top of page
Writer's pictureJagapathi Babu Chinthamekala

ఈ రక్తపు సింధూరం


'E Rakthapu Sindhuram' New Telugu Story





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల..

ఇక్కడ ఆరవ తరగతి నుంచి, పదవ తరగతి పిల్లలు సుమారు వెయ్యి మంది దాకా ఈ పాఠశాలలో చదువుతుంటారు.


ఈరోజు ఆగస్టు 15.

అన్నీ బాగుంటే ఇప్పటికే త్రివర్ణ పతాకం గాల్లో రెపరెపలాడుతుండాలి. కానీ గుర్తు తెలియని ఎవ్వరో ముగ్గురు వ్యక్తులు మూడో అంతస్తు పైనుంచి దూకి చచ్చారు.


ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ముగ్గురూ మూడు మతాల వారు అని వారు ధరించిన దుస్తులు వలన తెలుస్తోంది. ఒకరిది కాషాయం. మరొకరిది ఆకుపచ్చ. ఇంకొకరిది తెలుపు. అందులోనా వాళ్లు పండు ముసలి వాళ్లు.


ఇక్కడ అందరి వాదన.. కొడుకులకు బరువైతే ఇంట్లో నుంచి గెంటేశారు. దిక్కు తోచక ఇక్కడ చస్తే కనీసం పోలీసులు కొడుకులకు బుద్ధి చెప్తారని చచ్చారు.. అనుకుంటున్నారు.


కానీ కథ వేరే ఉంది! కసాయి వాడికి కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంది..!


కూయ్! కూయ్! అని ఒక అంబులెన్స్ మరియు పోలీస్ సైరన్ తో ఒక జీపు అతి వేగంగా స్కూల్ గేట్ దగ్గరకు వచ్చి ఆగాయి. ఆ జీపులో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ దిగి అంబులెన్స్ ని అక్కడికి రమ్మన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చకచకా అడగులు వేస్తున్నాడు.


కంగారుగా ఒక వ్యక్తి హెచ్ఎం సార్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, మెల్లగా ఇలా చెప్తున్నాడు "సార్.. పోలీసులు వస్తున్నట్టున్నారు. ఫార్మాలిటీస్.. తొక్క.. తోటకూరని దిక్కుమాలిన ప్రశ్నలు వేసి సాయంత్రం దాకా సమయం సరి చేస్తారు. అది ఏమి కుదరదని త్వరగా డెడ్ బాడీస్ తీసుకు వెళ్ళమని చెప్పండి. అసలే ఈరోజు ఆగస్టు 15. ఈ దరిద్రం లేకుంటే ఈపాటికే ఇక్కడ అందరం సంతోషంగా జెండా పండుగ జరుపుకునే వాళ్ళం" అని చెప్తుండగానే అతని చెంప చెళ్లుమంది. ఆ వ్యక్తి తల పైకి ఎత్తి చూసాడు. ఎదురుగా ఎస్సై. ఆ వ్యక్తి తన చెంపను రుద్దుకుంటూ "సార్, అది కాదు.." అని ఇంకేదో చెప్తుండేలోపే "నేను ఇక్కడికి వచ్చింది నీ యదవ సోది వినడానికి కాదు. ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు.


ఆ వ్యక్తి “మాకు తెలియకనే కదా!,మిమ్మల్ని రమ్మంది." అన్నాడు. వెంటనే మళ్ళీ ఎస్సై గారు తన ఇంకొక చెంప చెళ్లుమనిపించాడు. తిరిగి ఆ వ్యక్తి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడలేదు. అక్కడినుంచి వెళ్ళిపోయాడు.


"హెచ్ఎం గారు.. మీరైనా చెప్పండి. ఇక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు దూరంగా రక్తపు మడుగులో పడి ఉన్న మూడు శవాలను చూస్తూ...


"సార్.. ఇక్కడ నిన్నంతా ఈ ఆవరణం శుభ్రం చేసి, డెకరేషన్ పేపర్స్ అతికించి, జెండాలు కట్టి, అందమైన కలర్స్ ముగ్గులు వేయించి, స్కూల్ అయిపోగానే ఒక వ్యక్తిని సెక్యూరిటీగా ఉంచి వెళ్ళాము. ఉదయం వచ్చి చూసేసరికి ఇలా జరిగింది. ఇంతకంటే నాకు ఇంకేమీ తెలియదు" అన్నారు ఆ హెచ్ఎం గారు.


"ఆ సెక్యూరిటీ ఎవరో త్వరగా రమ్మనండి?" అన్నారు ఎస్ఐ గారు.


"రామకృష్ణ.. త్వరగా రా. సార్ పిలుస్తున్నారు నిన్ను" అని గట్టిగా అరిచాడు హెచ్ఎం గారు.


ఇప్పటికే రెండు చెంప దెబ్బలు తిన్న వ్యక్తి భయంగా వెన్నులో వణుకుతో ఎస్ఐ గారి ఎదురుగా వచ్చి నుంచున్నాడు.


"సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు! లేదంటే నీకు కింద పైన కూడా పగులుతుంది" అన్నారు ఎస్ఐ గారు.


"అంత పని చేయకండి. అది ఏదో అడగండి, చెప్తాను సార్" అన్నాడు వినయంగా ఆ వ్యక్తి.


"వీళ్ళు ఎలా లోపలికి వచ్చారు?" అన్నారు ఎస్ఐ గారు.


“అర్ధరాత్రి 11:30 అవుతుండొచ్చు సమయం. గేటు దగ్గర చైర్ లో కూర్చుని బాగా నిద్రలో ఉన్నాను. ఈ ముగ్గురు ముసలి వాళ్లు నిద్రలేపారు.

‘ఏంటి.. ఏం కావాలి?’ అని అరిచాను.

‘కొంచెం తాళం తీస్తారా.. బయట చాలా చలిగా ఉంది. లోపలకి వెళ్లి పడుకుంటాము’ అన్నారు.


‘అయ్యో పాపం! బిడ్డలు తన్ని తరిమేసారనుకుంటా.. చూడటానికి అమాయకుల్లాగా ఉన్నా’రని జాలిపడి తాళం తీశాను. లోపలికి వెళ్లడానికి అంగీకరించాను.


వాళ్లు ధరించిన దుస్తులను చూసి ఎందుకో అనుమానం వచ్చి ‘ఆగండి? అని ఎందుకు మీరు ఒకరేమో కాషాయం, మరి ఒక్కరు తెలుపు, ఇంకొకరు ఆకుపచ్చ దుస్తులు ధరించార’ని అడిగాను.


వాళ్లు నవ్వి ‘మాకు వేసుకోవడానికి దుస్తులు లేక ఇలా వేసుకున్నాం’ అన్నారు. వారి చేతిలో భగవద్గీత, ఖురాన్, బైబిల్, కూడా ఉన్నాయి. వీరు ముగ్గురూ మూడు మతాలవారు అనుకుంటా. పొద్దు పోక ఇలా పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నట్టున్నారు.. అనుకున్నాను. లోపలికి వెళ్ళగానే వెంటనే తాళం వేసి నిద్రమత్తులో ఉండడం వలన వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. స్కూల్ కి, స్కూల్ గేటు కి చాలా దూరం ఉండడం వలన నాకు వాళ్ళు చేసేది ఏది తెలియలేదు. ఉదయం లేచి ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది.


సార్! ఇంతకంటే నాకు ఇంకొక ముక్క కూడా తెలియదు. నన్ను నమ్మండి." అని జాలిగా ఎస్సై గారి వంక చూస్తూ అన్నారు ఆ రామకృష్ణ అనే వ్యక్తి.


ఎస్సై గారికి కూడా ఎందుకో అతని మాటలు నమ్మవచ్చు అనిపించి, "కానిస్టేబుల్స్ చెప్పింది అర్థమైంది కదా! ఎంక్వయిరీ చేయండి. ఏ చిన్న క్లూ దొరికిన నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీనికి కారణం వీడి హస్తం కూడా ఉందని తెలిస్తే వెంటనే స్టేషన్ కి లాక్కు రండి" అని ఆ శవాల దగ్గరికి వెళ్లారు ఎస్ఐ గారు.


"ఎస్సార్" అని సెల్యూట్ చేసి ఎస్సై గారిని అనుసరించారు ఆ ముగ్గురు కానిస్టేబుల్స్.


ఎస్సై గారు తన నెత్తి మీద టోపీ తీసి, ఆ డెడ్ బాడీస్ వైపు పరిశీలనగా ఒక్కసారి చూసి, నేషనల్ ఫ్లాగ్ లో ఉన్న మూడు రంగులను, ఒక్కొక్కరు ఒక్కో రంగు ధరించారని గ్రహించి, "కానిస్టేబుల్స్! ఈ ముగ్గురు వ్యక్తులను చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన సమయం సరిగ్గా అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్టుంది. కాబట్టి మీరు విడివిడిగా ఎంక్వయిరీ చేయండి. సలీం.. నువ్వు వెళ్లి ఈ కాషాయం రంగు ధరించిన వ్యక్తి వివరాలు కనుక్కో.

రామాచారి.. నువ్వు వెళ్లి ఈ తెలుపు రంగు ధరించిన వ్యక్తి వివరాలు కనుక్కో. జోసెఫ్.. నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.”

“ఎస్సార్.. నేను ఆకుపచ్చ రంగు ధరించిన వ్యక్తి వివరాలు కనుక్కుంటా”

“సరే వెళ్లండి. నేను దగ్గరుండి ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను" అన్నారు ఎస్ఐ గారు.


‘ఎస్సార్’ అన్నారు ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్స్.


"వీళ్లు మూడు మతాల వారని కొన్ని ఆధారాల వలన తెలుస్తోంది. కాబట్టి త్వరగా ఎంక్వయిరీ చేయాలి. వెరీ కాంప్లికేటెడ్ సిచువేషన్. తేడా వస్తే మన జాబ్స్ పోతాయి. కులాలవారు కొట్టుకు చస్తారు. మతాలవారు తన్నుకు చస్తారు. కాబట్టి వెంటనే సిఐ గారికి ఈ విషయం తెలియజేస్తా. 144 సెక్షన్ అమలులో ఉండేలా పర్మిషన్స్ తీసుకుంటా. మీరు మాత్రం జాగ్రత్తగా టేకప్ చేయండి.

అనవసరమైంది ఏది గెలక వద్దు. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకురండి." అన్నారు ఎస్ఐ గారు.


ముగ్గురు కానిస్టేబుల్స్ ‘ఎస్సార్’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


కొంతసేపటి తర్వాత "సార్ పిల్లలు భయపడుతున్నారు. త్వరగా ఈ డెడ్ బాడీస్ తీయించండి" అని వినయంగా అన్నారు ఆ స్కూల్ హెచ్ఎం గారు ఎస్సై గారితో.


అలా ఆ పిల్లల వంక ఎస్ఐ గారు ఒక్కసారి చూసి పోస్ట్ మాస్టర్ కి తీసుకెళ్లడానికి అప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి రెడీగా ఉన్న అంబులెన్స్ బృందాన్ని "త్వరగా తీయండయ్యా.. పిల్లలు భయపడుతున్నారు" అని కంగారు పెట్టారు.


"ఎస్సార్.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయాయి. మీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాం" అని మూడు శవాల్ని తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. ఈ విషయం పాత్రికేయులకు ఇప్పటివరకు తెలియదనుకుంటా.. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందినట్టుంది.. వాళ్లు పరిగెత్తుకు రావడం చూస్తుంటే.


ఐదారు మంది పరిగెత్తుకు ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి, మైక్స్ ఎస్సై గారి నోటి దగ్గర పెట్టి, కెమెరా ఆన్ చేసి, వాళ్లలో ఒక విలేఖరి "సార్.. ఈ సంఘటన ఎలా జరిగింది? ఈ కుట్ర వెనక రాజకీయ నాయకులు హస్తం ఉందంటారా?" అన్నారు.


"ప్రజెంట్ అయితే మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా మీరు చెప్పినట్టే ఉండి ఉండొచ్చు" అన్నారు ఎస్ఐ గారు.


"అయితే! మీరు నిజమని నమ్ముతున్నారా?" అన్నారు మరి ఒక విలేఖరి.


"అన్నీ మీరే చెప్తారు అయ్యా. మేము చెప్పేది ఏది వినరు కదా!" కాస్త కోపంగా దబాయించారు ఎస్ఐ గారు.


"మరి ఏమిటో మీరే చెప్పండి?" అని ఇంకొక లేడీ విలేఖరి వినయంగా అంది.


ఆ మాటలకు ఎస్ఐ గారు కాస్త శాంతపడి "ఇప్పటివరకు మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదని చెప్పానుగా.. బృందాలుగా విడిపోయి ఎంక్వయిరీ చేయిస్తున్నా. మీరు కాస్త అడ్డు తప్పుకుంటే హాస్పిటల్కు తీసుకెళ్లి పోస్టుమాస్టర్ చేయించాలి" అన్నారు ఎస్ఐ గారు నెత్తిమీద టోపీ పెట్టుకుంటూ...


"జీపు స్టార్ట్ చేయండి వెళ్దాం" అని అంబులెన్స్ డ్రైవర్ కు చెప్పి, జేబులో నుంచి ఫోన్ తీసి సి ఐ గారికి లైన్ కలుపుతూ... తను చక చక గేటు దగ్గర ఆగి ఉన్న జీపు వైపు అడుగులు వేశాడు.


ఒక విలేఖరి మైక్ నోటి దగ్గర పెట్టుకొని కెమెరా వంక చూస్తూ..."దర్యాప్తు చేయడంలో పూర్తిగా విఫలమైన కుర్ర కారు ఎస్సై.. ఇంత చిన్న వయసులోనే ఉద్యోగాలు ఇస్తే ఇలానే దర్యాప్తు కొనసాగిస్తారు" అని చెబుతూ... ‘ఈ మూడు మతాలకు చెందిన ముసలి వ్యక్తులు, ఒకరిని ఇంకొకరు చంపుకొని చచ్చారు’ అని సబ్ హెడ్డింగ్స్ స్క్రోల్ అవుతుంటే ఏ టీవీ చూసిన చూపించింది పదేపదే చూపిస్తూ... మారుమొగుతున్నాయి.



ఈ న్యూస్ చూసిన కొందరు మతాల మధ్య చిచ్చుపెట్టే మత పెద్దలు ఇదే అదననుకొని, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య మంట పెడుతున్నారు. అక్కడక్కడ ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉండడం వలన ఆ బృందాలను కాస్త చెదరగొడుతున్నారు పోలీసులు.


గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మూడు శవాలకు పోస్ట్మాస్టర్ చేస్తుంటే బయట తహాసిల్దార్ కార్యాలయం అధికారులు మరియు ఎస్సై గారు బయట వెయిట్ చేస్తున్నారు.


ఈ లోపు సిఐ కోపంగా ఊగిపోతూ అక్కడికి చక చక వచ్చి"ఏంటయ్యా నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఏవైనా వివరాలు తెలిసాయా? బయట అందరూ కొట్టుకు చస్తున్నారు నువ్వేమో! హ్యాపీగా హాస్పిటల్ లో ఉన్నావు?" అని చడామడ తిట్టి "నువ్వే దగ్గరుండి దర్యాప్తు చెయ్! పో. నేను ఇక్కడ అన్నీ చూసుకుంటాను అన్నారు ఎస్ఐ గారితో.


"ఎస్సార్" అని సెల్యూట్ చేసి అక్కడ నుంచి ఓ నాలుగడుగులు ముందుకు వేశాడు.


"కుర్ర బచ్చాకు ఉద్యోగం ఇస్తే ఇలానే ఉంటాది" అన్నారు తనంటే సరిపోని ఓ తహాసిల్దార్ కార్యాలయం అధికారి ఒక్కరు. ఆ మాటలకు కోపం విపరీతంగా వచ్చిన అదుపు చేసుకొని తర్వాత చూస్తా నీ అంతు అన్నట్టుగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఎస్ఐ గారు.


కాస్త మన ఎస్సై మదన్ కుమార్ గురించి తెలుసుకుందాం..


మదన్ కుమార్ ఓ మధ్యతరగతికి చెందిన అబ్బాయి. తన తండ్రి రాజా రామ్. కొడుకుని లా చదివించాలనుకున్నాడు ఎందుకంటే? లాయర్ అనేవాడే నిజాయితీగా ఉంటే న్యాయం నాలుగు పాదాల మీద నిలబడుతుంది అని ఆయన నమ్మకం.

స్వాతంత్రం పోరాట యోధులు ఎక్కువగా లాయర్స్ ఉండడం ఆయనకు స్ఫూర్తిదాయకం. అందువలన కొడుకుని లా చదివించాలి అనుకున్నాడు. కానీ కొడుకు ఉన్న పర్సనాలిటీకి పోలీసు ఉద్యోగం వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యంతో కాలం చేసి వెళ్ళిపోయాడు. అమ్మ చిన్నప్పుడే పోయింది. ఉన్నది ఇప్పుడు అతను ఒక్కడే.. వాళ్ల నాన్నగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అన్యాయాన్ని ఎదిరించే దిశగా అడుగులు వేస్తున్నాడు.


ఇక ప్రస్తుత కథకు వస్తే..


ఎస్సై మదన్ కుమార్ కోపంగా జీపు దిగి, పోలీస్ స్టేషన్ లోకి వచ్చి, తన చేతిని టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకి ఆ టేబుల్ మీద ఉన్న వస్తువులు అన్నీ ఎగిరి పడ్డాయి. తలపైకెత్తి గట్టిగా ఒకసారి అరిచి తన జేబులో నుంచి ఫోన్ తీసి కానిస్టేబుల్స్ కు ఫోన్ చేస్తుండగానే ముగ్గురు కానిస్టేబుల్స్ నీరసంగా వెనుతిరిగి వచ్చారు.


"ఏం సలీం ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా?" అన్నారు చైర్ లో కూర్చుంటూ...


"లేదు సార్. ఆ ముగ్గురు ముసలి వాళ్లు మూడు ప్రాంతాలకు చెందిన వారిని తెలిసింది. ఇంక ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు" అన్నాడు.


జోసెఫ్ వైపు తిరిగా చూశాడు. తల అడ్డం ఆడించాడు.


రామాచారి దగ్గర నుంచి కూడా అదే సమాధానం రావటం ఎస్ఐ గారికి ఇంకాస్త కోపం ఎక్కువైంది.


"ఎవరయ్యా వీళ్ళు? ఒక్కొక్కరు ఒక్కో నేషనల్ ఫ్లాగ్ రంగు ధరించడం ఏంటి? ముగ్గురూ కలిసి అక్కడకు పోయి చావడం ఏంటి.. నాకసలు తల తిరిగిపోతున్నది. దానికి తోడు మన సిఐ గారి చివాట్లు ఒకటి. నువ్వు వెళ్లి ఆ సెక్యూరిటీ గాన్ని లాక్కుర జోసెఫ్!, సలీం నువ్వు వెళ్లి ఓ మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా. రామాచారి.. నువ్వు వెళ్లి ఆ టీవీ ఆన్ చెయ్! బయట ఏం పెంట జరుగుతుందో తెలుస్తాది" అన్నారు విసుకుపోయిన స్వరంతో ఎస్ఐ గారు.


సలీం మరియు జోసెఫ్ ఇద్దరు ఒకేసారి స్టేషన్ నుంచి బయటికి వెళ్లగా.... రామాచారి టీవీ ఆన్ చేసి, రిమోట్ తీసుకొని, ఎస్ఐ గారికి ఇచ్చారు. ఏ ఛానల్ చూసిన ఇదే న్యూస్ ప్లే అవుతున్నది. మత పెద్దలు పెట్టిన చిచ్చు అందరి గుండెల్లోన బాగా గుచ్చుకున్నట్టుంది. మూడు మతాలవారు ఊగిపోతున్నారు. దొరికినవి దొరికినట్టే వాహనాలను పగలగొడుతున్నారు. కొందరు వాటికి మంట కూడా పెడుతున్నారు. మరికొందరు ప్రభుత్వ కార్యాలయాలు ముందు నిరసన తెలియజేస్తున్నారు.


ఎస్ఐ గారు ఒక్కసారి అడ్డం గట్టిగా తల విదిలించుకుని "చారి.. ఏంటయ్యా వీళ్ళు చేస్తున్నది? రేపటి వరకు మనం ఈ కేసును చేదించకపోతే తలలు తెగ నరుక్కుని రక్తసింధూరం పూసుకునేలా ఉన్నారు ఈ మూడు మతాలవారు" అన్నారు ఆశ్చర్యంగా టీవీ వైపు వైపు చూస్తూ...


ఈలోపు "బ్రేకింగ్ న్యూస్.. ఇప్పుడే అందిన వార్త.. 24 గంటల్లో కేసును ఛేదించకపోతే మదన్ కుమార్ ఎస్సైను సస్పెండ్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నారు అని కొందరు రాజకీయ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి చెబుతున్నారు." అని ఆ విషయం టీవీలో యాంకర్ చక చక చెబుతున్నది.


ఆ మాటలు వినగానే ఎస్ఐ గారు కంగుతిన్న తన గొంతును సవరించుకొని “ఎక్కడ ఈ సలీం ఇంకా వచ్చి చావలేదు తల పగిలిపోతున్నది” అని విసుగ్గా అరిచాడు ఎస్ఐ గారు.



బయట వస్తూ ఈ మాటలు విన్న సలీం"సార్ వచ్చేస్తున్నా" అని గట్టిగా బయట నుంచి అరుస్తూ టీ కప్ తీసుకొచ్చి ఎస్సై గారికి ఇచ్చాడు.


టీ తాగుతుండగా జోసెఫ్ సెక్యూరిటీ రామకృష్ణ మెడ దగ్గర కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చి ఎస్సై గారి ముందుకు తోసాడు. ఆ సెక్యూరిటీ రామకృష్ణ భయం భయంగా "ఏంటి సార్ రమ్మన్నారు అంట?" అని కాస్త విసుగ్గా అడిగాడు.


"నువ్వు చేసిన పనికి తాంబూలం ఇచ్చి పంపిద్దామని రమ్మన్నాను" అని వ్యంగ్యంగా అని "ఒక్కటి ఇచ్చానంటే గూబ పగిలిపోద్ది ఏమనుకుంటున్నావో! చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు సార్ రమ్మన్నారు అని విసుకుంటావా" అన్నారు ఎస్ఐ గారు లేచి కొట్టబోయిన తన చేయని వెనక్కి తీసుకుంటూ...


అదిరిపడి "ఏంటి సార్.. నేనేం చేశాను" వినయంగా అన్నాడు చిన్న పిల్లవాడి లాగా ముఖం పెట్టి ఆ సెక్యూరిటీ.


"నువ్వు కాదా బే.. వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చిండేది?" అన్నాడు కానిస్టేబుల్ సలీం ఆ సెక్యూరిటీని మెడ పట్టుకు ముందుకు తోస్తూ...


"చావాలనుకున్న వాళ్ళని ఎవరు ఆపుతారు సార్? ఇక్కడ కాకపోయినా ఇంకొక చోట చచ్చేవాళ్ళు!. అసలే నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నవాన్ని, నన్ను వదిలేయండి సార్" అని ప్రాధేయ పూర్వకంగా బ్రతిమాలాడు.


"అవును రోయ్! వీడు చెప్పేది కూడా నిజమే! ఇక్కడ కాకపోయినా ఇంకోచోట చచ్చేవాళ్ళు. వాళ్ల చావు నా ప్రాణానికి వచ్చింది" అన్నాడు ఎస్ఐ గారు ముఖం చిట్లించుకుంటూ.


రిమోట్ చేతికి తీసుకొని "లోపలికి వెళ్లేటప్పుడు

అదేదో బుక్స్ పట్టుకెళ్లారన్నావ్, అవి ఎక్కడ?" అన్నాడు బోరున మోగుతున్న టీవీని ఆఫ్ చేస్తూ...


"ఏమో సార్! నాకు తెలియదు. లోపలికి పోయేటప్పుడు అయితే ముగ్గురూ మూడు మతాల బుక్కులను తీసుకెళ్లారు" అన్నాడు అతి వినయంగా ఆ సెక్యూరిటీ.


"బహుశా ఆ థర్డ్ ఫ్లోర్ మీద ఉండుంటాయి సార్" చురుగ్గా ఉండే కానిస్టేబుల్ జోసెఫ్ అన్నాడు.

"అవును! సార్ అక్కడే ఉంటాయి" అని మిగతా కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా అన్నారు.


"పద! పద! త్వరగా పద! అక్కడ ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు" అని చక చక కారు తీసి అందరూ వెళ్లారు ఆ థర్డ్ ఫ్లోర్ మీదికి. అక్కడ అయితే వీళ్లు అనుకున్నట్టు బుక్స్ అయితే ఉన్నాయి కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు.


"చ ఇక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు" అని డిసప్పాయింట్ గా అంటుండగా దూరాన గాలికి కొట్టుకుపోయిన ఒక పేపర్ గాల్లో ఎగురుకుంటూ ఎస్ ఐ గారు మొఖం మీద వచ్చి పడ్డది.


ఆశ్చర్యంగా ఏమిటిది అని చేతికి తీసుకుని చూశాడు.


“హిందూ, ముస్లిం, క్రైస్తవ ఒక్కటే అని నమ్మే వాళ్ళం.. ఈ దేశానికి ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రాలు ఈ దేశంలో నివసించే మాకు లేక చస్తున్న వాళ్ళం ! అని పెద్దగా రాసి ఉన్న అక్షరాలను ఆశ్చర్యంగా చదివి, కానిస్టేబుల్స్ కు కూడా వినిపించేటట్టుగా... మిగతాది కూడా చదువుతున్నాడు ఎస్సై గారు.


“కులాల మధ్య చిచ్చుపెట్టేందుకో లేక మతాల మధ్య మంట పెట్టేందుకో మేము చావట్లేదు! ఈ దేశానికి ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు, ఈ దేశంలో నివసిస్తున్న మాకు లేక ఈ పని చేస్తున్నామని గ్రహించండి. మాకే కాదు.. ఈ దేశంలో నివసించే చాలామందికి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవ అయినా అందరూ ఒక్కటే కానీ కొందరు తన స్వలాభాల కోసం మంట పెడతారు. ఆ మంట ఎంతోమంది అమాయకులను చిన్నాభిన్నం చేస్తుంది.


ఈ కోవకు చెందినవే మా కథలు కూడా..


అత్తర్ భాష: నేను తోపుడు బండిమీద వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో నాకు ఉన్న ఒక్కగాను ఒక కూతురిని చదివించేవాడిని. సరైన ఇంటి వసతి లేక నా భేటీ హాస్టల్లో ఉండి చదువుకునేది. ఒకరోజు నా చిన్న పదహారేళ్ల భేటీని కాలేజీకి వెళ్లి హాస్టల్ కు వస్తుండగా అతి కిరాతకంగా నడిరోడ్డు మీద మానభంగం చేసి చంపారు. ఈ స్వాతంత్ర భారతమణిలో. ఇదేమిటి! అన్యాయం అని అడిగితే ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ ముందుకు రాలేదు.. ఏ ఒక్క లాయరు నా ఆర్తనాధాన్ని పట్టించుకోలేదు.. పెద్దవాళ్ల హస్తం ఉన్నాదని ఏ ఒక్క


న్యూస్ వేయడానికి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్లు డబ్బుకు అప్పటికే అమ్ముడు పోయారు కాబట్టి. కనీసం నా భేటీని ఎవ్వరు మానభంగం చేసి చంపారన్న విషయం కూడా తెలియలేదు. నాకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డ స్వేచ్ఛ లేక చనిపోయింది. బ్రతికుండి కూడా ఏ న్యాయం చేయలేని ఈ చేతకాని తండ్రి జీవితం మీద అసహ్యం వేసి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా భేటీ లాగా ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను.


రంగయ్య: నాకు ఇద్దరు ఆడపిల్లలు మాది వ్యవసాయ కుటుంబం. ఉన్న రెండెకరాల పొలంతో వ్యవసాయం చేస్తూ జీవించేవాడిని. వేసిన పంటకు గిట్టుబాటు ధర లేక తెచ్చిన అప్పు కట్టలేక ఒక ఎకరా పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చేశాను. ఉన్న ఎకరం పొలంతో నా కూతుళ్ళకి పెళ్లి చేయాలనుకున్నా. పెద్ద కూతురికి ఒక మంచి సంబంధాన్ని చూశాను. వరకట్నం బాగా ఎక్కువ అడిగారు. ఒక్కొక్కరికి అరెకరం పొలంతో పెళ్లి చేయాలనుకున్న నేను ఒక కూతురికే ఎకరం పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే అబ్బాయికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల కట్నం ఇవ్వటానికి నేను వెనకడుగు వేయలేదు. కావాలంటే ఉన్న ఇంటిని అమ్మేసి నా రెండో కూతురికి పెళ్లి చేయొచ్చులే అనే ధైర్యంతో భూమినీ అమ్మకానికి పెట్టాను.


కొనటానికి ఎవ్వరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ భూమిని వేరే వాళ్ళు దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం.. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది అన్యాయం అని ఎదురు తిరిగిన పాపానికి మమ్మల్ని ఓ వారం రోజులు స్టేషన్లో వేశారు. నా సొంత భూమిని స్వతంత్రంగా అమ్మే హక్కును కోల్పోయి, కట్నం ఇచ్చి కూతురు పెళ్లి చేయలేక, దానికి తోడు ఆ పోలీస్ స్టేషన్ అవమానాన్ని భరించలేక, మేము నలుగురం పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నం. కానీ నా ఇద్దరూ పిల్లలు, భార్య చనిపోయారు. నేను కొనఊపిరితో ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. స్వేచ్ఛగా చనిపోవడం కూడా ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా నన్ను మళ్లీ బ్రతికించాడు. ఇప్పుడు నాకు ప్రాణం ఉన్న లేనట్టే ఎందుకంటే? నా దగ్గర నా పిల్లలు భార్య లేరు. కాబట్టి నా చావు తర్వాత అయినా నాలాంటి వాళ్లకు న్యాయం జరిగితే చాలు అని కోరుకుంటున్నాను.


యెషయా: నాకు ఒక కూతురు ఒక కొడుకు నేను ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ని. వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించే వాన్ని. నా కొడుకు ఉన్నాడే వీడికి కులాల మతాల గజ్జి కాస్త అంటుకుంది. అందుకోసం ప్రాణాలు ఇచ్చేకైనా తీసేకైనా వెనకాడడు. నా కూతురు ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని. నా కొడుకు కొందరు మతోన్మాదుల మాటలు విని ఆవేశంలో నా కూతుర్ని నా కొడుకు చంపేశాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వాడు కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. చెట్టు అంత కొడుకు కూతురు కళ్ళ ముందర పోయేసరికి మా ఆడది మెల్లగా అనారోగ్యం పాలై చనిపోయింది. అందర్నీ పోగొట్టుకొని ఎవరూ లేని ఏకాకిలా నేను ఉండలేకపోతున్నా. ఆ మతాలకు నిరసనగా ఈరోజు నేను చనిపోతున్నా.


మేము ముగ్గురం ఎలా కలిసాము అనేదే కదా! మీ అనుమానం.. ఒక ధర్మాస్పత్రి దగ్గర కలిసాం!


పేరుకు ధర్మాస్పత్రి అయినా అక్కడ మాత్రం మా రోగుల మీద ధర్మం కనికరం చూపించరు ఏ ఒక్క డాక్టరు. అక్కడే మేము ముగ్గురం కలిసాము. ఒకరికి మరొకరం పరిచయం అయ్యాం. జరిగిన అన్యాయాలను ఒకరితో మరొకరం చెప్పుకునీ కుమిలి కుమిలి ఏడ్చాం. అప్పటినుంచి బాధ ఇంకాస్త ఎక్కువైంది. ఆ బాధను భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాం.


మేము ముగ్గురం మీ దృష్టిలో మూడు మతాలకు చెందిన వారిమైనా మాకు వచ్చిన కష్టంలో నుంచి పుట్టిన నొప్పి మాత్రం ఒక్కటే. మతం పిచ్చికి, స్వేచ్ఛ స్వతంత్రాలకు ఎదురీత ఈదే ధైర్యం లేని పిచ్చి తండ్రులం. అన్యాయాన్ని ఎదిరించలేని పిరికివాళ్ళం.


కాబట్టి కులాల పేరుతో కూనీలు, మతాల పేరుతో మారణ హోమాన్ని సృష్టించవద్దు. ఒక్కరు మరొకరికి అన్యాయం చేయవద్దు అనేదే మా నినాదం. ఒక ఆడబిడ్డలో అమ్మను చూడకపోయినా పర్లేదు.. ఒక అక్కని చెల్లిని లేకపోతే కనీసం ఒక సాటి మనలాంటి ఒక మనిషిగా నైనా గుర్తించండి. ఇదే మా చివరి విన్నపం.


ఇక్కడ చనిపోవడానికి ముఖ్య కారణం. ఈ పాఠశాలలో వందల మంది విద్యార్థులు చదువుతుంటారు. మా కథను వాళ్లకు చెప్పి స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలంటే మాలాగా పిరికితనంతో చనిపోకూడదని చెప్పండి. స్వేచ్ఛ కావాలంటే మొదట గుండె నిండా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేక మేము మా కుటుంబాలను కోల్పోయాము. మీరు మాలాగా కాకుండా మీ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. అన్యాయం అని తెలియగానే ఉక్కు పాదాన్ని మోపండి. గట్టిగా పిడికిళ్లు బిగించి అన్యాయం జరిగినచోట పిడిగుద్దుల వర్షం కురిపించండి. అప్పుడే మీరు స్వేచ్ఛ స్వతంత్రలను పొందుతారు. ఇది భావితరాలకు బాటలు వేసే విద్యార్థులకు తెలియజేయడం కోసం ఈ ప్రదేశం ఎన్నుకున్నాం.


పిల్లలు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం మా మూలంగా కాస్త సమయం పడుతున్నందుకు మమ్మల్ని క్షమిస్తారు కదూ! భగవద్గీత, కురాన్, బైబిల్ ఈ మూడు గ్రంథాలు ఒకటే చెప్పేది? ఒకరు మరొకరికి అన్యాయం చేయవద్దు అని. మేము మూడు మతాలకు చెందిన వారము అందరి దృష్టిలో కానీ మాకు జరిగిన అన్యాయం వలన గుండెల్లో గాయం ఏర్పడింది. ఆ గాయంలో నుంచి పుట్టిన నొప్పి ఒక్కటే? ఈ రక్తపు సింధూరం కూడా ఒక్కటే? ఎరుపు.


ఈ ఎరుపు రక్తాన్ని మీరు ప్రేరేపించకండి. శాంతి వైపు అడుగులు వేయండి. మూసుకుపోయిన న్యాయం కళ్ళు తెరిపించండి. అన్యాయం జరిగిన చోట పిడిగుద్దులు వర్షం కురిపించండి. గాడ్ బ్లెస్స్ యు, శతమానం భవతి, అస్-సలాము అలైకుమ్”



చదవడం పూర్తి కావడంతో అక్కడ అందరికీ కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్ళకు న్యాయం చేస్తారో లేదో! చూద్దాం మరి.


మదన్ కుమార్ తన కన్నీళ్ళను తుడుచుకుంటూ,"సలీం, జోసెఫ్, రామాచారి, వీళ్లకు జరిగిన అన్యాయం వివరాలు మరో అరగంటలో నా ముందు ఉండాలి. దానికోసం ఏం చేస్తారో? ఎలా చేస్తారో? నాకు తెలియదు. అలాగే వెంటనే ఈ విషయాన్ని న్యూస్ ఛానల్ వారికి చెప్పండి. త్వరగా వెళ్లండి" అని దబాయించి. ఆ లెటర్ ని భద్రంగా తన కాకి చొక్కా జోబులో పెట్టుకుంటూ"రామకృష్ణ నువ్వు వెళ్లి ఆ ప్రేమ వివాహం చేసుకుని భార్యను పోగొట్టుకున్న వాళ్ల వివరాలు కనుక్కో? అవసరమైతే కోర్టు దగ్గరికి పీల్చుకురా?" అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.



ఎస్సై గారు సిఐ గారి దగ్గరికి ఆ లెటర్ తీసుకొని వెళ్లేసరికి అప్పటికే న్యూస్ బాగా వైరల్ అవుతున్నది.

ఇది నిజం కాదు కట్టుకథ అని. అక్కడ మదన్ కుమార్ ఆ ముగ్గురు వ్యక్తులు రాసిన లెటర్ చూపించి నెత్తి నోరు కొట్టుకుని ఇది నిజమని చెప్పినా. ఇది కల్పిత కథని తేల్చేశాడు ఆ సీఐ. దానికి తోడు బహుమానం సస్పెండ్ ఆర్డర్ చేశాడు.



అక్కడి నుంచి మౌనంగా వెనుతిరిగి కోర్టు మెట్లమీద కూర్చుని. నా చేతుల్లో అన్నీ ఉండి ఏమీ చేయలేని దద్దమ్మను నేను అని బాధపడుతుండగా కానిస్టేబుల్స్ ముగ్గురూ అక్కడికి వచ్చి "అన్ని వివరాలు తెలిసాయి సార్" అని పూర్తి వివరాలను వివరించి చెప్పారు ఎస్సై గారికి.


"ఈ వివరాలను కోర్టులో సబ్మిట్ చేస్తే ఏ న్యాయము జరగదు? ఈ అన్యాయం దేశము మొత్తం చూడాలి? వెంటనే ఫ్రెష్ వాళ్లకు ఫోన్ చేయండి? ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి? అసలే మతాలవారు నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని కాస్త అర్థమయ్యేలా చెప్పండి?" అన్నారు.


"రామకృష్ణ ఎక్కడ?”

“ ఇంకా రాలేదు సార్ వచ్చేస్తాడు." అన్నారు కానిస్టేబుల్స్ ముగ్గురూ. హుటా హుటిన ఈ విషయాన్ని మొత్తం చేరివేశారు ఆ కానిస్టేబుల్స్.


ఫోన్ చేయగానే ఫ్రెష్ వాళ్ళందరూ హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. చాలామంది విలేఖరులు వచ్చారు. ప్రజలు కూడా వాళ్లు చేస్తున్న విధ్వంశాలను ఆపి ఇక్కడ ఏం జరుగుతుందని ఆసక్తిగా టీవీలు ఎదురుగా కూర్చున్నారు.


ఎస్ ఐ మదన్ కుమార్ గారు మైక్స్ ఎదురుగా కూర్చుని"నాది కట్టుకథని కొట్టిపారేస్తున్నారు. మీరు అసలు మనుషులేనా? మీకు జాలి దయ ఉన్నాయా?" అన్నారు కాస్త కోపంగా...



ఆ గుంపులో ఒక విలేఖరి"ఆధారాలు చూపించాలి కదా! సార్" అన్నారు.


"ఆ ఇదే ఇంకా అడగలేదు అనుకుంటున్నా ఆధారాలు చూపిస్తా? అందరి లెక్కలు తేలుస్తా?


"ఏంటి ఆ లెక్కలు సార్" అన్నారు మరొక విలేఖరి వ్యంగంగా.


మీరు మారరు అని తన మనసులో అనుకుని."అత్తర్ కూతురు కాలేజీకి వెళ్లి హాస్టల్ కి వస్తుండగా మన టౌన్ సిఐ కొడుకు మానభంగం చేసి చంపేశాడు. సిఐ కొడుకు కావడం వలన ఇంతవరకు ఆ కేసు బయటకు రాలేదు? ఆ అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ల నాన్నకు ఏ న్యాయము జరగక మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు కూడా తిరస్కరించారు? అట్లీస్ట్ పేపర్ కైనా వేశారా? లేదే? అదే! బాగా బలిసిన వాడి కూతురుకి జరిగుంటే? ఆరోజు మొత్తం వేసింది వేసి, చెప్పిందే పదేపదే చెప్పి బాగా డబ్బులు గుంజి మీ ఛానల్ రేటింగ్స్ పెంచుకుంటారు. ప్రజలు కూడా అలాంటి వాటిని బాగా చూస్తారు. అదే! ఏమీ లేని ఒక అనామకుడి న్యూస్ అయితే ఇంత వైరల్ చేస్తారా చెప్పండి?" అన్నారు గట్టిగా ఎస్ ఐ గారు.


ఎస్ఐ గారు మాటలకు విలేఖరులు నోరు మెదపలేదు.


"ముగ్గురు జీవితాలు కాదు చిన్నా బిన్నమైండేది మూడు కుటుంబాలు. మొత్తం పదిమంది జీవితాలు ఈ స్వేచ్ఛ భారతామనిలో జీవించే ధైర్యం లేక బలి అయ్యుండేది?. మరెందరో ఇలాంటివారు గుండె నిబ్బరంతో బ్రతుకులు ఎల్లిదుతున్నారు. లేదంటే ఈపాటికి ఈ దేశానికి స్వాతంత్రం ఉన్న ఎన్నో! ప్రాణాలను కోల్పోయి ఉండేది?"


"మన తాహాసిల్దార్ కార్యాలయం అధికారి ఒక్కరు డబ్బుకు లోబడి రంగయ్య కు ఉన్న ఎకరం పొలాన్ని వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయిస్తే, కూతుళ్లకు పెళ్లి చేయలేక చీడల మీద ప్రయోగించే పురుగుల మందు తాగి చనిపోయారు. ఆ పురుగుల మందు ఈ దేశానికి పట్టిపీడిస్తున్న కులం మతం అన్యాయం అధర్మాల మీద పిచికారి చేయాలి. అప్పుడు ఈ దేశానికి పట్టిన దరిద్రం కొంతైనా వదులుతుంది." అన్నారు ఆవేశంగా ఎస్సై గారు.


రామకృష్ణ అప్పటికే ఆ ముస్లిం కుటుంబాన్ని తీసుకువచ్చి పక్కనే నుంచున్నాడు."వాళ్ళని ఇక్కడ పీల్చుకురా" అన్నారు ఎస్ఐ మదన్ కుమార్ గారు


బలవంతంగా పిచ్చితో ఊగిపోతున్న యువకున్ని భుజాలు పట్టుకుని, తీసుకొని వచ్చి నిల్చున్నారు అతని అమ్మానాన్నలు. మతం పేరుతో భార్యను తన కళ్ళముందరే బలి చేయడం చూసి అతనికి పిచ్చి పట్టింది అన్న విషయం క్షణాల్లో తెలుసుకొని ఎస్ఐ గారు మళ్లీ చెప్పడం మొదలెట్టాడు.


ఇతన్ని చూడండి క్రైస్తవ మతం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇలా పిచ్చోడిలా తయారయ్యాడు.


యెషయా కొడుకుని కులం పేరుతో మతం పేరుతో కొందరు మతోన్మాదులు రెచ్చగొట్టడంతో ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నయ్య ఆమెని చంపి, తను కూడా చనిపోయాడు. అప్పటినుంచి ప్రేమించిన అమ్మాయి మతం కోరలకు బలి కావడంతో ఇలా పిచ్చోడై మన అందరి ముందు నుంచున్నాడు.


చెప్పండమ్మా మీరైనా ఈ మతాల మధ్యమంట కాస్తయినా చల్లారుతుందేమో!? అన్నారు ఎస్ఐ గారు.


ఆ తల్లి పొంగి వస్తున్న దుఃఖంతో కులం పేరుతో మతం పేరుతో గజ్జి పట్టి గీక్కుంటున్నారు కొందరు. ఆ గజ్జిని కాస్త మిగతా వారికి కూడా అంటిస్తున్నారు. భగవద్గీత, కురాన్, బైబిల్ ఈ మూడు గ్రంథాలు ఒక్కటే చెప్పేది? మనసులందరూ ఒక్కటే అని. కానీ వారి మనస్సులు విభిన్న రకాలు ఉంటాయి. అందుకే ఇలా మతాల పేరుతో మారణ హోమాన్ని సృష్టిస్తుండేది. అందరి మనస్సు ఒకే తాటిపైకి వచ్చిన రోజు ఆంగ్లేయులు మీద తిరగబడి ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకున్నట్టు, తన మనస్సును తాను గెలిచిన రోజు ఈ దేశానికి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి. అప్పుడు ప్రజలు సంతోషంగా జీవిస్తారు అని చెప్పి ముగించారు.


గట్టిగా ఒకసారి ఎస్ఐ మదన్ కుమార్ గారు"ఎనీ డౌట్స్ ఇంకేమైనా ఆధారాలు కావాలా!" అన్నారు.


ఆ మాటలకు విలేఖరులు అందరూ సిగ్గుతో తలదించుకున్నారు.


“ఎంతోమంది అమరవీరుల రక్తసింధూరంను నుదుటన తిలకం దిద్దుకుని 1947 ఆగస్టు 15th రోజున ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని తెచ్చారు. ఈ రోజుటికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మూసుకుపోయిన మన కళ్ళు తెరుద్దాం. దేశంలో నివసించే ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ప్రాణాలర్పించిన ఈ ముగ్గురు అమరవీరుల రక్తపు సింధూరాన్ని నుదుటన తిలకం దిద్దుకుని ఇప్పటినుంచి సత్యమే భగవంతుడు అని నమ్మి, మన అందరిదీ ఒకటే కులం, ఒకటే మతం అని భావితరాలకు చాటి చెబుదాం. అన్యాయాన్ని అధర్మాన్ని అరికడదాం. స్వేచ్ఛ స్వాతంత్రాలతో దేశమే కాదు దేశంలో నివసించే మనము కూడా జీవిద్దాం” అని గట్టిగా అరిచి చెప్పాడు.


విలేఖరులు అందరూ లేచి గట్టిగా క్లాప్స్ కొట్టారు.


మదన్ కుమార్ తన ఖాకీ చొక్కా లోని లెటర్ తీసి, “ఈ లెటర్ ఆ ముగ్గురు అమరవీరులు రాసింది” అని అందరికీ చూపించి “ఇది ఆ స్కూల్లో చదివే పిల్లలు చదివితే చాలు అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు అమరవీరులు రాసిన ఈ లెటర్ దేశం మొత్తం చదవాలి. మీ అందరి పేపర్లలో ముద్రించండి అని లెటర్ ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయారు ఎస్ఐ మదన్ కుమార్ గారు.


మదన్ కుమార్ గారు ఆ సీఐ కొడుకుని, తాహాసిల్దార్ అధికారిని, మరియు రంగయ్య భూమిని తాహాసిల్దార్ అండతో దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూస్వామిని అరెస్ట్ చేసి కారాగారాల్లోకి నెట్టారు.


జరిగిన దానికి సిఐ కూడా సిగ్గుపడి, మదన్ కుమార్ కు క్షమాపణ చెప్పి, తన జాబును తిరిగి తనకి ఇచ్చాడు.


సమాప్తం

C. జగపతి బాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: C. జగపతి బాబు

కథలు రాయడం అన్నా, చదవడం అన్నా నాకు చాలా చాలా ఇష్టం. కొన్ని కారణాలవల్ల ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసి ప్రస్తుతం ఫార్మర్ గా కొనసాగుతున్నాను. ఈ వేదిక ద్వారా నా టాలెంట్ ఏంటో నలుగురికి తెలియాలని, అలాగే సమాజానికి ఉపయోగపడే కథలు మరెన్నో వ్రాయాలని తపిస్తున్నాను.




23 views0 comments

Comments


bottom of page