మనమంతా ఒక్కటే !!!

Manamanthaa Okkate!!! - Telugu Family Story | Kotthapalli Udayababu
మనమంతా ఒక్కటే !!! - తెలుగు కుటుంబ కథ | కొత్తపల్లి ఉదయబాబు
Published in manatelugukathalu.com on 24/11/2026
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతలు విడిపోవని చాటిచెప్పే స్ఫూర్తిదాయక కథ ‘మనమంతా ఒక్కటే!!!’. విద్యను సమాజానికి ఉపయోగపడేలా మలచుకోవాలనే కవిత ఆలోచన ఈ కథకు ప్రధాన బలం.
బార్లా తెరచిన కిటికీలోంచి లేడిని గురిచూసి కొట్టిన బాణంలాంటి కిరణాలు నేరుగా కనురెప్పలపై పొడిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది కవిత.
ఒక్కసారిగా వెలుగు భరించలేక కళ్ళకు, రెండు డజన్ల గాజుల ఖాళీల్లోంచి కనిపిస్తున్న రంగోలి నిండుగా పెట్టుకున్న ముంజేతిని కళ్ళకడ్డుపెట్టుకుంది.
నెమ్మదిగా ముంజేతిని కొద్దికొద్దిగా కళ్ళ మీదనుంచి పైకి జరుపుకుంటూ ఆ వెలుతురుకు కళ్ళను అలవాటు చేసి, ‘కరాగ్రే వసతే లక్ష్మీ…’ శ్లోకాన్ని పఠించుకుని రెండు చేతులు కళ్ళకద్దుకుంది.
తన పుట్టింట్లో అయితే మేడ మీద తన గదిలోంచి బయటకు వచ్చి ఎదురుగా తూర్పున ఉదయిస్తున్న ప్రత్యక్ష నారాయణుడికి నమస్కారం చేసుకునేది.
నాలుగు రోజుల క్రితం కాపురానికి అత్తవారింటికి వచ్చేసింది తానని, కోపం వచ్చిందో ఏమిటో నేరుగా ఈవేళ గదిలోకే వచ్చేశాడు సూరీడు.
తన ఆలోచనకు తానే నవ్వుకుంది కవిత. మంచం మీద నుంచే సూర్యభగవానుడికి నమస్కరించుకుని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది.
ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. రాత్రి భర్త మరీ రెచ్చిపోయాడు. అయితేనేం? చదువుకున్నవాడు కనుక తన అభిప్రాయాలకు, భావాలకు విలువనిస్తూ తనను గెలుచుకున్నాడు.
భార్యకు అంతకన్న కావలసింది ఏముంది?
గదిలో ఎవరూ లేకపోయినా సిగ్గు బరువుతో ఆమె తల వాలిపోయింది.
అంతలో వేసి ఉన్న గది తలుపుల అవతల మాటలు వినిపించాయి.
"ఏందిరా? నీ పెండ్లాము ఇంకా నిద్ర లేవలేదా?" "లేచినాదవ్వా! అయిదింటికే! కొత్త ప్రదేశం కదా! సీకట్ల సరిగా తెల్వదని నేనే పండబెట్టా!" అనిల్ అంటున్నాడు.
అప్పుడు వెంటనే తలెత్తి టైం చూసింది. టైం ఉదయం ఏడూ పది నిముషాలు. గబగబా మంచం దిగి బట్టలు సర్దుకుని, చెదిరిన జుట్టును సరిచేసుకుంది. అంతలో తలుపులు తోసుకుని అనిల్ లోపలకు వచ్చి తలుపు నొక్కేశాడు.
అయినా తలుపుల ఆవల అవ్వ, "పెండ్లయి నాల్గుదినాలు కాలేదు. పెండ్లాన్ని కొంగట్టు తిరుగుతుండాడు. పిదపకాలం. మా రోజుల్లో మొగడంటే గడగడలాడేటోళ్ళం," అనేసి వెళ్ళిపోయినట్టు అలికిడి.
అనిల్ ఆ మాటలకు కవిత కేసి చూశాడు. "తప్పు నాదా!" అడిగింది కవిత.
ఆమెను అమాంతం చుట్టేసుకుని, "కాదు! మన యిద్దరిదీ! అమ్మ కూడా అడిగింది.
అమ్మ పూజ కూడా అయిపోనాది. 'రేపట్నుంచి నేనే పూజ చేస్తాను – ఉదయమే లేచి' అని సెప్పు," అన్నాడు కౌగిలి బిగిస్తూ.
"నువ్వొదిలేస్తే వెళ్ళి చెబుతాను," అంది కవిత అతని బుగ్గ మీద చిటికేసి.
"కాఫీతో పాటు నా బహుమతి కూడా నాకివ్వాలి!" అన్నాడు తను చిలిపిగా.
"అలాగే!" అని అతన్ని సున్నితంగా విడిపించుకుని గదిలోంచి వెళ్ళిపోయింది కవిత.
నేరుగా ఫ్రెష్ అయి కిచెన్‌లోకి వచ్చింది కవిత.
అత్తగారు కాఫీ కలుపుతూనే, టిఫిన్ చేయడం కోసం బాణలి రెండవ పొయ్యి ఎక్కించింది.
అలికిడి విని, "వచ్చినావా! కాఫీ పట్టుకెళ్ళి నీ మావకిచ్చిరా! తొందరగా! యిట్టున్నట్టు రావాలే!" అంటూ కాఫీ గ్లాసు కోడలికి అందించింది.
"మావ ఎక్కడున్నారు?" అడిగింది కవిత."ఈది అరుగుమీద పేపరు సదువుతుండాడు. ఎల్లు. బేగిరావాలె!" తొందరచేసింది అత్త భద్రకాళి.
రెండు నిమిషాలలో మావగారికి కాఫీయిచ్చి తిరిగి వచ్చింది కవిత. అప్పటికే ఉప్మా తాలింపు వేసి, నీళ్ళుపోసి, ఉప్పువేసి మూతపెట్టింది భద్రకాళి.
"ఇదిగో! నీ పెనిమిటికి కూడా కాఫీ యిచ్చి రా! యీడ నువ్వూ నేను తాగుదాం! మన ఇండ్ల పనోళ్ళు ఉండరు.
మన పనులు మనమే సేసుకోవాల! మగోడు రాజులా బయటకెల్లి సంపాదించుకొస్తాడు.
ఆళ్ళు అలసిపోయొచ్చేసరికి మనం అన్నీ అమర్చి, మనం గూడ రెడీగుండాల! అట్టుండకపోతే ఆడు బయటకెల్లి ఎవత్తినో తగులుకుంటడు. మన బతుకు మొదలు కోసిన బీరపాదైపోద్ది.
అర్థమైందా?" విడమర్చి విద్యార్థికి బోధిస్తున్న ఉపాధ్యాయినిలా చెప్పింది భద్రకాళి.
"అర్థమైందత్తా!" అని కాఫీ తీసుకుని భర్త ఉన్న గది తలుపు కొట్టింది కవిత!
కాఫీతో పాటు దాన్ని అందించిన చేతిని కూడా లోపలకు లాక్కోబోయాడు అనిల్.
"రాత్రికి! అన్నీ! అత్త ఉన్నపాటున వేగిరం రమ్మంది అనిల్!" అని కిచెన్ వైపు పరుగెత్తింది కవిత.
విజయవాడ మార్కెట్ యార్డ్‌లో చేపలు, రొయ్యల దిగుమతి వ్యాపార కాంట్రాక్టర్ శంకర్ యాదవ్ ఒక్కగానొక్క కూతురు కవిత. ఎం.బి.ఎ చేసింది. తల్లి జయప్రద ఆ రోజుల్లోనే ఎం.ఎ చదివింది. "ఉద్యోగం చేస్తానండి!" అని శంకర్‌ని కోరింది.
శంకర్ ఆమెను 'అవసరమా!' అని ప్రశ్నించాడు."ఎంతోమంది ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అదో సరదా ముచ్చట. నేనూ చేస్తానండీ!" అంది గారంగా.
అప్పటికే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆయన గతించిన వెంటనే వ్యాపారం అందిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు తెచ్చుకున్న శంకర్ కోటీశ్వరుడు.
వ్యాపారంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చిరునవ్వు పెదవుల మీద చెదరనీయకుండా తన చిన్నతనంలో తనకు, తన తోబుట్టువులకు కడుపునిండా అన్నం పెట్టి, రెండురోజులకోసారి భోజనం చేసి తమకు జీవితాన్నిచ్చిన కన్న తల్లిదండ్రులంటే శంకర్ యాదవ్‌కు అవ్యాజమైన భక్తి.
ఆ రోజుల్లోనే అర్ధాకలి పస్తులతో ఏళ్ళకాలం గడిపిన తల్లికి టి.బి సోకి వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఆమెను పోగొట్టుకున్ననాడు తన తండ్రి ఎంతగా... ఎంతగా విలపించాడో తనకు తెలుసు.
కూలివాడిగా చేరి, యజమాని నమ్మకం సంపాదించి మార్కెట్ యార్డులో అందరితోనూ తలలో నాలుకగా మసలి యజమాని అండదండలతో చిన్న కాంట్రాక్టరుగా ప్రవేశించి కోటీశ్వరుని స్థాయికి ఎదిగిన తండ్రి అనితర సాధ్య జీవితం శంకర్ యాదవ్‌కు నిత్యభగవద్గీత.
తండ్రి చనిపోతూ, "నాన్నా! ఓర్పు, సహనం, చిరునవ్వు, ధైర్యం—ఈ నాలుగు ఎప్పుడూ కోల్పోకు. అదే నీకు దుర్గమ్మ తల్లి భిక్ష-రక్ష!" అన్న మాటలు అతని పాలిట నాలుగు వేదాలు.
అందుకే ఉద్యోగం చేస్తానన్న భార్యను రాత్రివేళ పడకగదిలో అనునయిస్తూ, "జయా! అవసరం, కొత్త విషయాన్ని ఆవిష్కరించడానికి తల్లివంటిది అన్నారు పెద్దలు.
నువ్వు చేద్దామనుకున్న ఉద్యోగం ఒక వ్యక్తికి జీవనోపాధి అవుతుంది. దానివల్ల ఆ కుటుంబ సభ్యులు సుఖంగా బ్రతుకుతారు.
స్త్రీకి విద్య చాలా అవసరం. అయితే అవసరం లేకపోయినా డబ్బున్న ఎందరో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తూనే ఉన్నారు.
స్త్రీ అన్నా, అమ్మ అనిపించుకున్న ప్రతి ఆడదానిపైన పూజ్యభావం గల సభ్యసమాజం మనది. అటువంటి ఉద్యోగంలో ఉన్నతస్థానంలోకి పోతోంది కూడా.
లంచాలు తీసుకుని డబ్బు, నగలు, ఆస్తులు కూడబెట్టుకుని దొరికినప్పుడు మీడియా ద్వారా స్త్రీ పట్ల సమాజంలో గౌరవభావం తగ్గిపోయేలా, నిజాయితీ ఉద్యోగం చేసుకునే స్త్రీమూర్తులు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.
నీకు సేవ చేయాలనే దృక్పథమే ఉండాలి గాని మార్గాలు అనేకం. ఒక అనాథ శరణాలయాన్ని దత్తత తీసుకో. ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయి.
నీ సహాయం అందించు. వందల చేతులు నిన్ను చల్లగా దీవిస్తాయి. అందుకు అవసరమైన డబ్బు అంతా నీవు వాడుకో.
మరో విషయం—ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సృష్టిలో చెరో అర్ధభాగం. పదిమంది పిల్లల్ని కనడం కన్న ఒక్క అమ్మాయినో అబ్బాయినో కని నీ ప్రేమ, దృష్టి వారిపై కేంద్రీకరించి ప్రయోజకులయ్యే విధంగా పెంచు.
నీకు అన్ని విషయాలలోనూ నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఏమంటావ్?" అన్నాడు.
జయప్రద అతని మాటలకు పులకించిపోయింది.
తన మనసు చదివినట్టుగా భర్త అన్న మాటలకు ఆ క్షణం నుంచి అచ్చమైన ‘అర్థాంగి’గా మారిపోయింది. ఏడాదికే కవిత పుట్టింది. తన భర్త తనకు నేర్పినవన్నీ కవితకు ఉగ్గుపాలతో నేర్పింది.
పాఠశాలలో కవిత మంచిపిల్లగా పేరు తెచ్చుకుంది. పట్టణంలో ఏ ‘సహాయ’ కార్యక్రమాలు జరిగినా సెలవు రోజుల్లో తనతోపాటు కూతుర్ని తీసుకెళ్ళేది జయప్రద.
"ఎందుకమ్మా మనం వాళ్ళకి సహాయం చేయాలి?" ఒకసారి కవిత అడిగింది తల్లిని. అప్పటికి తను ఐదవ తరగతి చదువుతోంది.
"మనం బ్రతుకుతూ ఎదుటివారిని బ్రతికించడమే మానవత్వం. మహాత్మా గాంధీతోపాటు ఎందరో అమరవీరులు తమ దేశభక్తిని చాటుకుంటూ స్వాతంత్ర్య పోరాటం చేశారు. ఈ దేశం మనకేమిస్తుంది అని వాళ్ళు ఆలోచించలేదు.
అలాగే ఈ దేశం మనకేమిచ్చింది అని మనమే మనం ప్రశ్నించుకుంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి జీవి స్వేచ్ఛగా పుట్టిపెరిగే స్వాతంత్ర్యం ఇచ్చింది.
అప్పుడు మనం ఈ దేశానికి ఏమివ్వాలి? మన దేశ పతాకం ప్రపంచంలో అగ్రస్థానంలో రెపరెపలాడుతూ ఎగిరే అంతటి కీర్తిని ఇవ్వాలి. అటువంటి కృషి మీలాంటి భారత పౌరులు చేయాలి.
అంత చేసే శక్తి లేనప్పుడు సాటి మనిషిగా సహాయం కావలసిన ప్రతీ వ్యక్తికి మనకున్నంతలో మన శక్తిమేర చేయాలి! అర్థమైందా?" అంది జయప్రద.
ఒదులుగా పిల్ల పావురం తల్లి రెక్కల్లో ఒదిగినట్టుగా తల్లి ఒడిలో ఒదిగిపోయి ఆమె బుగ్గమీద పువ్వును చుంబించినంత మెత్తగా ముద్దుపెట్టి, "నువ్వెంత మంచిదానివమ్మా!" అని ముడుచుకుపోయింది కవిత.
అప్పటి నుంచి కవిత చదువులో వెనుదిరిగి చూసుకోలేదు. చదువులో, డిబేట్స్‌లో, కల్చరల్ యాక్టివిటీస్‌లో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో చురుకుగా పాల్గొనేది.
స్నేహితులెవరైనా అడిగితే, "నాకు బహుమతి ముఖ్యం కాదే! పాల్గొనడం ముఖ్యం. అలా పాల్గొనకపోతే ఆ ‘విజ్ఞానాన్ని’ కోల్పోతాను నేను," అనేది.
తనవరకు ఆ కార్యక్రమంలో న్యాయం చేశానా లేదా! అని మాత్రమే ఆలోచించేది. ఆ ఆలోచనే ఆమెకు ‘విజయం’ సాధించిపెట్టేది.
కవిత సాధించిన బహుమతుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసింది జయప్రద. ఇంటర్, డిగ్రీ తర్వాత ఎం.బి.ఎ చేసింది కవిత.
చదువుకున్నంత కాలం ప్రతిరోజు ‘గాడ్స్ గిఫ్ట్ టెంపుల్’ అని తల్లి చేత నామకరణం చేయబడిన ఆ గదిలోకి వెళ్ళి బహుమతులకు నమస్కరించుకుని వెళ్ళేది కవిత.
ఎం.బి.ఎ పూర్తి చేసిన కవితను అడిగాడు శంకర్ యాదవ్, "ఏమ్మా! మంచి చదువు చదువుకున్నావ్! ఉద్యోగం చేయవా?" అని నవ్వుతూ.
"నాకు పరీక్ష పెడుతున్నారా నాన్నా! హాయిగా పెళ్ళి చేసుకుని అత్తామామలకి, భర్తకి సేవ చేసుకునే ఉద్యోగం చాలు. అయితే ఒక్క షరతు," అంది కవిత తండ్రితో.
"ఏమిటమ్మా అది?"
"నేను పుట్టిపెరిగింది విజయవాడలో. ఇపుడు తెలంగాణ, ఆంధ్రా విడిపోయాయి కదా! నాకు తెలంగాణలో అదీ ఒక పల్లెటూరు సంబంధం చూడండి. అతను చదువుకుని, రెండెకరాల పొలం ఉన్న పేదవాడైనా చాలు."
విస్తుపోయాడు శంకర్ యాదవ్ కవిత కోరిక విని. "ఎందుకమ్మా అలా! నీకేం
తక్కువ? కోటీశ్వరుడి కూతురువి. రాజాలాంటి సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తాను." "నేను ఏం మాట్లాడినా గుడ్డును పిల్ల వెక్కిరించినట్టు ఉంటుంది నాన్నా! అయినా నా భావాన్ని మీ ముందు ఉంచనివ్వండి.
నా ఆలోచనలు తప్పయితే చెప్పండి. సరిదిద్దుకుంటాను. ఏమ్మా! తప్పుగా మాట్లాడానా?" జయప్రదను అడిగింది కవిత.
"నేను ఈవేళ ఇంత ఆనందంగా ఉన్నానంటే మీ నాన్నగారే కారణం. మా యిద్దరి ఆలోచనలు కలబోసుకుని పెరిగినదానివి. హాయిగా మనసు విప్పి చెప్పు ఆయనకి," ప్రోత్సహించింది కవితని.
"కష్టం తరువాత వచ్చే సుఖం, చెమట చుక్క చిందించాక వచ్చే నిద్ర, మనం నాటిన మొక్క పుష్పించిన క్షణం, అది పండుగా మారి దాన్ని మనం ఆస్వాదించే క్షణం… ఇవన్నీ జీవితంలో అద్భుతమైనవి నాన్నా! యివన్నీ మీ పెంపకంలో నేను అనుభవించాను. చక్కని ఫలితాలు పొందగలిగాను.
జీవితంలో నాలుగు అరలు అనుకుంటే, బాల్యం, కౌమార్యం నాకు సంతృప్తిగానే గడిచాయి. యిక యవ్వనం, వృద్ధాప్యం.
వీటిని కూడా సంతృప్తిగా గడపాలంటే అవసరాలు తీర్చేటంత డబ్బు చాలు. అమ్మ ఏ లక్ష్యంతో ఉద్యోగం మానివేసిందో, నేనూ ఆ లక్ష్యంతోనే ఉద్యోగం చేయను.
విద్య విజ్ఞతను పెంచేదిగా ఉండాలి. విజ్ఞానాన్ని పంచేదిగా ఉండాలి. నేను చదువుకుని నేర్చిన విద్యను అలా వినియోగించుకునే అవకాశం నాకిమ్మని కోరుతున్నాను.
నెట్‌లో వెతుకుతారో, పంతులుగారికి చెబుతారో మీ యిష్టం. యిందాక నేను చెప్పినట్టు కనీసం డిగ్రీ చదివి, రెండెకరాల పొలం ఉన్నవాడు చాలు.
నా లక్ష్యం అతని ద్వారా సిద్ధింపజేసుకుంటాను. నా కోరిక తీరుస్తారా నాన్నా!" అడిగింది బేలగా కవిత.
"యువత అంతా పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటూ, దానికి బానిసలై ప్రవర్తిస్తున్న ఈ అత్యంత వేగవంత సమాజంలో ఉన్నతమైన చదువు చదివి కూడా నా కూతురుగా ఆలోచిస్తున్న నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా.
తప్పకుండా నీ కోరిక ఎంత కష్టమైనా తీరుస్తానమ్మా! తీరుస్తాను బంగారూ!" అంటూ కుమార్తె తలను గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు శంకర్ యాదవ్ పితృప్రేమతో!
కేవలం మూడునెలలలో తన మిత్రుల ద్వారా అన్నివిధాలా పరిశీలించి పరిశోధించి గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మోతుబరి రైతు రాజేందర్ యాదవ్ ఏకైక కుమారుడు అనిల్ యాదవ్ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు కవితకు.
అనిల్ అగ్రికల్చరల్ ఎం.ఎస్.సి చదివాడు. ఆరడుగుల స్ఫురద్రూపి. ఆధునిక భావాలున్న వాడిలా కనిపించినా పెద్దలంటే గౌరవం, సనాతన సాంప్రదాయాలను పాటించే చక్కటి వ్యక్తిత్వం గలవాడని తెలిసి సంతోషించాడు.
పెళ్ళిచూపులలో ఒకరికొకరు మొదటిచూపులోనే ఇష్టపడటంతో కాబోయే వధూవరులు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఒకరి మనోభావాలను ఒకరు పంచుకున్నారు.
తన స్థాయికి తగ్గట్టుగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించాడు శంకర్ యాదవ్. పదహారు రోజుల పండుగ వెళ్ళాక ఒక మంచి ఏకాదశి శుభ ముహూర్తాన అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కవిత.
వచ్చిన మొదటిరోజునే భద్రాచల రాముణ్ణి దర్శించుకున్నారు నూతన దంపతులిద్దరూ.
రెండోరోజు యాదగిరి గుట్ట. ఆయా దేవుళ్ళను దర్శించుకుంటున్నప్పుడు ఆ ప్రాంతపు చారిత్రక విశేషాలు, స్థలపురాణం వివరాలను వివరంగా సేకరిస్తున్న కవితను, "ఎందుకోయ్ అవి!" అని అడిగాడు.
"ఇది మన తెలంగాణ సంస్కృతీ, పూర్వచరిత్ర అని నా పిల్లలకు, తెలియనివాళ్ళకు చెప్పడం కోసం," అంది కవిత.
తండ్రి డ్రైవర్‌తో సహా కారును అనిల్‌కు బహుమతిగా ఇవ్వడంతో కేవలం మూడునెలలు తెలంగాణలోని అన్ని ప్రదేశాలు ‘గూగుల్’లో వెదికి పట్టుకుని మరీ దర్శించి వచ్చింది కవిత, అనిల్ జంట.
మొదట పండుగకు రమ్మని ఆహ్వానించాడు శంకర్ యాదవ్ స్వయంగా వచ్చి."నాన్న! ఆంధ్రాలో అన్ని పండుగలు నాకు తెలుసు.
వాటి విశిష్టత, పూర్వవైభవం అన్నీ కూడా! యిక్కడి పండుగలు కూడా తెలుసుకోవాలి కదా నాన్న! మేము రాము. ఏమీ అనుకోకండి!" అంది.
ఆమె మాటలకు శంకర్ యాదవ్ నొచ్చుకున్నాడు."మీరన్నా చెప్పండి బావగారూ! నువ్వన్నా చెప్పవయ్యా," అభ్యర్థించాడు వియ్యంకుడిని, అనిల్‌ని.
"అవునమ్మా! యిక ప్రతి ఏడాదీ యిక్కడే పండుగలు జరుపుకుంటావు. మొదటిపండుగకే రాలేదా అని మీ నాన్నని ఎవరైనా అడిగితే ఏం బాగుంటుంది చెప్పు?" అన్నాడు రాజేందర్.
"సారీ నాన్న! నేను అంతదూరం ఆలోచించలేదు. నన్ను క్షమించండి," అంది తప్పుచేసిన దానిలా.
వియ్యాల వారందరినీ సంక్రాంతి పండుగ మూడురోజులు తమ మర్యాదలతో ఉప్పొంగిపోయేలా చేశాడు.
పండుగ అనంతరం ఇంటికి చేరాక భద్రకాళికి బాగా చేరువ అయింది కవిత. అవ్వకైతే కవిత ఒక దేవతే!
"అత్తయ్యా! ఈ పాటు ఏ పండుగ వచ్చినా అంటే బతుకమ్మా అయినా, బోనాల పండగైనా, ఆటికి సరిపడ్డ పూలన్నీ పెరట్లో పూయిస్తనత్తా! తులసమ్మను దాటినాక ఆ రెండో పెరడంతా చెత్తాచెదారంతో పిచ్చిమొక్కలు పెరిగి సిరగ్గా ఉన్నాదత్తా.
యీ ఇల్లు మీ పుట్టింటోరు పెళ్ళప్పుడు పసుపు కుంకుమల కింద యిచ్చినారని అనిల్ సెప్పిండు. అనిల్ నడిగితే నిన్ను అడిగి ఒప్పుకోలు తీసుకోమన్నడు. సెప్పండత్తా! పేచీ సెయ్యను?"
"అమ్మా కయితమ్మా! నువు మాయింటి మాలచ్చిమివి. అదాటులో నేను ఓ మాట ఇసిరినా ఏమనుకోమాక. నా యింట బతుకమ్మను పూయిస్తనంటే నేనెట్టా వద్దంటా? యింటి పనంత నేను చూసుకుంట గదా!" అంది భద్రకాళి.
వంగుని అత్తగారి పాదాలకు నమస్కరించింది కవిత. అక్కడే ఉన్న అవ్వ బోసినవ్వు నవ్వుతూ, "ఎంత అదురుష్టమే కోడలా నీకు. ఏం యినయం. ఏం గౌరం. మన పిల్లదాన్ల ఒక్కరికాడ సూడం యిట్టాంటి పేమ," అనింది.
అవ్వకు కూడా నమస్కరించి చెంగున తమ అంతఃపురంలోకి వచ్చింది కవిత. అనిల్ మంచం మీద పడుకుని వీక్లీ చదువుకుంటున్నాడు.
"అనూ! మన రెండో పెరట్లో పూలమొక్కలు నాటడానికి అత్త, అవ్వ ఒప్పుకున్నారు. ఇక మనం అనుకున్న ప్లాన్ ప్రారంభించడమే ఆలస్యం!" అంది అతని గుండెలమీద రోమాలను మెలిపెడుతూ.
"అద్సరే! అమ్మ, అవ్వలకాడ మా బాస, నాతోను, అత్త, మావల్తోను మీ బాస... ఏంటి సంగతి?" అడిగాడు అనిల్ ఆమెను గుండెలకు హత్తుకుని.
"ఆళ్ళకి అట్టా మాట్లాడితేనే అర్థమవుద్ది. నీకు ఎట్టా మాట్లాడినా అర్థమవుతుంది. అదే సంగతి. అది సరేగానీ నీకు ప్రేమలేఖ రాసినా! చదువుతావా!" అతని గుండెల మీదనుంచి పక్కకు జరుగుతూ అంది కవిత.
"ఊ!" అన్నాడు అమాయకంగా ముఖంపెట్టి.
"అయితే తీసుకో!" అంటూ రెండో దిండుకింద దాచిన ఉత్తరం అతనికి అందించింది. ముందు మామూలుగా, తర్వాత శ్రద్ధగా, మరీ తర్వాత అత్యంత శ్రద్ధగా మూడోసారి చదవసాగాడు.
అందులో—
"బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగార్కి,మీ కుమార్తె ‘కవితానిల్’ హృదయపూర్వక నమస్కారాలు.
మీ అల్లుడు తండ్రి కాబోతున్నాడు. అంటే మీరు, మావయ్య తాతయ్యలు కాబోతున్నారు. ఈ శుభవార్త మీకు అత్యంత సంతోషాన్నిస్తుందని నాకు తెలుసు.
ముఖ్యంగా నేను చెప్పదలచిన నాలుగుముక్కలు స్పష్టంగా చెప్పేస్తాను. నా ఉత్తరం సాంతం చదివాక మీ అభిప్రాయం చెప్పండి.
ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయినందుకు ముందు బాధపడినా, ప్రాంతాల అభివృద్ధి కొరకు అది అత్యావశ్యకం అని తెలిశాక ఎంతో ఆనందించాను.
అందుకే కోరి నేను తెలంగాణ అబ్బాయిని చేసుకున్నాను. రేపు నాకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా యీ గడ్డమీదనే కంటాను.
వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఆంధ్ర సంబంధాలు చేస్తాను. ఒకవేళ ప్రేమిస్తే ఆంధ్రావారి పిల్లలనే ప్రేమించి వివాహం చేసుకోమని చెబుతాను.
ఎందుకంటే నా పుట్టింటి చరిత్రతో పాటు, నా అత్తింటి చరిత్ర సంస్కృతీ సంప్రదాయాలు పిల్లలు తెలుసుకోవాలి. తరతరాల వారసత్వ సంపదని, సంరక్షించుకుంటూ సనాతన ధర్మాలను ఆచరిస్తూ పెరగాలి.
ఇది నేటి తరాల నుండి భావితరాలకు ప్రవహించే సంస్కృతి నాన్నా! ఆ ప్రవాహం యిటు నుంచి అటు, అటు నుంచి యిటూ నిరంతరంగా ప్రవహిస్తూ యిరువైపులా న్యాయం జరగాలి.
‘ఇదే ఇదే మా సంస్కృతి. ఇదే ఇదే మా ప్రగతి’ అని రెండు రాష్ట్రాల తెలుగువారు దేశదేశాల నినదించాలి నాన్నా! అదే నా కోరిక.
యిదంత పిచ్చితనమో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కాని నేను బీజం వేయదలచుకున్నాను.
ఇదే ఆలోచన మరొకరికి రాకూడదని ఏముంది?
ఈ దేశం నాకేమిచ్చింది అని నేనేనాడూ ప్రశ్నించుకోను. నా దేశానికి నేను ‘ఇది’ ఇవ్వదలుచుకున్నాను.
మనమందరం చదువుకున్నవాళ్ళం, విజ్ఞానవంతులం. ఆలోచించండి. నా నిర్ణయం తప్పయితే సరిదిద్దుకుంటాను.
నమస్కారాలతో మీ కుమార్తె ‘కవితానిల్’"
అనిల్ ఉత్తరాన్ని విసిరేసి కవితను గాఢంగా గుండెలలో దాచుకుని ఆత్మతృప్తితో కళ్ళు మూసుకున్నాడు.
సమాప్తం.
***
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్










Comments