గాడిద తిక్క కుదిరింది
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jun 23
- 4 min read
#GadidaThikkaKudirindi, #గాడిదతిక్కకుదిరింది, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 7
Gadida Thikka Kudirindi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 23/06/2025
గాడిద తిక్క కుదిరింది - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
ఊరి బట్టలుతికే చాకలి లచ్చన్న గాడిద, యజమాని సరిగ్గా తనకి పోషణ కలిగించడం లేదని కొద్ది రోజులు తను లేక పోతే తన విలువేంటో తెలిసొస్తుందని అలిగి చాకలిపేట వదిలి బయట తిరుగుతు దారి తప్పి దగ్గరలో ఉన్న అడవిలో ప్రవేసించింది.
అడవిలో కెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు చూసి భయపడి తన సహచర గాడిదలేవైనా కానొస్తాయేమోనని గార్దభ రాగంలో ఓండ్రింపు మొదలెట్టింది.
భయానకమైన గాడిద అరుపులు విన్న అడవి జంతువులన్నీ భయపడసాగాయి. అడవికి రాజైన మృగరాజు సింహం తన మంత్రి సలహాదారు జిత్తులమారి నక్కను విషయం తెలుసుకురమ్మని పంపాడు.
నక్క గాడిద దగ్గరకొచ్చి ఎవరీ కొత్త జంతువని ఎగాదిగా చూస్తూ ముందుగా దాని ముఖాన్ని పరిశీలించి విచిత్రంగా ఉందని భయపడుతు వెనకకు వెళ్లి కాళ్ల డెక్కల్ని వంగి చూడసాగింది.
అలవాటు ప్రకారం గాడిద తన రెండు కాళ్లను సాచి బలంగా తాపు తన్నింది. నక్క రెండు పల్టీలు కొట్టి ఎగిరి పడింది. మూతి దవడ పళ్లు ఊడిపడ్డాయి.
నక్క కుంటుతూ మృగరాజు వద్దకెళ్లి " సింహ రాజా! ఆ విచిత్ర జంతువు చాలా బలమైంది. మీరు ముందు కాళ్ల పంజాతో జంతువుల్ని వేటాడితే అది పంజాలేకుండా ముందు వెనక కాళ్లతో కూడా వేటాడగలదు. వెనక కాళ్లతో తన్ని నా మూతి పళ్లు రాలగొట్టింది. ముందు కాళ్లతో తొక్కితే పచ్చడైపోదును. మీరు ప్రాణాలు దక్కించుకోవాలంటే వెంటనే అడవి వదిలి పారిపొం”డని భయపెట్టింది.
వింత జంతువుకు భయపడి మృగరాజు అడవి వదిలి పారిపోయాడని తెలిసి మిగతా జంతువులన్నీ గాడిద విశ్రాంతి తీసుకున్న మర్రిచెట్టు వద్దకు రావడం చూసిన గాడిద ముందు భయపడినా దైర్యం తెచ్చుకుని గాంభీర్యం ప్రదర్సిస్తు "ఎవరు మీరు ? ఇక్కడి కెందు కొచ్చా”రని ధాటిగా అడిగింది.
అడవిలోని చిన్న పెద్ద జంతువులన్నీ వినయంగా "వనరాజా! మీశక్తి సామర్ధ్యాలు తెలిసాయి. ఇప్పటి నుంచి మీరే మా ప్రభువు. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటా”మని ప్రాధేయ పడ్డాయి.
ఆకలితో నకనకలాడుతున్న గాడిద పాచిక పారినందుకు ఆనందించి "వినండి నా ఆజ్ఞ. నేను శాకాహారిని. మీ కెలాంటి ప్రాణహాని తలపెట్టను. భయపడకండి. నా పాలనలో హాయిగా ఉండొచ్చు. నాకు ఆకలిగా ఉంది. పళ్ళు, ఫలాలు, పచ్చగడ్డి తీసుకురం”డని హుంకరించింది.
వెంటనే కుందేలు లేత పచ్చ గడ్డి పరకలు కేరట్ దుంపలు, కోతి పండిన మామిడి పళ్లు, ఏనుగు లేత అరటి ఆకులు చెరకు గడలూ తెచ్చి పడేసాయి.
గాడిద అవన్నీ తింటు చాకలి లచ్చన్న రోజంతా చాకిరేవు బండచాకిరి చేయించుకుని మోపెడు పచ్ఛగడ్డైనా పెట్టకుండా అర్దాకలితో డొక్క మాడ్చేవాడు. ఇక్కడే నయం, ఈ అమాయక జంతువులకి చెప్పి ఏది కావాలంటే అది కడుపు నిండా మెక్క వచ్చు. వీటన్నిటినీ నాచెప్పు చేతల్లో ఉంచుకుని అధికారం చెలాయిస్తు స్థిరనివాసం చేసుకోవాలనుకుంది.
అక్కడ లచ్చన్న గాడిద ఎటుపోయిందోనని అంతటా వెతకడం మొదలెట్టాడు. లచ్చన్న తన గాడిదకు గుర్తింపుగా మెడలో ఒక ఇత్తడిమువ్వ కట్టేడు. అది తన అలవాటు ప్రకారం మెడ ఎత్తి ఓండ్ర పెట్టినప్పుడు ఆ గంభీర స్వరంతో పాటు మువ్వ శబ్ధం వినిపించేది.
అడవి జంతువులకు ఆ శబ్దాలు విచిత్రమనిపించి చుట్టూ చేరేవి. గార్దభానికి తన గాత్రం మీద నమ్మకం ఏర్పడింది. అందువల్ల తను గాత్ర కచేరీ చేసేటప్పుడు అడవిలోని పక్షులు జంతువులు జత కలిపి గాత్రం చెయ్యాలని శాసించింది.
ఇష్టం ఉన్నా లేకపోయినా గాడిద చెప్పిన సమయానికి మర్రిచెట్టు దగ్గరకు చేరేవి. రోజురోజుకీ గాడిద గాత్రకచేరీ సతాయింపులతో అడవిలోని జంతువులు, పక్షులు విసిగిపోయి ఈ పీడ ఎలా వదులుతుందా అనుకునేవి.
రోజూ గార్దభరాజు కావల్సినంత పచ్చ గడ్డి, పళ్లు సుష్టుగా తిని, పుష్టిగా, బలంగా తయారైంది. తన బండారం బయట పడుతుందేమోనని నేను రాత్రిళ్లు నాలుగు కాళ్ల మీద నిలబడి ధ్యానం చేస్తూంటాను. కాబట్టీ రాత్రి సమయంలో నా దగ్గరకొచ్చి ధ్యాన భంగం చెయ్యెద్దని హుకుం జారీ చేసింది.
గాడిద ఒకరోజు చారల గుర్రాన్ని పిలిచి నువ్వు నా జాతి దానివి. నాతో గాత్ర కచేరీకి రావల్సిందిగా ఆజ్ఞాపించింది. ఎప్పుడు గొంతెత్తి అరవని జీరల గుర్రం భయపడింది. ఈ గండం నుంచి ఎలా బయట పడాలా అని మౌనంగా అక్కడి నుంచి జారుకుంది.
ఆ చెట్టు మీద గూడు కట్టుకుని కాపుర ముంటున్న కాకి కూడా గార్దభ సంగీత బాధితురాలే. గార్దభం జీబ్రాగుర్రంతో అన్న మాటలు విన్న కాకి ఏదో ఒక ఉపాయం చేసి గాడిదను ఈ అడవి నుంచి పారిపోయేలా చేయాలనుకుంది.
కాకి జీబ్రా గుర్రం దగ్గరకెళ్లి తనొక ఆలోచన చేసాననీ కనక నువ్వు గార్దభ రాజు దగ్గర గాత్రకచేరీ పందేనికి సిద్ధమనీ, అడవిలోని అన్ని పక్షి జంతు సముదాయం ముందు పందెం జరగాలని షరతు పెట్టమంది.
జీబ్రా గుర్రం మాట విన్న గార్దభం వికటాట్టహాసం చేస్తూ ఇన్నాళ్లకి నాతో ఢీ కొనే మొనగాడు ఎదురుపడ్డాడని షరతుకు ఒప్పుకుంది.
కాకి తన ఉపాయం ప్రకారం అడవికి సమీప గ్రామంలో కెళ్ళి బయట పొలంలో ఎండపోసిన పండు ఎర్రమిరప్పళ్లు తెచ్చి చారల గుర్రానికిచ్చి, "ఇవి గాత్ర శుద్ధికి ఉపయోగపడే అడవి మూలికా ఫలాలు, వీటిని బాగా నలిపి ఉంచు." అని చెప్పింది.
అక్కడి నుంచి కాకి తిన్నగా గాడిద దగ్గరకొచ్చి " గార్దభ రాజా ! అందరూ పన్నాగం చేసి చారల గుర్రాన్ని మీతో గాత్ర కచేరీకి పంపుతున్నారు. ఏవో అడవి మూలికా ఫలాలు తినిపించి మిమ్మల్ని ఓడించి అందరి ముందు నవ్వులపాలు చెయ్యాలనకుంటున్నారు, కనుక ఆ మూలికా ఫలాలు మీరే
తింటే విజయం మీదే అవుతుందని" చెప్పి వెళిపోయింది.
అడవి జంతు పక్షి సమూహ సమక్షంలో గాత్ర కచేరీకి సిద్ధ పడిన గాడిద జీరల గుర్రం ముందున్న ఎర్రని పొడవైన మిరపపళ్లను చూడగానే కాకి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గబుక్కున వాటిని నోటిలోకి లాక్కుని కరకర నమలసాగింది.
కొద్ది సేపటికి గాడిద నాలిక మీద, నోట్లో బొబ్బలు వచ్చి మంటతో అరుస్తు అడవి విడిచి పరుగులు పెట్టింది.
చుట్టూ చేరిన అడవి జంతువులన్నీ గాడిద పాట్లు చూసి పకపక నవ్వడం మొదలెట్టాయి. చారల గుర్రంతో పాటు కాకి గాడిదకి తగిన ప్రాయశ్చిత్తం జరిగి పీడ విరగడైందని సంతోషించాయి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments