గాడిద పాలు
- Karlapalem Hanumantha Rao
- May 23
- 3 min read
#గాడిదపాలు, #GadidaPalu, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నీతికథలు

Gadida Palu - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 23/05/2025
గాడిద పాలు - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పట్టపాలెంలో ఊరి మైలబట్టలు ఉతికి జీవనం సాగించే కుటుంబం ఒక్క పిచ్చయ్యదే. అతగాడికి ఆపనిలో సాయం చేసే నమ్మకమైన గాడిద ఒకటి ఉండేది.
కొడుకు పుట్టినందుకు దుర్గమ్మ తల్లికి ముడుపు చెల్లించాలని పోతూ పోతూ రెండూళ్ల ఆవల ఉండే దూరపు చుట్టం సోమయ్యకు గాడిదను అప్పగించాడు పిచ్చయ్య.
యాత్ర నుంచి తిరిగొచ్చిన పిచ్చయ్యకు అతగాడి గాడిదను తిరిగివ్వక పోగా ' ఇక్కడి గాడిదలన్నీ నేను సాకేవి. రేవు దగ్గర నీ గాడిద తప్పిపోయింది. దాని మేతకు అయిన ఖర్చు నీవే నాకు అచ్చుకోవాలి ' అని మొండికి తిరగటంతో పిచ్చయ్య న్యాయం కోసం ఆ ఊరి పంచాయితీ పెద్దను ఆశ్రయించాడు.
వివాదం ఆసాంతం శ్రద్ధగా ఆలకించి "అనుకోని అవాంతరం వల్ల నిర్ణయం వెంటనే చెప్పలేను" అన్నాడు పంచాయితీ పెద్ద. తీర్పు వచ్చే వరకు ఊరి సత్రంలో బస చేయక తప్పింది కాదు పిచ్చయ్యకు.
మరో నెలరోజుల్లో కూతురు పెళ్లి ముహూర్తం ఉన్న తన దగ్గరి బంధువు ఒకాయనకు ప్రాణం మీదకు ముంచుకొచ్చింది. 'మూడు రోజులు ముప్పూటలా గుక్కెడు గాడిద పాలు పట్టిస్తేనే ముహూర్తం నాటికి ఆయన మనుషుల్లో పడేది. కాకపోతే, గాడిద ముందు వైపు కూర్చుని పితికిన పాలు మాత్రమే మందుకు పనికివచ్చేది ' అన్నాడు వైద్యం చేసే ఆచారిగారు.
ముందు వైపు నుంచి పితికినా పాలిచ్చే అలాంటి గాడిద కోసమే పంచాయితీ పెద్ద ప్రస్తుతం విచారణలో ఉన్నట్టు తెలిసింది పిచ్చయ్యకు.
' నా గాడిద ఆ విధంగా పాలు యిస్తుంది. కాకపోతే తన నిజమైన యజమానికే అలా పితకడం సాధ్యం ' అని మర్నాటి వాయిదాలో విన్నవించుకొన్నాడు పిచ్చయ్య.
వివాదంలో ఉన్న గాడిదను తన ముందుకు తెప్పించి, పిచ్చయ్య చెప్పే గాడిద ఎవరిదయితే వాళ్లు దాని పాలు పితికి నా బంధువుకు ప్రాణదానం చేయాలని కోరాడు పంచాయితీ పెద్ద.
అప్పటి వరకు తనదేనని బుకాయిస్తూ వచ్చిన గాడిద ముందు చెంబుతో సహా కూర్చోక తప్పింది కాదు సోమయ్యకు. పొదుగు మీద చెయ్యి పడీ పడగానే పళ్లు రాలి కింద పడేట్లు ముందు కాళ్ళు రెండూ ఎత్తి సోమయ్య మూతి మీద ఒక్క తాపు తన్నింది గాడిద.
సోమయ్య చెప్పింది అబద్ధమని తేలిపోయింది.
"తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి నువ్వూ సోమయ్యకు మల్లేనే గాడిద పాలు పితికి చూపించమ ' ని పిచ్చయ్యను ఆదేశించాడు పంచాయితీ పెద్ద.
' న్యాయమూర్తులు.. పెద్దమనసు చేసుకొని నన్ను మన్మించాలి. పోయిన నా గాడిద నిజానికి ముందు నుంచి పితికినా పాలు ఇవ్వలేదు. అదీ అన్ని గాడిదలకు మల్లే పక్క నుంచి పితికితేనే పాలు ఇచ్చేది ' అన్నాడు పిచ్చయ్య చేతులు కట్టుకొని వినమ్రంగా.
పరాయి సొమ్ముకు పాకులాడి అబద్ధం చెప్పింది సోమయ్యేనని నిర్ధారణయింది.
సమస్యను సవ్యంగా పరిష్కరించే నిమిత్తం- లేని తన బంధువుకు మాయ జబ్బు అంటకట్టి, దాని తరుణోపాయమూ సత్రంలో బస చేసిన పిచ్చయ్యకు ముందు రోజు రాత్రే పంచాయితీ పెద్ద చేరవేసిన వైనం సోమయ్య తెలియదు.
పంచాయితీ తీర్పు ప్రకారం పిచ్చయ్యకు గాడిదతో పాటు భారీగా నష్టపరిహారం చెల్లించి చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించక తప్పింది కాదు సోమయ్య కు.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments