top of page

ఎదుట నిలచిన నీడలు


'Eduta Nilichina Needalu' New Telugu Story

Written By Dr. Kanupuru Srinivasulu Reddy

'ఎదుట నిలచిన నీడలు' తెలుగు కథ

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఉదయం అయి ఉంటుందని లేచి చూసాను. అయిందిగాని చాలా పొద్దెక్కింది. మరీ ఇంత పాలుమాలానా? లేవడానికి కూడా బుద్దిపుట్టలేదా? ఏముంది లేచి చేసేది అనే నిర్లిప్తభావం నిరాశ!! హృదయం మూలిగింది అనుభూతులకోసం.


తన ఎదురుగా ఎవరో నీడలా కదులుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూసాను. కూతురు ముఖం మాడ్చుకుని దిగులుగా నన్నే చూస్తూ నిలుచుంది.


పైకి లేస్తూ. ” ఏమ్మా ! రా! కూర్చో. ఎందుకు అట్లాగున్నావు?”

“ట్యూషన్ ఫీజు మూడు నెలలనుంచి ఇవ్వలేదు డాడీ. అదోలా చూసి అడుగుతున్నాడు మాస్టారు. ”


వెయ్యి రూపాయలు నెలకు, తన స్తోమతకు మించిందే కానీ బిడ్డను లెక్కలు బాగా ఇష్టమని ఇంజినీరింగ్ ఫ్రీ సీటు తెచ్చుకోవాలని చేర్చాడు.

“ఇచ్చేద్దామమ్మా! ఫ్రెండ్సును అడిగి ఉన్నాను. రేపు ఇస్తామన్నారు”.

“సరేలే నాన్నగారు! ఎదో ఒకటి చెపుతాను. ” అని వెళ్లిపోయింది.


ఎంత మంచి బిడ్డ. అర్ధం చేసుకుంది. భాద్యతను గుర్తించింద అని అనుకోగానే గర్వంతో హృదయం ఉప్పొంగింది.

“అదెక్కడ చచ్చింది? సాయంకాలం పాలవాడికివ్వాలని ఐదువండలు పెట్టి పెడితే ఎంత చెప్పినా వినకుండా సినిమాకు పోవాలని ఎత్తుకేల్లింది. వాడొస్తే ఏం చెప్పాలి. అంతా మీ మూలంగానే!!”


ఇప్పటి వరకు గొప్పగా అనుకున్న నా కూతురా? సహజంగా మొగపిల్లలు చేస్తారు ఇలాంటి ఆకతాయి పనులు. అబద్దం చెప్పి నన్ను మోసం చేసిందా?కూతురు నీడ ఎదురుగా నిలిచి ఎగతాళిగా నవ్వుతున్నట్లు అనిపించింది.

“ఎందుకు గుడ్లు అప్పగించి దయ్యాన్ని చూసినట్లు చూస్తారు. ”


ఎగిరి పడ్డాను. భూమి తలకిందులవుతున్నట్లు అనిపించింది. గోడకేసి చూసాను తమ పెండ్లి ఫోటో అటు ఇటు ఊగులాడుతూ ఏ క్షణంలోనయినా కింద పడిపోయేటట్లుంది. చెమట పోసి శరీరమంతా తడిచి పోయింది. ఏవిటిది చలికాలంలో అనుకున్నాను.


“ఇంకా తెల్లరలా! “ భార్య గర్జింపు. వణుకు పుట్టినా కాళ్ళు నిలిచాయి

ఎదురుగా కనిపించేది అదే కదా. అనే మాట తోసుకు వచ్చిన దాన్ని నమిలి మింగేసి నోరు గట్టిగా కప్పెట్టుకున్నాను.


“ఉద్యోగం ఉంది. సంపాయిస్తాడు. పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడు అని నమ్మి మోసపోయాను. ” మరో సారి భయంకరంగా ముక్కు చీది గాండ్రించింది.

ఆ మాటలు నేను చెప్పానా ?ప్రాణమండి మీరంటే అని చెప్పిన మాట.. ? మరీ గొంతు.. కంఠం ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు. తలగోక్కున్నాను అప్పుడెప్పుడో నేనే కోకిల కంఠం అని బూతుమాట అన్నట్టు గుర్తు.


గబ్బుక్కున చెంబు తీసుకుని వీధిలోకి పరుగు పెట్టాను.

“అదేవిటి చెంబు? టాయిలెట్ ఇంట్లోనే ఉందికదా!”


చూసుకున్నాను నిజమే చెంబు. ఎందుకు? దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ పారిపోతే మరీ ప్రమాదం. వీధుల్లో ఫ్రీ సినిమా చూపించాల్సి వస్తుంది అక్కడే నిలుచున్నాను. రాకరాక దొరికిన సెలవును రిలాక్స్ డ్ గా పడుకుని గరగరమంటూ తిరుగుతున్న ఫ్యాను చూస్తూ గూగుల్ న్యూస్లో ఎదలు సోదలు నెమరువేసుకుంటూ, కూడు పెట్టినప్పుడు తిని మధ్య తరగతి సగటు మనిషికి దొరకని కలల్లోకి జారిపోదామనుకున్నాను. అన్నీ అంతులేకుండా ఎగిరిపోయాయి శ్రీమతి అరుపు విని.

“ఏవిటి అలోచిస్తున్నారు. ?“


“ఒంటికి.. ఛీ దొడ్డికి.. ఛీ కాదు ప్యాకెట్లు ! పాలు.. పాలు కింద పోతాయేమోనని. ” మొదటి బాంబు నా నెత్తినే పగులుతుంది. ఆ రోజు.. రోజంతా చావనివ్వకుండా బ్రతకిస్తూ నాపై మారణాయుధాల దాడి. మగాడ్ని, బోరున ఆవిడకు కనిపించేటట్లు ఏడవలేక కారుతున్న కన్నీటి రక్తాన్ని రుచి చూస్తూ గుటకలు మింగుతూ ఆవిడ త్వరగా శాంతించాలని దేవుళ్ళను వేడుకుంటూ.. ఛీ నా కొంపను నిలబెట్టుకుంటే చాలు. నేను ఈ ఇంటికి యజమానిని ??ఎటూ తేల్చుకోలేక నిలుచున్నాను.


“మీతో కాపురం చెయ్యడం కన్నా విడాకులు ఇచ్చి, లేచి పోవడం మేలు. నా జీవితాన్ని సర్వ నాశనం చేసారు. ఒక్క కోరిక కూడా తీర్చుకోలేక పోతున్నాను. అష్టకష్టాలు పడి ఈడ్చుకు వస్తున్నాను. ” అంటూ బోట బోట కన్నీరు కారుస్తూ తల బాదుకోసాగింది.


విడాకులిచ్చిన తరువాత లేచిపోవడం ఎందుకు ? అర్ధంకాలేదు. మరి నేను ఏం అనుకోవాలి ? వచ్చినదంతా చేతులో పెట్టి ఆవిడ దయ పెడితే టీనో కాఫీ తాగుతున్నాను, పండగలకు గుడ్డలు, పౌడెర్. స్నోలు, సెంట్లు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఈ కొంప ఎవరు కట్టారు. కూతురికు ఒక మోపెడ్, కొడుక్కి మోటారు సైకిల్ కొనిచ్చేవరకు హంగర్ స్త్రికు చేసింది. చాలా ఖర్చు, పెట్రోలు రిపేర్లు.. చెప్పినా వదలలేదు. ఇప్పడు కొడుకు స్నేహితులతో లంజ.. ఛీ.. లాంగ్ రైడ్లు, కూతురు లేటు కమింగులు. అడగితే బ్రతకలేని సన్యాసి బిరుదుతో ఉగ్ర స్వరూపం ప్రత్యక్షం. ఇవన్నీ చెదిరే కదిలే నీడలు కాదు. బ్రతికున్నంత వరకు కళ్ళముందు.. కలల్లో తాండవ నృత్యాలు చేసే మల్టీకలర్ సినిమాలే ! నిత్య సత్యాలు!! ఛీ.. మగాడు.. కాదు మొగుడు.. బ్రతుకు ఘోరాతి ఘోరం. చస్తే.. ? మధ్య తరగతి తండ్రిగా ఉండి అనుకోనే కూడదు.


మధ్య తరగతిలో పుట్టి చాలీ చాలని జీవితాన్ని భరించలేక కుట్రలతో దిగజారి పోయి దర్జాలతో బ్రతకాలని ఆశ.. అత్యాశ ఉంటే నలిగి చావాల్సిందే ! ఆ విషయం ఆలోచించరు. మన తోక ఎంతో తెలుసుకొని స్థిమితం తెచ్చుకోగలిగితే, సంస్కారం, సభ్యత, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యానికి ఈ తరగతే మార్గదర్సికమవుతుంది, నైతిక విలువలు నిలబెట్టే ఆణిముత్యాలు అవుతారు. అత్యాశకు పోతే సంఘ విద్రోహ చర్యలకు పునాదులవుతారు.. దరిద్రానికి ప్రధమ సంతానం అవుతారు.


లేదు.. లేదు అని ఏడ్చేదానికన్నాతృప్తి అనే పదాన్ని నమ్ముకుని బ్రతుకుని స్వర్గమయం చేసుకోవచ్చు. ఈ సంఘర్షణ అంతంకానిది ఆరంభం లేనిదీ.


ఇండ్లు కట్టడానికి, పిల్లల చదువులకంటే తిరుగుళ్ళకు జల్సాలకు అన్నింటికీ లోన్స్ అప్పు. అది ఆవిడకు తెలుసు కానీ ఇతర్ల దగ్గర తను తగ్గ కూడదు. పెగ్గి చూపించుకోవాలి. ఇది మధ్య తరగతిలో బాగు చెయ్యలేని, మందేలేని అంటు వ్యాధి. ఎలా వీలు పడుతుంది. ఇంటి ఖర్చు ఎంత.. తమకు వచ్చేది ఏవిటి అనీ ఆలోచన ఉండదు.. ఉన్నా నా మీద పడుతుంది నువ్వు చేతగాని దద్దమ్మవు. బ్రతకడం చేతకాదు. ఖర్మ.. ఖర్మ అని నెత్తి బాదుకుంటుంది. పిల్లల మీద, నా మీద అరుపులు. ఆవిడ, పిల్లలు వాదనలు తగువులతో ఇంటిలో ఎప్పుడూ యుద్ద వాతావరణమే ఉంటుంది. తను జోక్యం చేసుకుంటే ముగ్గరూ ఒక్కటయి దూకుతారు. ఒక్క ఈ కొంపలోనే ఇన్ని అణుబాంబుల పోరాటాలుంటే దేశంలో.. ప్రపంచంలో ??


పక్కింటిలో పొరుగింటిలో కూడా ఉంటాయి. షో కులు, జల్సాలు, వాళ్ళు డబ్బు సంపాయించే తీరులో ఉంటాయి. ఖర్చుపెట్టే ఆలోచనా విధానంలో ఉంటుంది. అందరికి అన్నీ కావాలి క్షణంలో కోటీస్వర్లు కావాలి ! ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన తరువాత చాలా మంది యువత చదువు, సంధ్య వదిలేసి మందు మగువతో రోడ్డు యాక్సిడెంట్లు చేసి అర్దాంతరపు చావులు చస్తున్నారు. అప్పుల్లో మునిగిపోయి గడ్డాలు పెంచుకుని వీధుల్లో తిరుగుతున్నారు. మోసం, దగా, కుట్రలు కుతంత్రాల నిలయాలు అయి పోతున్నారు. ఈ కాలంలో వ్యక్తిత్వం, సభ్యత, సంస్కారం అనే శాంతి సీమలున్నాయని మరిచిపోయి కుక్కచావులు చస్తున్నారు.


అలాంటి దళారు పనులు చేసి సంపాదించమని నా భార్య బండబూతులుతో తిండి తిప్పలు పెడుతూ నాలోని పౌరుషాన్ని చేతగాని వేదవా చచ్చుదద్దమ్మ అని రెచ్చగొట్టుతూ ఉంటుంది. ఈ కాలం భార్యలు మొగుళ్ళను ముద్దుగా అలా పిలుస్తారేమో?


కొందరికి చాలా మొహమాటం. కొందరికి ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్ తో తెలియని గర్వం, కొందరు ప్రతి చిన్నదానికి క్రుంగిపోవడం గోరంతలు కొండంతలుగా ఊహించి ఆత్మవిస్వాశాన్ని కోల్పోయి నిరాశతో జీవించడం ! చిన్న చిన్న కోరికలకు అవసరాలు తీర్చుకోవడానికి డబ్బుకోసం ఘోరమైన పనులు చెయ్యడం. అనుకున్నది జరగకపోతే లేదా ఆలస్యం అయితే తమను తాము తిట్టుకోవటం ఆసహ్యించుకోవడం దేవుళ్ళను దయ్యాలను బండ బూతులు తిట్టడం, కోపంతో విసుగుతో రెచ్చిపోయి అందినవి పగలగొట్టడం దొరికిన వారితో అనవసరంగా తగువులు వేసుకోవడం అనే మానసిక రోగం ఉంటుంది.


ఎంత దక్కితే అదే నీకు ప్రాప్తం అనే సిద్ధాంతాన్ని ఎలాంటి పర్రిస్తుతుల్లోను ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా బ్రతకొచ్చో తెలుసుకోలేరు. తనకే.. తమకే ఎందుకు అని అర్ధం చెప్పలేని ప్రశ్నలతో జీవితాన్ని ముళ్ళమయం చేసుకుంటారు..


“నాన్నా!” వాళ్ళమ్మ దగ్గర్నుచి నేర్చుకున్న గాండ్రింపు. నన్ను చూసి భయపడే నా కుమారుడు.

చూసాను.

“నేను నా స్నేహితులతో తిరగలేకున్నాను. ఎప్పుడూ ఎక్కడికి పోయినా పార్టీలకి వాళ్ళే ఖర్చు చేస్తున్నారు. నా దరిద్రాన్ని ఎత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. తలకోట్టేసినట్లు ఉంది “


“తిరగకు ! ఉండలేవా?ఉండాలంటే. భరించు. అవి లేకుండా నీ స్నేహం కోరుకునే వాళ్ళతో తిరుగు”.

"ఎవరున్నారు? మాది ఘాడమైన స్నేహం. ”


“వాళ్ళు నీ స్నేహితులుకారు. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళతో నీ వ్యధను బాధను ఆనందాన్ని పంచుకో. ”

దానికి వాడు చూసిన చూపు నన్ను కాల్చేస్తుందేమో అనిపించింది.


నేను లెక్క చెయ్యలేదు. కానీ వాడి నీడచేసే భయకర చేష్టలు చూసి భయం వేసింది.

“ఏం కొంపో ! ప్రతి దానికి అడుక్కు తిని చావాలి. పక్కింటి సుబ్బమ్మ వారానికి ఒక కొత్త నగ కొంటుంది. ఎదురింటి రత్తమ్మ నెలకో పట్టు చీర కొనాల్సిందే ! ఇదేవిటి సంవత్సరాల తరబడి కట్టిందే కట్టడం. వేసుకుందే వేసుకోవడం!?”


“మొగుళ్ళ ను మారుస్తున్నారేమో కనుక్కున్నావా?”

“నోరు మూసుకోండి. వాళ్ళ మొగుడ్లు కార్యసాధకులు. వారానికి ఒకసారి బ్యుటి పా ర్లేర్స్ తీసుకు వెళతారు “


“అంత అసహ్యంగా ఉంటారా?నా భార్య ఎలా ఉన్నా నాకు ఇష్టం.. ప్రేమ!!”

“నాకంటే అందంగా ఉంటారు “


“నాకు అనవసరం, నేను చూడను!”

కొరకొర చూసింది కాళ్ళు విరగొట్టే అవకాశం తప్పిపోయిందని.


“ఏదయినా లోపం ఉండాలి. వాళ్ళ అందం మీద మొగుళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదేమో? పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే.. !”

అంతే ఒక్క అరుపు అరిచి ఊగిపోయింది. ఆమె నీడ నా గొంతుకోసం వెతకడం చూసి అటుఇటు పరుగెత్తాను.


అక్కడే ఉన్న నాకూతురు వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలు పెట్టింది. బహుశా వాళ్ళ అమ్మ నన్ను తిట్టిందానికేమో అని సముదాయించబోయాను.


“కాలేజీకి పోవాలంటే సిగ్గుగా ఉంది. వాళ్ళ లేటెస్టు డ్రెస్సులు మేకప్పులు ముందు నేను బిచ్చగత్తెగా అనిపిస్తుంటే తల ఎత్తుకోలేక పోతున్నాను “


“నువ్వూ వొళ్ళు చూపించి బిక్షం ఎత్తుకుంటే సరిపోతుంది”

“అంత చీప్ గా నన్ను నా స్నేహితుల్ని మాట్లాడావంటే చూడు. ఛీ దరిద్రుడికి పుట్టడం నా ఖర్మ” అంటూ నిప్పులు కురిపించి గిరుక్కున వెనక్కు తిరిగింది. రాయి రప్ప ఎరుకోవడానికేమో ?


అది స్నేహామా? కట్టుకున్న గుడ్డలను చూసి, పూసుకున్న రంగునుబట్టి, చూపించే ప్రేమ ఒక.. !? ఏమో ఈ నవీన యుగంలో దీనికయినా అవే కొలమానికలేమో? ఆమె నీడ మాత్రం కదలక భయకరంగా తాండవ నృత్యాలు చేస్తూ నన్ను మింగేయ్యాలని కసిగా పైకి వస్తున్నట్లు అనిపించింది.


ఇవన్నీ వాళ్ళ అవసరాలుకాదు. గొంతెమ్మ కోరికలు. తమ పరిస్థితి అర్ధం చేసుకోకుండా అసంతృప్తిని పెంచి నిరాశతో నలుగుతున్నారు.


ఉన్నంతలో కూటికి గుడ్డకు లోటు లేకుండా చేస్తున్నాను. అతిగా ఖర్చు చేసి ఆనందించాలంటే నేనుకాదుకదా కుబేరులుకూడా చాలరు.

వాళ్ళను ఎలా తృప్తి పరచాలో నా దగ్గర ఏ సూత్రంగాని, మార్గంగాని లేదు. అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. తమ గుండెల్లోకి ఎప్పుడు చూసుకుంటారో నీడను దాటి వెలుగు చూస్తారో అప్పుడే అసంతృప్తి పోయి ఆనందమయమైన భవిష్యత్తు, మనశ్శాంతి వాళ్ళ సొంతమవుతుంది. అనుకుంటే మధ్యతరగతి వాళ్ళు అధిరోహించని శిఖరాలు ఉండవు. ఇప్పుడున్న మేధావులు ఆర్టిస్టులు కళాకారులు మిలియనీర్లు అందరూ మధ్యతరగతి వాళ్ళే !!


ఇన్ని ఆలోచిస్తున్నా వాళ్ళ నీడలు కదలక నా ఎదుటే ఉన్నాయి!! అజ్ఞానం స్వాభిమానం అత్యాశతో చిమ్మ చీకటిని కప్పుకున్న ఆ నీడలకు నేను లొంగ కూడదు. నా వ్యక్తిత్వాన్ని నేను నిలిపుకోవాలి. అదే మధ్యతరగతి ఉన్నతి.


****

డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..

నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


27 views0 comments

Comments


bottom of page