top of page

గాడిద గుడ్డు పగిలింది

Updated: Jun 23

#GadidaGudduPagilindi, #గాడిదగుడ్డుపగిలింది, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 5

Gadida Guddu Pagilindi - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 17/06/2025

గాడిద గుడ్డు పగిలింది - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


చాకలి లచ్చన్న ఇళ్ల నుంచి తెచ్చిన మురికి బట్టలికి నల్లజీడితో ఇంటి గుర్తులు పెట్టి మూటలు కట్టి గుడిసె బయట ఉంచిన గాడిద వీపు మీద రెండు వైపుల బరువు సరిపోయేల సర్దిఉంచాడు. 


ఇంతలో లచ్చన్న పెళ్లాం లచ్చి మధ్యాహ్నం తిండికి బువ్వ సిల్వరు గిన్నెలో ఉంచి గుడ్డతో చుట్టి తెచ్చింది. 


"పొద్దెక్కి పోతోంది, తొందరగా తెమల”మని కేక లేస్తున్నాడు లచ్చన్న. 


"ఉండు, మావా ! కోడిపుంజు, పెట్ట గూట్లో వుండి పోనాయి" 

అంటూ కోళ్లను తీసుకురాగా వాటిని గాడిద వీపు మీద

బట్టల మూటల మద్య సర్ది వుంచేడు. 


"సూరిగా, బేగె బడికి ఫో!" అని కొడుకుని కేకేసాడు. 


గుడిసె తలుపుకు తాళం పెట్టి తడిక దగ్గరగా లాగి ఇంటి పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని ఊరి బయట చెరువు ఒడ్డున ఉన్న చాకిరేవుకు సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరారు. 


దారిలో మిగత చాకలి కుటుంబాలు కలిసి రాగా అందరూ సందడిగా కబుర్లు చెప్పుకుంటూ చెరువు గట్టున వున్న చాకిరేవుకు చేరుకున్నారు. 


చద్ది మూట గిన్నెల్ని గట్టు మీదున్న మర్రిచెట్టుకి ఉట్టెలు కట్టి వేలాడదీసారు. కోళ్ళను తాళ్లు విప్పి భూమ్మీద పడేసి గంటిగింజలు కింద జల్లేరు. పెంపుడు కుక్క చెట్టు మొదట్లో చేరి పడుకుంది. 


లచ్చన్న బట్టీ మీదున్న గూనలో చెరువు నీళ్లు పోసి అందులో బ్లీచింగు కలిపి కింద కట్టెలమంట పెట్టాడు. 


గాడిద నడుం మీదున్న మురికి బట్టల మూటల్ని దించి బట్టలు వేరు చేసి గూనలో పడేసి కట్టెతో లోపలికి తోసి సరిచేసాడు. 


లచ్చి బట్టలు ఆరేయడానికి వెదురు కర్రలు నిలబెట్టి తాళ్లు సరిచేస్తోంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చాకిరేవు చాకలి కుటుంబాల రాకతో సందడిగా మారింది. బట్టలు ఉతికే రాళ్లను సరిచేసుకున్నారు. 


బట్టీ మీదున్న మురికి బట్టలు ఉతకడానికి సమయమున్నందున మగాళ్లందరూ చెట్టు కింద చేరి పొగాకు చుట్టలు ముట్టించారు. బట్టల మూటల్ని దించిన తర్వాత గాడిదల్ని తిండి కోసం ఊరి మీద వదిలేసారు. 


లచ్చన్న గాడిద బూడిద నలుపు రంగుతో ప్రత్యేకంగా కనబడుతుంది. అది ఊళ్లోకి పోయి బ్రాహ్మణ దొడ్లో అంట్లాకులు తినసాగింది. మామిడు పండు తొక్కలు, టెంకలు ఆప్యాయంగా నమిలి మింగుతోంది. 


పెంటకుప్ప గట్టు మీదున్న వెలగచెట్టు పండు అంట్లాకుల్లో పడింది. లచ్చన్న గాడిద మామిడి టెంకలతో పాటు కింద పడిన వెలగపండును మింగేసింది. 


 ఊళ్లో తిండి కోసం వెళ్లిన గాడిదలన్నీ సాయంకాలానికి చాకిరేవు చేరుకున్నాయి. ఎవరి గాడిదల్ని వారు పట్టుకుని ఉతికి ఆరేసిన బట్టల్ని మూటలు కట్టి వాటి వీపు మీద సర్ది ఇళ్లకు బయలుదేరారు. 


బ్రాహ్మణ ఇళ్లనుంచి తెచ్చిన కుడితి మిగిలిన అన్నమే వాటికి తిండి. చాకలిపేటలో ఒకరోజు బట్టలురేవు పెడితే రెండవరోజు ఉతికిన బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. కాబట్టి ఆరోజు లచ్చి, పెంపుడుకోళ్లు, ఇంటికుక్క, గాడిద, లచ్చన్న అందరూ ఇంటి వద్దే ఉంటారు. 


కట్టెల బొగ్గులు వెలిగించి ఎర్రగా నిప్పులైనాక ఇస్త్రీ పెట్టెలో వేసి కాక ఎక్కిన తర్వాత బట్టల ఇస్త్రీ మొదలెడతాడు. 


స్కూలుకు శలవైనందున గుడిసె బయట ఆడుకుంటున్న లచ్చన్న కొడుకు సూరిగాడు అరుస్తూ " అయ్యా ! మన గాడిద గుడ్డెట్టినాది. చూడు, ఎంత పెద్దగుందో ? " అన్నాడు. 


 సూరి అరుపు విన్న లచ్చన్న లోపలి నుంచి బయటికొచ్చాడు. 


గాడిద దడి దగ్గర నిలబడి ఉంది. దాని లద్దెలో బ్రాహ్మణ దొడ్లో మింగిన వెలగపండు జీర్ణం అవక లద్దెతో పాటు బయటపడింది. 


దాన్ని చూసి సూరి " మా గాడిద పెద్ద గుడ్డెట్టిందంటూ " అందరి గుమ్మాల ముందు అరుస్తూ పరుగులు తీసాడు. 


చాకలిపేట లోని చాకళ్లందరూ లచ్చన్న గుడిసె ముందు గుమిగూడారు. 


గాడిద లద్దెతో పాటు తెల్లగా ఉన్న వెలగపండును ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లెప్పుడు కోడి పెట్టే గుడ్లను చూసారు కాని వెలగపండును చూడలేదు. 


చాకలిపేటలో అందరూ లచ్చన్న గాడిద గుడ్డెట్టిందని వింతగా చెప్పుకుంటున్నారు. ఇలా ఒకరినుంచి ఒకరికి ఊరంతా పాకింది. 


ఇంతలో అటుగా వెల్తున్న గుడిపూజారి అవధానులు గారు విషయం తెల్సి ఏమైందని చాకలి లచ్చన్నని పిలిచి అడగ్గా జరిగిన కథంతా తెలిచేసాడు. 


దాన్ని తన దగ్గరకు తీసుకు వచ్చి చూపించమన్నారు పూజారి గారు. 


సూరి పరుగున వెళ్లి గాడిద లద్దెలో తెల్లగా ఉన్న వెలగపండును నీళ్లతో కడిగి పూజారి గారి వద్దకు తీసుకువచ్చాడు. 


దాన్ని దూరం నుంచే చూసిన పూజారిగారు నవ్వుతూ 


"ఓరి, అమాయకుల్లారా ! ఇదేం గాడిద గుడ్డురా ? గాడిద మింగిన వెలగపండు జీర్ణం అవక లద్దెతో పాటు బయటకు వచ్చింది". అసలు సంగతి చెప్పేరు పంతులు గారు. 


ఇంతలో సూరి చేతిలోని వెలగపండు జారి కిందపడి గింజలు బయటపడ్డాయి. వింతను చూద్దామని చేరిన చాకలి జనం లచ్చన్న గాడిద గుడ్డు పగిలిందని నవ్వుకున్నారు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page