top of page

ఎవరు?

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Evaru' Written By Venku Sanathani

రచన: వెంకు సనాతని

ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ వినోద్ హత్యకు గురవుతాడు.

ఆ విషయంగా స్వాతిని విచారిస్తారు పోలీసులు.

చివరకు అసలు హంతకుడెవరో తెలుసుకొని ఆశ్చర్యపోతారు.

ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు.

ఆఫీసుకి వెళ్ళటానికి రెడీ అవుతుంది స్వాతి. ఇంతలో ఫోన్ మోగుతుంది.

"హలో.. ప్రభ చెప్పు."

"స్వాతీ! మన బ్రాంచ్ మేనేజర్ వినోద్ చనిపోయారు." అంది ప్రభ కంగారుగా..

"అవునా..!!" అంది స్వాతి ఆశ్చర్యంగా..

అవునంటూ.. “నిన్న రాత్రి ఎవరో హత్య చేశారని ఇప్పుడే ప్యూన్ ఫోన్ చేసి చెప్పాడు” అంది ప్రభ

"హత్యా..!!"

"హ.. హత్యేనట." అని చెప్పి సరేనంటూ ఫోన్ పెట్టేసింది ప్రభ.

స్వాతి ఆలోచనల్లో పడింది. ఎక్కడ లేని ఆలోచనలతో ఉదయం సాయంత్రమయ్యింది.

*******

గట్టిగా తలుపు తడుతున్న శబ్దం.

ఉలిక్కిపడి లేచింది స్వాతి. టైమ్ చూసింది. రాత్రి రెండయ్యింది. "ఈ టైంలో ఎవరై ఉంటారు." అన్న ఆలోచనకే చెమటలు పట్టాయి స్వాతికి. భయం భయంగానే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు. పోలీసుల్ని చూడగానే స్వాతి భయం రెట్టింపయ్యింది.

"ఆర్ యూ స్వాతి" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్.

"ఎస్.." అంది స్వాతి బెదురుతో కూడిన గొంతుతో.

"మీరు మాతో స్టేషనుకు రావాలి"

"నేనా..! ఎందుకు..?" కంగారు, వణుకు,భయం అన్నీ ఒక్కసారిగా ఆవహించాయి స్వాతి మాటల్లో..

"వివరాలన్నీ స్టేషన్లో చెప్తాం" పదమన్నాడు ఎస్సై.

*******

"ఈ ఫోటోల్లో ఉన్నది మీరే కదా..!"

టేబుల్ మీదున్న ఫొటోల్ని ఒక్కొకటి చూపిస్తూ అన్నాడు ఎస్సై..

అసభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలు చూసి స్వాతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కళ్ళు తుడుచుకుంటూ..

"అవును..!!"

"నా ఫోటోలు.. మరీ ఇంత నీచంగా.." అంటూ ఆవేదన వ్యక్తం చేసింది స్వాతి.

మేనేజర్ వినోద్ ని అతికిరాతకంగా, అత్యంత దారుణంగా హత్య చేశారు. "ఎవరు చేశారు?" అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇల్లూ, ఆఫీసూ అన్ని చెక్ చేశాం. ఆఫీసులో.. అదీ.. అతని క్యాబిన్లో ఈ ఫోటోలు దొరికాయి.

ఇవి అక్కడ ఎందుకు ఉన్నాయి?

వినోద్ కి మీకూ ఏంటి సంబంధం?

కేసు గురించి చెప్పి ప్రశ్నల్ని గుప్పించాడు ఎస్సై సుధాకర్.

స్వాతి మౌనంగా కూర్చుంది.

"మేడమ్..మ్.." మీరు. మౌనంగా కూర్చుంటే కుదరదు. చెప్పాలి. చెప్పండి. విషయం ఏంటో వివరంగా చెప్పండి. కొంచెం గొంతు పెద్దది చేసి గట్టిగా అడిగాడు ఇన్స్పెక్టర్.

*******

స్వాతి ఓ పేరుమోసిన ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన స్థానిక బ్రాంచిలో ఉద్యోగం చేస్తుంది. ఆ కంపెనీ బ్రాంచ్ మేనేజరే వినోద్. కొత్తగా వచ్చాడు. వచ్చీ రాగానే స్వాతి మీద కన్నేశాడు. ఇది అతనికి కొత్తేం కాదు. ఎక్కడకు వెళ్ళినా ఇలాంటి నీచ బుద్ధినే ప్రదర్శిస్తాడు. ఒంటరి మహిళలే అతని టార్గెట్. అవతలి వారిని తన దారికి తెచ్చుకోవడానికి ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. చాలా బ్రాంచులు మారిన అతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆధారాలు లేవు. ఏదైనా పక్కాగా, పగడ్బందీగా చేస్తాడు.

స్వాతి విషయంలో కూడా ఇదే పరిస్థితి. తప్పని చెప్పింది. చెప్పుతో కొట్టింది. అయినా వినోద్ వైఖరి ఇంకా రెట్టింపయ్యింది. మరింతగా లొంగదీసుకునే ప్రయత్నంలో జుగుప్సాకరంగా మాట్లాడటం, లోంగకపోతే ఆఫీసు పనిని అడ్డుపెట్టుకుని పొట్లాడటం ఇవన్నీ చేసేవాడు. ఒకటా రెండా లెక్కలేనన్ని లైంగిక వేధింపులనెన్నో భరించింది స్వాతి. పొట్ట కూటి కోసం పాడు పని చేసే తత్వం కాదు తనది. కంపెనీ మారొచ్చు కదా అన్న సందేహానికి "మేక తోలు కప్పుకున్న మేనేజర్ వినోద్లు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో" అని తనకు తాను సమాధానం చెప్పుకుంది చాలా సార్లు.

*******

ఈ ఫోటోలు అక్కడ ఎందుకున్నాయో, వాటిని ఎవరు తీసారో నిజంగా నాకు తెలియదు. "అతనితో అంత సన్నిహితంగానా..!!" అంటూ అసభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలను చూస్తూ మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది స్వాతి. కొద్దిగా తేరుకుని తన హ్యాండు బ్యాగులో ఉన్న సెల్ ఫోన్ తీసి ఆడియో, వీడియో, మెసేజ్ల రూపంలో ఉన్న వినోద్ వికృత చేష్టలను ఎస్సై సుధాకర్ ముందు ఉంచింది స్వాతి.

వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్, “విచారణ పూర్తయ్యింది.ఇక మీరు వెళ్ళొచ్చు” అన్నాడు.

అతనే మళ్ళీ "వన్ మినిట్.. మేడమ్.. వినోద్ బాధితుల్లో మీరు ‘ప్రెసెంట్ విక్టిమ్’. కాబట్టి ఈ కేసులో మీ అవసరం ఉంటుందని గుర్తుంచుకోండి. వెళ్ళండి” అన్నాడు.

*******

వినోద్ చనిపోయాడు. అలాంటి నీచుడు చస్తే లోకానికి మంచిదే కానీ "ఎవరు చంపారు?" ఈ సందేహంతోనే ఇల్లు చేరింది స్వాతి.

స్వాతి వినోద్ ని హత్య చేసింది అనటానికి ఆధారాలు లేవు. మరి "ఎవరు చేశారు?". దీర్ఘాలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్. దర్యాప్తు మరింత ముమ్మరం చేశాడు.

వినోద్ ఉద్యోగంలో చేరింది మొదలు అతని చేత వేదింపబడిన వారి గురించి ఆరా తీశారు పోలీసులు. మొత్తం 16 మంది తేలారు. వీరందరూ వివిధ బ్రాంచుల్లో ఉద్యోగం చేసిన వారే. 16 మందిలో 14 మంది ఆచూకీ లేదు. వారి పాత అడ్రసుల వాకబుతో కొత్త చిరునామాలు కష్టంగానే తోచాయి పోలీసులకి.

మిగిలిన ఇద్దరిలో ఒకరు స్వాతి. ప్రెసెంట్ విక్టిమ్. మరొకరు హేమ. ఎవరీ హేమ. ఆరా తీశారు. వినోద్ వేదింపులకు తట్టుకోలేక రెండేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. కొత్త కోణంలో దర్యాప్తు చేపట్టాడు ఇన్స్పెక్టర్.

*******

వారం రోజుల తర్వాత..

“మేనేజర్ వినోద్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్” అన్న వార్తను పేపర్లో చూసి వినోద్ ని హత్య చేసింది ఇంతకు ముందు బ్రాంచిలో వినోద్ క్రింద పనిచేసిన ప్యూన్ వెంకట్రావు అని తెలుసుకుంటుంది స్వాతి.

“వెంకట్రావుకు ఏం సంబంధం ?” స్వాతిని సందేహాలు చుట్టుముట్టాయి.

*******

వెంకట్రావును కలవడానికి జైలుకు వెళ్లిన స్వాతికి “అసుర సంహారం చేసిన అవతారమూర్తి” గా కనిపించాడు. స్వాతిని చూడగానే చిన్న చిరునవ్వు ఆయన ముఖంలో తొణికిసలాడింది. మృగాడి చేతిలో మరొక ఆడపిల్ల బలి కాకుండా కాపాడానన్న సంతృప్తి స్పష్టంగా కనపడుతుంది ఆ చిరునవ్వులో..

*** శుభమ్ ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

పేరు : వెంకు సనాతని

అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత

ఊరు : బాపట్ల

జిల్లా : గుంటూరు

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్


107 views0 comments
bottom of page