top of page

ఎండమావులు


'Endamavulu' New Telugu Story


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

హేమంతం!

ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్...

వారం రోజుల సెమినార్ కోసం నేనిక్కడకి వచ్చాను. పదేళ్ళ క్రితం ఐఐటీలో ఇంజనీరింగ్ చదివిన తరువాత ఐఏఎస్ కి ఎంపికై ఇక్కడే శిక్షణ తీసుకున్నాను. దేశానికి దిశానిర్దేశం చేసే ఐఎఎస్ ఆఫీసర్లందరికీ ఇక్కడే శిక్షణ ఇవ్వబడుతుంది.


బ్రిటిష్ వారు అన్ని కాలాల్లో వాతావరణం బాగుంటుందనీ ఈ అకాడమీని ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో నెలకొల్పారు. ఇది హిమాలయాలకు దగ్గర్లో ఉంది.


నేను ట్రైనింగ్ లో ఉన్నపుడే కౌమోదిత పరిచయం అయి అది పెళ్ళికి దారితీసింది. సాధారణంగా ఐయ్యేయస్ లందరూ తమ సహచర బ్యాచ్ మేట్స్ నే పెళ్ళాడుతుంటారు... బయట వారిని పెళ్ళాడితే అవగాహనా లోపం వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలొస్తాయనీ ఈ పని చేస్తుంటారు...


కౌమోదిత కన్నడమ్మాయి... ఆమె రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది...

ఇక్కడ రెండేళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న తరువాత మా ఇద్దరికీ ఆంధ్రా కేడర్ ఎలాట్ అయింది... ఇద్దరం పెళ్ళి చేసుకున్న తరువాత ఉద్యోగాల్లో చేరేము...


ఒరిస్సా సరిహద్దులో ఉన్న జిల్లాలో ఇద్దర్నీ సబ్-కలెక్టర్స్ గా నియమించారు.

మొదట్లో పనివత్తిడి ఎక్కువగా ఉండేది. చాలా మంది అనుకునేటట్లు ఐయ్యేయస్ లుక్రేటివ్ అంటే ఆకర్షణీయమైన ఉద్యోగం కాదు; డబ్బు సంపాదన కోసం అయితే ఇందులో చేరకూడదు; ప్రజలకి సేవ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళే దీన్ని ఎంచుకోవాలి. ఈ విషయాన్ని ట్రైనింగ్ కొత్తలోనే మాకు చెబుతారు.


ఉద్యోగంలో చేరిన తరువాత నాకు సమాజం మీద అవగాహన పెరిగింది. నేను ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని కావటం, ఐఐటిలో చదువువల్ల సామాన్యుడి గురించిన అవగాహన లేదు. పైగా నేను చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బాగా విరుద్ధమైనది;


దేశంలో 140 కోట్లు, రాష్ట్రంలో 5 కోట్లు... పేదవారు ఏభై కోట్లు జనాభా ఉన్న దేశం మనది. పేదవారందరికీ ప్రభుత్వ సాయం కావాలి. 'రోజూ ఆఫీసుకి అర్జీలతో వేలాదిమంది వచ్చేవారు. ఎక్కువగా గిరిజనులు, కూలి పనివారు.


ఐ ఏ ఎస్ అధికారులకు పని గంటలుండవు... ఇల్లే ఓ ఆఫీసు... స్వంత సమయం ఉండదు. జిల్లాలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. మొదట్లో ఉడుకురక్తం వల్ల అందరికీ సహాయం చెయ్యాలనీ రాత్రి పగలు పనిచేసేవాడిని. ఆదివారం నాడు కౌమోదిత వచ్చేది. ఆమె పనిచేసే రెవెన్యూ డివిజన్ నేను పనిచేసే పట్నానికి వందకిలో మీటర్ల దూరంలో ఉండేది. మర్నాడు మళ్ళీ ప్రయాణం... ఇలా వివాహం జరిగిన మొదటి రెండు సంవత్సరాలు చాలా నిస్సారంగా గడిచాయని చెప్పొచ్చు.


ఒక పక్క ఉద్యోగాల్లో ఉండే వత్తిడి, మరో పక్క ఇద్దరం ఒకే దగ్గర గడపడానికి సమయం లేక పోవడంతో మాలో మానసిక అలజడి మొదలై మొదటి సారి అనవసరంగా వివాహం చేసుకున్నామన్న భావన కలిగింది...


అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. అది ఇంతింతై వటుడంతై అన్నట్లు రానురాను పెరిగిపోవడం మొదలైంది.


ఈలోగా మూడు సంవత్సరాలు పూర్తవడంతో ఇద్దరికి జాయింట్ కలెక్టర్లగా ప్రమోషన్ ఇచ్చి వేర్వేరు జిల్లాలకు బదిలీలు చేయడంతో మా మధ్య దూరం మరింత పెరిగింది.

సమాజ సేవ, పేదప్రజలకు బాసట, ఇవి చెప్పుకునేందుకు బాగుంటాయి కానీ ఆచరణ కొచ్చే సరికి ఎన్నో కష్టాల నెదుర్కోవాలి...


ఇద్దరి జిల్లాలు వేరైపోవడం, దానికి తోడు రెండింటి మధ్య దూరం ఎక్కువ కావడంతో నెలకోసారైనా కలుసుకోవడం కుదిరేది కాదు...


ఎప్పుడైనా రాత్రి పదిగంటల వేళ డ్యూటీ నుంచి బంగళాకి వచ్చినపుడు ఇంటి నిశ్శబ్దం నాకు చిరాకు కలిగించేది. ఆ సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర చల్లటి భోజనాన్ని తింటుంటే కళ్ళంట నీళ్ళు తిరిగేవి... ఆ సమయంలో మా అమ్మ గుర్తుకొచ్చేది. మొదటిసారిగా ఉద్యోగస్తురాలిని చేసుకున్నందుకు విచారించేను.


అలా నిస్సారంగా, భారంగా రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఇద్దరినీ ఇంకో జిల్లాకు పదోన్నతి కల్పించి, బదిలీ చేసారు. నన్నుకలెక్టర్ గా, కౌమోదితని మున్సిపల్ కమీషనర్ గా వేసారు. అక్కడ నాలుగు సంవత్సరాలున్నాము.


ఆ సమయంలో జీవితం సాఫీగా గడిచింది. అప్పుడే మాకు ఇద్దరు పిల్లలు కలిగారు. పెద్దపిల్ల మంజూష, రెండోవాడు ఆదిత్య...


తరువాత నాకు సెక్రెటరీగా పదోన్నతి కల్పించి సెక్రెటేరియట్లో వేసారు... కౌమోదితని ఇంకో జిల్లాకి కలెక్టర్ గా బదిలీచేసారు...


ఇద్దరు పిల్లలకూ స్కూల్లో చేర్పించే వయసు వచ్చింది... కౌమోదితకి ఇద్దర్నీ విశాఖపట్నం లోనో, హైదరాబాదు లోనో పబ్లిక్ స్కూల్స్లో చేర్పిద్దామని చెబితే నేనొప్పుకోలేదు...


ఆ సమయంలో ఒక రోజు మా సహాధ్యాయి కర్నాటక కేడర్ ఐయ్యేయస్ అయిన అనిరుధ్ మా ఇంటికి వచ్చాడు. అతను కూడా నాలాగే మా బాచ్ మాట్ మధూలికని వివాహం చేసుకున్నాడు. వాళ్ళు కూడా ప్రస్తుతం వేర్వేరు స్థలాల్లో పనిచేస్తున్నారు...

భోజనాలప్పుడు పిల్లల విషయం ప్రస్తావన కొచ్చింది.


“అనిరుధ్... పిల్లల చదువు మాకు ఓ సమస్య అయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు" అని చెప్పాను అతనితో.


“మన దగ్గర ఉంచుకొనీ చదివించడం కష్టం... మేమైతే ఒక అవగాహనకి వచ్చి ఊటీ పబ్లిక్ స్కూల్లో చేర్పించాము. ఆర్నెల్ల కోసారి వెళ్ళి చూసి వస్తున్నాము... అందువల్ల పెద్దగా సమస్య లేదు” అన్నాడు.


“బాల్యంలో పిల్లలు మన దగ్గర లేకుండా చదువుకోసం దూరంగా వెళ్ళడం నాకిష్టం లేదు... ఎలాగూ పదిహేనేళ్ళ తరువాత వాళ్ళు మన దగ్గర ఉండరు. మనం పిల్లలతో ఆనందంగా గడిపేది ఈ వయసులోనే... అప్పుడే వాళ్ళు క్రమశిక్షణతో పెరుగుతారు... బయటైతే వాళ్ళకి తల్లితండ్రులతో అనుబంధం తగ్గిపోతుంది... ఇది వాళ్ళ జీవితంలో పెద్ద ప్రభావం చూపిస్తుంది అనీ మన ప్రొఫెసర్ ఒకసారి చెప్పిన విషయం నీకు గుర్తుండే ఉంటుంది. అందుకే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు... ” అన్నాను.


ఇంతలో కౌమోదితకి అందుకుంటూ “మన దగ్గరే ఉండాలంటే ఎలా కుదురుతుంది. అన్నయ్య చెప్పినట్లు దూరంగా ఏ పబ్లిక్ స్కూల్లోనో చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంతకన్నా మరోమార్గం కనిపించటం లేదు. పిల్లల్ని వదలి ఉండటం ఓ మాతృమూర్తిగా నాకూ ఇష్టం లేదు... కష్టమే... అయినా వాళ్ళ భవిష్యత్తునీ, మన బాధ్యతల్నీ రెండింటినీ సమతుల్యం చేసుకోవాలంటే అలా చెయ్యక తప్పదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించటం వ్యర్థం" అంది కోపంగా...

ఈ సంఘటన జరిగి ఐదేళ్లయింది.


ఆ తరువాత నేను చాలా సంఘర్షణకి లోనయ్యాను. పిల్లల్ని బయటకు పంపి చదివించటానికి నేను ఒప్పుకోలేదు. దాంతో మా భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. అది గొడవలకు దారితీసింది. కౌమోదిత ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ చదివించననీ పట్టుబట్టి కూర్చుంది... చివరకు ఆమె పంతమే నెగ్గింది. పిల్లల్లిద్దర్నీ ఊటీ పబ్లిక్ స్కూల్లో చేర్పించాము. శలవులకు అప్పుడప్పుడు మేమిద్దరం ఊటీ వెళ్ళి వాళ్ళను చూసి వస్తుండేవాళ్ళం... అక్కడ తల్లితండ్రులు పిల్లల్ని చూడటానికి కూడా ఎన్నో నియమాలు...


ఇంగ్లీషులో మాట్లాడటం తప్ప వాళ్ళు విద్యార్థుల తెలివితేటల్ని పెంచిందేం ఉండదు. నేను మా ఊరి ప్రాథమిక పాఠశాలలో కింద కూర్చొని చదువుకొనీ ఐఐటీ దాకా వెళ్ళాను... విద్యార్థుల తెలివితేటలు, కృషి, తల్లితండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధ్యం అనడానికి నేనే ఉదాహరణ.


వాళ్ళు వేసవి శలవులకి ఇంటికి వచ్చేవారు. అప్పుడు కూడా నాతో ముభావంగా ఉండేవారు. ఏదైన నాలుగు మంచి మాటలు చెబితే వాళ్ళకి నచ్చేవి కావు. రామాయణం, భారత భాగవతాలు వాళ్ళకి స్కూల్లో చెప్పలేదు.


నేను చదువుతున్నప్పుడు మా స్కూల్లోని ఏకైక ఉపాధ్యాయుడు మాకు 3వ తరగతిలోపే రామాయణ, భారత, భాగవతాలను చెప్పేసారు. 4వ తరగతి వచ్చేసరికి రాముడు మంచిబాలుడు అనీ మాకు తెలిసిపోయింది...


నేను వద్దన్నా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొని యిచ్చింది కౌమోదిత... ఇక అక్కణ్ణుంచి వాళ్ళకి దానితోనే లోకం... భోజనాలప్పుడు ముభావంగా ఉండి తరువాత తమ గదిలోకి వెళ్ళిపోయేవారు... ఒక రోజు నాకు కొద్దిగా నలత అనిపించి ఆఫీసుకి వెళ్ళలేదు. నా స్నేహితుడు రవి డాక్టరు. అతనొచ్చి నన్ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చాడు.

ఆ విషయం తెలిసి కూడా ఇద్దరు పిల్లలూ నా దగ్గరకు రాలేదు. అలా మా మధ్య దూరం పెరిగిపోయింది...


ఒక రోజు మా శాఖ సెక్రెటరీ రమణ గారు మా ఇంటికి భోజనాల కొచ్చినపుడు ఈ విషయాలు ప్రస్తావన కొచ్చాయి...


“మన తరంలో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలూ ఈనాటి తరం పిల్లలకు లేవు రఘూ... అన్నీ వ్యాపార బంధాలు... తల్లితండ్రులను తమ ఉన్నతికి నిచ్చెనలుగా మాత్రమే పరిగణిస్తున్నారు... తల్లితండ్రులు పిల్లలకు ప్రేమ పంచినట్లుగా వాళ్ళు కూడా తల్లితండ్రులకు అదే ప్రేమని పంచాలన్న ధ్యాస వాళ్ళకి ఉండటం లేదు... పాశ్చాత్య దేశాల నాగరికతా ప్రభావం వీళ్ళ మీద బాగా ప్రభావం చూపుతున్నది... వాళ్ళ తిండి, కట్టుబాట్లు, అన్నీ అలవాటు చేసుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిందనీ మురిసిపోయాము కానీ మనం పూర్తిగా వాళ్ళ నాగరికతకు మనకు తెలీకుండానే బానిసలమైపోయాము... ఇది చాలా ప్రమాదకరం... మన జాతినే నిర్వీర్యం చేస్తుంది” అన్నాడు విచారంగా...


“మీరు చెప్పినవి అక్షర సత్యాలు... అవసరమైనపుడు తల్లితండ్రులకు తమ ప్రేమని పంచి వాళ్ళని ఆదుకోవాలనే మూల సూత్రాన్ని ఈతరం మరిచిపోయి పక్షులు, జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు... చదువు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది అనుకున్నాము కానీ స్వార్థం, అసూయ, ద్వేషాలను ఎక్కువ చేస్తుంది అనీ ఎవ్వరూ ఊహించలేదు. అంధులైన తల్లితండ్రులకు సేవ చేసిన శ్రావణుడు, తండ్రి మాట జవదాటని రాముడు,... తల్లి మాటే దైవంగా భావించిన పాండవుల గురించి వాళ్ళకు ఎవ్వరూ చెప్పలేదు... ఇప్పటికీ నేను ప్రతినెలా మా అమ్మానాన్నల్ని చూడటానికి మా పల్లెకు వెళుతుంటాను... నెలకోసారైనా అమ్మ చేతి వంట తినకపోతే నాకు ఏదోలా ఉంటుంది... కానీ నాలా మా పిల్లలు లేరు. అదీ నా తప్పో, ఈ సమాజానిదో అర్థం కావట్లేదు” అనీ నేను చెబుతుంటే ఆయన మౌనం వహించాడు.


కాలచక్ర భ్రమణం నిరంతరం అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది. పిల్లలు తమ ఇంజనీరింగ్ కోసం అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగాల్లో చేరిపోయారు... పది సంవత్సరాల్లో కేవలం రెండుసార్లే వచ్చారు... మేము కూడా ఒకసారి వెళితే మాతో కలిసి ఎక్కడికీ రాలేదు. మా భార్యాభర్తలం ఇద్దరం కలిసి కొన్ని ప్రాంతాల్ని చూసి వచ్చాము. వాళ్ళు మాకోసం ఒక్క రోజు కూడా శలవు పెట్టలేదు. వాళ్ళిద్దరూ అమెరికన్లను పెళ్ళాడారు. వాళ్ళకి మన మన్నా, మన వేషభాషలన్నా ద్వేషం.

ఇందుకోసమా వాళ్ళని కని పెంచామన్న కోపం కలిగి మధ్యలోనే మన దేశం వచ్చేసాము...


ఇద్దరం క్రితం నెలలో పదవీ విరమణ చేసాము. ఇద్దరు పిల్లలున్నా ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళం అయ్యాము. నాన్నగారు పోవడంతో అమ్మ ఒంటరిగా పల్లెలో ఉంటోంది. నేను మా ఊరు వెళ్ళిపోదామంటే కౌమోదితకి రాననీ హైదరాబాద్ లో మళ్ళీ ఉద్యోగంలో చేరింది... నేను మాత్రం మా ఊరు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వ్యవసాయం మొదలు పెట్టాను...


ఏం సాధించాను జీవితంలో అనీ నాకప్పుడప్పుడనిపిస్తుంటుంది ;

నేననుకున్నదేమిటీ... సాధించిందేమిటి? దీపమనే కీర్తి కోసం దాని చుట్టూ పురుగులా తిరిగాను... తెలియని గమ్యం కోసం జీవితమల్లా పయనించాను. పిల్లలనే నీడనివ్వని చెట్లను పెంచాను. వృద్ధాప్యంలో పెద్దగా ఉపయోగపడని ధనాన్ని సంపాదించాను.

పూర్వం ఉమ్మడి కుటుంబాలు... ఇప్పుడు నూక్లియస్ ఫేమిలీస్... ఒంటరి కుటుంబాలు.

నేనిక్కడ... భార్య అక్కడ... పిల్లలు ఎక్కడో... ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించుకోము... విమానాలు, టీవీలు, సెల్ఫోన్స్, కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు వాడుతున్న అత్యంత ఆధునిక సమాజంలో పెరుగుతున్న మానవుడు ప్రేమ తప్పా అన్నీ ఉన్న ఐశ్వర్యవంతుడు... ఆ ప్రేమ కోసం మనం ఎండమావుల వెంట పరిగెడుతున్నామనిపించింది. అసూయ, ద్వేషంతో ఇతరులను మోసం చేసి వచ్చే కీర్తి, డబ్బు తాత్కాలికం... అందుకే ప్రతివాళ్ళలో ఆత్మశోధన ముఖ్యం...


"If an egg is broken by an outside force, Life ends. But if it is broken inside force, Life begins - Greater things always begin from inside... "


ఎప్పుడో నేను చదివిన వాక్యం నాకెందుకో ఆక్షణంలో గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆ రోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళి పేపరు చదువుకుంటుండగా ఇంటి ముందర కారు ఆగి అందులోంచి నా స్నేహితుడు రవీంద్రనాథ్ దిగాడు. అతను కూడా నా బాచ్ మేటే ;ఈ మధ్య చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసాడు... ఆ సమయంలో అతను నేనుంటున్న పల్లెకి రావడం ఆశ్చర్యం కలిగించింది.


"హలో రవీంద్రా! స్వాగతం... చాలా రోజులైంది నిన్ను చూసి” అన్నాను...

“అందుకే వచ్చానురా... మన బేచ్ వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు... చాలామంది ఢిల్లీ, బొంబాయిల్లో సెటిల్ అయ్యారు... నువ్వే కాస్త దగ్గరున్నావు" అన్నాడు. ఇంతలో మా అమ్మ కాఫీలు తెచ్చింది... రవీంద్ర మా అమ్మకి నమస్కారం పెట్టాడు.


“నువ్వేంటి ఈ పల్లెలో ఉంటున్నావు... జీవితంలో అత్యంత ప్రధానమైన 30 సంవత్సరాలు ఐయ్యేయస్ బిజీ జీవితం గడిపి ఇప్పుడిలా అరణ్యంలోని ముని కుటీరం లాంటి ఇంట్లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది” అనీ అన్నాడు;


“పక్షిపిల్లలు పెద్దవై గూడు వదిలేసి వెళ్ళిపోయాయి. నాతో ఉండవలసిన పెంట పావురం కూడా ఈ గూటి ఇరుకును భరించలేక ఎగిరి పోయింది... నా సంగతి సరే, నువ్వెక్కడ ఉంటున్నావు? పిల్లలు?... ” అనీ అడిగాను ;


“నీ పిల్లలు లాగే వాళ్ళు కూడా ఎగిరిపోయి అమెరికా వెళ్ళిపోయారు. భార్య ఇందుమతి ఈ మధ్యనే చనిపోయింది. నేనొక్కడినే విశాఖలోని అంత పెద్ద ఇంట్లో ఉండలేక ఒక వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నాను” అన్నాడు డగ్గుత్తికతో...

“అంత పెద్ద పదవులు నిర్వహించిన మనం వానప్రస్తంలో ఎందుకు ఒంటరి జీవితం గడపవలసి వస్తోందో తలుచుకుంటే బాధ కలుగుతోంది. అందుకు మనం చేసిన తప్పే కారణ మంటావా?” అనీ అడిగాను ;


“అవున్రా... మనం పిల్లల్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాము... మన ఉద్యోగ ధర్మం వల్ల పిల్లలతో సరిగ్గా గడపలేకపోయాము. అందుకే వాళ్ళకు మనతో అనుబంధం పెరిగలేదు... ఆ తరువాత వాళ్ళు చదువులు, కేరియర్, పెళ్ళి... ఇలా వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని... పక్షుల్లా ఎగిరిపోయారు. ఇప్పుడూ మనం ఎవరికీ అక్కర్లేదు... మానవుడిలో ఉండే సహజమైన స్వార్థమే వీటన్నింటికీ కారణం... ” అన్నాడు;


"కుటుంబం కోసం, పిల్లల కోసం ఎంత కష్టపడ్డామో మనం... సుఖాలను కూడా మనం వాళ్ళ కోసం త్యాగం చేసి భార్యాపిల్లల కోసమే బతికాము... అది ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది... మనం ఎండమావుల వెంట పరిగెత్తాము” అనీ అన్నాను...


“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం" అన్నాడు వాడు. ఒక గంట తరువాత వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది...


(స‌మాప్తం)


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


82 views0 comments
bottom of page