E - తరం అమ్మాయి

E - Tharam Ammayi - Telugu Inspirational Story | Undavilli M
E - తరం అమ్మాయి - తెలుగు ప్రేరణాత్మక కథ | ఉండవిల్లి.ఎమ్
Published In manatelugukathalu.com On 05/10/2026
ప్రేమలో నమ్మకం అవసరమే; కానీ కొత్త పరిచయాల్లో వ్యక్తిగత భద్రత, హద్దులు, ఎదుటివారి ప్రవర్తనను గమనించడం కూడా అంతే ముఖ్యం.
నేను డ్యూటీ లోంచి బయటపడి, ఆటో కోసం నిలబడ్డాను. ఈ పాటికే మోహిత్ పార్క్ కి వచ్చేసుంటాడు. నా మనసు ఉవ్విళ్లూరిపోతోంది. సోషల్ నెట్ వర్క్స్ లో, తెలుగు మ్యాట్రిమోనీలో కలిశాడితను. అతని ప్రొఫైల్ చూసాక, కొంచెం బావున్నట్టనిపించి మేసేజ్ లు, ఈ మెయిల్ అయ్యాక ఇద్దరం తరచూ కలుస్తున్నాం.
కానీ, నా ఫ్రెండ్ రుద్రాని విషయంలోనూ, రోజూ పేపర్లలోను చూసాక, ఈ నెట్వర్క్స్ లో ఎవర్నీ సులువుగా నమ్మేయకూడదనిపించింది. మన వివరాలన్నీ అవతలి వారితో చెప్పేసి, తీరా అవతలి వ్యక్తి సరైన వాడు కాకపోతే అబాసి పాలవడం, అందుకనే అసలు విషయాలు దాచి, ఇతన్ని అబ్జర్వేషన్లో ఉంచాను. ఇంతలో ఆటోలో పార్కుకి చేరిపోయాను. దూరంగా మోహిత్ కనిపించాడు. పార్కులో కూర్చుని రోడ్డు వైపు నారాక కోసం చూపుల్ని పడేసాడు. అతన్ని చూసి నవ్వాను. నవ్వితే నా పలువరుస అందంగా చీకట్లో వెన్నెల్లా ఉంటుందంటాడు. "సారీ, లేటయ్యింది"అన్నాను.
"టైం అనుకున్నాకా, సమయానికి వచ్చేయాలి, లేదా ముందే చెప్పేయాలి"మోహిత్ అన్నాడు.
నాకేం చెప్పాలో తెలియలేదు. ఆలస్యంగా వచ్చిన మాట నిజమే"మా బాస్ పని ఎక్కువ ఇవ్వడం వల్ల లేటయ్యింది మోహిత్"అన్నాను.
"మీ బాస్ కి పెళ్ళయిందా!?వయసు ఎంత!?"మోహిత్ అడిగాడు.
"తెలియదు మోహిత్, నేనెప్పుడూ ఆ విషయాలు అడగలేదు. నీ వయసు ఉండొచ్చు"చెప్పాను.
"రేపు వీకెండ్ కదా, ఫస్ట్ షో సినిమాకొస్తావా!?"మోహిత్ అడిగాడు.
"సారీ నేను రాను, చాలా లేటవుతుంది"అన్నాను.
"ఆఫీస్ లో వర్కు అయితే లేటైన చెయ్యవా"అంటూ వేగంగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నేను కూడా అంతే వేగంగా అతని కళ్ళలోకి చూసి"పెళ్లి కాకుండా సినిమాలు అవి నాకిష్టం ఉండదు, పార్కు వరకు వచ్చి, కొంత సేపు మాట్లాడటం వరకు నో ప్రాబ్లెమ్"అన్నాను.
"ఉడ్ బి నే కదా, ప్రాబ్లెమ్ ఏమిటి!?"మోహిత్ ముఖం చిట్లిస్తూ అడిగాడు.
" అవును పెళ్ళైతే నేను నీ దాన్నే కదా, బట్ అప్పటి వరకు ఈ సాంప్రదాయాలు పాటించాలి కదా మోహిత్, మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ ప్లీజ్... "అన్నాను. కొంచెం కూల్ అయ్యాడు.
"సరే, రేపు తాజ్ హోటల్లో డిన్నర్ కి వస్తావా కనీసం!"మోహిత్ అడిగాడు.
"సారీ మోహిత్ లంచ్ కైతే వస్తాను"అన్నాను
"సరే, లంచ్ కి రా"అని చెప్పేసి వెళ్ళిపోయాడు మోహిత్. అతని వెంటే నేనూ వెళ్ళిపోయాను.
మర్నాడు౼
తాజ్ హోటల్లో లంచ్ చేసాం, అక్కడ కొంత సమయం గడిపాక, పార్కుకి వెళ్ళాం. "నీ ఇష్టాలు ఏమిటి?మోహిత్ అడిగాడు. ఇంతలో నా మొబైల్ మోగింది. నా కొలీగ్ తో మాట్లాడి పెట్టేసాక, "నాకు సరదాగా నవ్వుతూ ఉండటం ఇష్టం"అన్నాను. మోహిత్ నా మొబైల్ ని మొబైల్ బాగుంది అంటూ తీసుకుని, అన్నీ చెక్ చేస్తూ"అయితే నన్ను నవ్వించ మంటావా"అని అడిగాడు.
"నవ్వించు మోహిత్"అతన్ని చూస్తూ చెప్పాను.
"నాకు నవ్వడం, నవ్వించడం చిరాగ్గా ఉంటుంది"మోహిత్ చెప్పాడు.
"ఏంటలా సీరియస్. సరే, ఎవరైనా అమ్మాయి సడన్ గా వచ్చి, నీ చెంప చెల్ మనిపిస్తే తిరిగి ఏం చేస్తావ్!?అన్నాను.
"కోపంగా చూస్తూ రెండు పీకుతా గట్టిగా "అన్నాడు మోహిత్. నేను అతని ఫేస్ ని కెమెరాలో బంధించి, మళ్ళీ అతనికే చూపించాను. మోహిత్ ముఖం అదోలా పెట్టాడు. అస్తమానూ మూడ్ చేంజ్ అయిపోతూ కనిపిస్తాడు. ఇష్టపడ్డాక, ప్రేమన్నాక, సరదాలు, నవ్వడాలు, ఒకరికొకరం అనురాగంతో చూసుకోవడాలు, ఇవేవీ లేని యాంత్రికతతో, కృత్రిమ మాటల జీవన విధానం అతనిది.
అతను స్పష్టంగా అర్ధం కాలేదు. ఏదో సీరియస్ నెస్ అతనిలో కన్పించి, "ఓకే మోహిత్, నాక్కొంచెం పనుంది, రేపు కలుద్దాం"అన్నాను.
"ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి, ఒకోసారి ఎంగేజ్ వస్తుంది. ఎవరితో అంత సేపు మాట్లాడతావ్"మోహిత్ అడిగాడు.
"నువ్వెప్పుడు చేశావ్, కొలీగ్స్ అయ్యుంటుంది"అన్నాను.
"సరే వెళ్ళు"అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నేను బయట పడ్డాను.
౼౼౼
రోజూ సాయంత్రం ఆఫీస్ కి వచ్చి, నన్ను పికప్ చేసుకుని, మళ్ళీ పార్కు నుండి రూమ్ కి డ్రాప్ చేస్తానని కాల్ చేసాడు మోహిత్.
దానికి నేను ఒప్పుకోలేదు. ఆఫీసులో అందరూ చూస్తారని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నా కొలీగ్స్ ఇంట్లో చెప్పేస్తారని, కొన్ని రోజులు ఆగి ఇంట్లో చెప్పాక, అలాగే చేద్దాం, దేనికైనా సమయం రావాలి, అనుకూలించాలి కదా అన్నాను.
మోహిత్ ప్రవర్తన నాపై అజమాయిషీ చేసేలా ఉంటుంది. ఖచ్చితమైన నా మాటలు కాదనలేక మౌనం దాల్చాడు. రోజూ అతన్ని కలుస్తూనే ఉన్నా, సూక్ష్మంగా పరిశీలిస్తే అతనిలో మరోకోణం కనబడుతుంది. నేను ఆలస్యంగా వస్తే అన్నిటినీ ఆరా తీస్తాడు. నా కొలీగ్స్ వివరాలన్నీ అడుగుతాడు. ఎవరైనా నా వైపు చూస్తే, వాళ్ళని అనుమానంగా గుచ్చిగుచ్చి చూస్తాడు.
మొదట్లో ఇలాంటి ప్రవర్తన బావున్నట్టే ఉంటుంది. రాను రాను అవి చాలా అసహ్యంగా మారిపోతుంటాయి. పెళ్లయ్యాక ఇంకా మారిపోయి, జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. జీవిత కాలం వేగాలంటే కష్టం, విడిపోయే పరిస్థితి శీఘ్రంగా వచ్చేస్తుంది. ఈ ఆలోచన్లతో నా నుదుట చెమటలు పట్టేసాయి. అయినా, నేను అన్నీ తెలుసుకున్న మీదట, నెట్ లో జరిగే విషయాలు చాలా స్టడీ చేశాక కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను.
అన్ని రకాలుగా అతన్ని అబ్జర్వ్ చేశాక, అతనితో దూరంగా ఉండి, వెనక్కి తగ్గే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. మోహిత్ ఫోన్ చేస్తున్నపుడు మా ఊరు అనంతపూర్ వెళ్లానని, ఆఫీసులో వర్కు బిజీ అని రకరాలుగా కారణాలు చెప్పే కొలదీ అతనిలో కోపం, పంతం పెరిగిపోతున్నాయి. ఒకరకమైన సైకోలా మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని చెప్పినా, ఏదొక రోజు అతనితో ప్రమాదం వచ్చే పరిస్థితి సుచాయగా అర్ధమవుతుంది.
నేను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి, నా ఫోటో అతని మొబైల్ లో లేకుండా, ఎప్పటి కప్పుడు జాగ్రత్త పడ్డాను. నా మొబైల్ నంబరు ఒక్కటే అతని దగ్గర ఉంది. ఆ నంబరు విషయంలో రోహిణి చేసిన సహాయానికి, నేను మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
కొన్ని రోజులు అలా గడచిపోయాక, నేను అతన్ని దూరం పెట్టాననే విషయం రూడీ అయ్యాక, చిన్న చిన్నగా బెదిరింపులు, బ్లాక్ మెయిలింగులు మొదలు పెట్టాడు మోహిత్.
ఓరోజు రాత్రి నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఇలాంటి వాటి నుండి నాకు ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అవసరం అయితే అతనికి ఓ పాఠం చెప్పడానికి రెడీ గా ఉన్నాను.
మోహిత్ కాల్ చేసి నిలదీసి అడిగాడు. అతని మానసిక ప్రవర్తనని అతనితో సూటిగా చెప్పేసి, నేను నిన్ను ఇష్టపడలేనని అంటే, అతనిలో కలిగే మార్పులు నన్ను పెకళించేలా ఉంటాయి. ఇలాంటి వారి నుండి నిశ్శబ్దంగా తప్పుకు పోవడమే మంచిదనిపించింది. అందుకే నసుగుతూ "అయ్యో, వర్కు బిజీ ఉండటం మూలానా... "అన్నాను.
"నిజం చెప్పు, నన్ను వదిలెయ్యాలని కదూ!"అన్నాడు మోహిత్.
"అదేం లేదు"అన్నాను మెల్లగా.
"మరి... !?"అన్నాడు.
"మరీ... !!!"అన్నాను.
"ఊ... చెప్పు... "
"మా ఆఫీసులో సునీల్ అని ఒకతను, ప్రేమించమని తినేస్తున్నాడు. మనిద్దరిని చాలా సార్లు చూసాడట, ఇద్దరం కల్సి కనబడితే, నీ బాయ్ ఫ్రెండ్ కాళ్ళు విరగ్గొడతాను అని బెదిరించాడు. భయమేసి, నీకేమైనా అవుతుందని తగ్గించేసాను" అన్నాను కంగారుగా వణుకుతూ.
"ఎవరు వాడు, వాడి సంగతి చూస్తాను. ఎక్కడుంటాడు!?"మోహిత్ అడిగాడు.
"ఆదివారం సాయంత్రం వివేకానంద పార్కుకి రమ్మని వార్నింగ్ ఇచ్చాడు"మోహిత్ తో చెప్పాను.
"సరే రాని, ఆ టైంకి ఫ్రెండ్స్ తో నేనూ వస్తాను. నువ్వూ వచ్చెయ్, వాడి సంగతి తేలుస్తాను"మోహిత్ అన్నాడు.
"అమ్మో!వాడి దగ్గర రాడ్స్ ఉంటాయి" అన్నాను.
"మా దగ్గరా ఉంటాయి, భయపడేది లేదు"మోహిత్ అన్నాడు.
"అలాగే వచ్చేస్తాను"
"ఓకే"అంటూ కాల్ కట్ అయింది.
నేను బాగా ఆలోచించాను. ఇక నేను ఇక్కడ ఉండటం వల్ల చాలా ఇరుకున పడటమే కాకుండా, జీవితం నాశనమవుతుంది.
ఒక వ్యక్తిని పూర్తిగా చదివి, అవగాహన కలిగాక అన్ని విషయాలు పెద్దలతో చెప్పి, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సరైన వ్యక్తి కాకపోతే, అతన్నుంచి తప్పుకునేలా ముందే పధకం వేసుకోవడం వల్ల ఇప్పుడు తనకి ఈసీగా ఉంది.
మోహిత్ తో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినని చెప్పాను. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాననే విషయం చెప్పలేదు. తన ఊరు విశాఖపట్నానికి బదులు అనంతపూర్ అని చెప్పాను. నా పేరు కూడా మార్చి చెప్పాను. మోహిత్ కి ఇచ్చిన నంబరు కూడా, నా ఫ్రెండ్ కి దొరికిన సిమ్. అది డెడ్ అయిపోకుండా మెయింటెన్ చేస్తూ, నాకిచ్చింది. "ఒక వ్యక్తిలోని ప్రేమ నిజమని తెలిసి, అతని బుద్ధి మంచిదైతే, నీ అసలు నంబరు ఇచ్చేసుకో"అని చెప్పింది. అచ్చు గుద్దినట్టు నేను అలాగే పాటించాను.
నేను మాఊరు వెళ్లిపోయే ఉద్దేశ్యంతో ఉన్నాను. కాలేజీలో ఉద్యోగం రిజైన్ చేసేసాను. అపార్టుమెంట్ ఫ్లాటులో ముగ్గురం కల్సి ఉంటున్నాం. నేను నా సామాన్లు సర్దుకుని ప్యాక్ చేసేసాను.
మోహిత్ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడిన మాటలు, సీరియస్ ఫేస్ తో ఉన్నప్పుడు తీసిన అతని ఫోటోలు పెన్ డ్రైవ్ లో రికార్డ్ చేసి, ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి వివేకానంద పార్కు లోపలికి కొంతమంది ఫ్రెండ్స్ తో వచ్చి, నన్ను బలవంతంగా ఏదో చెయ్యాలని అక్కడికి రమ్మన్నాడు. దయచేసి ఆరోజు నన్ను కాపాడండి అంటూ రికార్డ్ చేసి, రిజిస్టర్ పోస్ట్ లో పెన్ డ్రైవ్ ని పార్కు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి పంపి, నా మొబైల్ సిమ్ తీసిపారేసి, చక్కా వైజాగ్ వెళ్లే బస్ ఎక్కేసాను.
సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని, అతిచేష్టలతో, మానసిక సత్ర్పవర్తన లేని ఇలాంటి వాడిని;ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి పోలీసులు వెళ్లి, ఫ్రెండ్స్ తో ఉండే మోహిత్ ని పట్టుకుని, స్టేషన్ కి తీసుకెళ్లి గట్టిగా బుద్ధిచెబుతారు. ఈ విషయం అస్తమానూ జ్ఞాపకమొచ్చి, నాకు నవ్వొచ్చి మరోసారి నాకు నేనే అభినందించుకున్నాను.
౼
(ఈ కధ మన తెలంగాణ దిన పత్రిక ఆదివారం దునియాలో 26 ఆగస్టు 2018 న ప్రచురింపబడింది)
౼ఉండవిల్లి. ఎమ్
సమాప్తం.
౼౼౼౼౼
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్
ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి.
'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.
నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి.
అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం!




Comments