'Doctor Babu' - New Telugu Story Written By Pitta Gopi
'డాక్టర్ బాబు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
డాక్టర్లనే దేవుళ్ళు గా నమ్మే ఈ సమాజానికి ప్రతి డాక్టర్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయటమే తప్ప నిలబెట్టుకుని నిజాయితీగా వైద్యం అందించే వాళ్ళు దాదాపు లేరు.
ఎక్కడో.... ఒక్కో డాక్టర్ మంచోడైనా....తమ అనుభవాన్ని ఉపయోగించి వైద్యం చేసినా...
పైసలు ఇవ్వనిదే వైద్యం చేయరు.
ఇక మిగిలిన వైద్యులు ,ఆసుపత్రులు గూర్చి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్నపాటి జ్వరం అని వైద్యులను సంప్రదించినా… ఏదేదో జరిగిపోయినట్లు పది రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి వేలల్లో , వీలుంటే లక్షల్లో డబ్బులు గుంజకుండా వదిలిపెట్టరు.
ఇంకా మానవత్వం దేవుడెరుగు..
చచ్చినా డబ్బులు కట్టనిదే శవాన్ని కూడా ఇవ్వలేని వైద్యం మనది.
అలాంటి సమాజంలో ఉన్నాం.
అలా కాలం గడవగా చూస్తుండగానే నగరంలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టడం , ఇప్పటికే దోచుకుంటున్న ఆసుపత్రులు చాలవు అన్నట్లు ఇంకా కొత్తవి పుట్టుకొస్తున్నాయని ప్రజలు తిట్టుకోవటం అంతా జరిగిపోయింది.
అయితేనేం ఆసుపత్రి కట్టడం ఆగుతుందా.....
పూర్తయింది.
‘కేశవయ్య ఉచిత ప్రజా వైద్యశాల’ అని ఉండంటంతో అందరికి ఆశ్చర్యం ,ఆనందం రెండూనూ....
శివయ్య అనే వైద్యుడు తండ్రి పేరు మీద కట్టించిందే ఈ ఆసుపత్రి.
తన తాత ,తండ్రుల కాలం నాటి ఆస్తులు ఎక్కువ ఉండటంతో పాటు ‘ఎలాగూ వైద్య వృత్తి లో ఉన్నాం కనుక తన జీవితం ప్రజలకే అంకితం కావాలని ,
బతికున్నపుడు దోచుకోవటం కంటే.... చచ్చిపోయినా పదిమంది మనసులో ఉండిపోతే చాల’నుకున్నాడు శివయ్య.
తన ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలను , చాలామంది వైద్యులను ,సిస్టర్స్ ను పెట్టాడు. ఎమర్జెన్సీ కేసులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మిగతా సమయంలో సిబ్బంది జీతభత్యాలు ,ఆసుపత్రి కోసం మంచి మంచి పరికరాల ఆన్వేషణ.. తదితర పనులతో బయట ఎక్కడో ఉంటారు.
రాజేందర్ శివయ్య పై అసూయతో రగిలిపోయే వ్యక్తుల్లో ఒకడు.
ఆసుపత్రి పనితీరు చూద్దామనుకుంటున్న రాజేందర్ కి ఒకరోజు ఒంట్లో బాలేదు .
అదే అదనుగా,అతను కేశవయ్య ఉచిత వైద్యశాల కు పోయాడు.
ఆసుపత్రి లోపలికి ప్రవేశిస్తుంటే అతని అసూయ ఇంకా పెరుగుతోంది.
లోపల ఒక సిస్టర్ ఉంటే తన పేరు ,రోగం తదితర వివరాలు రాసుకుని " పలాన రూం నంబర్ కి వెళ్ళండి "అని అటు చూపుతుంది.
"ఇంతకీ ‘శివయ్య డాక్టర్’ ఉన్నారా"....అడుగుతాడు రాజేందర్.
"సార్ లేరు , ఏదో పని మీద బయటకు వెళ్ళారు.
మీకు ట్రీట్మెంట్ చేయటానికి లోపల చాలామంది డాక్టర్లు ఉన్నారు వెళ్ళండి " అంటుంది.
"ఆసుపత్రి కట్టేసి బయట తిరగటం అంత అవసరమా సిస్టర్..." ప్రశ్నిస్తాడు రాజేందర్.
కోపంతో సిస్టర్, "చూడండి..... ఆయన ఉన్నారా లేరా అనేది ఇక్కడ మేటర్ కాదు....
మీకు ఉచితంగా వైద్యం అందిందా లేదా.. అనేది మేటర్. మీలాంటి వాళ్ళు వందమంది వచ్చినా ఆయన యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. వెళ్ళండి వెళ్ళండి" అంటుంది.
కొంచెం సమయం గడిచాక రాజేందర్ మరలా సిస్టర్ దగ్గరకు వస్తాడు.
"ఏమయ్యా ట్రీట్మెంట్ అందిందా "
"ఆ ...ఆ ..అందిందమ్మ కానీ.... ఈ మందులు ఏంటి చాలా తక్కువ ఇచ్చారు "......
ఏదీ ఆ చీటీ ఇలా ఇవ్వమని తీసుకుని చూసి
"నీకొచ్చిన రోగం ఏమీ లేదయ్యా....చిన్నపాటి జ్వరం వచ్చింది. అందుకే ఇంజక్షన్ తో పాటు ఈ తక్కువ మందులు ఇచ్చారు.
అదే వేరే ఆసుపత్రికి పోతే ఈపాటికి ప్లేట్లెస్ తగ్గాయని పల్స్ తగ్గిందని వేలకు వేలు దోచేసేవాళ్ళు వెళ్ళవయ్య వెళ్ళు" అంటుంది.
రోజులు గడుస్తుంటే రోజురోజుకు ఆసుపత్రికి రోగులు సంఖ్య పెరుగుతోంది.
ఆసుపత్రి బాధ్యత నడుపుతూనే ఎన్నో ఎమర్జెన్సీ కేసులు శివయ్య చేశాడు.
దీంతో ఆ నోటా ఈ నోటా ప్రభుత్వం దృష్టిలో పడింది ఆ ఆసుపత్రి.
దీంతో శివయ్యను విభిన్న అవార్డులతో సత్కరించటమే కాదు... ప్రభుత్వం తరపున కూడా తమ వంతు సహయసహకారాలు అందించటం ప్రారంభించింది.
అలా రోజులు గడుస్తుండగా....
ఒక రోజు రాజేందర్ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. ప్రాణాపాయంలో ఉన్న కొడుకుని తెచ్చాడు రాజేందర్.
"సిస్టర్, సిస్టర్.. ఎమర్జెన్సీ కేసు. ఎలాగైనా నా బిడ్డని బతికించండి " అంటాడు.
"నేను సార్ కి ఫోన్ చేస్తాను. లోపల డాక్టర్లు ఉన్నారు. మీరు తీసుకెళ్ళండి" అంటు ఫోన్ తీస్తుంది.
"ఏంటీ ఇప్పుడు కూడా సార్ లేరా.... ఎమర్జెన్సీ కేసు మనకు చెప్పి వస్తుందా.." ఆవేశంతో అంటాడు రాజేందర్.
" అయ్యో.... సార్ వచ్చేవరకు ఇక్కడే ఉంచుతావా… లోపల డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేయగలరు , మరియు సార్ వచ్చే లోపు సర్జరీ కి ఏర్పాట్లు చేయగలరు. పక్కకు తప్పుకో " అని పేషెంట్ ని ఐసియు లోపలికి తీసుకెళ్తుంది.
ఇంతలో శివయ్య డాక్టర్ వస్తాడు.
"ఆగండి.....
అక్కడ నా కొడుకు చావుబతుకుల మద్య ఉంటే మీరు ఇప్పుడు వస్తారా...." అంటాడు రాజేందర్.
"క్షమించండి నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే నేను వచ్చాను. అయినా డాక్టర్లు ఎవరూ ఎవరి జీవితకాలం పొడిగించలేరు. అక్కడ మీ కొడుకు కోసం మీరు దేవుడిని ప్రార్దించండి. నేను వెళ్ళి సర్జరీ చేస్తాను " అంటూ లోపలకి వెళ్తాడు శివయ్య.
రాజేందర్ రెండు చేతులు జోడిస్తు పైకి చూస్తు ఏడుస్తూ ఉంటాడు.
ఇంతలో లోపలి నుంచి శివయ్య వస్తూ "మీ కొడుకు కు సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం ప్రాణాలకు ప్రమాదం ఏమి లేదు .
నాకు అవతల అర్జెంట్ పని ఉంది. మీరు ఏమైనా మాట్లాడవల్సి వస్తే సిస్టర్ తో మాట్లాడండి " అని చెప్పి వెళ్ళిపోతాడు.
"ఏంటీ ఈ డాక్టరు ఇంత కఠినాత్ముడు...ఎప్పుడూ పని ఉందని వెళ్ళిపోతాడు... కొంచెం వేగంగా వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నా కొడుకు నాకు దక్కేవాడే కాదు.
మాట్లాడుదామంటే వెళ్ళిపోతున్నాడు" అంటాడు రాజేందర్.
ఆ మాటలకు సిస్టర్, "శివయ్య సార్ కొడుకు కూడా ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఇందాక ఎమర్జెన్సీ కేసు అని ఫోన్ చేసినపుడు వాళ్ళ కొడుకు అంత్యక్రియల్లో స్మశానం వద్ద ఉన్నాడు. ఫోన్ చేశాక వాటిని అన్నింటినీ ఆపేసి వచ్చి సర్జరీ చేసి, మిగిలిన అంత్యక్రియలు పూర్తి చేసేందుకు మరలా స్మశానానికే వెళ్ళా"రని కన్నీటిపర్యంతం అయింది సిస్టర్.
ఆ మాటలకు రాజేందర్ బాధతో కన్నీరు ఆపుకోలేకపోయాడు.
"దేవుడా....ఇలాంటి డాక్టర్లు కూడా ఉన్నారా....ఈ సమాజంలో.... ఈ ఆసుపత్రి కట్టినపుడే తెలుసుకోలేక పోయాను" అని ఏడుస్తూ… విషాదం లో కూడా
తన కొడుకు ప్రాణం పోసిన ఆ గొప్ప డాక్టరు కొడుకు ఆత్మ శాంతి కోసం ప్రార్దించటానికి స్మశానానికి మెల్లగా అడుగులు వేస్తాడు రాజేందర్.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments