి కూడా ఉద్యోగం అక్కడే రావడంతో నెత్తిన పెట్టుకున్నాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగం వల్ల రిటైర్ అయ్యే అంతవరకు యిక్కడే వున్నాను, వుంటాను. ఇటు పక్కన నాలుగు ఇళ్ల వాళ్ళు, ఎప్పుడు ‘మేము పిలిస్తే అప్పుడు వచ్చి సహాయం చేస్తాము’ అన్నారు. అయినా ఏడాదికి మూడు నెలలు మీ దగ్గరే వుంటున్నాముగా” అన్నాడు సీతాపతి.
“ఏమో! మీకు చెప్పటం మా వల్ల కాదు” అన్నాడు పెద్దకొడుకు.
లంచ్ చేస్తున్నప్పుడు భర్తని అడిగింది జానకి, “పిల్లలు అంత బ్రతిమాలుతోవుంటే మనం వెళ్లి వాళ్ళతో ఉండచ్చు కదా, యిక్కడ ఉండి చేసేది ఏముంది మీరు, ఎక్కడైనా సోఫాలో కాళ్ళు జాపుకుని పడుకోవడమేగా” అంది.
“వాళ్ళు అంత రమ్మని అడుగుతున్నా నీ యిద్దరు కోడళ్ళు ఏమైనా రమ్మన్నారా?” అన్నాడు.
“వాళ్ళు అంగీకరించకపోతే మన పిల్లలకి మనల్ని రమ్మనే ధైర్యం ఉంటుందా, అయినా ఇంటిల్లపాది మిమ్మల్ని ఆహ్వానం చేస్తేగాని రారా ఎక్కడకి, అలాగే ఉండండి” అంది జానకి.
“చూడు, మన ఇరుగు పొరుగు వాళ్ళు నేను కనిపించినప్పుడల్లా ‘ఎందుకు అంకుల్ మీరు మార్కెట్ కి వెళ్లడం, మాకు ఒక్క మెసేజ్ పెట్టండి మీకు కావలిసినవి మేము తెస్తాము, మీరు ఈ వయసులో రోడ్డు దాట్టడం మంచిది కాదు, మా తల్లిదండ్రులు ఎలాగో యిక్కడ లేరు, మీకైనా మమ్మల్ని సేవ చేసుకోనివ్వండి’ అంటున్నారు” అన్నాడు సీతాపతి.
“ఒకసారి చేస్తారు, రెండు సారులు చేస్తారు, మన పనులు ఇతరులకి అప్పగించి మీరు యూట్యూబ్ చూసుకుంటాను అంటే ఎవ్వరు చేస్తారు, మొన్న చెట్టు కున్న మామిడికాయ కోసి యిస్తావా నాయనా అంటే, ఆఫీస్ టైము అయ్యింది సాయంత్రం కోసిస్తా” అన్నాడు కాశీరామ్. సాయంత్రం లోపు ఎవ్వరో కోసుకుపోయారు, ఆలా ఉంటుంది ఇతరుల సహాయం మీద ఆధారపడితే” అంది జానకి.
“చూడు.. పిల్లలు చిన్న వయసులో వున్నారు. వాళ్ళకి ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి. మనం ఎందుకు అడ్డం?” అన్నాడు.
“చూడండి.. అదివరకు తల్లిదండ్రులతో కలిసి వున్న ఇంటికి కోడలు వచ్చేది. అప్పుడు ఆ అమ్మాయి వీళ్ళందరూ తన కుటుంబం అనుకునేది. మీ లాంటి చాదస్థులు రిటైర్ అయిన తరువాత కూడా ఎవ్వరి మీద ఆధారపడకూడదు అని విడిగా వుంటారు. అప్పుడప్పుడు కొడుకు కోడలు ఇంటికి వెళ్తే, మనం చుట్టాలం అని పనిమనిషి కూడా మన మాట వినదు. కాలు చెయ్యి పనిచెయ్యనప్పుడు వెళ్తే మనం పరాయి వాళ్ళు లా అనిపించడం తప్పులేదు” అంది.
“అయితే ఏమంటావు, రేపే సామాను సద్దుకుని కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అంటావా. కొడుకు కోడలు యిద్దరూ ఉద్యోగాలు అంటూ బయటకు వెళ్ళిపోతారు, మనవడు స్కూల్ కి, ఇహ మిగిలింది నువ్వు నేను. యిప్పుడు కూడా నువ్వు నేనే. యిక్కడైతే నాకు ఏది ఇష్టమో అది వండ గలవు. అక్కడ వాళ్ళు ఏదో వండి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. నువ్వా మళ్ళీ యింకో కూర వండలేవు. ఇది అంతా ఇప్పటినుంచే అవసరమా చెప్పు” అన్నాడు సీతాపతి.
“ఇన్నేళ్లు తిన్నారుగా కావలిసినవి చేయించుకుని, యిప్పుడైనా నోరు కట్టుకుని వండినది తిని కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేస్తే సరిపోదా, అయినా మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక, కానివ్వండి ఎలా జరిగితే ఆలా జరుగుతుంది” అంది జానకి.
“మీ ఆంటీ, ‘మనం పిల్లలు దగ్గరికి వెళ్ళిపోదాం, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, మనకి ఇక్కడ చూసే వాళ్ళు ఎవ్వరున్నారు’ అంటోంది” అని చెప్పాడు పక్కింటి రమేష్ కి.
“అదేమిటి అంకుల్? మేము లేమా, మీరు ఫోన్ చేసిన క్షణం లో మీ యింట్లో ఉంటాము, యిక్కడ ఉంటున్న బ్రాహ్మిన్స్ మీరు ఒక్కరే. మా ఇళ్లలో ఏ శుభకార్యం చేసుకున్నా ముందు ఆంటీ ఆశీస్సులు తీసుకుంటున్నాము. మిమ్మల్ని అవసరమైతే చూసే వాళ్ళు ఎవ్వరు అని భయపడక్కరలేదు. మేమందరం వున్నాము. వేరే కారణం అయితే మీ ఇష్టం” అన్నాడు. అదే విధంగా అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నారు.
ఒకరోజు ఉదయం ఎదురింటి సుధాకర్ “అంకుల్! మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మీరిద్దరే కాబట్టి మీ సంపులో నీళ్లు మేము తీసుకుంటాము” అన్నాడు పెద్ద పైప్ తీసుకుని వచ్చి.
“దానికేం భాగ్యం. మాకు సగం నీళ్లు ఉంచి మీరు తీసుకోండి” అన్నాడు సీతాపతి.
యింట్లోకి వచ్చిన భర్త తో, “అసలే వేసవి కాలం, వున్న నీళ్లు వాళ్ళని తీసుకోమన్నారేమిటండి” అంది జానకి.
“యిప్పుడు వాళ్ళకి అవసరం అయినప్పుడు మనం ఆదుకోకపోతే రేపు మనకి అవసరం అయితే మన మొహం చూడరు, తప్పదు ఇటువంటివి, నువ్వే నీళ్లు జాగ్రత్తగా వాడు” అన్నాడు.
మధ్యలో కొడుకులు ఇద్దరు వచ్చి తల్లిదండ్రుల ని చూసి వెళ్తున్నారు. అర్ధరాత్రి ఏదో చప్పుడు అయితే ఉలిక్కిపడి లేచింది జానకి. పక్కన భర్త లేడు. హాలులో లైట్స్, ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు విని కంగారుగా హాలు లోకి వచ్చి చూసింది.
సీతాపతి ఆయాసపడుతో “పొట్టా, గుండెల్లో నొప్పి. భరించలేకపోతున్నాను” అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.
“పడుకునే అప్పుడు బాగానే వున్నారుగా, ఎందుకు వచ్చింది?” అంటూ టైమ్ చూసి “రెండు గంటలు అయ్యింది, గుండెల్లో నొప్పి అంటే తెల్లారిజామున హార్ట్ ఎటాక్ వస్తుంది అంటారు, కొంపదీసి అదేనా” అంది.
“నీ బొంద, ఊపిరి ఆడక చస్తోవుంటే యింకా కంగారు పెట్టేస్తున్నావ్, ఎదురింటి సుధాకర్ ని పిలిచి విషయం చెప్పి త్వరగా నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమను, డెబిట్ కార్డు పర్సు లో వుంది, పాస్వర్డ్ నీ పుట్టినరోజు. త్వరగా వెళ్ళు” అన్నాడు సీతాపతి.
“పుట్టినరోజు అంటే అసలు పుట్టినరోజా లేకపోతే స్కూల్ లో వేసిందా” అంటున్న భార్య వంక చూడకుండా “ఏదో ఒకటి ముందు నన్ను హాస్పిటల్ కి లాక్కుపోండి” అన్నాడు.
సుధాకర్ యింటి కాలింగ్ బెల్ నొక్కిన పదినిమిషాలకి సుధాకర్ భార్య కళ్ళు నులుముకుంటో తలుపు తీసి “ఏమిటి అంటీ” అంది కొద్దిగా చిరాకుగా.
“మీ అంకుల్ కి సడన్ గా గుండెల్లో నొప్పి అని బాధ పడుతున్నారు, నాకు డ్రైవింగ్ రాదు. సుధాకర్ ని పిలిస్తే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాము. నాకు భయం గా వుంది” అంది.
“అయ్యో! మా వారికి రాత్రి డోకులతో నీరసపడి ఒక గంట క్రితం పడుకున్నారు, ఆయన ఈ స్థితిలో కారు నడపలేరు. ఒక్కసారి 33 నెంబర్ యింట్లో డాక్టర్ గారు వున్నారు. వాళ్ళని అడగండి, సారీ అంటీ” అంటూ తలుపు వేసుకుంది.
33 నెంబర్ యింటిలో ఉంటున్న వాళ్ళు తనకి తెలియకపోయినా పరుగున వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. రెండు నిముషాలలో తలుపు తీసిన డాక్టర్ గారి భార్య చెప్పింది “ఈ రోజు డాక్టర్ గారికి హాస్పిటల్ లో నైట్ డ్యూటీ, మీరు వెళ్ళండి చూస్తారు” అంది.
యిహ టైం వేస్ట్ చెయ్యడం కంటే మరిది కి ఫోన్ చేసి అంబులెన్సు బుక్ చెయ్యమని అడుగుదాం అని ఫోన్ చేసింది. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలో ఈవిడ ఆ యింటికి ఈ యింటికి తిరగడం చూసిన వాచ్మాన్ మెయిన్ గేట్ నుంచి పరుగున వచ్చి విషయం తెలుసుకుని, “మేడం! నాకు కారు నడపటం వచ్చు, పదండి మీ కారులో హాస్పిటల్ కి తీసుకొని వెళ్దాం” అన్నాడు.
“అమ్మా.. దేముడే నీ రూపంలో వచ్చాడు” అని లోపల నుంచి సీతాపతి ని తీసుకుని కారులో హృదయం హాస్పిటల్ కి వెళ్లారు.
అంత రాత్రి వచ్చారు అంటే ఎమర్జెన్సీ నే అని వెంటనే ఐసీయూ లోకి తీసుకుని వెళ్లారు. పెద్ద డాక్టర్ పైన బిల్డింగ్ లో నే నివాసం ఉండటం తో వెంటనే వచ్చి పరీక్ష చేసి ఈసీజి తియ్యమన్నాడు.
ఈసీజీ చూసి నొప్పితో బాధపడుతున్న సీతాపతి ని చూసి నర్స్ తో సీతాపతి భార్యని పిలవమన్నాడు. ఆ పిలుపు వినగానే జానకి వణికిపోయింది ఏదో కొంపములిగింది అనుకుని. మెల్లగా తలుపు తీసుకుని ఐసీయూ లోకి వెళ్ళింది.
కుర్చీలో కూర్చుని వున్న డాక్టర్ గారు సీతాపతి భార్య ని చూసి “ఈ రోజు ఏమి తిన్నారు మీ వారు” అన్నాడు.
ఈ ప్రశ్నకు తెల్లబోయిన జానికి ఉదయం ఏమి తిన్నామో గుర్తుకు తెచ్చుకుని చెప్పింది.
“ఉదయం బ్రేక్ ఫాస్ట్ వడ తిన్నారు, లంచ్ లో కొబ్బరి శనగపప్పు కూర, చేమదుంపలూ వేపుడు, సాయంత్రం నాలుగు గంటలకు రెండు పచ్చిమిర్చి బజ్జిలు తిని కాఫీ తాగారు, రాత్రికి ఆకలి లేదు అని ఉదయం చేసిన నాలుగు వడలు వుంటే తిని పడుకున్నారు. అంతే.. నాకు మెలుకువ వచ్చి చూసేసరికి గుండెల్లో నొప్పి అంటూ కంగారుగా తిరుగుతున్నారు. అదేమిటి ఆయన కళ్ళు పెద్దవి అయిపోతున్నాయి.. ముందు ఆయనని రక్షిచండి” అంది జానకి.
“అయన తిన్న వంటల గురించి చెప్తున్నారు అని కోపంగా చూస్తున్నారు మీ వంక అంతే. డెబ్భై ఏళ్ళు పెట్టుకుని ఒక టిఫిన్ రూంలో ఉండాలిసిన టిఫిన్స్, దానికి తోడు మళ్ళీ రాత్రి గారెలు ఎలా తిన్నారండి. తిన్న తరువాత పోనీ కొద్దిసేపు నడిచారా అంటే అదీలేదు, యిలా ఉంటే ఈసారి నిజంగానే గుండె ఆగిపోతుంది. యిప్పుడు మీకు వచ్చింది ఆసిడీటీ ప్రాబ్లెమ్, తిన్నది అంతా గొంతుకులోనే ఉండటం వలన గాలి ఆడకా యిలా అయ్యింది.
ప్రతీ వాళ్ళు రాత్రి భోజనం అయ్యిన తరువాత వంద అడుగులైనా నడిస్తే వందేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. యిప్పుడు మీకు నొప్పి తగ్గటానికి ఇంజక్షన్ యిచ్చాము, ఇంటికి వెళ్లి మేము యిచ్చిన పౌడర్ గ్లాస్ నీళ్లలో కలుపుకుని తాగి పడుకోండి. తెల్లారి బాత్రూం కి చాలా సారులు వెళ్ళాలిసివస్తుంది. కంగారు పడకండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అక్కడే వున్న నర్స్ నవ్వుతో “అంకుల్! రేవు ఏం తినాలి అనుకుంటున్నారు?” అంది సీతాపతి ని మెల్లగా మంచం మీద నుంచి లేపుతో.
“నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి. సంపులో నీళ్లు మనం లేచే లోపే పట్టేసుకున్నారు. ఒకసారి గ్రీన్ సిగ్నల్ యిస్తే వాళ్ళు ఊరుకుంటారా” అంది జానకి.
“వుండు రెస్ట్ రూమ్ కి వెళ్లి వచ్చి నీ మాట వింటాను” అంటూ బాత్రూం లోకి పరుగేత్తడు సీతాపతి.
నీరసంగా బయటకు వచ్చి “ఇదిగో, కాలనీలో అందరూ మేమున్నాం మీకెందుకు భయం అన్నారు. అవసరంకి ఒక్కళ్ళు ఆదుకోలేదు. ఉదయం వచ్చి ఏమైంది అని కూడా అడగలేదు. వీళ్ళని నమ్ముకుని మనం యిక్కడే ఉండటం ఏమాత్రం మంచిది కాదు, అదృష్టం కొద్దీ వాచ్మాన్కి కారు నడపటం వచ్చింది, వాడే దేముడు. ఎంతైనా కడుపున పుట్టిన పిల్లలే దిక్కు. పరాయి వాడు పెట్టే పరవన్నం కన్నా కొడుకు ని, మనవరాలు, మనవళ్లు ని చూస్తో కోడలు చేసి పెట్టే పోహా నే నయ్యం. పిల్లలకి చెప్పు, మనల్ని తీసుకుని వెళ్ళమని. పాపం మన టీవీ, ఫ్రిడ్జ్ రాత్రి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన వాచ్మాన్ కి యిచ్చేద్దాం” అన్నాడు.
“అది సరే అలాగే వెళ్ళపోదాం, యిప్పుడు మీ కడుపు కొద్దిగా ఖాళీ అయ్యిందా, టిఫిన్ ఏమన్నా తింటారా” అంది జానకి.
“పిల్లలు దగ్గరికి వెళ్లే దాకా మన యింట్లో టిఫిన్, వేపుడు బంద్. బీరకాయ, బెండకాయ అంతే. అక్కడ కోడలు ఎలాగో ఆరోగ్య సూత్రాలు పాటిిస్తుంది కాబట్టి ఇహ భయం లేదు” అన్నాడు మళ్ళీ రెస్ట్ రూంలోకి వెళ్తో.
రాత్రి భోజనం/ టిఫిన్ తిన్న తరువాత కనీసం కొంతసేపు నడవండి, రాత్రికి రాత్రి డాక్టర్ దగ్గరికి పరుగులు తీయక్కరలేదు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments